సిరిసిల్ల నేతన్న ఔదార్యం.. సామాజిక రుగ్మతలపై పోరాటం | Handloom Labour Constructed A House For Sircilla Tenants | Sakshi
Sakshi News home page

సామాన్యుడి మానవత్వానికి దర్పణం

Published Sat, Nov 23 2019 9:00 AM | Last Updated on Sat, Nov 23 2019 9:00 AM

Handloom Labour Constructed A House For Sircilla Tenants  - Sakshi

సిరిసిల్ల మానేరు తీరంలో ఏర్పాటు చేసిన సామాజిక విడిది భవనాలు, చిలుక నారాయణ(ఫైల్‌)

సిరిసిల్లటౌన్‌: ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు..మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్న వాడు..అనే పాటను మరిపించేలా చిలుక నారాయణ అందిస్తున్న సేవ దు:ఖంలో ఉన్న అద్దె ఇంటివాసులకు ఎంతో ఊరట కలిగిస్తోంది. మానేరు తీరాన సామాజిక ‘విడిది’ భవనం ఏర్పాటు చేసి మానవత్వానికి ఊపిరిపోస్తున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్న వారిలో ఎవరైనా చనిపోతే రోడ్డుపై శవజాగరణకు ఎలాంటి అవకాశం లేకుండా ఉండేందుకు ఏడు గదులు నిర్మించి దిక్కులేని వారికి ఆశ్రయం కల్పించేందుకు మానవాతావాది చూపిన మార్గం మనసు లేని కర్కోటకులకు సైతం కనువిప్పు కలిగించిక మానదు. 

సాక్షి, కరీంనగర్‌: సామాజిక రుగ్మతపై స్పందన.. కార్మికక్షేత్రం సిరిసిల్లలో నిరుపేద నేతకార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పట్టణ జనాభాలో సుమారు 80శాతం పద్మశాలి సామాజిక వర్గానిదే ఉంటుంది. మిగతా కులాల్లో కూడా బీసీలదే అధిక జనాభా. అందుకే ఇక్కడ ఆర్థికలేమితో ఉండేవారి సంఖ్య అధికం. చాలా మంది ఇరుకు గదుల్లో అద్దెకు ఉంటూ..కుటుంబాలను నెట్టుకొచ్చేవారే. అయితే పట్టణంలో సామాజిక మూఢాచారాలు ఎక్కువ. ఎవరైనా అద్దె ఇంట్లో  ఉండేవారు చనిపోతే..శవాన్ని ఇంటికి తీసుకు రానివ్వరు. పైగా..నెలపాటు శూదకం పేరుతో ఇంట్లోకి రావొద్దనే కట్టుబాటు నడుస్తోంది. భక్తి ప్రపత్తులు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇటువంటి సామాజిక మూఢాచారం ఎక్కువైంది. గడిచిన మూడేళ్లుగా ఒక్క సిరిసిల్ల పట్టణంలోనే 100 మందికిపైగా అద్దె జీవులు చనిపోతే రోడ్డుపై శవజాగరణ చేసిన సంఘటనలున్నాయి. వీటిపై ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోతోంది. కొంతమంది మానవతావాదులు ఈ దురాచారానికి స్వస్తి పలకాలని కోరుకుంటున్నా..ఆచరణలో ముందుకుసాగడం లేదు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ కౌన్సిలర్‌ చిలుక నారాయణ మాత్రం సామాజిక దురాచారంపై యుద్ధాన్ని ప్రకటించారు. మానేరు శివారులో రూ.5 లక్షలు వెచ్చించి 7 గదులతో ఒక ఇంటిని నిర్మించారు. అద్దె ఇంట్లో ఉంటూ ఎవరైనా చనిపోతే ఇంట్లోకి రానివ్వని వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు.   

మానవత్వానికి నిలయం..
సిరిసిల్ల నెహ్రూనగర్‌ మానేరు నది తీరాన ఉన్న సామాజిక నివాసం మానవత్వానికి నిలయంగా నిలుస్తోంది. మున్సిపల్‌ వారు కట్టించిన ఆధునిక వైకుంఠథామం(శ్మశాన వాటిక)కు కొద్ది దూరంలోనే ఇది ఉండడంతో ఆప్తులను కోల్పోయి దు:ఖంలో ఉంటూ..అద్దె ఇంట్లోకి వెళ్లలేని వారు ఆశ్రయం పొందుతున్నారు. ఆరునెలలక్రితం దీనిని స్థానిక అంబాభవాని ఆలయం చైర్మన్‌ చిలుక నారాయణ సొంత ఖర్చులతో నిర్మించి అందులో ఏడు కుటుంబాలు ఆశ్రయం పొందేలా వసతులు కల్పించారు. ఇప్పటికీ శవ జాగరణ చేసిన సుమారు 30 కుటుంబాలు ఇందులో ఆశ్రయం పొంది చనిపోయిన తమ పెద్దలకు అంత్యక్రియలు జరిపించుకున్నారు. వస్త్రోత్పత్తి ఖిల్లాగా పేరొందిన సిరిసిల్లలో అత్యవసర పరిస్థితుల్లో ఆశ్రయం ఇచ్చేవారు కొలువైన తరుణంలో ఈ విడిదిని ఏర్పాటు చేయడం మానవత్వాన్ని ప్రతిబింబిస్తోంది. అయిన వారిని పోగొట్టుకుని అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్న నిరుపేదలు ఆశ్రయం పొందుతుండగా, దూరప్రాంతాల నుంచి వచ్చి రోకడ (రోజువారి) నేత కార్మికులకు కూడా రాత్రి పూట ఉచితంగా బసను కల్పించడం విశేషం. 

మాలాంటి వారికి తోడ్పాటు
మనిషిని మనిషి ఈసడించుకుంటున్న ఈరోజుల్లో ఐనవారిని తలపించేలా..ఇక్కడ సోషల్‌ హోం నడిపించడం మాలాంటోళ్లకు కలిసొస్తుంది. మా తండ్రి వడ్నాల మల్లేశం(85) నేతకార్మికుడు. అమ్మ కళావతి 30 ఏళ్ల క్రితమే పక్షవాతంతో చనిపోయింది. నాన్న సిరిసిల్లలో ఉండి సాంచాలు నడిపేవాడు. నేను టీవీ రిపేరర్‌గా వేములవాడలో భార్య మంజుల, కూతురు లాస్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నా. పదిహేనురోజులక్రితం మా నాన్న అనారోగ్యానికి గురైండు. బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టింది. ఆపరేషన్‌ చేయించాలంటే..రూ.5లక్షలు కావాలన్నారు. ఖరీదైన వైద్యం చేయించలేక సిరిసిల్ల జిల్లాసుపత్రిలో చేర్పించా..ఈనెల 8న చనిపోయిండు. అద్దె ఇంటికి తీసుకెళ్లడం కుదరకపోవడంతో ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానానికి తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపిన. తెలిసినవారు చెబితే కుటుంబంతోపాటు ఇక్కడే ఆశ్రయం పొందుతూ..నాన్నకు ఖర్మకాండలు జరిపిస్తున్న. 

                                         వడ్నాల సదానందం కుటుంబ సభ్యులు
కార్మికుల కష్టాలు చూసే..
నేను సాంచాలు నడిపిన. బీడీ టేకేదారుగా పని చేస్తా. అందుకే నాకు నేతకార్మికులు, బీడీ కార్మికుల కష్టాలు పూర్తిగా తెలుసు. సిరిసిల్ల పట్టణంలో అద్దె ఇళ్లలో ఉండేవారు చనిపోతే జరుగుతున్న సంగతులు ఇటీవలే ’పేపర్లో’ చూసి మనసుకు బాధనిపించింది. అందుకే నా సొంత డబ్బుతో ఏడు గదులతో ఇక్కడ ఇల్లు కట్టించిన. రెండు మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్లు, అంబాభవాని ఆలయం నుంచి బోరు కనెక్షన్‌ కల్పించిన. విద్యుత్‌ కనెక్షన్‌ ఇతర వసతులు కల్పించిన. రోకడ కార్మికులు కూడా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు.

సొంతిల్లు ఉంటే..బాధలుండవు..
సొంతిల్లు ఉంటే..మాలాగా అయిన వారిని పోగొట్టుకున్న సమయాల్లో శవాలతో రోడ్డుపై, శ్మశానంలో జాగారం చేసే బాధలుండవు. మాది సిరిసిల్ల శివారులోని ముష్టిపల్లి. నా భార్య భాగ్య, పిల్లలు సిద్దార్థ, లవన్‌తో కలిసి ఉంటున్న. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న నాకు చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోయారు. అప్పట్నుంచి నానమ్మ కుసుమ రుక్కవ్వ (62) సాకి పెద్ద చేసింది. 15రోజులక్రితం పక్షవాతం వచ్చింది. ఇంటోళ్లు చనిపోతదని వేరు ఇల్లు చూసుకోమన్నరు. దీంతో ఖరీదైన వైద్యం చేయించలేని స్థితిలో ఈనెల 16న జిల్లాసుపత్రిలో చేర్పించగా..తెల్లారి చనిపోయింది. అమ్మానాన్నలు కూడా ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోయారు. నేనే చదువుకోలేక చిన్నప్పట్నుంచి పనులు చేసుకుంటూ..చెల్లి పెళ్లి చేసిన. ఇప్పుడు పెద్దదిక్కు నానమ్మ చనిపోయింది. ఆమె ఆత్మశాంతి కలిగేలా అంత్యక్రియలు కూడా చేయలేని స్థితిలో ఉన్న మాకు ఇక్కడున్న సోషల్‌ హోం ఆశ్రయం కల్పించినందుకు కృతజ్ఞతలు. 

                                                        కుసుమ వెంకటేశ్‌
కొడుకున్నా..ఏకాకి జీవితం..
మేము దత్తోజిపల్లె నుంచి యాభై ఏళ్ల కింద సిరిసిల్లకు బతుకొచ్చినం. మా ఆయన ఇస్తారి(65) చేనేత కార్మికుడు. నేను బీడీలు చేస్తూ..కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్లం. ఇంట్లో ఆయనకు ఎప్పుడూ..అనారోగ్యంతో ఉండేవాడు. మాకున్న ఆస్తులు, నగలు అన్నీ అమ్మిన. కొడుకు జితేందర్‌ 25 ఏండ్లు ఉంటాడు. మాకున్న ఆస్తులు పోవడంతో మమ్మల్ని వదిలి ఎక్కడికో వెళ్లిపోయిండు. వాడిజాడకై వెతికినా..ఫలితం లేదు. ఈయనకేమో ఆర్నెల్ల నుంచి మంచంమీదే అన్ని సేవలు చేసిన. కొడుకు వస్తడని దేవున్ని మొక్కినా..దయతల్చలేదు. చాలా రోజులుగా ఇద్దరికీ పని లేకుండా ఉంటున్నాం. నాకు బీడీ పెన్షన్, ఆయనకు వృధ్యాప్య పింఛన్‌ ఇవ్వాల్సి ఉన్నా..అధికారులు ఎవ్వరూ..ఇవ్వడం లేదు. ఇప్పుడు నేను ఏకాకినైన. ఏం పని చేసుకుంటూ..బతకాలి. నిలువ నీడలేని ఆడబతుకు ఇది. సర్కారు దయచూపాలి. ఇక మాఆయన చనిపోయినప్పుడు జాయింట్‌ కలెక్టరమ్మకు మొరపెట్టుకున్న. రూ.5వేలు ఇచ్చింది. కొందరు మనసున్నోల్లు కలిసొచ్చి అంత్యక్రియలు చేయించిండ్రు. ఇప్పుడు నేనొక్కదాన్నే ఇక్కడ తలదాచుకుంటున్న. చిలుక నారాయణ మాలాంటోళ్లకు మంచి సౌలతి కలిపించిండు. 

                                                 వేముల మణెవ్వ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement