సీఎం జగన్‌ ఆదేశాలు.. సాయం శరవేగం | Cyclone relief measures have intensified with CM Jagan orders | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ ఆదేశాలు.. సాయం శరవేగం

Published Thu, Dec 7 2023 4:18 AM | Last Updated on Thu, Dec 7 2023 1:13 PM

Cyclone relief measures have intensified with CM Jagan orders - Sakshi

ఏలూరు జిల్లా ప్రగడవరంలో ధాన్యాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించడంలో సహకరిస్తున్న ఉపాధి హామీ పథకం కూలీలు

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: తుపాను ప్రభావానికి గురైన జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం వేగంగా సహాయక చర్యలు చేపట్టింది. తుపాను ప్రారంభం కాక ముందు నుంచే కట్టుదిట్టంగా ముందస్తు ఏర్పాట్లు చేయడం వల్ల ప్రాణ నష్టాన్ని నివా­రించగలిగారు. ఎనిమిది జిల్లాల్లో 320 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. 20,572 మందిని తరలించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 124 శిబిరాల్లో 6,077 మందికి ఆశ్రయం కల్పించారు.

తిరుపతి జిల్లాలో 36 కేంద్రాల్లో 3,386 మందికి, పశ్చిమగోదావరి జిల్లాలో పన్నెండు కేంద్రాల్లో 5,113, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 37 కేంద్రాల్లో 910, బాపట్ల జిల్లాలో 74 కేంద్రాల్లో 3,888, గుంటూరులో 14 శిబిరాల్లో 1,111, కోనసీమ జిల్లాలో 36 శిబిరాల్లో 910, పశ్చిమ గోదావరిలో 32 శిబిరాల్లో 5,113, తూర్పు గోదావరిలో 3 కేంద్రాల్లో 87 మందికి పునరావాసం కల్పించారు. బాధితులందరికీ భోజనం, మంచి నీటి సౌకర్యం కల్పించారు. వారికి అక్కడే నిత్యావసరాలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాలు ఇళ్లకు వెళ్లే ముందు ఆర్థిక సాయంగా రూ.1000 నుంచి రూ.2500 అందిస్తున్నారు.

తుఫాను ప్రభావిత గ్రామాల్లో 6 ఎస్డీఆర్‌ఎఫ్, 6 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరు, ఉలవపాడు, బాపట్ల, నాయుడుపేటలో ఈ బృందాలు సేవలు అందిస్తున్నాయి. అధికార యంత్రాంగం దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించడంతో రాకపోకలు యధాతథంగా కొనసాగుతున్నాయి. వర్షం తెరిపి ఇవ్వడంతో రైతులు ముంపునకు గురైన పంటలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు.

వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఆర్బీకే సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరోవైపు రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యలతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆపదలో ఉన్న రైతులను గుర్తించడమే కాకుండా, వారి వద్ద నుంచి ధాన్యం కొనుగోలు వెంటనే కొనుగోలు చేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు.  సీఎం ఆదేశాల మేరకు తేమ శాతంతో సంబంధం లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. 
బాపట్ల జిల్లా రావికంపాడులో రైతులతో కలసి వర్షపు నీటిని పొలం నుంచి బయటకు మళ్లిస్తున్న ఆర్‌బీకే సిబ్బంది..  

యుద్ధ ప్రాతిపదికన కదిలిన యంత్రాంగం
► ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాత్రింబవళ్లు 3 వేల మందికి పైగా విద్యుత్‌ అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తూ సరఫరాను పునరుద్ధరించారు. బాపట్ల జిల్లాలో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు బాధితులకు సహాయం అందించే పనుల్లో నిమగ్నమయ్యారు. 353 విద్యుత్‌ స్తంభాలను శాఖ అధికారులు తిరిగి పునరుద్ధరించారు. కూలిపోయిన 282 చెట్లను రోడ్లపై నుంచి తొలగించారు. 261 గ్రామాలలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. 74 రిలీఫ్‌ క్యాంపులు ఏర్పాటు చేసి, 3,888 మందికి పునరావాసం కల్పించారు.

బుధవారం ఉదయం నుంచే ఉపాధి హామీ కూలీలతో వరి పంట పొలాల్లోని నీటిని బయటకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. 93 చోట్ల హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. పశువులకు సైతం వైద్య సేవలు అందిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు వచ్చిన ఒక్కో కుటుంబానికి రూ.2,500 పంపిణీ చేశారు. 25 కేజీల బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేశారు. దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు పరిహారం పంపిణీ చేస్తున్నారు. మంత్రి మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు బాధితులకు ధైర్యం చెప్పారు. 
తిరుపతి జిల్లా కోట మండలం రొయ్యలగుంతల వద్ద చిక్కుకున్న వారిని తీసుకువస్తున్న రెస్క్యూ టీం 

► తిరుపతి జిల్లాలో నిర్వాసితుల కోసం 80 పునరావాస కేంద్రాలు, 80 మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 25 వేల కుటుంబాలకు ప్రభుత్వ సాయం పంపిణీ చేస్తున్నారు. రూ.వెయ్యి నుంచి రూ.2,500 నగదుతో పాటు ఐదు రకాల వస్తువులు పంపిణీ చేస్తున్నారు. దైవాలదిబ్బ సమీపంలో రొయ్యలగుంతల వద్ద కాపలాదారులుగా పని చేస్తున్న 18 మంది వరద ఉధృతిలో చిక్కుకుపోయారు.

గూడూరు ఆర్డీఓ కిరణ్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్‌ సిబ్బంది సాయంతో 18 మందిని ఒడ్డుకు చేర్చారు. నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కేరోజా తన చారిటబుల్‌ ట్రస్టు ద్వారా తన సోదరుడు రాంప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ట్యాంకర్ల ద్వారా తాగు నీరు సరఫరా చేశారు. 

► కాకినాడ జిల్లాలో సుడిగాలికి దెబ్బతిన్న పిఠాపురం మండలం పి.దొంతమూరు, కొత్తపల్లి మండలం కొండెవరంలలో 100 కుటుంబాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతి సదుపాయాలు కల్పించారు. కోనసీమ జిల్లాలో సహాయ, పునరావస చర్యలు వేగమందుకున్నాయి.అమలాపురం మున్సిపాలిటీతోపాటు పలు గ్రామాల్లో రోడ్డుకు అడ్డుగా పడిన చెట్లను తొలగిస్తున్నారు. వరి చేలల్లో మంపు నీరు దిగేందుకు ఉపాధి హామీ పథకం కూలీలు డ్రెయిన్లలో పూడిక తొలగింపు పనులు చేపట్టారు. కూనవరం డ్రెయిన్‌ మొగ వద్ద ముంపునీరు దిగేందుకు వీలుగా చర్యలు చేపట్టారు.

తద్వారా సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టు పరిధిలోని ముంపు నీరు వేగంగా సముద్రంలోకి దిగనుంది. అయినవిల్లి మండలం మాగాంలో దెబ్బతిన్న వరిచేలను కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జిల్లా ప్రత్యేకాధికారి జయలక్ష్మిలు బుధవారం పరిశీలించారు. అమలాపురం పట్టణంలో 28,29,14,11 వార్డులలో ముంపు బాధితులకు వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు భోజనాలు అందించారు. మరోవైపు ధాన్యం కొనుగోలును కొనసాగించారు. 17 శాతం తేమ అధికంగా ఉన్నా, రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 3వ తేదీ నుంచి బుధవారం వరకు 14,278 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement