tenants
-
కౌలు రైతులకు తీపికబురు
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు మరింత అండగా నిలవాలని ప్రభుత్వం సంకల్పించింది. గడచిన నాలుగేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది పంట హక్కు సాగు పత్రాలు (కౌలు కార్డులు) జారీ చేసిన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఇందుకోసం తొలిసారిగా సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌తో సీసీఆర్సీ వెబ్‌పోర్టల్‌ను అనుసంధానించింది. ఫలితంగా బ్యాంక్ లోన్చార్జ్ మాడ్యూల్లో భూ యజమానులతోపాటు కౌలుదారుల వివరాలను సైతం బ్యాంకర్లు ఖరారు చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ మంది కౌలుదారులకు పంట రుణాలు మంజూరు చేసే అవకాశం కల్పించింది. సాధారణంగా సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్ బ్యాంకుల లోన్చార్జ్ మాడ్యూల్లో అనుసంధానమై ఉంటుంది. లోన్‌చార్జి మాడ్యూల్లో సర్వే నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయగానే భూ యజమానుల పేర్లు మాత్రమే కన్పించేవి. దీంతో కౌలుదారులకు రుణాల మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ఏదో సాకుతో వెనుకడుగు వేస్తుండేవారు. రబీ సీజన్లో మరింత ఎక్కువ మంది కౌలుదారులకు రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంతో సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను సీసీఆర్సీ వెబ్ పోర్టల్‌తో ప్రభుత్వం అనుసంధానించింది. లోన్చార్జ్ మాడ్యూల్తో సీసీఎల్ఎ వెబ్‌ల్యాంబ్ పోర్టల్ అనుసంధానించి ఉండడంతో ఆటోమేటిక్‌గా లోన్‌చార్జి మాడ్యుల్లో భూ యజమానుల వివరాలతో పాటు కౌలుదారుల వివరాలు కూడా బ్యాంకర్లకు కనిపిస్తాయి. భూ యజమానులను ఒప్పించి.. భూ యజమానుల వివరాలతో పాటు కౌలు రైతుల వివరాలను ఖరారు చేసుకుని బ్యాంకర్లు వారికి రుణాలు మంజూరు చేస్తారు. ఒకవేళ కౌలుకు ఇచ్చిన భూమిపై భూ యజమాని కనుక పంట రుణం తీసుకుని ఉంటే కౌలుదారులకు పంట రుణం మంజూరు చేయరు. అయితే, సాగు చేయకపోయినప్పటికీ వరుసగా రెండు సీజన్లలో భూ యజమాని కనుక పంట రుణం పొంది ఉంటే, అటువంటి వారిని గుర్తించి ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పిస్తారు. తమ భూమి కౌలుకు తీసుకున్న వాస్తవ సాగుదారులకు చేయూతనిచ్చేలా సహకరించాలని సూచిస్తారు. ఫలితంగా భూ యజమానుల స్థానంలో కౌలుదారులు పంట రుణాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. నాలుగేళ్లలో రూ.6,906 కోట్ల పంట రుణాలు.. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలుదారులు ఉంటారని అంచనా. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నా.. ఆంక్షల పేరిట బ్యాంకులు మోకాలడ్డేవి. ప్రస్తుతం ఏటా 11 నెలల కాల పరిమితితో జారీ చేస్తున్న కౌలు కార్డుల ఆధారంగా పంట రుణాలతో పాటు సంక్షేమ ఫలాలు అందిస్తోంది. నాలుగేళ్లలో 17.61 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేయగా.. వీరిలో 9.83 లక్షల మందికి రూ.6,905.76 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారు. 2023–24 సీజన్లో 8.89 లక్షల మంది కౌలుదారులకు సీసీఆర్సీల జారీ లక్ష్యం కాగా.. ఇప్పటికే 8.19 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేశారు. వీరికి కనీసం రూ.4 వేల కోట్ల పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. ఇప్పటికే 3.33 లక్షల మందికి రూ.1,085.42 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారు. నూరు శాతం రుణాలు మంజూరే లక్ష్యం మరింత ఎక్కువ మంది కౌలుదారులకు పంట రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంగా సీïసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌తో సీసీఆర్సీ పోర్టల్‌ను అనుసంధానం చేశాం. ఫలితంగా కౌలుదారులకు రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లకు మరింత వెసులుబాటు కలుగుతుంది. జేఎల్‌జీ గ్రూపులతో పాటు వ్యక్తిగతంగా కూడా కౌలుదారులు పంట రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంగా ఈ మార్పు చేశాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఇల్లు లేకపోయినా హోమ్ ఇన్సూరెన్స్! ఎందుకు.. ఏంటి ప్రయోజనం?
వేగవంతమైన పట్టణీకరణ, అభివృద్ధి చెందుతున్న జీవనశైలి కారణంగా భారతదేశంలో అద్దె ఇళ్ల భావన ఎక్కువైంది. దేశంలో చాలామంది అద్దె ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. అద్దె ఇళ్లతో అనేక రకాల సౌలభ్యాలు ఉంటాయి. ఇంటి యజమానులతో పోలిస్తే అద్దెకు ఉండే వారికి బాధ్యతలు తక్కువగా ఉన్నప్పటికీ.. వారితో అద్దెకు ఉంటున్నవారికీ ఓ బాధ్యత ఉంది. అదే హోమ్ ఇన్సూరెన్స్. అదేంటి హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి ఓనర్‌కు సంబంధించింది కదా.. దీంతో అద్దెకు ఉంటున్నవారికి పనేంటి అనుకోవద్దు.. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి యజమానికి ఎంత అవసరమో.. అద్దెకుంటున్నవారికీ అంతే అవసరం. అది ఎందుకు.. ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. వస్తువుల రక్షణ ఇళ్లలో అద్దెకుండేవారు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ముఖ్యమైన కారణం ఇది. ఈ హోమ్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత వస్తువులు అంటే టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నీచర్, దుస్తులతోపాటు ఇతర విలువైన వస్తువులకు రక్షణ కల్పిస్తుంది. ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు, అగ్నిప్రమాదం, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దెబ్బతిన్న లేదా చోరీకి గురైన వస్తువులకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కొత్తవాటిని కొనుగోలు లేదా మరమ్మతుకు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. ఆస్తుల డ్యామేజీ కవరేజ్ వస్తువుల రక్షణతోపాటు ఇంటి ఆస్తుల రక్షణను ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అద్దెదారు అనుకోకుండా ఇంటి ఆస్తిని పాడు చేసినట్లయితే, అంటే కిచెన్‌లో మంటలు ఏర్పడి ఇంటికి సంబంధించిన వస్తువులు దెబ్బతింటే ఆ నష్టాన్ని ఓనర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. ఇలాంటి ప్రమాదాల్లో గాయపడిన ఇంట్లోకి వారికి బీమా వర్తిస్తుంది. తాత్కాలిక జీవన వ్యయాలు అగ్నిప్రమాదం లేదా వరదలు వంటివి సంభవించినప్పుడు ఇళ్లను ఖాళీ చేసి తాత్కాలికంగా వేరొక చోట ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో హోటళ్లలో ఉండటానికి, భోజనం, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను ఈ హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. క్లిష్టమైన సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇది చాలా తోడ్పాటు అందిస్తుంది. అందుబాటులోనే ప్రీమియం హోమ్ ఇన్సూరెన్స్‌పై భారతదేశంలో చాలా అపోహలు ఉన్నాయి. ప్రీమియం ఎక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ అందుబాటు ప్రీమియంతోనే ఈ ఇన్సూరెన్స్ పొందవచ్చు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు తలెత్తే ఆర్థిక నష్టాలతో పోల్చినప్పుడు అది సహేతుకంగానే ఉంటుంది. అద్దెదారుల నిర్దిష్ట అవసరాలు, ఆర్థిక పరిమితుల ప్రకారం దేశంలో అనేక కంపెనీలు ఈ రెంటర్స్ హోమ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. -
లిఫ్ట్ ఆగిపోయిందని వాచ్ మెన్ పై ప్రతాపం.. చీపురు తిరగేసి..
ఆగ్రా: యూపీ సికందరాలోని రెయిన్బో అపార్ట్మెంట్లో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయిందన్న కోపంలో కిందకు వచ్చిన తర్వాత వాచ్ మెన్ ను చెడామడా తిట్టడమే కాకుండా చీపురు కూడా తిరగేసింది. వయసులో పెద్దాయన అని కూడా చూడకుండా ఆ మహిళ నిర్దాక్షిణ్యంగా చీపురుతో కొడుతున్న వీడియో అపార్ట్మెంట్ సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తోంది. ఆగ్రాలోని సికందరాలో రెయిన్బో అపార్ట్మెంట్ వాచ్ మెన్ గా పనిచేస్తోన్న జగదీశ్ ప్రసాద్ తివారీ సికందరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అపార్ట్మెంట్లో C -8 ఫ్లాట్ లో నివసించే అనిల్ శర్మ భార్య అనిత లిఫ్ట్ ఆగిపోయిందన్న కారణంతో అనరాని మాటలు అంటూ తనపై చీపురుతో దాడి చేసిందని, ఒకపక్క తాను వివరణ ఇస్తున్నా కూడా వినకుండా కొట్టిందని ఆరోపించాడు. ఆమెతో పాటు వారి కుమారుడు ప్రాన్షు కూడా మాటలతో దూషించాడని తెలిపాడు. ఈ తతంగం మొత్తం అక్కడ సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ కావడంతో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం తోపాటు వీడియోను కూడా ఆధారాలుగా సేకరించినట్టు తెలిపారు సికందరా పోలీసులు. Kalesh B/w Watchman and Woman inside Rainbow Apartment in Agra due to lift failurepic.twitter.com/4pPL56hZPk — Ghar Ke Kalesh (@gharkekalesh) July 13, 2023 ఇది కూడా చదవండి: Heavy Rains : చెత్తనంతా తిరిగిచ్చి.. లెక్క సరిచేసి"నది".. -
రెంట్‌కి ఉండి ఇళ్లుని కాజేయాలనుకున్నారు.. అడ్డొచ్చిన ఓనర్ని చంపేశారు..
కర్ణాటక:ఇంట్లో రెంట్‌కు ఉన్నారు బిహార్ యువకులు. ఓనర్‌తో చనువుగా ఉండేవారు. ఎప్పుడు సరదాగా కామెడీ చేస్తూ నవ్వించేవారు. ఇలా ఓనర్‌కు మరింత దగ్గరయ్యారు. ఇళ్లుని తమ పేర రాయమని పీడించారు. అంగీకరించని ఓనర్‌ను చంపారు. శరీర భాగాలను దేహం నుంచి వేరు చేసి వేరువేరు ప్రాంతాల్లో పడేశారు. ఈ అమానవీయ ఘటన కర్ణాటక బన్నేర్‌ఘట్ట ప్రాంతంలో జరిగింది. బన్నేర్‌ఘట్ట జనతా కాలనీలో గీతమ్మ(53) ఒంటరిగా నివసిస్తోంది. ఏడుగురు బిహార్ యువకులు ఆమె ఇంట్లో రెంట్‌కి ఉంటున్నారు. ఏడుగురిలో చాలాకాలం నుంచి రెంట్‌కి ఉంటున్న పంకజ్ కుమార్ గీతమ్మతో సన్నిహితంగా ఉండేవాడు. అక్రమంగా ఇంటిని తన పేర రాయించుకోవాలని చూశాడు. ఒప్పుకోని ఆవిడను అందరూ కలిసి మే 27న గొంతు పిసికి చంపేశారు. అరెస్టవుతాయమనే భయంతో మృతదేహం నుంచి కాళ్లు, చేతులు, తల వేరుచేసి మిగిలిన దేహాన్ని జనతా కాలనీ కాంపౌడ్ దగ్గర పడేశారు. అనంతరం బిహార్‌కు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బిహార్ పోలీసుల సహాయంతో నిందితుల్లో ఒకరైనా ఇందాల్ కుమార్‌ను పట్టుకున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి:పాలు దొంగిలిస్తున్న రూమ్మేట్.. ఉప్పుతో బుద్ధి చెప్పిన యువతి! -
గూగుల్ ఇంటర్వ్యూలో నెగ్గాడు.. కానీ అక్కడ మాత్రం!
కోవిడ్-19 తర్వాత మెట్రో పాలిటన్ నగరాల్లో అద్దె ఇల్లు సంపాదించడం తలకు మించిన భారంగా మారింది. ఎంతలా అంటే? గూగుల్ లాంటి టెక్ దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించొచ్చు..కానీ బెంగళూరు వంటి మెట్రో పాలిటన్ నగరాల్లో అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టంగా ఉందంటూ అద్దెకోసం అన్వేషిస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బెంగళూరులో ఇంటి యజమానుల ఆగడాల గురించి ఐటీ ఉద్యోగులు సోషల్ మీడియాకు ఎక్కిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇంటి యజమానులు పెట్టే సవాలక్ష కండీషన్లకు ఒప్పుకోవాలి. ఇంటర్వ్యూ పేరుతో వాళ్లు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. లేదంటే అద్దె ఇల్లు దొరకదు. అలా అద్దె ఇల్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్న రీపు సోనారిక భడోరియా (Ripu Daman Bhadoria) తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. భడోరియా గత ఏడాది అమెరికా సియాటెల్ నుంచి బెంగళూరు వచ్చాడు. అక్కడ తన బడ్జెట్ తగ్గట్లు రెంట్‌కు ఉండేందుకు అద్దె ఇల్లు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ కోవిడ్ తర్వాత అద్దె ఇళ్లకు గిరాకీ పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇంటి ఓనర్స్ రకరకాల ప్రశ్నలతో ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేదంటే అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టం. అలా ఓనర్ చేసిన తొలి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినట్లు బహదోరియా చెప్పుకొచ్చాడు. అప్పుడే బెంగళూరులో అద్దె ఇల్లును సొంతం చేసుకోవడం కంటే గూగుల్ (google) ఇంటర్వ్యూని క్రాక్ చేయడం చాలా సులభమని భావించినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఓ చిన్న చిట్కాతో మరో ఇంటి ఓనర్ చేసిన ఇంటర్వ్యూలో పాస్ అయినట్లు వివరించాడు. బహదోరియా గూగుల్ ఉద్యోగి. తాను గూగుల్ ఉద్యోగినని. సొంత ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పడం వల్లే తనకు అద్దె ఇల్లు దొరికిందని చెప్పాడు. గూగుల్‌లో పనిచేయడం విపత్కర పరిస్థితులు తనకు అనుకూలంగా మారతాయని ఎప్పుడూ ఊహించలేదని లింక్డ్ ఇన్ పోస్ట్‌లో రాశారు. ఆ పోస్ట్‌కు స్పందించిన నెటిజన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు. విసుగు తెప్పించడంలో బెంగళూరులో ఇంటి ఓనర్స్ అద్దె ఇంటి కోసం వెతికే వారికి తెగ విసుగు తెప్పిస్తుంటారనే అభిప్రాయం వ్యక్తం చేశాడు ఓ నెటిజన్ . 2016 లో అనుకుంటా. మీరు పొట్టి స్కర్టులు ధరిస్తారా? మీ ఇంటికి మగ స్నేహితులు వస్తారా? అని ప్రశ్నించారు. నేను టీసీఎస్‌లో పనిచేస్తున్నాను కాబట్టి నాకు అద్దె ఇల్లు దొరికింది. వేరే కంపెనీలో ఉన్న నా స్నేహితుడికి ఉండేందుకు 2 నెలలు పాటు అద్దె ఇల్లు దొరకలేదు. అప్పటి నుంచి బెంగళూరుకు దూరంగా ఉంటున్నా' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. చదవండి👉 హీరా గోల్డ్ కుంభకోణం..రూ.33.06 కోట్ల నౌహీరా షేక్ ఆస్తుల అటాచ్ -
దారుణం.. ఇంటి యజమానిని చితకబాది.. నోట్లో పినాయిల్ పోసి..
ముంబై: మహారాష్ట్ర ముంబైలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న నలుగురు వ్యక్తులు యజమానిని చితకబాదారు. ఆపై అతని నోట్లో పినాయిల్ పోశారు. దీంతో అతని పేగులు కాలి తీవ్ర కడపునొప్పితో ఇబ్బందిపడ్డాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెప్పారు. ముంబై శివాజినగర్‌లో మంగళవారం రాత్రి 7:30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే యజమానికి అతని ఇంట్లో అద్దెకుండే వాళ్లు డబ్బులిచ్చారు. చాలా రోజులైనా తిరిగి ఇవ్వకపోవడంతో వాళ్లు అతనితో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం మాటామాటా పెరిగింది. అద్దెకు ఉండే నలుగురు కలిసి అతన్ని గోడకు నెట్టేశారు. అనంతరం ఒకరు యజమాని నోట్లో బలవంతంగా పినాయిల్ పోశారు. ఈ ఘటనలో నలుగురు నిందితులపై హత్యాహత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు సియాన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. చదవండి: తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ -
Chennai: నగరజీవికి మోయలేని భారం.. తప్పక కట్టాల్సిందే గురూ!
చెన్నై మహానగరం పరిధిలో అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న వారికి.. యజమానులు చుక్కలు చూపిస్తున్నారు. ఎడాపెడా అద్దె మొత్తాన్ని పెంచేస్తూ సామాన్యులపై భారం మోపుతున్నారు. అంత కట్టలేమంటే వెళ్లిపోమంటూ ఈసడించుకుంటున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ నిర్ణయం అశనిపాతంగా మారుతోంది. సాక్షి, చెన్నై: పెరిగిన విద్యుత్ బిల్లులు, ఆస్తి, నీటిపన్నులతో సతమతం అవుతున్న నగరజీవికి ఇంటి అద్దె పెరుగుదల మోయలేని భారంగా మారుతోంది. చెన్నై మహానగరంలో ఉద్యోగం, విద్యా, వ్యాపారం కోసం వచ్చి స్థిర పడ్డ వారి సంఖ్య ఎక్కువే. వీరిలో మెజారిటీ ప్రజలు అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. వీరి అవసరాలు ఇంటి యజమానులకు కాసుల వర్షం కురిపిస్తోంది. చెన్నై శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో పెద్దసంఖ్యలో పారిశ్రామిక వాడలున్నాయి. ఇక్కడ ఉద్యోగ రిత్యా రాష్ట్రానికి చెందిన వారే కాదు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారూ ఉన్నారు. ఇటీవల ఉత్తరాది నుంచి వివిధ పనుల నిమిత్తం చెన్నై వస్తున్న వారి సంఖ్య పెరిగింది. దీంతో చెన్నై, సెంట్రల్ చెన్నై, దక్షిణ చెన్నైతో పాటు శివారులలోని వేళచ్చేరి, ఈసీఆర్, ఓఎంఆర్ మార్గాలు, అంబత్తూరు, పూందమల్లి, రెడ్ హిల్స్, మాధవరం, ఆవడి, తాంబరం, పల్లావరం, క్రోం పేట, పెరుంగళ్తూరు, ముడిచ్చూరు పరిసరాలలో అద్దె ఇల్లు దొరకడం గగనంగా మారింది. సాఫ్ట్వేర్ వంటి పెద్ద సంస్థలలో పనిచేసే ఉద్యోగులు మాత్రం తమకు సౌకర్యవంతంగా ఉండే అపార్ట్‌మెంట్స్‌ను బాడుగకు తీసుకుంటున్నారు. వడ్డనతో భారం.. చెన్నై నగరంలో నెలసరి అద్దె అధికంగానే ఉంటోంది. చిన్న గది అయినా కనీసం రూ. 5 వేలు పైగా వెచ్చించాల్సిందే. సింగిల్ బెడ్ రూమ్ కావాలంటే రూ.10 వేలు, మరి కాస్త పెద్దది కావాలంటే రూ. 15 వేలు, రూ. 20 వేలు, రూ. 25 వేలు వరకు అద్దె చెల్లించాల్సిందే. అన్నానగర్, అడయార్, తిరువాన్మీయూరు, ఈసీఆర్, ఓఎంఆర్ తదితర మార్గాల్లో కొంత సౌకర్యాలు కల్గిన ప్రాంతాల్లో రెట్టింపు అద్దె చెల్లించుకోక తప్పదు. ఇక, కొన్నిచోట్ల విద్యుత్ బిల్లులకు మీటరుతో సంబంధం ఉండదు. ఇంటి యజమాని నిర్ణయించే మీటర్ రీడింగ్ చార్జీను చెల్లించక తప్పదు. పన్నులు పెంచితే చాలు.. అసలే కరోనా మిగిల్చిన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ప్రజల్ని ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి. చెన్నై వంటి నగరాలలో ఆస్తిపన్ను, నీటి పన్ను ఇటీవలే అదనంగా వడ్డించారు. అలాగే, విద్యుత్ బిల్లుల మోత మోగింది. ఈ ప్రభావం ఇళ్ల యజమానులపై పడింది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు వారు అద్దెను అమాంతం పెంచేస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబరు నుంచి అనేక చోట్ల అద్దె పెంచుతూ యజమానులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అద్దెతో పాటు అదనంగా.. కొన్నిచోట్ల ఇంటి అద్దెతో పాటు విద్యుత్, తాగునీరు, మెయింట్‌నెన్స్ చార్జీలను పెంచేశారు. ఈ విధంగా కుటుంబ ఆదాయంలో గణనీయమైన మొత్తాన్ని ఇంటి అద్దె రూపంలో చెల్లించడం ద్వారా మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాయి. ప్రస్తుతం లగ్జరీతో కూడిన అపార్ట్మెంట్లకు 13, 14 శాతం మేరకు, చిన్న చిన్న రూములు, సింగిల్ బెడ్ రూం, డబుల్‌బెడ్ రూం ఇళ్లకు 25 శాతం వరకు అద్దెను పెంచారు. దీంతో ఇది వరకు రూ. 5 వేలు చెల్లిస్తున్న వారు ప్రస్తుతం రూ. 7 వేల వరకు, రూ.10 వేలు చెల్లిస్తున్న వారు రూ. 13 వేల వరకు అద్దె భారాన్ని భరించాల్సిన పరిస్థితి చెన్నైలో నెలకొంది. నిబంధనలు దాటి ఇంటి అద్దెలు అధికంగా వసూలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నా, ఆ దిశగా చర్యలు తీసున్న దాఖలాలు లేవు. ఇంటి బాడుగలను క్రమబద్దీకరించే విధంగా మార్గదర్శకాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న వారిలో మధ్య తరగతి కుటుంబాలే అధికంగా ఉండడం గమనార్హం. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
కౌలు రైతులకు మరిన్ని రుణాలు
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ముందుకు రావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ప్రస్తుతం కౌలు రైతులకు ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని పేర్కొన్నారు. వైఎస్సార్ నవోదయం పథకం కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్లకు (ఎంఎస్ఎంఈ), ఎస్సీ, ఎస్టీ మహిళలకు, ప్రధాన మంత్రి ముద్ర యోజన రుణాల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ఆయా రంగాల వారికి రుణాల మంజూరు పెంచాలని బ్యాంకర్లకు సూచించారు. మే 15వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో 210వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం సూచనలు ఇలా.. – వైఎస్సార్ జిల్లా మాదిరిగా బ్యాంకుల డిజిటలైజేషన్ ప్రక్రియ అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలి. – గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లిష్ మీడియంలో బోధన, రైతు భరోసా కేంద్రాలతో గ్రామాలలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులకు సహకరించాలి. – ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం)లో ఉన్న ఇంటర్నెట్ కియోస్క్ ద్వారా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఆర్డర్ చేస్తే నాణ్యతా నిర్ధారణలతో అవి రైతులకు అందుబాటులోకి వస్తాయి. పంటల వివరాలను నమోదు చేయించేందుకు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, రెవిన్యూ అసిస్టెంట్లకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. ఆ వివరాలను బ్యాంకులతో అనుసంధానం చేస్తాం. తద్వారా సాగు చేస్తున్న పంటలకు తగిన విధంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. – మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం జూన్‌లో కొత్త పథకం తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగా చిరు వ్యాపారులు, తోపుడు బండ్లమీద చిన్న పాటి వ్యాపారం చేసుకునే వారికి గుర్తింపు కార్డులతో రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నది ఆలోచన. ఇందుకు మీ (బ్యాంకుల) సహకారం చాలా అవసరం. – కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు నీరివ్వడం.. ప్రాజెక్టుల సత్వర పూర్తి, వాటర్‌గ్రిడ్ ద్వారా మంచి నీటి సరఫరా, తదితర కార్యక్రమాలన్నింటికీ బ్యాంకుల సహకారం కావాలి. రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సదుపాయం 1,000పైగా రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సదుపాయం కల్పించేందుకు బ్యాంకు మిత్రలను ఆయా కేంద్రాల్లో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. 5 వేల జనాభాకు పైబడిన 567 చోట్ల కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సీబీఎస్) సర్వీసులు ప్రారంభించాం. 5 కి.మీ పరిధిలో బ్యాంకింగ్ సదుపాయం లేని 229 గ్రామాలను మ్యాపింగ్ చేశాం. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 29 మధ్య 1.1 లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చాం. ఏడాదిలోగా వైఎస్సార్ జిల్లాలో వంద శాతం డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయం అమల్లోకి వస్తుంది. ప్రాథమిక రంగానికి రూ.1,18,464 కోట్లు (70.01 శాతం), వ్యవసాయ రంగానికి రూ.83,444 కోట్లు (72.56 శాతం), రుణ ప్రణాళిక మేరకు రూ. 1,73,625 కోట్లు (75.75 శాతం), ఎంఎస్ఎంఈలకు రూ.29,442 కోట్లు (81.78 శాతం) రుణాలు (ఇవన్నీ డిసెంబర్ నాటికి) ఇచ్చాం. స్టాండప్ ఇండియా కింద 4,857 మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు సహాయం చేశాం. – ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ జె.పకీరసామి సమావేశంలో పాల్గొన్న వారు.. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, వ్యసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ కే.వి.నాంచారయ్య, ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుందరం శంకర్, నాబార్డ్ సీజీఎం ఎస్.సెల్వరాజ్. -
సిరిసిల్ల నేతన్న ఔదార్యం.. సామాజిక రుగ్మతలపై పోరాటం
సిరిసిల్లటౌన్: ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు..మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్న వాడు..అనే పాటను మరిపించేలా చిలుక నారాయణ అందిస్తున్న సేవ దు:ఖంలో ఉన్న అద్దె ఇంటివాసులకు ఎంతో ఊరట కలిగిస్తోంది. మానేరు తీరాన సామాజిక ‘విడిది’ భవనం ఏర్పాటు చేసి మానవత్వానికి ఊపిరిపోస్తున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్న వారిలో ఎవరైనా చనిపోతే రోడ్డుపై శవజాగరణకు ఎలాంటి అవకాశం లేకుండా ఉండేందుకు ఏడు గదులు నిర్మించి దిక్కులేని వారికి ఆశ్రయం కల్పించేందుకు మానవాతావాది చూపిన మార్గం మనసు లేని కర్కోటకులకు సైతం కనువిప్పు కలిగించిక మానదు. సాక్షి, కరీంనగర్: సామాజిక రుగ్మతపై స్పందన.. కార్మికక్షేత్రం సిరిసిల్లలో నిరుపేద నేతకార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పట్టణ జనాభాలో సుమారు 80శాతం పద్మశాలి సామాజిక వర్గానిదే ఉంటుంది. మిగతా కులాల్లో కూడా బీసీలదే అధిక జనాభా. అందుకే ఇక్కడ ఆర్థికలేమితో ఉండేవారి సంఖ్య అధికం. చాలా మంది ఇరుకు గదుల్లో అద్దెకు ఉంటూ..కుటుంబాలను నెట్టుకొచ్చేవారే. అయితే పట్టణంలో సామాజిక మూఢాచారాలు ఎక్కువ. ఎవరైనా అద్దె ఇంట్లో ఉండేవారు చనిపోతే..శవాన్ని ఇంటికి తీసుకు రానివ్వరు. పైగా..నెలపాటు శూదకం పేరుతో ఇంట్లోకి రావొద్దనే కట్టుబాటు నడుస్తోంది. భక్తి ప్రపత్తులు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇటువంటి సామాజిక మూఢాచారం ఎక్కువైంది. గడిచిన మూడేళ్లుగా ఒక్క సిరిసిల్ల పట్టణంలోనే 100 మందికిపైగా అద్దె జీవులు చనిపోతే రోడ్డుపై శవజాగరణ చేసిన సంఘటనలున్నాయి. వీటిపై ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోతోంది. కొంతమంది మానవతావాదులు ఈ దురాచారానికి స్వస్తి పలకాలని కోరుకుంటున్నా..ఆచరణలో ముందుకుసాగడం లేదు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ కౌన్సిలర్ చిలుక నారాయణ మాత్రం సామాజిక దురాచారంపై యుద్ధాన్ని ప్రకటించారు. మానేరు శివారులో రూ.5 లక్షలు వెచ్చించి 7 గదులతో ఒక ఇంటిని నిర్మించారు. అద్దె ఇంట్లో ఉంటూ ఎవరైనా చనిపోతే ఇంట్లోకి రానివ్వని వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. మానవత్వానికి నిలయం.. సిరిసిల్ల నెహ్రూనగర్ మానేరు నది తీరాన ఉన్న సామాజిక నివాసం మానవత్వానికి నిలయంగా నిలుస్తోంది. మున్సిపల్ వారు కట్టించిన ఆధునిక వైకుంఠథామం(శ్మశాన వాటిక)కు కొద్ది దూరంలోనే ఇది ఉండడంతో ఆప్తులను కోల్పోయి దు:ఖంలో ఉంటూ..అద్దె ఇంట్లోకి వెళ్లలేని వారు ఆశ్రయం పొందుతున్నారు. ఆరునెలలక్రితం దీనిని స్థానిక అంబాభవాని ఆలయం చైర్మన్ చిలుక నారాయణ సొంత ఖర్చులతో నిర్మించి అందులో ఏడు కుటుంబాలు ఆశ్రయం పొందేలా వసతులు కల్పించారు. ఇప్పటికీ శవ జాగరణ చేసిన సుమారు 30 కుటుంబాలు ఇందులో ఆశ్రయం పొంది చనిపోయిన తమ పెద్దలకు అంత్యక్రియలు జరిపించుకున్నారు. వస్త్రోత్పత్తి ఖిల్లాగా పేరొందిన సిరిసిల్లలో అత్యవసర పరిస్థితుల్లో ఆశ్రయం ఇచ్చేవారు కొలువైన తరుణంలో ఈ విడిదిని ఏర్పాటు చేయడం మానవత్వాన్ని ప్రతిబింబిస్తోంది. అయిన వారిని పోగొట్టుకుని అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్న నిరుపేదలు ఆశ్రయం పొందుతుండగా, దూరప్రాంతాల నుంచి వచ్చి రోకడ (రోజువారి) నేత కార్మికులకు కూడా రాత్రి పూట ఉచితంగా బసను కల్పించడం విశేషం. మాలాంటి వారికి తోడ్పాటు మనిషిని మనిషి ఈసడించుకుంటున్న ఈరోజుల్లో ఐనవారిని తలపించేలా..