దుష్ట చతుష్టయం మొసలి కన్నీళ్లు | CM Jagan On Chandrababu YSR Rythu Bharosa | Sakshi

దుష్ట చతుష్టయం మొసలి కన్నీళ్లు

Published Tue, May 17 2022 3:21 AM | Last Updated on Tue, May 17 2022 2:06 PM

CM Jagan On Chandrababu YSR Rythu Bharosa - Sakshi

ఏలూరు జిల్లా గణపవరంలో వైఎస్సార్‌ రైతు భరోసా నిధుల జమ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు, రైతులు ,రైతులు బహూకరించిన నాగలితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

చెప్పిందే.. చేస్తా
జగన్‌.. రైతుల తరపున నిలబడే మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒక మాదిరిగా, అయిపోయిన తర్వాత మరో మాదిరిగా ఉండడు. నిజాయితీ, నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో అదే చేస్తాడు.
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి ప్రతినిధి, ఏలూరు: నాడు రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు దారుణంగా వంచించి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తే నోరెత్తని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లాంటి దుష్ట చతుష్టయం అంతా కలసి ఇవాళ రంధ్రాన్వేషణ చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు కాగానే మేనిఫెస్టో హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబును ప్రజల పక్షాన నిలబడి కనీసం ప్రశ్నించని, బాధ్యత లేకుండా తప్పించుకుని తిరిగిన ఆయన దత్తపుత్రుడిని ఏమనాలని నిలదీశారు.

ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబు పట్ల విపరీతమైన ప్రేమ చూపించి ఈ రోజు పరామర్శ యాత్రలంటూ పర్యటిస్తున్నారని విమర్శించారు. మొసలి కన్నీరు కారుస్తున్న వీరికసలు రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ధ్వజమెత్తారు. సోమవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వైఎస్సార్‌ రైతు భరోసా కింద 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికీ రూ.5,500 చొప్పున నేరుగా పెట్టుబడి సాయాన్ని జమ చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం జగన్‌ మాట్లాడారు. ఆ వివరాలివీ..

టీడీపీ మేనిఫెస్టో చూపుతున్న సీఎం 

నాడు – నేడు.. ఎంత తేడా అంటే?
చెప్పిన దానికంటే మిన్నగా..
అన్నదాతలకు ఏటా రూ.13,500 చొప్పున వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని మూడేళ్లుగా అందిస్తున్నాం. 2014–19 మధ్య ఇలాంటి పథకం ఉందా? సొంత భూమి ఉన్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, అటవీ, దేవదాయ భూముల సాగుదారులందరికీ వైఎస్సార్‌ రైతు భరోసా మాదిరిగా రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్న పరిస్థితి గతంలో ఉందా? మేనిఫెస్టోలో రైతన్నకు ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. కానీ అంతకు మించి నాలుగేళ్లకు బదులుగా ఐదేళ్లు ఏటా రూ.13,500 చొప్పున  ఇస్తున్నాం. అంటే ఐదేళ్లలో ప్రతి రైతు చేతిలో రూ.67,500 చొప్పున పెడుతున్నాం. మూడేళ్లలోనే అన్నదాతలకు వివిధ పథకాల ద్వారా రూ.1.10 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చాం.

మాఫీ పేరుతో ముంచారు..
రైతులకు రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని నమ్మించి ముష్టి వేసినట్లు కేవలం రూ.15 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్న గత సర్కారుకు, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించండి. ఈ మూడేళ్లలో 50 లక్షల మందికిపైగా రైతులకు రూ.23,875 కోట్లు రైతు భరోసా ద్వారానే అందచేశాం. ఇంతగా సహాయపడే ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా ? 

పారదర్శకంగా పరిహారం..
వైఎస్సార్‌ సున్నావడ్డీ ద్వారా 65.65 లక్షల మంది రైతులకు మేం మూడేళ్లలో రూ.1,282 కోట్లు ఇస్తే.. ఐదేళ్లు పరిపాలన చేసిన ఓ పెద్దమనిషి ఇచ్చింది కేవలం రూ.782 కోట్లు. ఇప్పటి మాదిరిగా ఏ సీజ¯Œన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌లో పరిహారం చెల్లిస్తున్న పరిస్థితి గతంలో ఉందా? పంట నష్టం జరిగితే అసలు పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి నుంచి.. సీజ¯Œన్‌ ముగిసేలోగా ఆర్బీకేల్లో జాబితాలు ప్రదర్శిస్తూ, ఇంకా ఎవరైనా మిస్‌ అయితే పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతూ ఇ–క్రాప్‌తో అనుసంధానించి పారదర్శకంగా చెల్లిస్తున్నాం. మూడేళ్లలో వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా ద్వారా అందించిన సొమ్ముతో పాటు వచ్చే నెలలో అందించనున్న మొత్తాన్ని కూడా కలిపితే 31 లక్షల మంది రైతులకు దాదాపు రూ.5 వేల కోట్లు ఇన్సూరెన్స్‌గా రైతుల ఖాతాల్లో జమ చేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? 

ఆర్బీకేల్లో అన్ని సేవలు..
విత్తనం నుంచి విక్రయాల వరకూ ప్రతి అడుగులోనూ రైతులకు సహాయపడుతున్నాం. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి గ్రామాల్లోనే సేవలందిస్తున్నాం. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ చెల్లింపు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు లాంటివి పారదర్శకంగా చేపట్టి అక్కడే జాబితా ప్రదర్శిస్తూ ఇస్తున్న వ్యవస్థ గతంలో ఉందా? విత్తనాలు మొదలుకుని పురుగు మందుల వరకూ నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్‌లు తీసుకొచ్చాం. గతంలో ఇలాంటివి ఉన్నాయా? గతంలో బ్యాంకు రుణాలు అందినప్పుడు బీమా సొమ్ము మినహాయించుకుని వారికి మాత్రమే వర్తింపజేసేవారు. మిగతా వారికి బీమా ఎలా కట్టాలో కూడా తెలియదు. రైతులు చెల్లించిన సందర్భాలు చాలా తక్కువ. ఇవాళ ప్రతి రైతు పేరుతో ఆర్బీకేలోనే ఇ–క్రాప్‌ బుకింగ్, ఇన్సూరెన్స్‌ నమోదు చేస్తున్నాం. ఎక్కడా లంచాలు లేవు. వివక్షకు తావులేదు. నాకు ఓటు వేసినా, వేయకపోయినా సరే అర్హత ఉన్న ప్రతి రైతుకు మంచి జరుగుతోంది. కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటించని పంటలను కూడా రైతులు నష్టపోరాదని ప్రభుత్వమే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయడం గతంలో జరిగిందా? 

ఆక్వా రైతులకు రూ.2,403 కోట్ల సబ్సిడీ 
అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50కే కరెంటు సబ్సిడీ ఇస్తూ మూడేళ్లలో రూ.2,403 కోట్లు సబ్సిడీ కల్పించిన ఏకైక ప్రభుత్వం మనదే. కోవిడ్‌ సమయంలో నష్టపోకుండా వారికి తోడున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో 1.72 లక్షల ఎకరాల్లో 55,866 మంది రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. 5 ఎకరాల్లోపు 87 శాతం మంది 70,518 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కార్పొరేట్‌ వ్యవసాయం చేస్తున్న 13 శాతం మంది అంటే ఐదు వేల మంది రైతులు 60 శాతం భూమిలో ఆక్వా సాగు చేస్తున్నారు. 

ఆక్వాజోన్‌లో 10 ఎకరాల వరకు రూ.1.50 సబ్సిడీ 
ఆక్వా సాగుదారుల్లో 5 ఎకరాలలోపు ఉన్న వారందరికీ యూనిట్‌ విద్యుత్తు రూ.1.50 సబ్సిడీ కొనసాగుతుంది. మిగిలిన వారికి రూ.3.80 ఉంటుంది. ఈ మొత్తం కూడా సబ్సిడీ మొత్తమే. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఈ రేటు ఇస్తున్నాం. అయితే పరిమితిని 10 ఎకరాల వరకు విస్తరింప చేయాలని ఎమ్మెల్యే వాసుబాబు కోరారు. ఆక్వాజో¯న్‌లో 10 ఎకరాల వరకు రూ.1.50 సబ్సిడీని విస్తరిస్తాం. ఇది ప్రతి ఆక్వా రైతుకూ సంతోషాన్ని కలిగిస్తుందని భావిస్తున్నా. 

పాడి రైతులను కాపాడి..
గతంలో పాడి రైతులు మోసాలకు గురై నష్టపోయారు. ఇవాళ అమూల్‌ను తీసుకొచ్చి లీటర్‌ పాల మీద పాడి రైతులకు రూ.5 నుంచి రూ.10 అదనంగా ఇస్తున్నాం. అమూల్‌ ఈ ధర ఇస్తోంది కాబట్టి చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌తో సహా ప్రైవేట్‌ డెయిరీలన్నీ ఇదే మాదిరిగా చెల్లించక తప్పని పరిస్థితి వచ్చింది.

ప్రశ్నించని ఈ దత్తపుత్రుడిని ఏమనాలి?
2014 ఎన్నికల్లో చంద్రబాబు ఫొటోతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ తరువాత టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి మేనిఫెస్టోను తొలగించారు. ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేసే నైజం చంద్రబాబుది. చంద్రబాబు మేనిఫెస్టోతో పాటు లేఖలు కూడా రాశారు. ఇందులో చంద్రబాబు, దత్తపుత్రుడు సరిపోరన్నట్లుగా ప్రధాని ఫొటో కూడా పెట్టారు. ఆ మేనిఫెస్టోను బాబు అమలు చేయకుండా మోసగిస్తే కనీసం ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడానికి అడుగు ముందుకు వేయని ఈ దత్తపుత్రుడిని ఏమనాలి? 

కొల్లేరు కోరికలు తీరుస్తూ...
ఎమ్మెల్యే వాసు గణపవరాన్ని భీమవరంలో కలపాలని కోరారు. కొల్లేరు ప్రాంతంలో రీ సర్వే అడిగారు. ఈమేరకు ఆదేశాలు ఇచ్చాం. రాబోయే రోజుల్లో అమలవుతాయి. కొల్లేరు ప్రాంతంలో చెట్టున్నపాడు, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో తాగునీటి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మాణం కోసం విజ్ఞప్తి చేశారు. కొల్లేరులో రెగ్యులేటర్ల నిర్మాణం కోసం కావాలన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తైంది. జూన్‌లో శంకుస్థాపన చేస్తా. ఉంగుటూరులో 6 సబ్‌స్టేషన్లు కావాలని అడిగారు. సర్వే చేయించి అవసరమైన చోట వచ్చేటట్లు చేస్తాం. ఏలూరు కాలువపై నారాయణపురం, ఉంగుటూరు, పూళ్ల, గుండుగొలను గ్రామాల్లో వంతెన నిర్మాణాలు అడిగారు. అవి కూడా చేస్తాం. నారాయణపురం, ఉండి రోడ్డులో వెంకయ్యవయ్యేరు కాలువపై కొత్త వంతెన అడిగారు. అదీ మంజూరు చేస్తున్నాం. 48 పాత ఇందిరమ్మ కాలనీల్లో కనీస వసతులు కోసం విజ్ఞప్తి చేశారు. అవి కూడా చేపడతామని హామీ ఇస్తున్నా.

హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు,  మంత్రులు కాకాణి గోవర్దనరెడ్డి, పినిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement