leverage
-
కౌలు రైతులకు తీపికబురు
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు మరింత అండగా నిలవాలని ప్రభుత్వం సంకల్పించింది. గడచిన నాలుగేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది పంట హక్కు సాగు పత్రాలు (కౌలు కార్డులు) జారీ చేసిన ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఇందుకోసం తొలిసారిగా సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌తో సీసీఆర్సీ వెబ్‌పోర్టల్‌ను అనుసంధానించింది. ఫలితంగా బ్యాంక్ లోన్చార్జ్ మాడ్యూల్లో భూ యజమానులతోపాటు కౌలుదారుల వివరాలను సైతం బ్యాంకర్లు ఖరారు చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ మంది కౌలుదారులకు పంట రుణాలు మంజూరు చేసే అవకాశం కల్పించింది. సాధారణంగా సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్ బ్యాంకుల లోన్చార్జ్ మాడ్యూల్లో అనుసంధానమై ఉంటుంది. లోన్‌చార్జి మాడ్యూల్లో సర్వే నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయగానే భూ యజమానుల పేర్లు మాత్రమే కన్పించేవి. దీంతో కౌలుదారులకు రుణాల మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ఏదో సాకుతో వెనుకడుగు వేస్తుండేవారు. రబీ సీజన్లో మరింత ఎక్కువ మంది కౌలుదారులకు రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంతో సీసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను సీసీఆర్సీ వెబ్ పోర్టల్‌తో ప్రభుత్వం అనుసంధానించింది. లోన్చార్జ్ మాడ్యూల్తో సీసీఎల్ఎ వెబ్‌ల్యాంబ్ పోర్టల్ అనుసంధానించి ఉండడంతో ఆటోమేటిక్‌గా లోన్‌చార్జి మాడ్యుల్లో భూ యజమానుల వివరాలతో పాటు కౌలుదారుల వివరాలు కూడా బ్యాంకర్లకు కనిపిస్తాయి. భూ యజమానులను ఒప్పించి.. భూ యజమానుల వివరాలతో పాటు కౌలు రైతుల వివరాలను ఖరారు చేసుకుని బ్యాంకర్లు వారికి రుణాలు మంజూరు చేస్తారు. ఒకవేళ కౌలుకు ఇచ్చిన భూమిపై భూ యజమాని కనుక పంట రుణం తీసుకుని ఉంటే కౌలుదారులకు పంట రుణం మంజూరు చేయరు. అయితే, సాగు చేయకపోయినప్పటికీ వరుసగా రెండు సీజన్లలో భూ యజమాని కనుక పంట రుణం పొంది ఉంటే, అటువంటి వారిని గుర్తించి ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పిస్తారు. తమ భూమి కౌలుకు తీసుకున్న వాస్తవ సాగుదారులకు చేయూతనిచ్చేలా సహకరించాలని సూచిస్తారు. ఫలితంగా భూ యజమానుల స్థానంలో కౌలుదారులు పంట రుణాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. నాలుగేళ్లలో రూ.6,906 కోట్ల పంట రుణాలు.. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలుదారులు ఉంటారని అంచనా. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నా.. ఆంక్షల పేరిట బ్యాంకులు మోకాలడ్డేవి. ప్రస్తుతం ఏటా 11 నెలల కాల పరిమితితో జారీ చేస్తున్న కౌలు కార్డుల ఆధారంగా పంట రుణాలతో పాటు సంక్షేమ ఫలాలు అందిస్తోంది. నాలుగేళ్లలో 17.61 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేయగా.. వీరిలో 9.83 లక్షల మందికి రూ.6,905.76 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారు. 2023–24 సీజన్లో 8.89 లక్షల మంది కౌలుదారులకు సీసీఆర్సీల జారీ లక్ష్యం కాగా.. ఇప్పటికే 8.19 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేశారు. వీరికి కనీసం రూ.4 వేల కోట్ల పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. ఇప్పటికే 3.33 లక్షల మందికి రూ.1,085.42 కోట్ల పంట రుణాలు మంజూరు చేశారు. నూరు శాతం రుణాలు మంజూరే లక్ష్యం మరింత ఎక్కువ మంది కౌలుదారులకు పంట రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంగా సీïసీఎల్ఏ వెబ్‌ల్యాండ్ పోర్టల్‌తో సీసీఆర్సీ పోర్టల్‌ను అనుసంధానం చేశాం. ఫలితంగా కౌలుదారులకు రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లకు మరింత వెసులుబాటు కలుగుతుంది. జేఎల్‌జీ గ్రూపులతో పాటు వ్యక్తిగతంగా కూడా కౌలుదారులు పంట రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంగా ఈ మార్పు చేశాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
భారత్ వృద్ధికి ఢోకా లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ద్రవ్య, పరపతి విధానాలు కఠినంగా ఉన్నప్పటికీ, స్థూల ఆర్థిక స్థిరత్వం విషయంలో రాబోయే సంవత్సరాల్లో భారతదేశం మెరుగైన స్థితిలో ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక గురువారం తెలిపింది. ఖరీఫ్ పంట చేతికి అందడంతో రానున్న నెలల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుందని, అదే సమయంలో వ్యాపార అవకాశాలు మెరుగుపడటంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 2022కు సంబంధించి నెలవారీ నివేదికను విడుదల చేసింది. అమెరికా వడ్డీరేట్లు పెంపు ‘‘భవిష్యత్ ఇబ్బంది’’కి సంబంధించినది పేర్కొంటూ, స్టాక్ ధరలు తగ్గడానికి దారితీసే అంశం ఇదని పేర్కొంది. దీనితోపాటు బలహీన కరెన్సీలు, అధిక బాండ్ ఈల్డ్స్, అధిక వడ్డీరేట్ల సమస్యలు పలు ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొనాల్సి రావచ్చని పేర్కొంది. వృద్ధి అవకాశాల మందగమనం, అధిక ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రపంచాన్ని మాంద్యం ముందు నిలబెట్టే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. భారత్ ఎగుమతులపై ఇది ప్రభావం చూపినప్పటికీ, దేశీయ డిమాండ్, ఇన్వెస్ట్మెంట్ సైకిల్ పటిష్టత, వ్యవస్థాగత సంస్కరణలు భారత్‌కు రక్షణగా ఉంటున్నట్లు పేర్కొంది. -
కరోనా విలయం: మహమ్మారిపై ‘స్టార్టప్’ వార్!
నిత్యం లక్షలాదిగా పెరిగిపోతున్న కరోనా కేసులతో ఆస్పత్రులపై భారం పెరిగిపోతోంది. ఇటువంటి క్లిష్ట సమయాల్లో కరోనాను ఎదుర్కొనే విషయంలో స్టార్టప్‌లు బహుముఖ పాత్ర పోషిస్తుండడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అత్యాధునిక టెక్నాలజీల సాయంతో ఆస్పత్రులు, ప్రజలు, సంస్థలకు సాయపడుతున్నాయి. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో చేదోడుగా నిలుస్తున్నాయి. క్లౌడ్ ఫిజీషియన్ అనే స్టార్టప్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, లేహ్ లడక్, బిహార్, కోల్‌కతా, గుజరాత్ తదితర ప్రాంతాల్లో కరోనాతో తీవ్ర అనారోగ్యం బారిన పడిన 2,700 మంది రోగులు కోలుకునేందుకు తన వంతు పాత్ర పోషించింది. ఆస్పత్రులు, రోగులు, వైద్య నిపుణుల మధ్య అనుసంధానంతో మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ సంస్థ టెక్నాలజీ సాయపడింది. క్లౌడ్ ఫిజీషియన్ ‘‘భారత్‌లో 3 లక్షల ఐసీయూ (ప్రత్యేక వైద్య పర్యవేక్షణ) పడకలు ఉన్నాయి. కానీ వీటికి సంబంధించి అందుబాటులో ఉన్న ఐసీయూ వైద్యులు 5,000 మందే. దీంతో ఐసీయూ వైద్యంలో నైపుణ్యం ఉన్న డాక్టర్ల సేవలను అందరూ పొందలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు పరిష్కారం టెక్నాలజీ సాయాన్ని తీసుకోవడమే. ప్రస్తుతానికి 12 రాష్ట్రాల్లో మా సేవలు అందుబాటులో ఉన్నాయి. 25 ఆస్పత్రుల పరిధిలోని 250 ఐసీయూ బెడ్ల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నాము. మా టెక్ ప్లాట్‌ఫామ్ ‘రాడార్’ ద్వారా ఐసీయూ రోగుల పర్యవేక్షణకు సంబంధించి నర్సులు, జూనియర్ డాక్టర్లకు సాయపడుతున్నాము. రాడార్ ప్లాట్‌ఫామ్ అన్నది ఐసీయూ పడకలను మా కమాండ్ కేంద్రంతో అనుసంధానం చేస్తుంది. బెంగళూరులోని ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో బహుళ విభాగాల్లో నిష్ణాతులైన ఐసీయూ స్పెషలిస్టు వైద్యుల బృందం పనిచేస్తుంటుంది. వీరు ఎప్పటికప్పుడు చికిత్సలను పర్యవేక్షిస్తుంటారు’’ అని క్లౌడ్ ఫిజీషియన్ సహ వ్యవస్థాపకుడు ధృవ్‌జోషి తెలిపారు. వృత్తి రీత్యా జోషి పల్మనరీ, క్రిటికల్ కేర్ వైద్య నిపుణుడు కావడం గమనార్హం. క్రిటికల్ కేర్ వైద్య సేవలకు నిపుణుల కొరతను గుర్తించిన ఆయన ఈ దిశగా క్లౌడ్ ఫిజీషియన్‌ను ఏర్పాటు చేసి తన లక్ష్యాల దిశగా సాగిపోతున్నారు. (18 ఏళ్లు పైబడిన వారికి టీకా: ఖర్చు ఎంతో తెలుసా?) డోజీ... రోగులను ఆన్లైన్ మాధ్యమంలో పర్యవేక్షించే సంస్థే డోజీ. కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ ఆధారితంగా ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తుంటుంది. ఆస్పత్రిలోని ఎటువంటి పడకనైనా నిమిషాల వ్యవధిలోనే తన టెక్నాలజీ సాయంతో ఐసీయూగా మార్చేయగలదు. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల పర్యవేక్షణలో కీలకమైన సేవలను అందిస్తోంది. ఈ దేశీయ స్టార్టప్ రోగికి సంబంధించి కీలక అవయవాల పనితీరును పర్యవేక్షిస్తుంటుంది. గుండె కొట్టుకునే రేటు, శ్వాస తీసుకునే రేటు, ఆక్సిజన్ శాచురేషన్(ఎస్పీవో2), నిద్ర తదితర అంశాలను పరిశీలిస్తూ వైద్యులకు చేదోడువాదోడుగా నిలుస్తోంది. గడిచిన రెండు వారాల్లోనే 30కు పైగా ఆస్పత్రులు డోజీ ప్లాట్‌ఫామ్‌తో ఒప్పందాలు చేసుకున్నాయంటే ఈ సంస్థ సేవల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం డోజీ 4,000 కరోనా హై డిపెండెన్సీ యూనిట్ (హెచ్‌డీయూ) పడకలను పర్యవేక్షిస్తోంది. (జొమాటో కొత్త ఫీచర్, దయచేసి మిస్ యూజ్ చేయకండి!) టెక్నాలజీ పాత్ర... ‘కరోనా రెండో విడతలో వేగంగా వ్యాపిస్తోంది. ఆస్పత్రులు ఆర్పీఎం, నూతన ఏఐ టెక్నాలజీల సాయంతో మహమ్మారిని ఎదుర్కొనే వ్యూహాలను అనుసరిస్తున్నాయి. రిమోట్‌గా రోగులను పర్యవేక్షించడం వల్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. సిబ్బంది కొరతను కూడా అధిగమించొచ్చు’ అని డోజీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు ముదిత్ దంద్వతే పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో రోగుల పర్యవేక్షణ సెల్‌లను ఈ సంస్థ ఏర్పాటు చేయడమే కాకుండా.. క్షేత్ర స్థాయిలో రోజులో 24 గంటలూ సహాయ, సహకారాలు అందిస్తోంది. బీ2బీ (బిజినెస్ నుంచి బిజినెస్ మధ్య వ్యాపారం) ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ/ఇంటర్నెట్ అనుసంధానిత సేవలు) సొల్యూషన్లను అందించే సెన్స్‌గిజ్ టెక్నాలజీస్.. తొలి దశ కరోనా సమయంలో వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో సేవలు అందించింది. ‘దేశవ్యాప్తంగా 5,000కు పైగా ఉద్యోగులకు మా సెన్స్‌గిజ్ సెంటినెల్ ప్లాట్‌ఫామ్ ద్వారా భౌతిక దూరం, ఎక్కడ ఉన్నదీ గుర్తించే సేవలను అందిస్తున్నాం. తద్వారా వ్యాపార కార్యకలాపాలు ఆటంకాల్లేకుండా సాయపడుతున్నాము. హార్డ్‌వేర్ (ఉద్యోగులకు రిస్ట్‌బ్యాండ్), సాఫ్ట్వేర్ కూడా ఈ సేవల్లో భాగంగా ఉంటాయి. ఇదే ప్లాట్‌ఫామ్ ద్వారా 2,500 మందికి పైగా ఐపీఎల్ యూజర్ల కోసం వర్చువల్ బయో బబుల్ జోన్‌నూ నెలకొల్పాం. తద్వారా ఆటగాళ్లు, వారికి సేవలు అందించే సిబ్బంది, మ్యాచుల అధికారుల భద్రత కు భరోసా ఇచ్చాం. ఇండియా–ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా ఇదే విధమైన సేవలు అందించాము. 1,0,000 మందికి పైగా జీవితాలపై మా ప్రభావం ఉంటుంది’అని సెన్స్విజ్ టెక్నాలజీస్ మార్కెటింగ్ హెడ్ కుల్దీప్ రాణే వివరించారు. (వ్యాక్సిన్ తరువాత పాజిటివ్ : ఐసీఎంఆర్ సంచలన రిపోర్టు) వీడియో కన్సల్టేషన్లు.. వైద్యులు, రోగుల మధ్య వీడియో సంప్రదింపులకు ‘ఎంఫైన్’ అనే ప్లాట్‌ఫామ్ సేవలు అందిస్తోంది. యాప్ ద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకునే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇటీవలే ఈ సంస్థ ఎంఫైన్ పల్స్ పేరుతో ఒక యాప్‌ను ఆవిష్కరించింది. దీని సాయంతో రక్తంలో ఆక్సిజన్ పరిమాణం (ఆక్సిజన్ శాచురేషన్/ఎస్పీవో2) ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని తమ ఎస్పీవో2ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవచ్చు. కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న తరుణంలో ఎస్పీవో2 ట్రాక్ టూల్‌ను వినియోగించే వారి శాతం పది రెట్లు పెరిగినట్టు ఈ సంస్థ పేర్కొంది. అలాగే, కరోనా స్వీయ పర్యవేక్షణ టూల్‌ను వినియోగించే వారు ఐదు రెట్లు, వీడియో కన్సల్టేషన్లు 80 శాతం పెరిగినట్టు తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి సంక్షోభంలో టెలిమెడిసిన్, డిజిటల్ ఆరోగ్య సంరక్షణ సేవలన్నవి సాధారణంగా మారిపోయాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, పర్యవేక్షణ, చికిత్సల ప్రణాళికల విషయంలో ఎంఫైన్ పల్స్ కీలకపాత్ర పోషిస్తోంది’’ అని ఎంఫైన్ సీటీవో అజిత్ నారాయణన్ పేర్కొన్నారు. -
ప్రమాదంలో ‘పరపతి’
సాక్షి, ఏలూరు : రైతు సంక్షేమం కోసం ఏర్పాటైన వ్యవసాయ సహకార సంఘాల ‘పరపతి’ప్రమాదంలో పడింది. వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటి ఉసురు తీసి జీవచ్ఛవాలుగా మార్చడాన్ని లక్షలాది మంది రైతులు, వందలాది మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. రైతులు, ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులకు రుణాలివ్వడంలో అవినీతికి పాల్పడుతున్నాయని ప్రభుత్వం సాకుగా చూపుతోంది. దీన్ని అడ్డుపెట్టుకుని వాటిని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. డీసీసీబీ బ్రాంచీల్లో సహకార సంఘాలను విలీనం చేసే విధంగా ప్రకాష్‌బక్షి కమిటీ చేసిన సిఫార్సులను అమ లు చేయడానికి సిద్ధమవుతుతోంది. ఈ సిఫార్సులను అమలు చేస్తే లక్షలాది మంది రైతులు రుణాలు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంఘా ల్లో పనిచేసే వందలాది మంది ఉద్యోగులు రోడ్డున పడతారు. జిల్లాలో 253 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వీటిలో దాదాపు వెయ్యిమంది సిబ్బంది పనిచేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్, రబీ పంట ల్లో సాగయ్యే 10 లక్షల ఎకరాలకు చెందిన రైతులు సహకార సంఘాల నుంచి రుణాలు తీసుకుం టారు. ఏటా సుమారు రూ.1500 కోట్ల రుణాలను సహకార సంఘాలు రైతులకు అందజేస్తున్నాయి. సుమారు రూ.1200కోట్లు డిపాజిట్లు వారి నుంచి సేకరిస్తున్నాయి. జిల్లాలో అత్యంత పటిష్టంగా ఉన్న సహకార వ్యవస్థ రైతుల ప్రయోజనాలను నెరవేరుస్తోంది. ప్రకాష్‌బక్షి కమిటీ సిఫార్సులు అమలైతే సహకార సంఘాలు ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన రుణాలు, సేకరించిన డిపాజిట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) బ్రాంచ్‌లకు బదిలీ అవుతాయి. రైతుల నుంచి వసూలు చేసిన షేర్ ధనాన్ని కూడా బదిలీ చేయడంతోపాటు ఇక నుంచి డిపాజిట్లు, రుణాలు అందించే అవకాశాన్ని సొసైటీలు వదులుకోవాల్సి ఉంది. కమీషన్లకే పరిమితం విలీనం అనంతరం సంఘాలు డీసీసీబీ బ్రాంచీల బిజినెస్ కరస్పాండెంట్స్‌గా కమీషన్ ప్రాతిపదికన వ్యవహరిస్తాయి. డీసీసీబీల తరపున రుణాలు ఇవ్వ డం, వసూలు చేయడం, డిపాజిట్లు సేకరించడం చేస్తే వాటిపై సంఘాలకు కమీషన్ అందజేస్తారు. సంఘాలు ఎరువులు, వ్యవసాయ ఉపకరణాలు అద్దెకివ్వడం, ధాన్యం గిడ్డంగులు అద్దెకు ఇచ్చుకోవడం తదితర వ్యాపారాలు మాత్రమే చేయాల్సి ఉంది. డీసీసీబీ బ్రాంచీల నుంచే రుణాలు సహకార సంఘాల అధికారాలను లాక్కుంటే రైతులు నేరుగా డీసీసీబీ బ్రాంచి నుంచే రుణాలు తీసుకోవాలి. ఈవిధానం వల్ల రైతులకు రుణాలు సత్వరమే అందించడం అంత సులభం కాదు. ప్రస్తుతం ఒక్కో మండలంలోనూ పదికిపైగా సహకార సంఘాలుండటంతో రుణాలు పొందడం తేలికగా ఉంది. డీసీసీబీల నుంచే రుణాలు తీసుకోవాలంటే సకాలంలో రుణాలు అందే అవకాశం ఉండదు. ఓటుహక్కు కోల్పోనున్న చిన్న రైతులు ప్రకాష్‌బక్షి సిఫార్సుతో చిన్నరైతులు ఓటు హక్కును కోల్పోనున్నారు. అప్పులు పొందే రైతులు, డిపాజిట్‌దార్లు డీసీసీబీలలో సభ్యులుగా ఉంటారు. ఏక్టివ్ సభ్యులకే ఓటు హక్కు ఉంటుంది. తీసుకునే అప్పు, దాన్ని తిరిగి చెల్లించడాన్ని బట్టి, డిపాజిట్ ఎంత మొ త్తం ఎంత కాలానికి వేశారనే దాన్ని బట్టి ఏక్టివ్ సభ్యులను నిర్ణయిస్తారు. రుణాలు సకాలంలో చెల్లించలేని చిన్న రైతులు ఓటు హక్కును కోల్పోతారు. ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు ప్రకాష్ బక్షి కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తూ సహకార ఉద్యోగ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. తమ ఆందోళనను తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. జిల్లాలోని సహకార సంఘాలు సోమవారం నుంచి మూడు రోజుల పాటు (16,17, 18తేదీల్లో) డీసీసీబీ బ్రాంచ్‌ల వద్ద నిరసన దీక్షలు, 19న డీసీపీబీ బ్రాంచ్‌ల ముట్టడి, 23న చలో హైదరాబాద్‌కు సిద్ధమయ్యాయి.