ప్రమాదంలో ‘పరపతి’
Published Tue, Sep 17 2013 3:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
సాక్షి, ఏలూరు : రైతు సంక్షేమం కోసం ఏర్పాటైన వ్యవసాయ సహకార సంఘాల ‘పరపతి’ప్రమాదంలో పడింది. వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటి ఉసురు తీసి జీవచ్ఛవాలుగా మార్చడాన్ని లక్షలాది మంది రైతులు, వందలాది మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. రైతులు, ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులకు రుణాలివ్వడంలో అవినీతికి పాల్పడుతున్నాయని ప్రభుత్వం సాకుగా చూపుతోంది. దీన్ని అడ్డుపెట్టుకుని వాటిని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. డీసీసీబీ బ్రాంచీల్లో సహకార సంఘాలను విలీనం చేసే విధంగా ప్రకాష్‌బక్షి కమిటీ చేసిన సిఫార్సులను అమ లు చేయడానికి సిద్ధమవుతుతోంది. ఈ సిఫార్సులను అమలు చేస్తే లక్షలాది మంది రైతులు రుణాలు పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంఘా ల్లో పనిచేసే వందలాది మంది ఉద్యోగులు రోడ్డున పడతారు.
జిల్లాలో 253 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వీటిలో దాదాపు వెయ్యిమంది సిబ్బంది పనిచేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్, రబీ పంట ల్లో సాగయ్యే 10 లక్షల ఎకరాలకు చెందిన రైతులు సహకార సంఘాల నుంచి రుణాలు తీసుకుం టారు. ఏటా సుమారు రూ.1500 కోట్ల రుణాలను సహకార సంఘాలు రైతులకు అందజేస్తున్నాయి. సుమారు రూ.1200కోట్లు డిపాజిట్లు వారి నుంచి సేకరిస్తున్నాయి. జిల్లాలో అత్యంత పటిష్టంగా ఉన్న సహకార వ్యవస్థ రైతుల ప్రయోజనాలను నెరవేరుస్తోంది. ప్రకాష్‌బక్షి కమిటీ సిఫార్సులు అమలైతే సహకార సంఘాలు ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన రుణాలు, సేకరించిన డిపాజిట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) బ్రాంచ్‌లకు బదిలీ అవుతాయి. రైతుల నుంచి వసూలు చేసిన షేర్ ధనాన్ని కూడా బదిలీ చేయడంతోపాటు ఇక నుంచి డిపాజిట్లు, రుణాలు అందించే అవకాశాన్ని సొసైటీలు వదులుకోవాల్సి ఉంది.
కమీషన్లకే పరిమితం
విలీనం అనంతరం సంఘాలు డీసీసీబీ బ్రాంచీల బిజినెస్ కరస్పాండెంట్స్‌గా కమీషన్ ప్రాతిపదికన వ్యవహరిస్తాయి. డీసీసీబీల తరపున రుణాలు ఇవ్వ డం, వసూలు చేయడం, డిపాజిట్లు సేకరించడం చేస్తే వాటిపై సంఘాలకు కమీషన్ అందజేస్తారు. సంఘాలు ఎరువులు, వ్యవసాయ ఉపకరణాలు అద్దెకివ్వడం, ధాన్యం గిడ్డంగులు అద్దెకు ఇచ్చుకోవడం తదితర వ్యాపారాలు మాత్రమే చేయాల్సి ఉంది.
డీసీసీబీ బ్రాంచీల నుంచే రుణాలు
సహకార సంఘాల అధికారాలను లాక్కుంటే రైతులు నేరుగా డీసీసీబీ బ్రాంచి నుంచే రుణాలు తీసుకోవాలి. ఈవిధానం వల్ల రైతులకు రుణాలు సత్వరమే అందించడం అంత సులభం కాదు. ప్రస్తుతం ఒక్కో మండలంలోనూ పదికిపైగా సహకార సంఘాలుండటంతో రుణాలు పొందడం తేలికగా ఉంది. డీసీసీబీల నుంచే రుణాలు తీసుకోవాలంటే సకాలంలో రుణాలు అందే అవకాశం ఉండదు.
ఓటుహక్కు కోల్పోనున్న చిన్న రైతులు
ప్రకాష్‌బక్షి సిఫార్సుతో చిన్నరైతులు ఓటు హక్కును కోల్పోనున్నారు. అప్పులు పొందే రైతులు, డిపాజిట్‌దార్లు డీసీసీబీలలో సభ్యులుగా ఉంటారు. ఏక్టివ్ సభ్యులకే ఓటు హక్కు ఉంటుంది. తీసుకునే అప్పు, దాన్ని తిరిగి చెల్లించడాన్ని బట్టి, డిపాజిట్ ఎంత మొ త్తం ఎంత కాలానికి వేశారనే దాన్ని బట్టి ఏక్టివ్ సభ్యులను నిర్ణయిస్తారు. రుణాలు సకాలంలో చెల్లించలేని చిన్న రైతులు ఓటు హక్కును కోల్పోతారు.
ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు
ప్రకాష్ బక్షి కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తూ సహకార ఉద్యోగ సంఘాలు ఆందోళన బాటపట్టాయి. తమ ఆందోళనను తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. జిల్లాలోని సహకార సంఘాలు సోమవారం నుంచి మూడు రోజుల పాటు (16,17, 18తేదీల్లో) డీసీసీబీ బ్రాంచ్‌ల వద్ద నిరసన దీక్షలు, 19న డీసీపీబీ బ్రాంచ్‌ల ముట్టడి, 23న చలో హైదరాబాద్‌కు సిద్ధమయ్యాయి.
Advertisement