పొదుపు సొమ్ముకు ఎసరు | farmers faces new problem with banks after loan cleared! | Sakshi
Sakshi News home page

పొదుపు సొమ్ముకు ఎసరు

Published Wed, Jul 30 2014 1:29 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM

పొదుపు సొమ్ముకు ఎసరు - Sakshi

పొదుపు సొమ్ముకు ఎసరు

ఏపీలో 26 లక్షల మంది అన్నదాతలకు షాక్  
బ్యాంకుల్లో రైతుల సేవింగ్స్ ఖాతాల స్తంభన    
 
 రుణం చెల్లించినా పుస్తెలతాడు ఇవ్వలేదు
 వ్యవసాయ అవనరాల కోసం పంట రుణం తీసుకున్నాను. ఆ మొత్తం సరిపోక బంగారం కుదువబెట్టి మరికొంత తెచ్చుకున్నా. బంగారం రుణాన్ని చెల్లించి ఆభరణాలు తిరిగి ఇవ్వాలని బ్యాంక్ అధికారులను అడిగితే.. పంట రుణం చెల్లించాక ఇస్తామన్నారు. పుస్తెల తాడు (బంగారం) బ్యాంక్ వాళ్లు ఇవ్వలేదు. మెడలో పసుపుతాడుతో తిరుగుతున్నా.
 - లింగాల అనిత, ఎన్‌ఆర్‌పేట, ఏలూరు
 
 
 సాక్షి యంత్రాంగం
 ఇంటిల్లిపాదీ ఆరుగాలం శ్రమించినా సాగులో అప్పులే మిగిలాయి. వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్న పెద్ద మనిషిని నమ్ముకుని ఓటు వేసి గెలిపించి.. ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ అవి ఎప్పుడు నెరవేరుతాయో దిక్కు తెలియని పరిస్థితి. మరోవైపు.. ఖరీఫ్ కాలం కరిగిపోతోంది. మళ్లీ సాగు చేయటానికి పెట్టుబడుల కోసం డబ్బులు కావాలి. పాత రుణాలను మాఫీ చేస్తే కానీ బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. అదెప్పుడు జరుగుతుందో తెలియదు. బయట అప్పు పుట్టే పరిస్థితీ లేదు. ఈలోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోతే.. అదను తప్పిపోతే.. సాగుకు దిక్కుండదు. ఓ అన్నదాత తన జీవిత బీమా పాలసీని సరెండర్ చేశాడు. ఇంతకాలం పైసా పైసా చొప్పున దాచుకున్న ఆ సొమ్ము తెచ్చుకుని సాగు చేసుకోవచ్చని తలచాడు.
 
 ఎల్‌ఐసీ నుంచి 41,000 రూపాయలకు చెక్కు వచ్చింది. దానిని తీసుకువెళ్లి బ్యాంకులోని తన పొదుపు ఖాతాలో జమ చేశాడు. చెక్కు మారిన తర్వాత.. ఖాతా నుంచి సొమ్ము తీసుకోవాలని ప్రయత్నించాడు. కానీ.. ఆ ఖాతా నుంచి రూపాయి కూడా రాలేదు. బ్యాంకు అధికారులను అడిగితే.. సదరు రైతు రుణ బకాయి ఉన్నందున.. అతడి పొదుపు ఖాతాను బ్లాక్ చేసినట్లు చెప్పారు. బకాయిలు చెల్లించే వరకూ పొదుపు ఖాతాలోని సొమ్ము తీసుకునే వీలు లేదని స్పష్టంచేశారు. దీంతో ఆ రైతన్న హతాశుడయ్యాడు. అతడొక్కడే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో 26 లక్షల మంది అన్నదాతలకు తగులుతున్న షాక్ ఇది. పిల్లల చదువుల కోసం.. త్వరలో జరగాల్సిన పెళ్లిళ్ల కోసం.. ఆస్పత్రుల్లో వైద్యం కోసం.. అనుకోకుండా వచ్చే ఆపదల్లో అవసరాల నిమిత్తం.. పొదుపు ఖాతాల్లో పైసా పైసా చొప్పున కూడబెట్టుకుంటున్న సొమ్ముకు.. అత్యవసర ఖర్చుల కోసం అప్పు తెచ్చి ఖాతాలో జమ చేసిన సొమ్ముకూ.. ఎసరు వచ్చిపడింది. రైతుల రుణమాఫీపై చంద్రబాబు ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తూ ఎటూ తేల్చకుండా నాన్చుతుండటంతో.. బ్యాంకులు తాము ఇచ్చిన వ్యవసాయ రుణాలను వసూలు చేసుకునేందుకు నడుంకట్టాయి. రీషెడ్యూలా.. రుణ మాఫీనా.. తేల్చి చెప్పలేక రాష్ట్ర ప్రభుత్వం రోజుకో తీరుగా మాటమారుస్తుండటంతో బ్యాంకులు రైతులపై నిబంధనల కొరడా ఝుళిపించటం మొదలెట్టాయి. మొన్నటివరకూ రైతులకు నోటీసులు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు ఏకంగా రైతుల పొదుపు ఖాతాలను స్తంభింప చేస్తున్నాయి. ఆ పొదుపు ఖాతాల్లోని సొమ్మును వారి రుణ బకాయిల కింద లాగేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ‘‘మీ పంట రుణం బకాయి ఉంది. అందుకే మీ సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బులను.. మీరు రుణం చెల్లించేదాకా తిరిగి తీసుకునేందుకు అనుమతించం...’’ అని బ్యాంకు మేనేజర్లు రైతులకు కరాఖండిగా తేల్చిచెప్తున్నారు.
 
 రుణాలు చెల్లించటానికి నిర్దేశించిన నిర్ణీత గడువు ముగిసిన తర్వాత పొదుపు ఖాతాల్లోని సొమ్మును బకాయిల కింద జమచేసుకుంటామని స్పష్టంచేస్తున్నారు. ఒక బ్యాంకు కాదు.. వరుస పెట్టినట్లుగా అన్ని బ్యాంకులు రైతుల సేవింగ్స్ ఖాతాలకు, వారి రుణ బకాయిలకు మెలిక పెడుతున్నాయి. సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బును డ్రా చేసుకోకుండా బ్లాక్ చేస్తున్నాయి. దీంతో డెబిట్ కార్డుతో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లిన రైతులు.. ఖాతా ను బ్లాక్ చేశారని తెలుసుకుని నిర్ఘాంతపోతున్నారు. బ్యాంకు అధికారులు అసలు విషయం చెప్తుండటంతో నిశ్చేష్టులవుతున్నారు. ఇప్పుడిక అత్యవసర ఖర్చులకోసమే కాదు.. కుటుంబం గడవటానికి అవసరమైన రోజు వారీ ఖర్చుల కోసం కూడా వారు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఎక్కువ వడ్డీకి అప్పులు చేయాల్సిన దుస్థితి.
 
 గోదావరి జిల్లాల్లో అధికం...
 
 బ్యాంకింగ్ వర్గాలు అందజేసిన సమాచారం ప్రకారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 4.25 లక్షల మంది పొదుపు ఖాతాలను స్తంభింపజేశారు. ఆ తరువాత స్థానంలో పశ్చిమగోదావరి జిల్లాలో 2.75 లక్షలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2.5 లక్షల చొప్పున రైతుల పొదుపు ఖాతాలను వారు డబ్బు విత్‌డ్రా చేయకుండా బ్లాక్ చేశారు. ‘‘నిర్ణీత సమయంలో రుణం చెల్లించని రైతుల ఖాతాలను మేం బ్లాక్ చేశాం. రుణ పరిమితికి మించిన డబ్బును రైతులు తీసుకునేందుకు ఎలాంటి ఆంక్షలు లేవు’’ అని జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి ఒకరు చెప్పారు. అంటే.. ఒక రైతు రుణ బకాయి రూ. 50,000 ఉన్నపుడు.. అతడి పొదుపు ఖాతాలో రూ. 60,000 నగదు ఉన్నట్లయితే.. కేవలం రూ. 10,000 మాత్రం ఆ రైతు తీసుకునే అవకాశం ఉంది. అది కూడా బ్యాంకు అధికారుల అనుమతితోనే. మిగతా రూ. 50,000 మొత్తాన్ని బ్యాంకు స్తంభింపచేసి ఉంచుతుంది. రుణం చెల్లించటానికి ఇచ్చిన గడువులోగా చెల్లించకపోతే.. ఆ రూ. 50,000 ను బ్యాంకు బకాయి కింద జమ చేసేసుకుంటుంది. ఈ పరిస్థితి అటు బ్యాంకు అధికారులను సైతం ఇరకాటంలో పెడుతోంది. ‘‘రైతులు నిత్యం ఏదో ఒక బ్యాంక్‌కు వెళ్లి అధికారులతో తగాదా పడుతున్నారు. చివరకు మా పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది’’ అని ఓ అధికారి వాపోయారు.
 
 ఆందోళనలో రైతాంగం
 
 తమ ఓపికకు పరీక్ష పెడుతూ సర్కారు రుణ మాఫీపై దాగుడుమూతలు ఆడుతుండగా.. ఇప్పుడు తాము పైసా పైసా కూడబెట్టుకున్న సొమ్మును సైతం బ్యాంకులు బ్లాక్ చేస్తుండటంతో రైతుల్లో నిరాశ నిసృ్పహలు అలుముకుంటున్నాయి. ఇంటిల్లిపాదీ కష్టపడి అత్యవసర ఖర్చుల కోసం కాస్తో కూస్తో పొదుపు చేసుకున్న డబ్బును అప్పు కింద జమ కడితే.. తమ కుటుంబమెలా గడుస్తుందని రైతులు వాపోతున్నారు. బ్యాంకులు పొదుపు ఖాతాలను సైతం స్తంభింపచేస్తుండటంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటూ ఊబిలో కూరుకుపోతున్నారు.
 
 
 దాచుకున్న సొమ్మును బ్లాక్ చేశారు
 
 వ్యవసాయ మదుపుల కోసం సీతానగరం ఆంధ్రా బ్యాంక్‌లో 30 వేలు రుణం తీసుకున్నా. ప్రభుత్వం మాఫీ చేస్తానని చెప్పిందని సంబరపడ్డా. ఇంటి ఖర్చుల కోసం అదే బ్యాంక్‌లో (అకౌంట్ నంబర్ 052710021023711) కొంత డబ్బు దాచుకున్నా. ఇటీవల ఏటీఎంకు వెళితే ఖాతా బ్లాక్ చేసినట్లు చూపింది. ఏం చేయాలో దిక్కుతోచట్లేదు.
 - చొక్కాపు తిరుపతిరావు, అప్పయ్యపేట, విజయనగరం
 
 ఎల్‌ఐసీ పాలసీ సరెండర్ చేసి చెక్కు వేశా...
 
 పొలం పనుల కోసం ఆత్రేయపురం మండలంలోని ఐడీబీఐ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నా. ఇప్పుడు వ్యవసాయ అవసరాల కోసం డబ్బు అవసరమై నా ఎల్‌ఐసీ పాలసీని రద్దు చేసుకున్నా. దానికి రూ. 41,000 చెక్ వస్తే అదే బ్యాంక్‌లోని అకౌంట్‌లో జమ చేశా. బ్యాంకుకు వెళ్లి విత్‌డ్రా చేద్దామంటే అధికారులు కుదరదని చెప్పారు.  
 - మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా
 
 పిల్లల కోసం దాచిన డబ్బు తీయనీయడం లేదు
 
 ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రుణం తీసుకున్నా. అందులోని నా పొదుపు ఖాతాలో పిల్లల చదువుల కోసమని కొంత దాచుకున్నా. ఇప్పుడు అవసరానికి బ్యాంకుకు వెళితే రుణం చెల్లించేదాకా ఇవ్వబోమని తెగేసి చెప్తున్నారు. ప్రభుత్వం మాఫీ చేస్తామని చెప్పింది కదా అంటే.. ‘మా అకౌంట్‌కు వస్తేనే మేము మీ డబ్బు తిరిగిస్తాం’ అంటున్నారు.
 - గద్దలపాటి రామయ్య, పుల్లలచెరువు, ప్రకాశం జిల్లా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement