సాక్షి, అమరావతి: కౌలు రైతులకు మరింత అండగా నిలవాలని ప్రభుత్వం సంకల్పించింది. గడచిన నాలుగేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది పంట హక్కు సాగు పత్రాలు (కౌలు కార్డులు) జారీ చేసిన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఇందుకోసం తొలిసారిగా సీసీఎల్‌ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌తో సీసీఆర్సీ వెబ్‌పోర్టల్‌ను అనుసంధానించింది. ఫలితంగా బ్యాంక్ లోన్‌చార్జ్ మాడ్యూల్‌లో భూ యజమానులతోపాటు కౌలుదారుల వివరాలను సైతం బ్యాంకర్లు ఖరారు చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ మంది కౌలుదారులకు పంట రుణాలు మంజూరు చేసే అవకాశం కల్పించింది.
సాధారణంగా సీసీఎల్‌ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్ బ్యాంకుల లోన్‌చార్జ్ మాడ్యూల్‌లో అనుసంధానమై ఉంటుంది. లోన్‌చార్జి మాడ్యూల్‌లో సర్వే నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయగానే భూ యజమానుల పేర్లు మాత్రమే కన్పించేవి. దీంతో కౌలుదారులకు రుణాల మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ఏదో సాకుతో వెనుకడుగు వేస్తుండేవారు. రబీ సీజన్‌లో మరింత ఎక్కువ మంది కౌలుదారులకు రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంతో సీసీఎల్‌ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను సీసీఆర్సీ వెబ్ పోర్టల్‌తో ప్రభుత్వం అనుసంధానించింది. లోన్‌చార్జ్ మాడ్యూల్‌తో సీసీఎల్‌ఎ వెబ్‌ల్యాంబ్ పోర్టల్ అనుసంధానించి ఉండడంతో ఆటోమేటిక్‌గా లోన్‌చార్జి మాడ్యుల్‌లో భూ యజమానుల వివరాలతో పాటు కౌలుదారుల వివరాలు కూడా బ్యాంకర్లకు కనిపిస్తాయి.
భూ యజమానులను ఒప్పించి..
భూ యజమానుల వివరాలతో పాటు కౌలు రైతుల వివరాలను ఖరారు చేసుకుని బ్యాంకర్లు వారికి రుణాలు మంజూరు చేస్తారు. ఒకవేళ కౌలుకు ఇచ్చిన భూమిపై భూ యజమాని కనుక పంట రుణం తీసుకుని ఉంటే కౌలుదారులకు పంట రుణం మంజూరు చేయరు. అయితే, సాగు చేయకపోయినప్పటికీ వరుసగా రెండు సీజన్‌లలో భూ యజమాని కనుక పంట రుణం పొంది ఉంటే, అటువంటి వారిని గుర్తించి ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పిస్తారు. తమ భూమి కౌలుకు తీసుకున్న వాస్తవ సాగుదారులకు చేయూతనిచ్చేలా సహకరించాలని సూచిస్తారు. ఫలితంగా భూ యజమానుల స్థానంలో కౌలుదారులు పంట రుణాలు పొందే అవకాశం ఏర్పడుతుంది.
నాలుగేళ్లలో రూ.6,906 కోట్ల పంట రుణాలు..
రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలుదారులు ఉంటారని అంచనా. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నా.. ఆంక్షల పేరిట బ్యాంకులు మోకాలడ్డేవి. ప్రస్తుతం ఏటా 11 నెలల కాల పరిమితితో జారీ చేస్తున్న కౌలు కార్డుల ఆధారంగా పంట రుణాలతో పాటు సంక్షేమ ఫలాలు అందిస్తోంది. నాలుగేళ్లలో 17.61 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేయగా.. వీరిలో 9.83 లక్షల మందికి రూ.6,905.76 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారు. 2023–24 సీజన్‌లో 8.89 లక్షల మంది కౌలుదారులకు సీసీఆర్సీల జారీ లక్ష్యం కాగా.. ఇప్పటికే 8.19 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేశారు. వీరికి కనీసం రూ.4 వేల కోట్ల పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. ఇప్పటికే 3.33 లక్షల మందికి రూ.1,085.42 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారు.
నూరు శాతం రుణాలు మంజూరే లక్ష్యం
మరింత ఎక్కువ మంది కౌలుదారులకు పంట రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంగా సీïసీఎల్‌ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌తో సీసీఆర్సీ పోర్టల్‌ను అనుసంధానం చేశాం. ఫలితంగా కౌలుదారులకు రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లకు మరింత వెసులుబాటు కలుగుతుంది. జేఎల్‌జీ గ్రూపులతో పాటు వ్యక్తిగతంగా కూడా కౌలుదారులు పంట రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంగా ఈ మార్పు చేశాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment