కౌలు రైతులకూ ‘భరోసా’ | YSR Rythu Bharosa also for tenant farmers | Sakshi
Sakshi News home page

కౌలు రైతులకూ ‘భరోసా’

Published Thu, Jul 25 2019 4:59 AM | Last Updated on Thu, Jul 25 2019 4:59 AM

YSR Rythu Bharosa also for tenant farmers - Sakshi

సాక్షి, అమరావతి: పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకూ ప్రయోజనం చేకూర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారు. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులు పంటలు పండించుకునేందుకు వీలుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం, బ్యాంకుల నుంచి రుణం అందేలా కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పంట సాగుదారు హక్కుల కొత్త చట్టానికి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బుధవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లును  ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదింపచేసి చట్టబద్ధత కల్పిస్తారు. తద్వారా రాష్ట్రంలోని 15.36 లక్షల మంది కౌలు రైతులకు ప్రయోజనం కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచన. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన వ్యవసాయ కార్మికులు భూములను కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారని, పంటల సాగు విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో పేర్కొంది. కౌలు రైతులు పంట రుణం, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా మొదలైన వాటిని పొందలేకపోతున్నారని అందులో స్పష్టం చేసింది. ఇలాంటి అడ్డంకులను నివారించేందుకు భూ యజమానులకు గల హక్కులపై వారిలో విశ్వాసం కలిగించేందుకు, మరోవైపు కౌలు రైతులను ఆదుకునేందుకు కొత్త చట్టం తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

బిల్లులోని ముఖ్యాంశాలివీ
- భూ యజమాని హక్కులకు భంగం కలగకుండా కౌలుదారులకు హక్కుల కార్డు జారీ చేస్తారు. ఈ కార్డు ద్వారా కౌలుదారు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందటానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా పంటల బీమా, పంట నష్టపరిహారంతోపాటు రైతులకు కలిగే ఇతరత్రా  ప్రయోజనాలు కౌలు రైతులూ పొందవచ్చు.
ప్రధానంగా వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద కౌలు రైతులు సైతం పెట్టుబడి సాయం పొందేందుకు కొత్త చట్టం దోహదం చేస్తుంది. 

భూ యజమాని హక్కులు
ఒప్పంద కాల వ్యవధి ముగిసిన తరువాత ఏ విధమైన తాకట్టు భారం లేకుండా భూమిని తిరిగి యజమానికి వెనక్కి ఇవ్వాలి. ఒప్పందం చేసుకున్న  మొదటి రోజునే సాగుదారుకు వ్యవసాయ భూమి అప్పగించాలి. సాగుదారు షరతులు పాటించినంత కాలం ఆ భూమి స్వాధీనం/అనుభవించుటలో యజమాని జోక్యం చేసుకోకూడదు.
షరతులను పాటించడంలో సాగుదారు విఫలమైతే అతనికి రెండు నెలల ముందుగా నోటీసు ఇవ్వడం ద్వారా కౌలు ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు భూ యజమానికి ఉంటుంది. అయితే, ఇది కౌలు ఒప్పంద వ్యవధి సమయంలో సాగుదారు హక్కుకు భంగం కలిగించకూడదు. సదరు భూమిపై పంట రుణం తప్ప ఏవిధమైన ఇతర రుణాలు పొందటానికి కౌలుదారుకు అర్హత ఉండదు.

గ్రామ సచివాలయ విధులు
గ్రామ సచివాలయంలో ప్రాధీకృత అధికారి పంట సాగుదారు హక్కుల కార్డుపై ధ్రువీకరణ సంతకం చేయాలి. దాని నకలును సాగుదారు ఉద్దేశాన్ని తెలియజేసిన తేదీ నుంచి మూడు రోజుల్లో భూ యజమానికి అందజేయాలి.
దీనికి సంబంధించి స్వీకరించిన అన్నిరకాల ఖరారు ఒప్పందాలను నిర్దేశించిన రిజిస్టర్‌ను నిర్వహిస్తూ అందులో నమోదు చేయాలి. అన్ని ప్రయోజనాలను అంటే ఇన్‌పుట్‌ సబ్సిడీ, అర్హత కలిగి ఉన్నట్లయితే వైఎస్సార్‌ రైతు భరోసా, తీసుకున్న భూమికి పంట రుణం మొదలైన వాటిని సాగుదారులకు వర్తింపచేసేలా చూడాలి. ఇబ్బందులు ఏవైనా ఉంటే విచారణ జరిపి ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి.
షెడ్యూల్‌ ప్రాంతాలుగా ప్రకటించిన చోట ఎస్టీ సాగుదారులకు మాత్రమే ఈ బిల్లులోని ప్రయోజనాలను వర్తింపజేస్తారు. ఇతర సాగుదారులకు ఎటువంటి ప్రయోజనాలు వర్తించవు.
గ్రామ సచివాలయం నిర్ణయంతో ఎవరైనా విభేదిస్తే.. తొలుత సంబంధిత తహసీల్దార్‌కు అప్పీల్‌ చేసుకోవాలి. దానిపై విచారణ జరిపి తహసీల్దార్‌ ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి. తహసీల్దార్‌ నిర్ణయంపై విభేదిస్తే రెండో దశలో రెవెన్యూ డివిజినల్‌ అధికారి లేదా సబ్‌ కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చు. ఆ అప్పీల్‌ను ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి. రెండో అప్పీల్‌ నిర్ణయాన్ని విభేదిస్తే జాయింట్‌ కలెక్టర్‌కు రివిజన్‌ దాఖలు చేసుకోవచ్చు. రివిజన్‌ అప్పీల్‌ను ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి.
జిల్లా కలెక్టర్‌ పంట సంవత్సరం ప్రారంభంలో ముందుగా సాగుదారుల ప్రతినిధులు, బ్యాంకర్లు, భూ యజమానులు జిల్లాకు చెందిన రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించాలి. ఆ వివరాల నివేదికను నోడల్‌ ఏజెన్సీకి పంపాలి. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ నోడల్‌ ఏజెన్సీగా ఉంటారు. చట్టంలోని నియమ నిబంధనలు అమలు చేసేందుకు, చట్టం లక్ష్యాన్ని సాధించేందుకు నోడల్‌ ఏజెన్సీ అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తుంది. 
ఈ చట్టంలోని నియమాలు సద్భావంతో చేసిన దృష్ట్యా వీటిపై ఏ వ్యక్తిగాని, అధికారి లేదా ప్రాధికారిపై ఎటువంటి దావా, అభియోగం, ఇతర శాసనిక ప్రొసీడింగ్స్‌ ఉండవు. ఈ చట్టం కింద అధికారి, ప్రాధికార సంస్థ, ప్రభుత్వం చేసిన నిర్ణయం లేదా జారీ చేసిన ఉత్తర్వులపై ఏదేని దావా, దరఖాస్తు లేదా ఇతర ప్రొసీడింగ్స్‌ ద్వారా సివిల్‌ న్యాయస్థానాల్లో ప్రశ్నించకూడదు. అలాగే ఏదైనా న్యాయస్థానం నిషేధ ఉత్తర్వులను మంజూరు చేయకూడదు.
కొత్త చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలో గతంలో చేసిన ఆంధ్రప్రదేశ్‌ భూమి లైసెన్స్‌ను పొందిన వ్యవసాయదారుల చట్టం–2011 రద్దు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్ర ప్రాంత) కౌలు చట్టం–1956ను రద్దు చేయాలని బిల్లులో పేర్కొన్నారు. 

కౌలు కార్డు జారీ ఇలా
భూ యజమాని కౌలు రైతు మధ్య కుదిరిన ఒప్పందం ఆధారంగా కౌలు రైతులకు సాగుదారు రైతు హక్కుల కార్డులను జారీ చేస్తారు. గ్రామ సచివాలయంలోని ప్రాధీకృత అధికారి పంట సాగుదారు హక్కుల కార్డుపై ధ్రువీకరణ సంతకం చేస్తారు. దీని నకలును సాగుదారు ఉద్దేశాన్ని తెలియజేసిన తేదీ నుంచి మూడు రోజుల్లోగా భూ యజమానికి అందజేయాలని చట్టంలో ఉంది. భూ యజమాని, సాగుదారు మధ్య కుదిరిన కౌలు ఖరారు పత్రంలో భూ యజమానితో పాటు, సాగుదారు పేర్లు ఉండాలి. భూమి సర్వే నంబర్, సరిహద్దులు, భూమి ఉన్న ప్రదేశాన్ని అందులో పొందుపరుస్తారు. కౌలు ఒప్పందం కాల వ్యవధి 11 నెలలు ఉంటుంది.

సాగుదారు హక్కులు
ఒప్పంద కాల వ్యవధిలో భూ యాజమాన్యంలోని ఏ మార్పుతో సంబంధం లేకుండా పూర్తి కాలానికి కౌలురైతు హక్కుదారుగా ఉంటారు.
రాష్ట్ర ప్రభుత్వం/కేంద్ర ప్రభుత్వం/సహకార సంఘం/షెడ్యూల్‌ బ్యాంక్‌/కేంద్ర ప్రభుత్వంచే యాజమాన్యం వహించే లేదా నిర్వహించే ఏదైనా ఇతర ఆర్థిక సంస్థ నుంచి ఒప్పంద ఖరారు భూమిపై పంట రుణం పొందటానికి కౌలు రైతు హక్కు కలిగి ఉంటాడు.
పంట నష్టాలకు అర్హత ఉన్నట్లైతే వైఎస్సార్‌ రైతు భరోసాతోపాటు పంటల బీమా లేదా ప్రభుత్వంచే సాగుదారులకు కల్పించిన ఏవైనా ఇతర ప్రయోజనాలు/సదుపాయాలను పొందేందుకు కౌలుదారుకు హక్కు ఉంటుంది.
ఎలాంటి తాకట్టు భారం లేకుండా ఒప్పంద గడువు పూర్తి కాగానే వ్యవసాయ భూమిని ఖాళీ చేయాలి. సాగుదారు ఒప్పంద కాల వ్యవధిలో చార్జి లేదా వడ్డీ భారాన్ని భూ యజమానిపై వేయకూడదు.
భూ యజమానికి ఒప్పంద సమయంలోగా ఖరారు చేసుకున్న కౌలు మొత్తాన్ని చెల్లించాలి. వ్యవసాయ ప్రయోజనాలకు మాత్రమే భూమిని వినియోగించాలి. అందులోని ఇతర స్థిరాస్తులకు ఎలాంటి నష్టాన్ని కలిగించకూడదు. ఇతర చట్టంలో ఏమున్నా ఒప్పంద ఖరారు (కౌలు) భూమిపై ఏ విధమైన హక్కును కౌలు రైతు కలిగి ఉండకూడదు.
పంట కోత తరువాత బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న పంట రుణాన్ని పూర్తిగా చెల్లించాలి.
భూమి యాజమాన్యానికి సంబంధించి భూ రికార్డులలో ఇప్పటికే నమోదై ఉన్న వివరాల్లో ఏ అధికారితోనూ ఎలాంటి మార్పులు చేయకూడదు.
సాగుదారు నుంచి ఏదైనా బకాయిని రాబట్టేందుకు బ్యాంకులు షెడ్యూల్డు భూమిని జప్తు చేయకూడదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement