అయ్యో.. అవ్వాతాతలు | Beneficiaries coming to volunteers to know pension information | Sakshi
Sakshi News home page

అయ్యో.. అవ్వాతాతలు

Published Sun, May 5 2024 3:47 AM | Last Updated on Sun, May 5 2024 3:47 AM

Beneficiaries coming to volunteers to know pension information

బ్యాంకుల నిండా వారే

అందరికీ ఖాతాల్లో నగదు జమ చేసినా, ఇప్పటికీ సగం మంది చేతికి అందలేదు

పింఛన్‌ సమాచారం తెలుసుకోవడానికి వలంటీర్ల వద్దకే వస్తున్న లబ్ధిదారులు

ఏ బ్యాంకులో డబ్బులు పడ్డాయో వారినే అడిగి తెలుసుకుంటున్న వైనం

బ్యాంకు వరకు వచ్చి అవ్వాతాతలకు సాయం చేస్తున్న వలంటీర్లు

బాబు కుట్రలతో తప్పని ఇబ్బందులు

వలంటీర్ల ద్వారా పంపిణీని అడ్డుకోకుంటే ఇప్పటికే వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

సాక్షి, అమరావతి: ఇలా చంద్రబాబు కుట్రలతో అవ్వాతాతలు విల­విల­లా­డుతున్నారు. ప్రతి నెలా ఒకటినే తమ ఇళ్ల వద్దే వారు పింఛన్‌ అందుకునేవారు. అయితే చంద్రబాబు ముఠా కుతం­త్రాలతో వలంటీర్లతో పింఛన్ల పంపిణీ జరగనీయ­కుండా అడ్డుకున్నారు. బ్యాంకుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అవ్వాతాతలకు పింఛన్‌ సొమ్మును బ్యాంకుల్లో జమచేశారు. దీంతో అవ్వాతాతలు బ్యాంకుల్లో పడ్డ పింఛన్‌ సొమ్మును తెచ్చుకునేందుకు చాలా చోట్ల వలంటీర్లపైనే ఆధారపడుతున్నారు. 

వారినే బతిమలాడు­కుని బ్యాంకులకు తీసుకువెళ్తున్నారు. అవ్వాతాతల కష్టా­లతో చలించిపోతున్న వలంటీర్లతోపాటు ఇప్పటికే రాజీ­నామా చేసిన వలంటీర్లు కూడా వారికి మానవతాదృక్పథంతో సాయమందిస్తున్నారు. చంద్రబాబు ముఠా వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకోకపోయి ఉంటే ఒకటో తేదీనే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ సొమ్ము అందించేవారు. ఈపాటికే వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తయి ఉండేది.

 కానీ, చంద్రబాబు కుతంత్రాలతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఈ నెల పింఛన్‌ నగదును బ్యాంకుల్లో జమ చేశారు. అయితే ఇప్పటికీ సగం మంది లబ్ధిదారుల చేతికి సొమ్ము అందలేదని తెలుస్తోంది. నగదు ఏ బ్యాంకు ఖాతాలో జమైందో లబ్ధిదారులు తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక ఆన్‌లైన్‌ సిస్టమ్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే చాలా గ్రామాల్లో బ్యాంకులు, ఏటీఎంలు అందుబాటులో లేవు. దీంతో కనీసం 5 కి.మీ నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకులకు అవ్వాతాతలు వెళ్లాల్సి వస్తోంది.

సమాచారం కోసం వలంటీర్ల దగ్గరకే..
ప్రతి నెలా పింఛన్‌ డబ్బులు ఇవ్వడానికి వెళ్లినప్పుడు తమను చిరునవ్వుతో పలకరించే అవ్వాతాతలు ఇప్పుడు అదే పింఛన్‌ కోసం అవస్థలు పడుతుంటే చూడలేకపోతున్నామని గ్రామ, వార్డు వలంటీర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిలి కాళిదాస్‌ ‘సాక్షి’ ప్రతినిధితో ఆవేదన వ్యక్తం చేశారు. అవ్వాతాతలు సమాచారం కోసం తమ వద్దకే వచ్చి బ్యాంకు దాకా తోడు రమ్మని అడుగుతుంటే చాలాచోట్ల వలంటీర్లు కాదనలేక వెంట వెళ్తున్నారని తెలిపారు. 

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరివంకలో తన క్లస్టర్‌ పరిధిలో 35 మంది పింఛనుదారులు ఉన్నారన్నారు. అందరికీ పింఛన్‌ డబ్బులు ప్రభుత్వం బ్యాంకులో జమ చేసినా అందులో 13 మంది మాత్రమే బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్నారని చెప్పారు. లబ్ధిదారులు తన ఇంటికొచ్చి.. పింఛన్‌ సొమ్ము ఏ బ్యాంకులో పడిందో చెప్పాలని అడిగితే చెప్పానని వెల్లడించారు. బోరివంకకు బ్యాంక్‌ 5 కి.మీ దూరంలో ఉందని.. దీంతో ఎండల్లో అంతదూరం వెళ్లలేనివారు ఇంకా పింఛన్‌ తీసుకోలేదన్నారు. 

గతంలో తాము ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసినప్పుడు 35 మందికి ఒకట్రెండు తేదీల్లోనే పింఛన్‌ సొమ్ము అందేదని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 2.57 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తుండగా, అందులో 93 వేల మంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారన్నారు. రాజీనామా చేసిన వలంటీర్లు అవ్వాతాతల కోరిక మేరకు వారికి సాయం చేస్తున్నా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నిండిపోయిన బ్యాంకులు
శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు అవ్వాతాతలతో నిండిపోయాయి. కొన్నిచోట్ల పింఛను డబ్బులు తీసుకోవడానికి తమ ఊరి నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చారు. కొన్ని చోట్ల బ్యాంకులకు అనుసంధానంగా గ్రామాల్లో ఉండే బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు అవ్వాతాతలకు రూ.3,000 తీసి ఇచ్చేందుకు రూ.200 దాకా తీసుకుంటున్నారని సమాచారం.

ఈ చిత్రంలోని వృద్ధుడి పేరు ఉల్చాల మద్దయ్య. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరంగా­పురం మజారా లక్షుంపల్లె నివాసి. మండల కేంద్రం వెల్దుర్తి­లోని యూనియన్‌ బ్యాంకుకు 30 కిలోమీటర్ల దూరంలో ఈయన ఊరు ఉంది. పింఛన్‌ కోసం బ్యాంకుకు శుక్ర­వారం ఉదయం వచ్చాడు. ఇంకా అకౌంట్‌లో పడలేదని తెలు­సుకుని శనివారం పడతాయేమోనని బ్యాంకు బయటే రాత్రి పడుకున్నాడు. తెల్లారి బ్యాంకు ఉద్యోగులు వచ్చి బయటపడుకున్న మద్దయ్యకు టిఫిన్‌ పెట్టించారు. అనంతరం అకౌంట్‌ చెక్‌ చేస్తే పింఛన్‌ సొమ్ము పడలేదు. 

అదే సమయంలో ఒక సచివాలయ ఉద్యోగి నరేశ్‌ బ్యాంకుకు వచ్చి విషయం తెలుసుకుని వృద్ధుడి వివరాలు తీసుకు­న్నారు. ఆయన పింఛన్‌ను ఇంటి వద్ద ఇచ్చేందుకు ఆ ప్రాంత సచివాలయ ఉద్యోగి వెళ్లగా వృద్ధుడు లేడని, ఎక్కడి­కెళ్లాడో తెలియక ఇవ్వలేక­పోయినట్లు తెలుసుకు­న్నాడు. చివరకు వృద్ధుడికి ఆ ప్రాంత సచివాలయ ఉద్యోగి వెల్దుర్తి బ్యాంకు వద్దకే వచ్చి పింఛన్‌ అందించాడు. నాకీ కష్టం తెచ్చింది ఆ చంద్రబాబేనని, మట్టి కొట్టుకుపోతా­డని తిడుతూ మద్దయ్య వెళ్లిపోయాడు.

చంద్రబాబు కుట్రకు బదులు తీర్చుకుంటాం
చంద్రబాబు దుర్మార్గం వల్ల రెండు నెలలుగా పింఛన్‌ తీసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. బాబుకు పేదల కష్టాలు ఎప్పటికీ తెలియవు. ఎంతో ఆశగా ఈనెల పింఛను తీసు­కుందామని రెండు రోజుల నుంచి వాకాడు యూని­యన్‌ బ్యాంక్‌ చుట్టూ తిరుగుతున్నాను. అయినా.. పింఛన్‌ అందుకోలేకపోయాను. వలంటీర్లు ఇంటికి పింఛన్‌ తెచ్చి ఇచ్చేట­ప్పుడు మాకు ఈ కష్టాలు తెలియలేదు. బాబు కుట్రకు బదులు తీర్చుకుంటాం. – చేను వెంకటయ్య, వాకాడు, తిరుపతి జిల్లా 

చంద్రబాబు దుర్మార్గమే ఇది
మా ఊరి నుంచి మూడు రోజులుగా నరసాపురం బ్యాంకుకు వచ్చి పోతున్నాను. ఎక్కువ మంది ఉండటంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. అసలే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రోజూ ఇలా తిరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. వలంటీర్ల ద్వారా పంపిణీ చేసి ఉంటే ఈ కష్టాలు తప్పేవి. చంద్రబాబు చేసిన రాజకీయ దుర్మార్గం వల్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బంది పడుతున్నారు. – చోడదాసి బొంతమ్మ, జోనానగర్,  లక్ష్మణేశ్వరం, నరసాపురం మండలం, పశ్చిమ గోదావరి 

మమ్మల్ని ఏడిపిస్తే ఏమొస్తుంది బాబూ
మాలాంటి ముసలోళ్లను ఏడిపిస్తే చంద్రబాబుకు ఏమొస్తుందో అర్థం కావటం లేదు. నాలుగో తారీఖు వచ్చింది. అయినా పింఛన్‌ అందలేదు. అంతకుముందు ప్రతి నెలా మొదటి రోజున వలంటీర్‌ మా ఇంటికే వచ్చి తలుపు తట్టి చేతిలో పింఛను డబ్బులు పెట్టేవారు. చంద్రబాబు పుణ్యమా అని మాకు ఇబ్బందులు వచ్చి పడ్డాయి. – షేక్‌ మస్తాన్‌బీ సుబ్బాయిగూడెం,  పెనుగంచిప్రోలు, ఎన్టీఆర్‌ జిల్లా 

చంద్రబాబుకు మా ఉసురు తగులుతుంది
వలంటీర్లు ప్రతినెలా ఇంటికొచ్చి ఇచ్చే పింఛన్లను చంద్రబాబు రానివ్వకుండా చేశాడు. 75 ఏళ్ల వయసులో నడిచే ఓపిక లేక మనవడితో పాటు మరో మహిళ సాయంతో సచివాలయానికి వెళ్లా. బ్యాంకు దగ్గరకు వెళ్లండని చెప్పారు. అక్కడ చూస్తే ఒకటే జనం. పింఛన్‌ డబ్బు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా. ప్రతినెలా హాయిగా ఇంటి వద్దే పింఛన్‌ తీసుకునేవాళ్లం. చంద్రబాబు చేసిన పని వల్ల రెండు నెలల నుంచి నరకం చూస్తున్నాం. చంద్రబాబుకు మా ఉసురు తప్పక తగులుతుంది.
– సిద్ధరామక్క, పళారం, గుడిబండ మండలం, శ్రీసత్యసాయి జిల్లా

పేదోళ్లంటే బాబుకు కడుపుమంట
80 ఏళ్ల వయసులో పింఛన్‌ కోసం బ్యాంక్‌కు తిరగలేకపోతున్నాను. చంద్రబాబు చేసిన పనికి మా కడుపు మండుతోంది. గతంలోనూ ఆయన హయాంలో ఇలాంటి ఇబ్బందులే పడ్డాం. పింఛన్‌ తీసుకొనేందుకు రోజుల తరబడి పంచాయతీ కార్యా­లయాల చుట్టూ తిరిగేవాళ్లం. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత మా కష్టాలు తీరాయి. పేదోళ్లంటే బాబుకు కడుపుమంట. మాపై కక్ష కట్టి మరీ సాధిస్తున్నాడు. ఇప్పటికీ నా పింఛన్‌ సొమ్ము చేతికి అందలేదు. – దేవళ్ల రమణమ్మ, కోవూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement