మాఫీ బురిడీ
ఇదిగో ఇచ్చేస్తున్నా..అదిగా ఇచ్చేస్తున్నా.. లక్షన్నర వరకు మీ రుణాలన్నీ మాఫీ చేసేస్తున్నా.. అంటూ బురిడి మాటలతో ఆర్నెళ్లుగా కాలం గడిపిన సీఎం చంద్రబాబు నాయుడు చివరకు తుస్సుమనిపించారు. మసిపూసిమారేడుకాయ చందంగా మాఫీ ప్రకటన జిల్లా రైతులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. కనీసం 10 శాతం మంది బాధిత రైతులకు కూడా లబ్ధి చేకూరని దుస్థితి నెలకొనడంతో పాలుపోక అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మాయ మాటలకు మళ్లీ మోసపోయాం అంటూ గగ్గోలు పెడుతున్నారు.
⇒మెజారిటీ రైతులకు మొండిచేయి
⇒10 శాతం మందికే లబ్ధి
⇒లబోదిబోమంటున్న అన్నదాతలు
⇒బంగారు రుణాలకు కొర్రి
⇒ కౌలుదారులకు జెల్ల
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో రెండున్నరలక్షల మంది రైతులకు చెందిన 3.87లక్షల ఖాతాల పరిధిలో పంట, బంగారు రుణాలు కలిపి సుమారు రూ.3,800కోట్ల వరకు ఉన్నాయని అంచనా. వీటిలో పంట రుణాలే రూ.1500కోట్లు, టెర్మ్ లోన్స్, కన్వర్టడ్ క్రాప్ లోన్స్ కలిపి మరో వెయ్యి కోట్ల వరకు ఉంటాయని అంచనా. రుణమాఫీ పరిధిలోకి వచ్చే పంట, బంగారు రుణాలలో ప్రభుత్వం ప్రకటించిన లక్షన్నర లోపు రుణాల వరకు చూసుకున్నా కనీసం రూ.2,200 వేల కోట్ల వరకు వరకు మాఫీ కావాల్సి ఉంది. వీటిలో పంట రుణాలు ఎంతతక్కువ లెక్కేసుకున్నా రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటాయని అంచనా.
10 శాతం మంది రైతులకే లబ్ధి: ప్రస్తుతం 50 వేల లోపుపంట రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ప్రకారం జిల్లాలో 3.87లక్షల అకౌంట్లలో 70వేల అకౌంట్ల పరిధిలోని 25వేల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదీ కూడా వడ్డీతో సహా అని మెలిక పెట్టడంతో రూ.30వేల లోపు రుణం తీసుకున్న వారికి వడ్డీతో సహా వారి అప్పు ప్రస్తుతం రూ.50వేల లోపు ఉంటుంది కాబట్టి వారికి పూర్తి స్థాయిలో మాఫీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ లెక్కన జిల్లాలో 25వేల మంది రైతులకు సంబంధించి రూ.400కోట్ల వరకు మాఫీ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన వారికి 20 శాతం మేర రుణమాఫీ మొత్తం జమచేస్తామని చెబుతుండడంతో ఆ మొత్తం ఎంతనేది తేలాలంటే జాబితా వెల్లడిస్తే కా నీ ఎంతమందికి ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో తేలే అవకాశాలు కన్పించడం లేదు.
బంగారురుణాలకు కొర్రే..: ముఖ్యంగా బంగారుఆభరణాలపై తీసుకున్న రుణాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లాలో లక్షమందికి పైగా సుమారు 2,500కోట్ల వరకు బంగారు ఆభరణాలపై రుణాలు పొంది ఉంటారని అంచ నా. వీరిలో పూర్తిగా పంటలకోసమే రుణా లు తీసుకున్న వారు సంఖ్య ఎంతతక్కువ లెక్కేసుకున్నా 70వేలమందికి పైగానే ఉంటారని భావిస్తున్నారు. వీరు పొందిన రుణాలు కూడా రూ.1,500కోట్లకు పైగానే ఉంటాయని లెక్కలేస్తున్నారు. ఈ బంగారు రుణాలల్లో ఏ మేరకు మాఫీ అవుతాయో లెక్కతేలడం లేదు.
కౌలు రైతుకు జెల్ల
జిల్లాలో ఉన్న రెండున్నర లక్షల మంది రైతుల్లో కౌలురైతులు లక్షన్నరకు పైగానే ఉంటారు. రుణఅర్హత కార్డులున్న వారు గతేడాది 35వేల వరకు ఉండేవారు. ప్రస్తుతం వాటి సంఖ్య 10వేల లోపు మాత్రమే ఉన్నారు. గతేడాది పంటరుణాలు పొందిన వారిసంఖ్య కేవలం వెయ్యిలోపే ఉన్నారు. వీరి పొందిన రుణం కూడా లక్షల్లోనే ఉన్నాయి. అయితే బంగారు ఆభరణాలు కుదవపెట్టి అప్పులు చేసి సాగుచేసిన వారే ఎక్కువ.
ఎల్‌ఈసీ కార్డులుండి బంగారు ఆభరణాలు పొందిన వారు మాత్రమే రుణమాఫీ వల్ల కొద్దొగొప్పో లబ్ధి పొందే అవకాశం ఉంది. మిగిలిన 95 శాతం మంది కౌలురైతుల రుణమాఫీ వల్ల ఎలాంటి లబ్ధి పొందే అవకాశం లేదు.దీంతో ఇప్పటికే వేలాదిమంది కౌలురైతులు కుదవపెట్టిన బంగారు ఆభరణాలను వేలం వేసేందుకు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ విధంగా జిల్లాలో కనీసం ఐదారువందల కోట్ల రుణాలకు చెందిన బంగారు ఆభరణాలను వేలం వేసేందుకు ఏరా్పాట్లు చేశారు.
బీమా సొమ్ము అప్పుల పాలు: పం టల బీమా, ఇతర పరిహారాల కింద వచ్చిన సొమ్మును బ్యాంకులు జమ చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది సంభవించిన నీలం తుఫాన్ ఇన్‌పుట్‌సబ్సిడీని జమ చేసుకోవ డానికి వీల్లేదని ప్రభుత్వం తెగేసి చెప్పినా జిల్లాలో మెజార్టీ బ్యాంకర్లు తమ అప్పుల కింద ఈ మొత్తాన్ని జమ చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలు, జల్ తుఫాన్‌కు సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీ రూ.12కోట్లు ఇటీవలే విడుదలయ్యాయని చెబుతున్నారు. ఈ మొత్తాన్ని కూడా గుట్టుచప్పుడు కాకుండా మాఫీఖాతాలకు మళ్లించేస్తున్నారని చెబుతున్నారు.