ఇక్కడ సోషల్ హోం నడిపించడం మాలాంటోళ్లకు కలిసొస్తుంది. మా తండ్రి వడ్నాల మల్లేశం(85) నేతకార్మికుడు. అమ్మ కళావతి 30 ఏళ్ల క్రితమే పక్షవాతంతో చనిపోయింది. నాన్న సిరిసిల్లలో ఉండి సాంచాలు నడిపేవాడు. నేను టీవీ రిపేరర్గా వేములవాడలో భార్య మంజుల, కూతురు లాస్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నా. పదిహేనురోజులక్రితం మా నాన్న అనారోగ్యానికి గురైండు. బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టింది. ఆపరేషన్ చేయించాలంటే..రూ.5లక్షలు కావాలన్నారు. ఖరీదైన వైద్యం చేయించలేక సిరిసిల్ల జిల్లాసుపత్రిలో చేర్పించా..ఈనెల 8న చనిపోయిండు. అద్దె ఇంటికి తీసుకెళ్లడం కుదరకపోవడంతో ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానానికి తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపిన. తెలిసినవారు చెబితే కుటుంబంతోపాటు ఇక్కడే ఆశ్రయం పొందుతూ..నాన్నకు ఖర్మకాండలు జరిపిస్తున్న. వడ్నాల సదానందం కుటుంబ సభ్యులు కార్మికుల కష్టాలు చూసే.. నేను సాంచాలు నడిపిన. బీడీ టేకేదారుగా పని చేస్తా. అందుకే నాకు నేతకార్మికులు, బీడీ కార్మికుల కష్టాలు పూర్తిగా తెలుసు. సిరిసిల్ల పట్టణంలో అద్దె ఇళ్లలో ఉండేవారు చనిపోతే జరుగుతున్న సంగతులు ఇటీవలే ’పేపర్లో’ చూసి మనసుకు బాధనిపించింది. అందుకే నా సొంత డబ్బుతో ఏడు గదులతో ఇక్కడ ఇల్లు కట్టించిన. రెండు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు, అంబాభవాని ఆలయం నుంచి బోరు కనెక్షన్ కల్పించిన. విద్యుత్ కనెక్షన్ ఇతర వసతులు కల్పించిన. రోకడ కార్మికులు కూడా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. సొంతిల్లు ఉంటే..బాధలుండవు.. సొంతిల్లు ఉంటే..మాలాగా అయిన వారిని పోగొట్టుకున్న సమయాల్లో శవాలతో రోడ్డుపై, శ్మశానంలో జాగారం చేసే బాధలుండవు. మాది సిరిసిల్ల శివారులోని ముష్టిపల్లి. నా భార్య భాగ్య, పిల్లలు సిద్దార్థ, లవన్తో కలిసి ఉంటున్న. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న నాకు చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోయారు. అప్పట్నుంచి నానమ్మ కుసుమ రుక్కవ్వ (62) సాకి పెద్ద చేసింది. 15రోజులక్రితం పక్షవాతం వచ్చింది. ఇంటోళ్లు చనిపోతదని వేరు ఇల్లు చూసుకోమన్నరు. దీంతో ఖరీదైన వైద్యం చేయించలేని స్థితిలో ఈనెల 16న జిల్లాసుపత్రిలో చేర్పించగా..తెల్లారి చనిపోయింది. అమ్మానాన్నలు కూడా ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోయారు. నేనే చదువుకోలేక చిన్నప్పట్నుంచి పనులు చేసుకుంటూ..చెల్లి పెళ్లి చేసిన. ఇప్పుడు పెద్దదిక్కు నానమ్మ చనిపోయింది. ఆమె ఆత్మశాంతి కలిగేలా అంత్యక్రియలు కూడా చేయలేని స్థితిలో ఉన్న మాకు ఇక్కడున్న సోషల్ హోం ఆశ్రయం కల్పించినందుకు కృతజ్ఞతలు. కుసుమ వెంకటేశ్ కొడుకున్నా..ఏకాకి జీవితం.. మేము దత్తోజిపల్లె నుంచి యాభై ఏళ్ల కింద సిరిసిల్లకు బతుకొచ్చినం. మా ఆయన ఇస్తారి(65) చేనేత కార్మికుడు. నేను బీడీలు చేస్తూ..కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్లం. ఇంట్లో ఆయనకు ఎప్పుడూ..అనారోగ్యంతో ఉండేవాడు. మాకున్న ఆస్తులు, నగలు అన్నీ అమ్మిన. కొడుకు జితేందర్ 25 ఏండ్లు ఉంటాడు. మాకున్న ఆస్తులు పోవడంతో మమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్లిపోయిండు. వాడిజాడకై వెతికినా..ఫలితం లేదు. ఈయనకేమో ఆర్నెల్ల నుంచి మంచంమీదే అన్ని సేవలు చేసిన. కొడుకు వస్తడని దేవున్ని మొక్కినా..దయతల్చలేదు. చాలా రోజులుగా ఇద్దరికీ పని లేకుండా ఉంటున్నాం. నాకు బీడీ పెన్షన్, ఆయనకు వృధ్యాప్య పింఛన్ ఇవ్వాల్సి ఉన్నా..అధికారులు ఎవ్వరూ..ఇవ్వడం లేదు. ఇప్పుడు నేను ఏకాకినైన. ఏం పని చేసుకుంటూ..బతకాలి. నిలువ నీడలేని ఆడబతుకు ఇది. సర్కారు దయచూపాలి. ఇక మాఆయన చనిపోయినప్పుడు జాయింట్ కలెక్టరమ్మకు మొరపెట్టుకున్న. రూ.5వేలు ఇచ్చింది. కొందరు మనసున్నోల్లు కలిసొచ్చి అంత్యక్రియలు చేయించిండ్రు. ఇప్పుడు నేనొక్కదాన్నే ఇక్కడ తలదాచుకుంటున్న. చిలుక నారాయణ మాలాంటోళ్లకు మంచి సౌలతి కలిపించిండు. వేముల మణెవ్వ -
రాజధాని రైతులకు వార్షిక కౌలు విడుదల
సాక్షి, అమరావతి: రాజధాని భూసమీకరణ కింద రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు (యాన్యుటీ) మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. రాజధాని రైతులకు ఐదో విడతగా 2019–20 సంవత్సరం కౌలు రూ.187.40 కోట్లను విడుదల చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ విధానంలో 28,442 మంది రైతుల నుంచి 34,312 ఎకరాలను సీఆర్డీఏ సేకరించింది. ఈ భూములిచ్చిన రైతులకు భూసమీకరణ ప్యాకేజీ కింద పదేళ్లపాటు వార్షిక కౌలు చెల్లించాల్సి వుంది. జరీబు భూములకు రూ.50 వేలు, మెట్ట భూములకు రూ.30 వేల చొప్పున ప్రతి సంవత్సరం పది శాతం పెంపుతో పదేళ్లపాటు ఈ కౌలు రైతులకు ఇవ్వాల్సి వుంది. గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు ఈ కౌలును చెల్లించగా ఐదో సంవత్సరం పది శాతం పెంపుతో ఇప్పటి ప్రభుత్వం రూ.187.40 కోట్లను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఫైలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్న నేపథ్యంలో కొద్దిరోజులుగా టీడీపీ నేతలు, మద్ధతుదారులు కౌలు చెల్లింపును నిలిపివేస్తున్నారని పుకార్లు సృష్టించారు. రాజధానిపై టీడీపీ నేతలు రకరకాల పుకార్లు వ్యాపింపజేసి రైతులు, స్థానికుల్లో ఆందోళనలు రేకెత్తించారు. కానీ ప్రభుత్వం రాజధాని రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పది శాతం పెంపుతో వార్షిక కౌలును విడుదల చేసింది. -
కౌలు రైతులకూ ‘భరోసా’
సాక్షి, అమరావతి: పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకూ ప్రయోజనం చేకూర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతులు పంటలు పండించుకునేందుకు వీలుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం, బ్యాంకుల నుంచి రుణం అందేలా కొత్త చట్టం తీసుకొస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల కొత్త చట్టానికి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ బుధవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదింపచేసి చట్టబద్ధత కల్పిస్తారు. తద్వారా రాష్ట్రంలోని 15.36 లక్షల మంది కౌలు రైతులకు ప్రయోజనం కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచన. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన వ్యవసాయ కార్మికులు భూములను కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారని, పంటల సాగు విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో పేర్కొంది. కౌలు రైతులు పంట రుణం, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా మొదలైన వాటిని పొందలేకపోతున్నారని అందులో స్పష్టం చేసింది. ఇలాంటి అడ్డంకులను నివారించేందుకు భూ యజమానులకు గల హక్కులపై వారిలో విశ్వాసం కలిగించేందుకు, మరోవైపు కౌలు రైతులను ఆదుకునేందుకు కొత్త చట్టం తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. బిల్లులోని ముఖ్యాంశాలివీ - భూ యజమాని హక్కులకు భంగం కలగకుండా కౌలుదారులకు హక్కుల కార్డు జారీ చేస్తారు. ఈ కార్డు ద్వారా కౌలుదారు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందటానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా పంటల బీమా, పంట నష్టపరిహారంతోపాటు రైతులకు కలిగే ఇతరత్రా ప్రయోజనాలు కౌలు రైతులూ పొందవచ్చు. - ప్రధానంగా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద కౌలు రైతులు సైతం పెట్టుబడి సాయం పొందేందుకు కొత్త చట్టం దోహదం చేస్తుంది. భూ యజమాని హక్కులు - ఒప్పంద కాల వ్యవధి ముగిసిన తరువాత ఏ విధమైన తాకట్టు భారం లేకుండా భూమిని తిరిగి యజమానికి వెనక్కి ఇవ్వాలి. ఒప్పందం చేసుకున్న మొదటి రోజునే సాగుదారుకు వ్యవసాయ భూమి అప్పగించాలి. సాగుదారు షరతులు పాటించినంత కాలం ఆ భూమి స్వాధీనం/అనుభవించుటలో యజమాని జోక్యం చేసుకోకూడదు. - షరతులను పాటించడంలో సాగుదారు విఫలమైతే అతనికి రెండు నెలల ముందుగా నోటీసు ఇవ్వడం ద్వారా కౌలు ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు భూ యజమానికి ఉంటుంది. అయితే, ఇది కౌలు ఒప్పంద వ్యవధి సమయంలో సాగుదారు హక్కుకు భంగం కలిగించకూడదు. సదరు భూమిపై పంట రుణం తప్ప ఏవిధమైన ఇతర రుణాలు పొందటానికి కౌలుదారుకు అర్హత ఉండదు. గ్రామ సచివాలయ విధులు - గ్రామ సచివాలయంలో ప్రాధీకృత అధికారి పంట సాగుదారు హక్కుల కార్డుపై ధ్రువీకరణ సంతకం చేయాలి. దాని నకలును సాగుదారు ఉద్దేశాన్ని తెలియజేసిన తేదీ నుంచి మూడు రోజుల్లో భూ యజమానికి అందజేయాలి. - దీనికి సంబంధించి స్వీకరించిన అన్నిరకాల ఖరారు ఒప్పందాలను నిర్దేశించిన రిజిస్టర్‌ను నిర్వహిస్తూ అందులో నమోదు చేయాలి. అన్ని ప్రయోజనాలను అంటే ఇన్పుట్ సబ్సిడీ, అర్హత కలిగి ఉన్నట్లయితే వైఎస్సార్ రైతు భరోసా, తీసుకున్న భూమికి పంట రుణం మొదలైన వాటిని సాగుదారులకు వర్తింపచేసేలా చూడాలి. ఇబ్బందులు ఏవైనా ఉంటే విచారణ జరిపి ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి. - షెడ్యూల్ ప్రాంతాలుగా ప్రకటించిన చోట ఎస్టీ సాగుదారులకు మాత్రమే ఈ బిల్లులోని ప్రయోజనాలను వర్తింపజేస్తారు. ఇతర సాగుదారులకు ఎటువంటి ప్రయోజనాలు వర్తించవు. - గ్రామ సచివాలయం నిర్ణయంతో ఎవరైనా విభేదిస్తే.. తొలుత సంబంధిత తహసీల్దార్‌కు అప్పీల్ చేసుకోవాలి. దానిపై విచారణ జరిపి తహసీల్దార్ ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి. తహసీల్దార్ నిర్ణయంపై విభేదిస్తే రెండో దశలో రెవెన్యూ డివిజినల్ అధికారి లేదా సబ్ కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. ఆ అప్పీల్‌ను ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి. రెండో అప్పీల్ నిర్ణయాన్ని విభేదిస్తే జాయింట్ కలెక్టర్‌కు రివిజన్ దాఖలు చేసుకోవచ్చు. రివిజన్ అప్పీల్‌ను ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి. - జిల్లా కలెక్టర్ పంట సంవత్సరం ప్రారంభంలో ముందుగా సాగుదారుల ప్రతినిధులు, బ్యాంకర్లు, భూ యజమానులు జిల్లాకు చెందిన రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించాలి. ఆ వివరాల నివేదికను నోడల్ ఏజెన్సీకి పంపాలి. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నోడల్ ఏజెన్సీగా ఉంటారు. చట్టంలోని నియమ నిబంధనలు అమలు చేసేందుకు, చట్టం లక్ష్యాన్ని సాధించేందుకు నోడల్ ఏజెన్సీ అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తుంది. - ఈ చట్టంలోని నియమాలు సద్భావంతో చేసిన దృష్ట్యా వీటిపై ఏ వ్యక్తిగాని, అధికారి లేదా ప్రాధికారిపై ఎటువంటి దావా, అభియోగం, ఇతర శాసనిక ప్రొసీడింగ్స్ ఉండవు. ఈ చట్టం కింద అధికారి, ప్రాధికార సంస్థ, ప్రభుత్వం చేసిన నిర్ణయం లేదా జారీ చేసిన ఉత్తర్వులపై ఏదేని దావా, దరఖాస్తు లేదా ఇతర ప్రొసీడింగ్స్ ద్వారా సివిల్ న్యాయస్థానాల్లో ప్రశ్నించకూడదు. అలాగే ఏదైనా న్యాయస్థానం నిషేధ ఉత్తర్వులను మంజూరు చేయకూడదు. - కొత్త చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలో గతంలో చేసిన ఆంధ్రప్రదేశ్ భూమి లైసెన్స్‌ను పొందిన వ్యవసాయదారుల చట్టం–2011 రద్దు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ప్రాంత) కౌలు చట్టం–1956ను రద్దు చేయాలని బిల్లులో పేర్కొన్నారు. కౌలు కార్డు జారీ ఇలా భూ యజమాని కౌలు రైతు మధ్య కుదిరిన ఒప్పందం ఆధారంగా కౌలు రైతులకు సాగుదారు రైతు హక్కుల కార్డులను జారీ చేస్తారు. గ్రామ సచివాలయంలోని ప్రాధీకృత అధికారి పంట సాగుదారు హక్కుల కార్డుపై ధ్రువీకరణ సంతకం చేస్తారు. దీని నకలును సాగుదారు ఉద్దేశాన్ని తెలియజేసిన తేదీ నుంచి మూడు రోజుల్లోగా భూ యజమానికి అందజేయాలని చట్టంలో ఉంది. భూ యజమాని, సాగుదారు మధ్య కుదిరిన కౌలు ఖరారు పత్రంలో భూ యజమానితో పాటు, సాగుదారు పేర్లు ఉండాలి. భూమి సర్వే నంబర్, సరిహద్దులు, భూమి ఉన్న ప్రదేశాన్ని అందులో పొందుపరుస్తారు. కౌలు ఒప్పందం కాల వ్యవధి 11 నెలలు ఉంటుంది. సాగుదారు హక్కులు - ఒప్పంద కాల వ్యవధిలో భూ యాజమాన్యంలోని ఏ మార్పుతో సంబంధం లేకుండా పూర్తి కాలానికి కౌలురైతు హక్కుదారుగా ఉంటారు. - రాష్ట్ర ప్రభుత్వం/కేంద్ర ప్రభుత్వం/సహకార సంఘం/షెడ్యూల్ బ్యాంక్/కేంద్ర ప్రభుత్వంచే యాజమాన్యం వహించే లేదా నిర్వహించే ఏదైనా ఇతర ఆర్థిక సంస్థ నుంచి ఒప్పంద ఖరారు భూమిపై పంట రుణం పొందటానికి కౌలు రైతు హక్కు కలిగి ఉంటాడు. - పంట నష్టాలకు అర్హత ఉన్నట్లైతే వైఎస్సార్ రైతు భరోసాతోపాటు పంటల బీమా లేదా ప్రభుత్వంచే సాగుదారులకు కల్పించిన ఏవైనా ఇతర ప్రయోజనాలు/సదుపాయాలను పొందేందుకు కౌలుదారుకు హక్కు ఉంటుంది. - ఎలాంటి తాకట్టు భారం లేకుండా ఒప్పంద గడువు పూర్తి కాగానే వ్యవసాయ భూమిని ఖాళీ చేయాలి. సాగుదారు ఒప్పంద కాల వ్యవధిలో చార్జి లేదా వడ్డీ భారాన్ని భూ యజమానిపై వేయకూడదు. - భూ యజమానికి ఒప్పంద సమయంలోగా ఖరారు చేసుకున్న కౌలు మొత్తాన్ని చెల్లించాలి. వ్యవసాయ ప్రయోజనాలకు మాత్రమే భూమిని వినియోగించాలి. అందులోని ఇతర స్థిరాస్తులకు ఎలాంటి నష్టాన్ని కలిగించకూడదు. ఇతర చట్టంలో ఏమున్నా ఒప్పంద ఖరారు (కౌలు) భూమిపై ఏ విధమైన హక్కును కౌలు రైతు కలిగి ఉండకూడదు. - పంట కోత తరువాత బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న పంట రుణాన్ని పూర్తిగా చెల్లించాలి. - భూమి యాజమాన్యానికి సంబంధించి భూ రికార్డులలో ఇప్పటికే నమోదై ఉన్న వివరాల్లో ఏ అధికారితోనూ ఎలాంటి మార్పులు చేయకూడదు. - సాగుదారు నుంచి ఏదైనా బకాయిని రాబట్టేందుకు బ్యాంకులు షెడ్యూల్డు భూమిని జప్తు చేయకూడదు. -
లీజుదారులకు నిష్‘ఫలమే’
సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్: జిల్లాలో దాదాపు 50 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇక్కడి రైతులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తుంది. కానీ, ఈ సీజన్లో పూత నుంచే సమస్యలు మొదలయ్యాయి. పూత ఆలస్యంగా రావడంతోపాటు, పూత సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం, తేమ వాతావరణంతో వచ్చిన పూత నిలువలేదు. నిలిచిన పూతను సైతం తెగుళ్లు ఆశించి నష్టం చేశాయి. మామిడి చెట్లకు అక్కడక్కడ ఉన్న కాయలు ఇటీవల కురిసిన వడగండ్ల వానకు రాలిపోయాయి. ఈ క్రమంలో వడగండ్లు, ఈదురుగాలుల బాధ పడలేక గుత్తేదారులు కాయ సైజు పెరగకుండానే కోస్తున్నారు. మార్కేట్లో ఏదో ఒక రేటుకు మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రస్తుతం ఒక్కో చెట్టుకు కనీసం 2 నుంచి 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. గుత్తెదారుల గుండెల్లో దడ మామిడి తోటలను జిల్లాలో దాదాపు 70 శాతం మంది రైతులు లీజుకు ఇస్తుంటారు. ఈసారి మామిడి తోటలపై వాతావరణ ప్రభావంతోపాటు వడగండ్ల ప్రభావంతో ఉండటంతో లీజుదారులు ఇబ్బందులు పడుతున్నారు. తోట యాజమానులకు ముందే డబ్బులు చెల్లించడం, కాయలు పెద్దగా లేకపోవడం, ఉన్న కొద్దిపాటి కాయ రాలడం, మంచి కాయ రేటు సైతం రోజు రోజుకు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వడ్డీలు తెచ్చి మరీ తోటలు లీజుకు తీసుకున్న లీజుదారులు.. దిగుబడి సగానికిపైగా పడిపోవడంతో లీజు డబ్బులు సైతం దక్కే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. ఒక్కో ఎకరానికి రూ.50 వేలపైగా రైతులకు చెల్లించి తోటలు లీజుకుతీసుకున్నారు. అయితే ఇతర ప్రాంతాల్లో మామిడికాయ లేకపోవడంతో ధర ఓ మోస్తారుగా టన్నుకు మార్కెట్లో రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు ఉండటం లీజుదారులకు కొంత ఊరటనిస్తోంది. భారీగా పెట్టుబడి ఖర్చులు.. లీజుదారులు మామిడి తోటలను లీజుకు తీసుకున్నప్పటి నుంచి ప్రతీ పనిని వారే చేసుకోవాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పూత రాలిపోవడం, కాయ సైజు పెరగడానికి రెండు సార్లు క్రిమిసంహారక మందులతోపాటు పోటాష్ వేశారు. కాయ సైజు పెరిగినప్పటికీ తోటలకు రక్షణగా ఓ కాపాలదారుడిని పెడుతుంటారు. తర్వాత, సైజుకు వచ్చిన కాయలను కూలీలతో కోయించడం, మార్కెట్‌కు తరలించడం వంటి వాటికి లీజుదారులు భారీగానే ఖర్చు చేస్తున్నారు. దాదాపు ఎకరాకు కనీసం రూ.10 వేలపైనే ఖర్చు చేస్తున్నారు. పెట్టుబడి వచ్చేలా లేదు నేను ఐదు ఎకరాల తోట లీజుకు తీసుకున్నాను. పూత బాగానే వచ్చింది కాని ఆ మేరకు కాయ కనబడటం లేదు. కాయ చిన్నగా ఉన్నప్పటికీ రాళ్లవాన వస్తే ఇబ్బంది అని కొంతమేర తెంపి జగిత్యాల మార్కెట్లో అమ్మిన. ఈ సారీ మామిడి తోటలకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – గాదె శంకరయ్య, అనంతారం ఏం చేసుడో అర్థమైతలేదు ఈసారి ఐదారు తోటలు లీజుకు తీసుకున్న. పూత బాగా వచ్చిందని తోటలు పట్టిన. రెండుసార్లు మందులు కూడా కొట్టినా. అయినా ఊహించినంతగా కాయ రాలేదు. ఉన్న కాయ గాలులకు రాలిపోతున్నయ్. భయంతో ఇప్పటికే సగం కాయలు తెంపి అమ్మిన. మిగిలిన కాయలకు కూడా పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. – సత్తవ్వ, తిర్మలాపూర్ నిరుడు మంచిగ కాసినయ్ నేను ఈ ఏడాది 20 ఎకరాల మామిడి తోటలు లీజుకు తీసుకున్న. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు రైతులకు ముట్టజెప్పిన. అయితే నిరుడు మామిడి చెట్లు మంచిగ కాసిన. ఈసారి కూడా దిగుబడి బాగా వస్తదనుకున్నం. కానీ అనుకున్నంతగా చెట్లు కాయలేదు. ఇప్పటికే రెండుసార్లు కురిసిన రాళ్లవానకు ఉన్న కాయలు రాలినయ్. మళ్లీ గాలి దుమారం.. రాళ్ల వన పడుతదోనని భయమేస్తుంది. ఉన్న కాయను ఏదో ఒక రేటుకు అమ్ముకోవాల్సి వస్తుంది. కాయ సైజు పెద్దగా ఉంటే బరువు వచ్చి లాభం ఉంటుంది. – పంబల్ల లక్ష్మి, తాటిపల్లి -
నటి ఇన్నర్‌వేర్‌లతోసహా దోచుకుపోయారు
సాక్షి, ముంబై : నటి మేఘనా నాయుడికి ఊహించని అనుభవం ఎదురైంది. ఇంట్లో అద్దెకుంటున్న ఓ జంట ఆమెను దారుణంగా మోసం చేశారు. ఈ క్రమంలో వారు ఆమె సామాన్లతో సహా ఉడాయించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఫేస్ బుక్‌లో తెలియజేశారు. వివరాల్లోకి వెళ్లితే.. నటి మేఘనా నాయుడిక గోవాలో ఓ ఇల్లు ఉంది. దానికి ఆమె ఓ గార్డియన్‌ను నియమించి.. ఆమె మాత్రం ముంబైలో ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ఓ జంట ఆ ఇంట్లో అద్దెకు దిగారు. తాము ముంబైకి చెందిన వారిమని.. న్యూజిలాండ్‌లో పని చేస్తుంటామని... పని మీద గోవాకు వచ్చామని నమ్మబలికారు. అంతేకాదు వారి ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లను కూడా ఇచ్చారు. కానీ, గత కొన్ని నెలలుగా వారు అద్దె చెల్లించలేదంట. అంతేకాదు చెప్పా పెట్టకుండా పారిపోయిన ఆ జంట.. పోతూ పోతూ ఇంట్లోని మేఘనా వస్తువులను కూడా ఎత్తుకెళ్లిపోయారంట. ఇన్నర్ వేర్లతోపాటు, సాక్సులను కూడా వదలకుండా వారు తీసుకెళ్లినట్లు ఆమె వివరించింది. వారి ఆధార్, లైసెన్స్‌లు కూడా నకిలీవని తేలింది. అంతేకాదు గార్డియన్‌ను కూడా బురిడీ కొట్టించి ఆమె కొడుక్కి జాబ్ ఇప్పిస్తామని చెప్పించి 85 వేలు వసూలు చేశారంట. ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా అప్పులు చేసినట్లు ఫేస్బుక్లో నాలుగు రోజుల క్రితం పోస్ట్ చేసింది. అయితే ఈ ఘటనపై ఆమె పోలీసులను ఆశ్రయించిందా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కలియోన్ కా చమన్ మ్యూజిక్ రీమిక్స్ ఆల్బమ్(2002)తో పాపులర్ అయిన మేఘనా.. తర్వాత చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో కూడా పృథ్వీ నారాయణ, విక్రమార్కుడు, పాండురంగడు, పిల్ల జమీందార్ తదితర చిత్రాల్లో ఆమె కనిపించింది. -
కిరాయిదారులపై కిరాతకం!
సాక్షి, హైదరాబాద్ : ఇల్లు ఖాళీ చేయడం లేదన్న సాకుతో సదరు ఇంటి యజమాని దౌర్జన్యానికి దిగాడు. కిరాయిదారుడి కుటుంబాన్ని గదిలో బంధించాడు. రౌడీ మూకలతో దాడి చేయించాడు. అడ్డుచెబితే పిల్లలను చంపివేస్తామని బెదిరింపులకు పాల్పడిన ఘటన గురువారం ఉదయం కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని దాష్టీకం వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్త హస్తం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. కడప జిల్లా వేంపల్లెకు చెందిన కొక్కంటి మోహన్‌రెడ్డి మూడేళ్లుగా కేపీహెచ్‌బీ కాలనీ మూడో ఫేజ్ ఎంఐజీ 6/1లోని ఎంఎల్ఎం ప్రసాద్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. 12 ఏళ్ల కాలానికి లీజ్ అగ్రిమెంట్ చేసుకున్న అతను అద్దె ఇంటికి దాదాపు రూ.4.లక్షలతో మరమ్మతులు చేయించి, టాటా స్కై డిస్ట్రిబ్యూషన్ కేంద్రం కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రసాద్ సదరు ఇంటిని మరొకరికి విక్రయించడంతో కొనుగోలు చేసిన వ్యక్తులు ఇంటిని ఖాళీ చేయాలని మోహన్‌రెడ్డిపై ఒత్తిడి చేయగా, తనకు 12 ఏళ్ల అగ్రిమెంట్ ఉన్నట్లు చెప్పడంతో వారు వెళ్లిపోయారు. ఏడాది క్రితం ఇంటిని కొనుగోలు చేసిన గోపాల శ్రీహరి అనే మరో వ్యక్తి ఇల్లు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నాడు. ఈ వివాదం స్థానిక కార్పొరేటర్ కావ్య భర్త హరీష్‌రెడ్డి వద్దకు చేరగా, ఆయన మోహన్‌రెడ్డిని పిలిపించి ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించడమేగాక కాగితాలపై సంతకం చేయాలని ఒత్తిడి చేసినట్లు మోహన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మోహన్‌రెడ్డి ఇంటి యజమాని శ్రీహరికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించి స్టేటస్కో ఉత్తర్వులు తెచ్చుకోవడంతో అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది. గత నెల 11న కోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులు పొడించకపోవడంతో ఇదే అదనుగా భావించిన ఇంటి యజమాని శ్రీహరి గురువారం ఉదయం 50 మంది అనుచరులనతో కలిసి ఇంటిపై దాడిచేశాడు. మోహన్‌రెడ్డి, అతని భార్య, బిడ్డను వంట గదిలో బంధించి సామాను బయట పారేశారు. ఇంటి గోడలను యంత్రాల సహాయంతో కూల్చివేయించాడు. చుట్టుపక్కల వారు వచ్చి నిలదీయగా.. తాము కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నట్లు చెప్పారు. వంట గదిలో నుంచి మోహన్‌రెడ్డి, భార్య సంధ్య కేకలు వేయడంతో బిడ్డను చంపేస్తామని బెదిరించారు. భయాందోళనకు గురైన వారు పక్కింటి వారికి సమాచారం ఇవ్వడంతో వారు పోలీస్ కంట్రోల్ రూం కు ఫిర్యాదు చేశారు. అప్పటికే శ్రీహరి ఇంట్లోని విలువైన వస్తువులు, నగలు, నగదు, చెక్కు బుక్‌లు, దస్తావేజులతో పాటు సీసీ కెమె రాలు, డీబీఆర్‌లను తీసుకెళ్లారని, దీనిపై కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మోహన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, ఇల్లు అమ్మిన వ్యక్తిని, కొనుగోలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ కుషాల్కర్ తెలిపారు. ఎమ్మెల్యే ఆర్థికసాయం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఇంటి మరమ్మతుల కోసం మోహన్‌రెడ్డికి రూ.50 వేలు అందజేశారు. హరీష్‌రెడ్డి బెదిరించాడు: సంధ్య బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల కావ్య భర్త హరీష్‌రెడ్డి తమను ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారని మోహన్‌రెడ్డి భార్య సంధ్య మీడియాకు తెలిపారు. తమకు రక్షణ కావాలని, తాము సంపాదించుకున్న డబ్బు, నగలు దోచుకెళ్లారని బోరున విలపించింది. -
‘కిరాయిదారుల ఖాళీ’ కేసులకు ప్రాధాన్యం
న్యూఢిల్లీ: కిరాయిదారులను ఖాళీ చేయించడంలో వివాదం నెలకొన్న కేసులకు ప్రాధాన్యతనిచ్చి త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు కిందికోర్టులకు సూచించింది. ఈ కేసులు దీర్ఘకాలం కొనసాగడం వల్ల స్థల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంది. యజమాని ఆ స్థలాన్ని తన సొంత అవసరాలకు వాడుకోవటం కోసం అద్దెకున్న వారిని ఖాళీ చేయించే కేసులకు మరింత ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంది. కేరళకు చెందిన, దశాబ్దానికి పైగా పెండింగ్‌లో ఉన్న ఇలాంటి ఓ కేసు విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది. -
ఆ రెండు సంస్థల ఆఫీసులను తిరిగి అప్పగించండి
ముంబై: దక్షిణ ముంబై ఓడరేవు ప్రాంతంలోని వేల్హారి ట్రేడింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ ఆటో ఇన్వెస్ట్మెంట్లపై జప్తును ఎత్తివేసి, భవనాలు తిరిగి అప్పగించాలని బాంబే హైకోర్టు పోలీసులను ఆదేశించింది. సాంగ్లీ బ్యాంక్ (ప్రస్తుతం ఇది ఐసీఐసీఐ బ్యాంకులో విలీనమైంది) ఆవరణలోని ఆఫీసులను ఈ రెండు సంస్థలు అద్దెకు తీసుకున్నాయి. ముంబై పోలీసు శాఖ అనుబంధ ఆర్థిక నేరాల విభాగం జరిపిన విచారణలో ఆ రెండు సంస్థలు ఏ నేరంలోనూ భాగస్వాములైనట్లు తేల లేదని జస్టిస్ పి.వి.హర్దాస్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఎంఎస్ రూఫిట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థతోపాటు దాని డెరైక్టర్లు, అదే ప్రాంగణంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాకేష్ అగర్వాల్ అనే వ్యక్తి 2003లో ఆర్థిక నేరాల విభాగంలో కేసు నమోదు చేశాడు. అయితే విచారణ సమయంలో వెల్హారి ట్రేడింగ్, ఆటో ఇన్వెస్ట్మెంట్ సంస్థలను సీల్ చేశారు. ఆ రెండు సంస్థలు మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్(ఎంపీఐడి) కోర్టును ఆశ్రయించాయి. అయితే విచారణ కొనసాగుతున్నందున ఆయా ఆస్తుల విడుదల కోర్టు నిరాకరిం చింది. దీంతో రెండు సంస్థలకు హైకోర్టుకు వెళ్లా యి. నవంబర్ 2004లోనే విచారణ పూర్తయిందని, చార్జిషీట్ కూడా దాఖలు చేశారని హైకోర్టు తెలి పింది. అయితే ఆ భవనంలో అద్దెకు ఉంటున్న రెండు సంస్థలు ఏ నేరానికీ పాల్పడలేదని ఈ ఏడా ది ఫిబ్రవరిలో ఆర్థిక నేరాల విభాగం సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. నిందితులకు కేవలం మంచి చేయాలనే ఉద్దేశంతోనే రెండు సంస్థలు ఆవరణను ఇచ్చాయని కోర్టు తెలిపింది. అయితే రెండు ఆఫీసు ఆవరణలను తమకు ఇచ్చేయాలని ఐసీఐసీఐ బ్యాంక్ విచారణ సమయంలో కోరింది. సాంగ్లీ బ్యాంకుకు న్యాయబద్ధమైన కిరాయిదారులైనందున బ్యాంక్ వాదనను పక్కకు పెట్టిన హైకోర్టు... పై విధంగా తీర్పు నిచ్చింది.