సాక్షి, అమరావతి: కౌలు రైతులకు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ముందుకు రావాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ప్రస్తుతం కౌలు రైతులకు ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని పేర్కొన్నారు. వైఎస్సార్ నవోదయం పథకం కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్లకు (ఎంఎస్‌ఎంఈ), ఎస్సీ, ఎస్టీ మహిళలకు, ప్రధాన మంత్రి ముద్ర యోజన రుణాల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ఆయా రంగాల వారికి రుణాల మంజూరు పెంచాలని బ్యాంకర్లకు సూచించారు. మే 15వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో 210వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు.
బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సీఎం సూచనలు ఇలా..
– వైఎస్సార్ జిల్లా మాదిరిగా బ్యాంకుల డిజిటలైజేషన్ ప్రక్రియ అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలి.
– గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లిష్ మీడియంలో బోధన, రైతు భరోసా కేంద్రాలతో గ్రామాలలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులకు సహకరించాలి.
– ఆర్‌బీకే (రైతు భరోసా కేంద్రం)లో ఉన్న ఇంటర్నెట్ కియోస్క్ ద్వారా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఆర్డర్ చేస్తే నాణ్యతా నిర్ధారణలతో అవి రైతులకు అందుబాటులోకి వస్తాయి. పంటల వివరాలను నమోదు చేయించేందుకు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, రెవిన్యూ అసిస్టెంట్లకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. ఆ వివరాలను బ్యాంకులతో అనుసంధానం చేస్తాం. తద్వారా సాగు చేస్తున్న పంటలకు తగిన విధంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
– మైక్రో ఎంటర్‌ప్రైజెస్ కోసం జూన్‌లో కొత్త పథకం తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగా చిరు వ్యాపారులు, తోపుడు బండ్లమీద చిన్న పాటి వ్యాపారం చేసుకునే వారికి గుర్తింపు కార్డులతో రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నది ఆలోచన. ఇందుకు మీ (బ్యాంకుల) సహకారం చాలా అవసరం.
– కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు నీరివ్వడం.. ప్రాజెక్టుల సత్వర పూర్తి, వాటర్‌గ్రిడ్ ద్వారా మంచి నీటి సరఫరా, తదితర కార్యక్రమాలన్నింటికీ బ్యాంకుల సహకారం కావాలి.
రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సదుపాయం
1,000పైగా రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సదుపాయం కల్పించేందుకు బ్యాంకు మిత్రలను ఆయా కేంద్రాల్లో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. 5 వేల జనాభాకు పైబడిన 567 చోట్ల కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సీబీఎస్) సర్వీసులు ప్రారంభించాం. 5 కి.మీ పరిధిలో బ్యాంకింగ్ సదుపాయం లేని 229 గ్రామాలను మ్యాపింగ్ చేశాం. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 29 మధ్య 1.1 లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చాం. ఏడాదిలోగా వైఎస్సార్ జిల్లాలో వంద శాతం డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయం అమల్లోకి వస్తుంది. ప్రాథమిక రంగానికి రూ.1,18,464 కోట్లు (70.01 శాతం), వ్యవసాయ రంగానికి రూ.83,444 కోట్లు (72.56 శాతం), రుణ ప్రణాళిక మేరకు రూ. 1,73,625 కోట్లు (75.75 శాతం), ఎంఎస్‌ఎంఈలకు రూ.29,442 కోట్లు (81.78 శాతం) రుణాలు (ఇవన్నీ డిసెంబర్ నాటికి) ఇచ్చాం. స్టాండప్ ఇండియా కింద 4,857 మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు సహాయం చేశాం.
– ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ జె.పకీరసామి
సమావేశంలో పాల్గొన్న వారు..
ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, వ్యసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ కే.వి.నాంచారయ్య, ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుందరం శంకర్, నాబార్డ్ సీజీఎం ఎస్.సెల్వరాజ్.
Comments
Please login to add a commentAdd a comment