కరువుల్లేవ్‌.. వలసలు తగ్గాయ్‌: సీఎం జగన్‌ | CM YS Jagan Speech At kurnool pattikonda Public Meeting | Sakshi
Sakshi News home page

రైతులు బాగుండాలనే పెట్టుబడి సాయం: పత్తికొండలో సీఎం జగన్‌

Published Thu, Jun 1 2023 11:28 AM | Last Updated on Thu, Jun 1 2023 6:38 PM

CM YS Jagan Speech At kurnool pattikonda Public Meeting - Sakshi

సాక్షి, కర్నూలు: రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో రైతుల ఖాతాల్లోకి వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం నిధుల జమ కార్యక్రమ బహిరంగ సభలోపాల్గొని ప్రసంగించారు.  

సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..
మీ చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు మధ్య మీ బిడ్డకు, మీ అన్నకు మీరు తోడుగా ఉంటున్నందుకు ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ ప్రతి అవ్వకూ, తాతకు, ప్రతి సోదరుడుకి, స్నేహితుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది...
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఈ రోజు రైతన్నల కోసం, పొలాల్లో శ్రమించే ఆ కష్ట జీవుల కోసం  పత్తికొండ నియోజకవర్గం నుంచి దేవుడి దయతో మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. 
దాదాపుగా 52.30 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు ఈ రోజు బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి రూ.3900 కోట్లు జమ చేయబోతున్నాం.

వరుసగా ఐదో ఏడాది– తొలివిడత సాయం..
ఈ రోజు మేనిఫెస్టోలో రైతన్నలకిచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకునే ప్రభుత్వంగా వైఎస్‌ఆర్‌ రైతుభరోసా– పీఎం కిసాన్‌ ఐదో ఏడాది తొలివిడత సాయం ఇక్కడ నుంచే విడుదల చేస్తున్నాం. రైతన్నలకు తాను పంట పండించే సమయానికి ఆ రైతన్న ఇబ్బంది పడకూడదు, పెట్టుబడి కోసం రైతన్న అప్పులు పుట్టని పరిస్థితి ఉండకూడదని, ఇబ్బంది పడకూడదని ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం. 

చెప్పిన దాని కన్నా మిన్నగా - రైతుభరోసా...
రాష్ట్రంలో ఇవాళ 1 హెక్టారు కూడా లేని రైతులు దాదాపు 70 శాతం మంది ఉన్నారు. అర హెక్టారు లోపు ఉన్న రైతులు దాదాపు 50 శాతం ఉన్నారు. అటువంటి ప్రతి రైతుకు మంచి జరగాలన్న తపనతో ప్రతియేటా రూ.12,500 చొప్పున నాలుగు సంవత్సరాలలో రైతలు చేతుల్లో రూ.50వేలు పెడతామని ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రకటించాం. ఈ రోజు మీ బిడ్డ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా... ఈ రోజు రూ.13,500 ఇస్తున్నాం. 

నాలుగేళ్లు అని మేనిఫెస్టోలో చెప్పినా.. రైతులు ఇబ్బంది పడకూడదని ఐదేళ్లు ఇస్తామని చెప్పి.. రూ.50వేలు కాకుండా రూ.67,500 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చెప్పినదానికన్నా మిన్నగా.. ప్రతి రైతుకు రూ.17,500 ఎక్కువగా ఇచ్చే దిశగా అడుగులు వేశాం. ఇప్పటికే దాదాపుగా 50 లక్షల పై చిలుకు మంది రైతులకు.. ప్రతి రైతుకు రూ.54వేలు వైఎస్‌ఆర్‌ రైతుభరోసాగా ఆ కుటుంబం చేతిలో పెట్టాం. ఈ దఫా ఇచ్చే రూ.7,500 కలుపుకుంటే ప్రతి రైతన్న కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రూ.61,500 ఇచ్చినట్టవుతుంది.

రైతు భరోసా కింది ఏటా మూడు విడతల్లో అందిస్తున్న సహాయాన్ని ఐదో ఏడాది తొలివిడతగా ఈ దఫా 52.30 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి అక్షరాలా రూ.3923 కోట్లు జమ చేస్తున్నాం. ప్రతి రైతుకు రూ.5,500 రైతు భరోసా పీఎం కిసాన్‌ పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఈ రోజు నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్తుంది. మిగిలిన రూ.2వేలు త్వరలో పీఎం కిసాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి మీ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది. వాళ్లు ఇచ్చేది కాస్తా ఆలస్యమైనా నా రైతన్నలు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో.. మీ బిడ్డ కచ్చితంగా మే నెలలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ఈ రోజు జరిపిస్తూ మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు జమ చేస్తున్నాం. 

ఒక్క రైతు భరోసాతోనే రూ.31వేల కోట్లు సాయం..
ఈ రోజు వరకు మీ బిడ్డ ప్రభుత్వం నేరుగా 52.30 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి కేవలం రైతు భరోసా అన్న ఒక్క పథకం ద్వారానే... రూ.31 వేల కోట్లు జమ చేశాం. 
ఈ రోజుమరో మంచి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చే విషయంలో ఒక విప్లవాత్మక మార్పును మీ బిడ్డ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఏ సీజన్‌లోనైనా పంట నష్టం జరిగితే... ఆ సీజన్‌ ముగిసేలోగానే రైతన్నల చేతుల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ డబ్బులు పెడితే ఆ రైతన్న తన కాళ్లమీద తాను నిలబడగలుగుతాడని చెప్పి... ఇన్‌పుట్‌ సబ్సిడీ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తున్న ప్రభుత్వం మనదే. 

రూ. 54 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ..
ఈ సారి కూడా అదే పద్ధతిలో ఎక్కడా ఆలస్యం లేకుండా, రైతన్న ఇబ్బంది పడకూడదని ఈ సంవత్సరం మార్చి, ఏఫ్రిల్, మే నెలల్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన 51వేల మంది రైతన్నల ఖాతాల్లోకి నేరుగా రూ.54 కోట్లను ఇన్‌పుట్‌ సబ్సిడీగా జమ చేస్తున్నాం. గత నాలుగు సంవత్సరాలుగా 22.70 లక్షల మంది రైతన్నలకు ఏ సీజన్‌లో నష్టం జరిగితే ఈ సీజన్‌లో రైతన్నలను ఆదుకుంటూ ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపంలో రూ.1965 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశాం.

సాగులో విప్లవాత్మక మార్పులు...
మన ప్రభుత్వం వచ్చి కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే అయింది. ఈ నాలుగేళ్లలో వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలబడుతూ.. విప్లవాత్మక మార్పులు ఈ రంగంలో తీసుకొచ్చాం. మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో గొప్పది.. 

రైతు భరోసా కేంద్రాలు
గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాలంలో ఇలాంటి ఆలోచన అయినా ఆయనకు తట్టిందా? రైతు భరోసా కేంద్రాల ఊసే అప్పుడు లేదు. మన ప్రభుత్వంలో గ్రామస్ధాయిలో ప్రతి రైతన్నను ఆదుకునేందుకు, తోడుగా నిలబడేందుకు.. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ రైతన్నకు తోడుగా ఉంటూ, చేయిపట్టుకుని నడిపిస్తూ.. 10778 రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసాం. అన్నదాతకు నిరంతరంగా తోడుగా,అండగా ఉంటూ వారితో పాటు కలిసి అడుగులు వేస్తున్నాం. దేవుడి కరుణ, రైతన్నల కష్టం, రైతుల పట్ల మీ ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమ వీటన్నింటినీ ఒక్కచోటుకి తీసుకొస్తే.. దేవుడి దయతో రాష్ట్రంలో దిగుబడి పెరిగింది.

2014–19 మధ్య కాలంలో ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి అప్పట్లో ఏటా 153 లక్షల టన్నుల మాత్రమే ఉంటే... మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు ప్రతిఏటా సగటున 165 లక్షల టన్నులకు చేరింది. ఉద్యాన పంటల దిగుబడి గమనిస్తే.. చంద్రబాబు హయాంలో ఏటా సగటున 228 లక్షల టన్నుల మాత్రమే ఉంటే...మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏకంగా 332 లక్షల టన్నులకు పెరిగింది. తేడా గమనించండి.

బాబు పాలనంతా కరువే..
గతంలో చంద్రబాబు హయాలంలో ఏ సంవత్సరం చూసుకున్నా కరువే.. కరువు. బాబు హయాలంలో ప్రతి సంవత్సరం కనీసం సగం మండలాలు కరవు మండలాలుగా ప్రకటించే పరిస్థితి. అప్పట్లో 1623 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారు. రాష్ట్రంలో సగం మండలాలు ఎప్పుడు కరవు మండలాలుగానే ఉండేవి. దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతో మీ బిడ్డ పరిపాలన ప్రారంభమైన తర్వాత దేవుడిదయతో మంచి వానలు పడ్డాయి. కరువులు లేవు. వలసలు కూడా తగ్గాయి.

నాటికీ – నేటికీ తేడా చూస్తే...
దేవుడి దయ వల్ల ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా కరవు మండలాలుగా ప్రకటించాల్సిన అవసరం లేకుండా పాలన సాగింది. గతంలో చంద్రబాబు పాలనలోని ఐదేళ్లలో సున్నా వడ్డీ కింద రుణాల మీద 40.60 లక్షల మంది రైతన్నలకు కేవలం రూ.685 కోట్లు మాత్రమే అందిస్తే.. మన ప్రభుత్వంలో ఈ నాలుగేళ్ల కాలంలో రైతులకు సున్నావడ్డీ కింద రూ.1835 కోట్లు ఇచ్చాం. 74 లక్షల మంది రైతులకు సున్నావడ్డీ ద్వారా మంచి చేయగలిగాం. చంద్రబాబు హయాంలో సున్నావడ్డీ కింద  ఇవ్వకుండా పెట్టిన బకాయిలు సైతం మీ బిడ్డ హయాంలో చిరునవ్వుతో చెల్లించాం. 

గతంలో చంద్రబాబు హయాంలో 30.85 లక్షల మంది రైతులకు కేవలం ఐదేళ్లలో రూ.3411 కోట్లు పంటల బీమా కింద ఇస్తే... మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ నాలుగు సంవత్సరాలలో మాత్రమే వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకంలో 44లక్షల మంది రైతన్నలకు రూ. 6685 కోట్లు బీమాగా చెల్లించాం. ఈ సంవత్సరం కూడా నిరుడు ఖరీప్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్‌ సొమ్ము కూడా జూలై 8, (నాన్నగారి పుట్టిన రోజు) వైఎస్‌ఆర్‌ జయంతి రోజున జమ చేయనున్నాం.

ఒక్క రూపాయి కూడా రైతన్నలు బీమా ప్రీమయం కట్టాల్సిన అవసరం లేకుండా.. గతంలో ఎన్నడూ జరగని విధంగా, పూర్తిగా బీమా ప్రీమియం కూడా తానే భరిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మనదే.

మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలోనూ ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా ఇ–క్రాప్‌ బుకింగ్‌ జరుగుతుంది.  రైతుల పేరులన్నీ సోషల్‌ ఆడిట్‌ కోసం ఆర్బీకేలలో డిస్‌ప్లే చేస్తున్నారు. గ్రామస్ధాయిలోనే ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా మంచి చేస్తున్నారు. ఇవన్నీ మీ బిడ్డ హాయంలోనే జరుగుతున్నాయి. 

గత చంద్రబాబు ప్రభుత్వ హయాలంలో ఇ– క్రాప్‌ అనే మాటే లేదు. ఆర్బీకే అన్న మాటే లేదు. సోషల్‌ ఆడిట్‌ కింద మొత్తం జాబితా పెట్టాలన్న ఊసే లేదు. గత పాలనకు, ఈ పాలనకు మధ్య తేడా గమనించండి.

ధాన్యం సేకరణలో నాడు– నేడు
మరోవైపు ధాన్యం సేకరణ మీద కూడా గతానికి ఇప్పటికి ఉన్న తేడా గమనించండి.గతంలో ఆ ఐదు సంవత్సరాల కాలంలో సేకరించిన మొత్తం ధాన్యం 2.65 కోట్ల టన్నులు అయితే, మన ప్రభుత్వంలో నాలుగేళ్లలో సేకరించిన ధాన్యం మొత్తం 3.09 కోట్ల టన్నులు. ఇంకా రబీలో సేకరణ జరుగుతుంది. ఎన్నికల్లోగా మరో ఏడాది ధాన్యం సేకరణ మళ్లీ జరుగుతుంది.  గతంతో పోలీస్తే.. అప్పుడు ఏటా సగటున 53 లక్షల టన్నుల సేకరిస్తున్న పరిస్థితి నుంచి ఇవాళ సగటున ఏటా 75 లక్షల టన్నుల సేకరిస్తున్నాం. ధాన్యం సేకరణపై గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన వ్యయం రూ.40,237 కోట్లు అయితే మన ప్రభుత్వంలో ఈ నాలుగేళ్లలో ఇప్పటికే రూ.60వేల కోట్లు ధాన్యం సేకరణ కోసం ఖర్చు చేశాం. రబీ పూర్తి కాలేదు. ఐదేళ్లకు ఇంకా మరో ఏడాది పెండింగ్‌ ఉంది. అది కూడా కలుపుకుంటే కనీసం రూ.77వేల కోట్లు అవుతుంది. తేడా మీరే చూడండి. 

అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు
విత్తనాలు దగ్గర నుంచి ఎరువులు వరకు నకిలీలు గుర్తించే విషయంలోనైనా, భూసార పరీక్షలు చేసే విషయంలోనూ, గత ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపించలేదు. మన ప్రభుత్వంలో ఇప్పటికే 70 నియోజవర్గస్ధాయిలో అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌లు కనిపిస్తున్నాయి. 
2 జిల్లా స్ధాయి ల్యాబ్‌లు, మరో 4 రీజనల్‌ కోడింగ్‌ సెంటర్లు కూడా ఏర్పాటయ్యాయి. ఇవి కాకుండా మరో 77 నియోజకవర్గాల్లో అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌లు కడుతున్నాం. మరో 11 జిల్లా స్ధాయి ల్యాబ్స్‌ నిర్మాణం మొదలయ్యింది. ఆర్బీకే స్ధాయిలో కూడా సీడ్‌ టెస్టింగ్, 
సాయిల్‌ టెస్టింగ్‌ దిశగా అడుగులు పడుతున్నారు. ఎందుకంటే ఆర్బీకేలు గ్రామ స్ధాయిలో రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసే విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. 

100 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే...
మరికొన్ని విషయాలు కూడా మీకు చెప్పాలి. రైతన్నలకు పంట ఎంత ముఖ్యమో.. భూమిమీద సర్వహక్కులు కూడా వారికి అంతే ముఖ్యం.వందేళ్లక్రితం బ్రిటీష్‌ హయాంలో భూసర్వే జరిగితే... ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. గ్రామస్ధాయిలో సరిహద్దు రాళ్లు లేవు. గ్రామస్ధాయిలో సబ్‌డివిజన్‌ అప్‌డేట్‌ కార్యక్రమం కూడా జరగలేదు. భూవివాదాలు గ్రామాల్లో మన కళ్లెదుటనే కనిపిస్తున్నా.. పరిష్కారం రాని పరిస్థితులలో రైతులు ఉన్నారు.  ఈ విషయం తెలిసిన ప్రభుత్వంగా..  వీరికి మంచి జరగాలని మన ప్రభుత్వం హయాంలో వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే నిర్వహించి, నిర్ధిష్టంగా సరిహద్దులు నిర్ణయించి, సర్వేరాళ్లను పాతించి, రికార్డులన్నీ అప్‌డేట్‌ చేయించి, వివాదాలకు ఏమాత్రం తావులేకుండా రైతన్నల చేతిలో భూహక్కు పత్రాలను పెట్టే గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది. 


గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు...
గ్రామ సచివాలయాలన్నింటిలోనూ సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో జరగబోయే రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలన్నీ అక్కడే జరగాలన్న ఆలోచనతో.. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. 
ఎప్పుడూ జరగని విధంగా, ఎవ్వరూ ఊహించని విధంగా రైతన్నలకు భూముల మీద ఉన్న సర్వహక్కులు వారికి ఇప్పించాలని తపన, తాపత్రయంలో అడుగులు వేస్తున్నాం. చుక్కల భూముల మీద, బ్రిటీష్‌ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న భూముల మీద, గత ప్రభుత్వ హయాలంలో నిషేధిత జాబితాలో పెట్టిన భూముల మీద సర్వహక్కులూ రైతులకు ఇస్తూ.. లక్షల ఎకరాల మీద పూర్తి హక్కులు ఇచ్చిన ప్రభుత్వం మనది.

9 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ కోసం..
ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నిరంతరాయంగా రైతులకు ఏ ఇబ్బంది రాకూడదని, పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ప్రభుత్వం కూడా మీ బిడ్డదే. రైతన్నలకు పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలంటే.. రూ.1700 కోట్లు ఖర్చుపెట్టి ఫీడర్లను బలపరుస్తే తప్ప ఉచిత విద్యుత్‌ ఇవ్వలేమంటే మీ బిడ్డ హయాంలో ఆ ఖర్చు కూడా చేసి ఫీడర్లను బలపర్చే కార్యక్రమం చేశాం.

ఆక్వా సాగుకు సాయంగా....
ఆక్వా రైతులకు రూ.1.50 కే యూనిట్‌ విద్యుత్‌ అందిస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం మనదే. ఇప్పటివరకూ ఈ ఆక్వా రైతులకు మంచి చేస్తూ.. వాళ్లందరి తరపున నిలబడి వారికి రూ.2967 కోట్ల సబ్సిడీ రూపేణా ప్రభుత్వం భరించింది. దేవుడి దయతో ఈ నాలుగు సంవత్సరాలు వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల కరవుసీమగా పేరున్న రాయలసీమ కూడా కళకళలాడుతుంది. రిజర్వాయర్లు అన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు కూడా ఎప్పుడూ ఊహకందని విధంగా పెరిగాయి. రైతన్నలకు తోడుగా నిలుస్తున్న ప్రభుత్వంగా, అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలి, రైతన్న వ్యవసాయం ఒక్కటే చేస్తే సరిపోదు, వ్యవసాయం మీద వచ్చే ఆధాయానికి అదనంగా ఇంకా ఆధాయం రావాలని చెప్పి వారికి తోడుగా నిలబడుతూ.. అక్కచెల్లెమ్మలకు మరో నాలుగు రూపాయలు అదనంగా రావాలన్న తపనతో అమూల్‌ను తీసుకొచ్చి, రాష్ట్రంలో రంగ ప్రవేశం చేయించాం. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచిన అమూల్‌ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాం.

అమూల్‌– పాడి రంగంలో మార్పులు..
అమూల్‌ ఇక్కడకు వచ్చింది కాబట్టి.. అంతకముందు దోచుకుంటున్న హెరిటేజ్‌ వంటి పాలడెయిరీలన్నీ తలవంచి పాడిరైతులకు ఇచ్చే ధర పెంచాల్సి వచ్చింది. అమూల్‌ వచ్చేనాటికి ఇప్పటికీ పాలధరల్లో తేడా చూస్తే... అమూల్‌ వచ్చిన తర్వాత నాలుగు సందర్భాలలో ధరలు పెంచుకుంటూ పోయింది. లీటరుకు రూ.10 నుంచి రూ.17 వరకు ధర అమూల్‌ పెంచింది. దీంతో హెరిటేజ్‌ వంటి పాలడెయిరీలు కూడా రేటు పెంచకతప్పనిసరి పరిస్థితి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కనిపిస్తోంది. 

మీ బిడ్డ హయాంలో ఆర్బీకే స్ధాయిలోనే ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర అన్నది పోస్టర్లు ద్వారా డిస్‌ప్లే చేశాం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీ ప్రకటించని ఆరు పంటలకు కూడా మద్ధతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మార్కెట్‌లో పోటీ పెరిగి ఈ రోజు ప్రతీ రైతన్నకు కనీస గిట్టుబాటు ధర ఆర్బీకే స్దాయిలోనే వచ్చేట్టు, దళారులు లేకుండా అమ్ముకునే కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జరుగుతోంది. 

మూగజీవాల కోసమూ...
పశునష్టపరిహారం కింద రూ.667 కోట్లు చెల్లించాం. ఆయిల్‌ఫాం రైతులను ఆదుకునేందుకు రూ.85 కోట్లు ఇచ్చాం. వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ చేయూత ద్వారా 5 లక్షల మంది అక్కచెల్లెమ్మలు పశుసంపద కొనుగోలుచేసి.. తద్వారా అదనపు ఆదాయం వచ్చేందుకు తోడుగా నిలబడ్డాం. 
వైఎస్‌ఆర్‌ పశు ఆరోగ్యసేవలో భాగంగా పశువులకు సైతం 340 ఆంబులెన్స్‌లు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో యానిమల్‌ డిసీజెస్‌ డయాగ్నొస్టిక్‌ ల్యాబ్స్‌ ఏర్పాటయ్యాయి.

చంద్రబాబు పెట్టిన బకాయిలూ చెల్లించాం...
చివరకు గత ప్రభుత్వ హయాంలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టి పోయిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలు కూడా మన ప్రభుత్వమే చెల్లించింది.
అప్పట్లో చంద్రబాబు బకాయిలుగా పెట్టి ఎగ్గొట్టి పోయిన రూ.384 కోట్ల విత్తన బకాయిలూ మన ప్రభుత్వమే చెల్లించింది. రూ.8845 కోట్ల మేర చంద్రబాబు ఎగ్గొట్టి పోయిన విద్యుత్‌ బకాయిలునూ రైతన్నల కోసం మన ప్రభుత్వమే చెల్లించింది. ఫామ్‌ మెకనైజేషన్‌ అన్నది ఎప్పుడూ జరగని  విధంగా చేస్తున్నాం. గతంలో ఎవరికిచ్చామో, ఎందుకిచ్చామో తెలియదు అన్న పరిస్థితి నుంచి ఈ రోజు ఒక విధానం తీసుకొచ్చాం. 

ఫామ్‌ మెకనైజేషన్‌...
ప్రతి ఆర్బీకే స్దాయిలో ఒక సీహెచ్‌సీ(కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ను) స్ధాపించాం. ప్రతి ఆర్బీకే స్దాయిలోనూ ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఫామ్‌ మెకనైజేషన్‌ కోసం రూ.1052 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికాలను ఆర్బీకే స్ధాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అడుగులు పడుతున్నాయి. ప్రతి ఆర్బీకే స్ధాయిలో రైతులు ఒక గ్రూప్‌ కింద ఏర్పడి వారు కేవలం 10 శాతం చెల్లిస్తే.. 40 శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది.

మరో 50 శాతం రుణం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి, ఆర్బీకే స్ధాయిలోనే దాదాపు రూ.15 లక్షలు విలువ చేసే ట్రాక్టర్లు వంటి వ్యవసాయ ఉపకరణాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఈ గ్రూపులో ఉన్న రైతులు ఆ వ్యవసాయ ఉపకరణాలను మిగిలిన రైతులకు తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చి వారికి మేలు జరిగే విధంగా ఆర్బీకే స్ధాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం. వ్యవసాయ యంత్రీకరణ అన్నది ఇప్పుడు అర్ధవంతంగా సాగుతుంది. వ్యవసాయంలో మొట్టమొదటిసారిగా ఆర్బీకే స్ధాయిలోనే డ్రోన్లు తీసుకువచ్చే గొప్ప అడుగులు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ మన రైతులే డ్రోన్లు ద్వారా వ్యవసాయం చేసే గొప్ప రోజులు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగా వ్యవసాయం మీద అపారమైన ప్రేమ ఉన్న ప్రభుత్వంగా.. బాధ్యతతో, రైతుల మీద మమకారంతో చేసాం. 
నేరుగా రైతులకిస్తున్న పథకాలతో పాటు ప్రతి రైతుకు మేలు జరిగేటట్టుగా నవరత్నాల్లోని దాదాపు అన్ని పథకాలను కూడా  పేద కుటుంబాలన్నింటికీ వర్తించే విధంగా వాటిని తయారు చేసి అమలు చేస్తున్నాం. రైతుల కోసం ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వం మనది అయితే.. మరోవంక రైతుకు శత్రువైన చంద్రబాబు నాయుడుని చూడండి. 

సాగు దండగన్న బాబు...
వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికే ఆ తీగలు తరమవుతాయని చెప్పాడు. తొలి సంతకంతో మొత్తం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని ఊరూరా చెప్పి, పొరపాటున ఓటు వేసిన రైతులను చంద్రబాబు నిలువుగా ముంచాడు. 

రాజమండ్రిలో డ్రామా షో...
నిన్నకాక మొన్న రాజమండ్రిలో ఒక డ్రామ కంపెనీ మాదిరి ఒక షో జరిగింది. మహానాడు అని చెప్పి  ఆ డ్రామాకు ఒక పేరు కూడా పెట్టుకున్నారు. ఆ డ్రామా చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అందులో 27 సంవత్సరాల క్రితం తామే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషిని .. మళ్లీ తామే ఆ మనిషి యుగపురుషుడని, శకపురుషుడని, ఆ మనిషి రాముడు, కృష్డుడు అని కీర్తిస్తూ ఆయన ఫోటోకు దండ వేశారు. మహానాడులో  సాక్షాత్తుగా జరుగుతున్న డ్రామా ఇది.

ఆ మహానాడు డ్రామాకు మందు వీళ్లంతా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూస్తే నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. అదేమిటంటే... తమ పార్టీ ఆకర్షణీయమైన మేనిఫెస్టోను ముందే ప్రకటించారు.  మేనిఫెస్టోను ఆకర్షణీయమైన అని సంబోంధించి ప్రకటించడం..నాకు ఇంకా పెద్ద ఆశ్చర్యమనిపించింది. ఈ మాట వింటే కొన్ని కొన్ని పాత్రలు, కొన్ని కథలు గుర్తుకువస్తాయి.

పూతన, మారీచుడు, రావణుడు కలిసి చంద్రబాబులా...
పసిపిల్లవాడైన కృష్ణుడుని హతమార్చడానికి దుష్ట ఆలోచనలతో పూతన అనే రాక్షసి కూడా బాబు చెపుతున్నట్టుగా అందమైన మేనిఫెస్టో మాదిరిగా మోసపూరిత స్త్రీ వేషంలో రావడం గుర్తుకువచ్చింది. అందమైన మాయ లేడీ రూపంలో సీతమ్మ దగ్గరికి వచ్చిన మారీచుడు కూడా గుర్తుకు వచ్చాడు. సీతమ్మను ఎత్తుకుపోవడానికి గెటప్‌ మార్చుకుని భవతీ భిక్షాందేహీ అని వచ్చిన రావణుడు కూడా గుర్తుకు వచ్చాడు. 
ఈ ముగ్గురు ఆత్మలూ కలిసి, ఈ మూడు క్యారెక్టర్లూ కలిపి మన ఏపీలో ఒక మనిషిగా నారా చంద్రబాబునాయుడు అనే వ్యక్తి జన్మించాడు.

బాబు – విలువలు, విశ్వసనీయత లేని క్యారెక్టర్‌.. 
మేనిఫెస్టో పేరుతో ప్రతి ఎన్నికకు ఒక వేషం వేస్తాడు. వాగ్ధానానికి ఒక మోసం చేస్తాడు. ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారి క్యారెక్టర్‌ ఏమిటంటే ఈయన సత్యం పలకడు. ధర్మానికి కట్టుబడడు. మాట మీద నిలబడడు. విలువలు, విశ్వసనీయత అçసలే లేవు. 

తమ పార్టీ అధ్యక్షుడు, పిల్లనిచ్చిన మామ ఎన్‌టీరామారావునైనా సరే పొడుస్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలనైనా పొడుస్తాడు. అధికారం కోసం ఎవరినైనా పొడవడానికి ఏమాత్రం వెనుకాడడు. చంద్రబాబు పొలిటిలక్‌ ఫిలాసపీ ఏమిటంటే... ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో. ఆ తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడవడం. మేనిఫెస్టోను చూపిస్తూ.. ఆకర్షణీయమైన మేనిఫెస్టో అని చెపుతూ.. దానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతారు.

అసలు మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుందన్నది బాబుకు తెలుసా ? మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుందో ఈ పెద్ద మనిషికి అవగాహన ఉందా ? 

మన మేనిఫెస్టో... ప్రజల ఆకాంక్షల గుండె చప్పుడు
మన పార్టీ మేనిఫెస్టో నా ఓదార్పు యాత్ర, పాదయాత్ర వల్ల ప్రజల కష్టాల నడుమ వాటి పరిష్కారం దిశగా, ప్రజల ఆకాంక్షలు, అవసరాల నుంచి వారిæ గుండెచప్పుడుగా పుట్టింది. 

మన రైతులు, మన పేదలు, నా అక్కచెల్లెమ్మలు, మన ప్రాంతాలు, మన సామాజిక వర్గాలు, వారి కష్టాలు, వారి అవసరాలు నడుమ వారి ఉజ్వల భవిష్యత్‌ కోసం, వారికి మంచి భవిష్యత్‌ చూపించడం కోసం మన మట్టి నుంచి మన మేనిఫెస్టో పుట్టింది.

బాబు మేనిఫెస్టో – బిసిబెళ బాత్‌...
చంద్రబాబు మేనిఫెస్టో మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో పుట్టలేదు. వారి మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. కారణం ఈ పెద్ద మనిషి జనంలో తిరగడు కాబట్టి.. ఆయన మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. కర్ణాటకలో పుట్టింది. కర్ణాటకలో బీజీపీ కాంగ్రెస్‌ రెండూ ఎదురెదురుగా తలపడి,  రెండు పార్టీలు మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కలిపేసి ఒక బిసిబెళ  బాత్‌ వండేశాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. అంతటితో సరిపోదు అది రుచికరంగా ఉండదు, ఆకర్షణీయంగా ఉండదు అని మన అమ్మఒడి, చేయూత, రైతుభరోసా మన పథకాలన్నీ కలిపేసి ఇంకో పులిహోర వండేశాడు. 
వైయస్సార్‌ గారి పథకాలన్నీ కాపీ, జగన్‌ పథకాలూ కాపీ, బీజీపీ పథకాలూ కాపీ, కాంగ్రెస్‌ పథకాలూ కాపీ. చివరకు బాబు బ్రతుకే కాపీ, మోసం. ఈ బాబుకు ఒరిజినాలిటీ లేదు, పర్సనాలిటీలేదు. కేరెక్టర్‌ లేదు, క్రెడిబులిటీ అంత కన్నా లేదు. పోటీ చేసేందుకు ఈపెద్ద మనిషికి 175 నియోజకవర్గాల్లో 175 మంది కేండిడేట్‌లు కూడా లేని పార్టీ ఇది.

పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ...
మైదానాల్లో మీటింగ్‌లుపెడితే జనం రారని, మనుషులు చనిపోయినా ఫర్వాలేదని ఇరుకైన సందులు, గొందులు వెదుక్కుంటున్న పార్టీ ఇది. పొత్తులు కోసం ఎంతకైనా దిగజారే పార్టీ ఇది. ఏ గడ్డైనా తినడానికి వెనుకాడని పార్టీ ఇది. విలువలు, విశ్వసనీయత లేని పార్టీ చంద్రబాబు పార్టీ. జనంలో లేని బాబు పార్టీకి కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులే వీళ్ల పార్టీ ఫిలాసపీ.

ఫలానా మంచి చేశానని చెప్పుకోలేని వ్యక్తి – బాబు
1995లోనే సీఎం అయ్యి కూడా... సీఎం అయిన 30 సంవత్సరాల తర్వాత కూడా 2024లో ఎన్నికలు మరలా వస్తుంటే... ఈ పెద్ద మనిషి ఏం అడుగుతాడంటే.. నాకు ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి చేసేస్తా. మరో ఛాన్స్‌ ఇవ్వండి చేస్తాను అని అంటాడే తప్ప సీఎంగా ఉన్న రోజుల్లో మీ ఇంటికి ఈ మంచి చేశాను అని చెప్పి ఈ మనిషి నోటిలోనుంచి మాటలు రావు. డీబీటీ రూపంలో మీ ఇంటికి ఇంత మంచి చేశానని కానీ, మీకు ఇళ్లు కట్టించానని కానీ, రైతులకు ఈ మంచి చేశానని, గ్రామానికి మంచి చేశానని, పిల్లలకు ఈ మంచి చేశానని కనీసం ఒక్కటంటే ఒక్కటి చెప్పుకునే చరిత్రలేని వ్యక్తి చంద్రబాబు ఆయన పార్టీ.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటాడు.. కానీ చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పని లేని పరిపాలన ఆయన హయంలో సాగింది. రాష్ట్రంలో 1.50 కోట్ల ఇళ్ల ముందు నిలబడి మీ ఇంటికి  ఈ మంచి చేశానని చెప్పలేని బాబు, సామాజిక వర్గాల ఎదురుగా నిలబడి మీకు ఈ మాట ఇచ్చి, నెరవేర్చా అని చెప్పలేని ఈ బాబు, ఏం చేశాడో తెలుసా ? 
నమ్మిన రైతులను, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను, యువతను, అవ్వాతాతలని అందరినీ హోల్‌సేల్‌గామోసం చేశాడు. అందరికీ అప్పులు పాలుజేసి, నట్టేట ముంచాడు ఈ  పెద్ద మనిషి చంద్రబాబు. 

చంద్రబాబు –మొదటి సంతకమే మోసం
మామాలుగా ఎవరైననా ముఖ్యమంత్రి అయ్యి.. మొదటి సంతకం చేస్తే దానికి క్రెడిబులిడీ ఉంటుంది. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మొదటి సంతకాలనే మోసం, వంచన, దగాగా మార్చి.. మరోసారి మళ్లీ కొత్త వాగ్ధానాలతో జనం ముందుకు వస్తున్నాడు. కొంగ జపం మొదలెట్టాడన్నది గమనించండి. 
మంచి చేయడం అన్నది చంద్రబాబు డిక్షనరీలో లేనేలేదు. ధర్మంగా రాజకీయాలలో పోరాటం చేయడం, విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేయడం, ధైర్యంగా, ఒంటరిగా పోటీ చేసి నేను ఈ మంచి చేశాను కాబట్టి.. నాకు ఓటు వేయండి అని చెప్పి అడిగే ధైర్యం, సత్తా ఈ మనిషి డిక్షనరీలోనే లేవు. 

చంద్రబాబు నాయుడు ఆయన గజదొంగల ముఠాలో వారికి తోడుగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 వీళ్లందరికీ ఒక దత్తపుత్రుడు. వీళ్లు చేస్తున్నది రాజకీయ పోరాటం కాదు. వీరిది అధికారం కోసం ఆరాటం. ఆ అధికారం కూడా ఎందుకంటే... దోచుకోవడానికి, దోచుకున్నది ఈ నలుగురు పంచుకుని తినడానికి. 

పేదలకు– పెత్తందార్లకు మధ్య కురుక్షేత్రం...
రాబోయే రోజుల్లో ఎన్నికల్లో యుద్ధం జరగబోతుంది. ఈ కురుక్షేత్రంలో.. యుద్దం జరగబోతున్నది వారు దోచుకోవాడనికి, పంచుకోవడానికి, తినడానికి మధ్య... మన ప్రభుత్వంలో మీ బిడ్డ బటన్‌ నొక్కగానే నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకివెళ్లే కార్యక్రమం (డీబీటీ) మధ్య యుద్ధం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారీ డీపీటీ కావాలో.. మీ బిడ్డ బటన్‌ నొక్కే డీబీటీ  కావాలో ఆలోచన చేయండి.

ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు పెత్తందారీ భావజాలానికి మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య యుద్దం జరుగుతుంది. రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం జరగడం లేదు... ఇక్కడ పేదవాడు మనవైపు ఉంటే.. అటువైపు ఉన్న పెత్తందార్లతో యుద్దం జరుగుతుంది.
వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య యుద్దం జరుగుతుంది. ఒకవైపు మీ బిడ్డ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనే మాట ప్రతి సందర్భంలోనూ మీ బిడ్డ నోట నుంచి వినిపిస్తుంది. మీ బిడ్డ హయాంలోని కేబినెట్‌లో ఈ రోజు 65 శాతానికి పైగా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు కనిపిస్తారు. మీ బిడ్డ హయాంలో 5 గురు డిప్యూటీ సీఎంలు ఉంటే వారిలో నలుగురు నా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ సోదరులే కనిపిస్తారు. 
ఒకవైపు మీ బిడ్డ హయాంలో ప్రతి అడుగులోనూ నా అనే మాట వినిపిస్తుంది.

చంద్రబాబు మాత్రం...
కానీ అటువైపున మాత్రం ఎస్సీలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా ? అన్న మాట వినిపిస్తుంది. బీసీల తోకలు కత్తరిస్తా అని అప్పట్లో వెటకారం చేసిన మాటలు వినిపిస్తాయి. చివరకి అక్కచెల్లెమ్మలను సైతం వదలకుండా... కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా ? అని వెటకారం చేసిన మాటలుకనిపిస్తాయి.

ఈరోజు చంద్రబాబు గారి హయాంలో సామాజిక అన్యాయానికి మీ బిడ్డ హయాంలో సామాజిక న్యాయానికి యుద్ధం. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుద్ధం జరుగుతున్నది చంద్రబాబునాయుడు గారి ఎల్లో మీడియా విష ప్రచారాలకు.... మీ బిడ్డ హయాంలో మనం చేసిన, కనిపిస్తున్న మంచికి మధ్య యుద్దం జరుగుతుంది.

మీ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. వీరిది ఈ రోజు జగన్‌తో కాదు యుద్ధం, పేదలతో యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధంలో మీ బిడ్డకు ఓ ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, టీవీ5 తోడుగా నిలబడకపోవచ్చు. ఓ దత్తపుత్రుడు అండగా రాకపోవచ్చు. మీ బిడ్డ వీరిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడి దయను, మీ చల్లని దీవెనలను మాత్రమే. 

నా ధైర్యం మీరే... 
నేను గర్వంగా చెప్తున్నాను. నా నమ్మకం మీరు. నా ధైర్యం మీరు. మీ అందరికీ ఒక్కటే చెప్తున్నాను. వాళ్లు చెప్తున్న అబద్దాలను నమ్మకండి. వారు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా ?లేదా ? అన్నదానిని మాత్రమే కొలమానంగా తీసుకొండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మీ బిడ్డకు ఆ దేవుడు ఆశీస్సులు, మీ చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. 

దేవుడి దయ ప్రజలందరి చల్లని ఆశీస్సులు రాష్ట్రం పట్ల కూడా ఉండాలని, వర్షాలు మెండుగా పడాలని, రైతన్నలు ముఖాల్లో చిరునవ్వులు ఉండాలని కోరుకుంటున్నాను.

ఇదీ చదవండి: 63.14 లక్షల మందికి రూ.1,739.75 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement