నిత్యం లక్షలాదిగా పెరిగిపోతున్న కరోనా కేసులతో ఆస్పత్రులపై భారం పెరిగిపోతోంది. ఇటువంటి క్లిష్ట సమయాల్లో కరోనాను ఎదుర్కొనే విషయంలో స్టార్టప్‌లు బహుముఖ పాత్ర పోషిస్తుండడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అత్యాధునిక టెక్నాలజీల సాయంతో ఆస్పత్రులు, ప్రజలు, సంస్థలకు సాయపడుతున్నాయి. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో చేదోడుగా నిలుస్తున్నాయి. క్లౌడ్ ఫిజీషియన్ అనే స్టార్టప్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, లేహ్ లడక్, బిహార్, కోల్‌కతా, గుజరాత్ తదితర ప్రాంతాల్లో కరోనాతో తీవ్ర అనారోగ్యం బారిన పడిన 2,700 మంది రోగులు కోలుకునేందుకు తన వంతు పాత్ర పోషించింది. ఆస్పత్రులు, రోగులు, వైద్య నిపుణుల మధ్య అనుసంధానంతో మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ సంస్థ టెక్నాలజీ సాయపడింది.
క్లౌడ్ ఫిజీషియన్
‘‘భారత్‌లో 3 లక్షల ఐసీయూ (ప్రత్యేక వైద్య పర్యవేక్షణ) పడకలు ఉన్నాయి. కానీ వీటికి సంబంధించి అందుబాటులో ఉన్న ఐసీయూ వైద్యులు 5,000 మందే. దీంతో ఐసీయూ వైద్యంలో నైపుణ్యం ఉన్న డాక్టర్ల సేవలను అందరూ పొందలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు పరిష్కారం టెక్నాలజీ సాయాన్ని తీసుకోవడమే. ప్రస్తుతానికి 12 రాష్ట్రాల్లో మా సేవలు అందుబాటులో ఉన్నాయి. 25 ఆస్పత్రుల పరిధిలోని 250 ఐసీయూ బెడ్ల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నాము. మా టెక్ ప్లాట్‌ఫామ్ ‘రాడార్’ ద్వారా ఐసీయూ రోగుల పర్యవేక్షణకు సంబంధించి నర్సులు, జూనియర్ డాక్టర్లకు సాయపడుతున్నాము. రాడార్ ప్లాట్‌ఫామ్ అన్నది ఐసీయూ పడకలను మా కమాండ్ కేంద్రంతో అనుసంధానం చేస్తుంది. బెంగళూరులోని ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో బహుళ విభాగాల్లో నిష్ణాతులైన ఐసీయూ స్పెషలిస్టు వైద్యుల బృందం పనిచేస్తుంటుంది. వీరు ఎప్పటికప్పుడు చికిత్సలను పర్యవేక్షిస్తుంటారు’’ అని క్లౌడ్ ఫిజీషియన్ సహ వ్యవస్థాపకుడు ధృవ్‌జోషి తెలిపారు. వృత్తి రీత్యా జోషి పల్మనరీ, క్రిటికల్ కేర్ వైద్య నిపుణుడు కావడం గమనార్హం. క్రిటికల్ కేర్ వైద్య సేవలకు నిపుణుల కొరతను గుర్తించిన ఆయన ఈ దిశగా క్లౌడ్ ఫిజీషియన్‌ను ఏర్పాటు చేసి తన లక్ష్యాల దిశగా సాగిపోతున్నారు. (18 ఏళ్లు పైబడిన వారికి టీకా: ఖర్చు ఎంతో తెలుసా?)
డోజీ...
రోగులను ఆన్‌లైన్ మాధ్యమంలో పర్యవేక్షించే సంస్థే డోజీ. కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ ఆధారితంగా ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తుంటుంది. ఆస్పత్రిలోని ఎటువంటి పడకనైనా నిమిషాల వ్యవధిలోనే తన టెక్నాలజీ సాయంతో ఐసీయూగా మార్చేయగలదు. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల పర్యవేక్షణలో కీలకమైన సేవలను అందిస్తోంది. ఈ దేశీయ స్టార్టప్ రోగికి సంబంధించి కీలక అవయవాల పనితీరును పర్యవేక్షిస్తుంటుంది. గుండె కొట్టుకునే రేటు, శ్వాస తీసుకునే రేటు, ఆక్సిజన్ శాచురేషన్(ఎస్‌పీవో2), నిద్ర తదితర అంశాలను పరిశీలిస్తూ వైద్యులకు చేదోడువాదోడుగా నిలుస్తోంది. గడిచిన రెండు వారాల్లోనే 30కు పైగా ఆస్పత్రులు డోజీ ప్లాట్‌ఫామ్‌తో ఒప్పందాలు చేసుకున్నాయంటే ఈ సంస్థ సేవల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం డోజీ 4,000 కరోనా హై డిపెండెన్సీ యూనిట్ (హెచ్‌డీయూ) పడకలను పర్యవేక్షిస్తోంది. (జొమాటో కొత్త ఫీచర్, దయచేసి మిస్ యూజ్ చేయకండి!)
టెక్నాలజీ పాత్ర...
‘కరోనా రెండో విడతలో వేగంగా వ్యాపిస్తోంది. ఆస్పత్రులు ఆర్‌పీఎం, నూతన ఏఐ టెక్నాలజీల సాయంతో మహమ్మారిని ఎదుర్కొనే వ్యూహాలను అనుసరిస్తున్నాయి. రిమోట్‌గా రోగులను పర్యవేక్షించడం వల్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. సిబ్బంది కొరతను కూడా అధిగమించొచ్చు’ అని డోజీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు ముదిత్ దంద్‌వతే పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో రోగుల పర్యవేక్షణ సెల్‌లను ఈ సంస్థ ఏర్పాటు చేయడమే కాకుండా.. క్షేత్ర స్థాయిలో రోజులో 24 గంటలూ సహాయ, సహకారాలు అందిస్తోంది. బీ2బీ (బిజినెస్ నుంచి బిజినెస్ మధ్య వ్యాపారం) ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ/ఇంటర్నెట్ అనుసంధానిత సేవలు) సొల్యూషన్లను అందించే సెన్స్‌గిజ్ టెక్నాలజీస్.. తొలి దశ కరోనా సమయంలో వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో సేవలు అందించింది. ‘దేశవ్యాప్తంగా 5,000కు పైగా ఉద్యోగులకు మా సెన్స్‌గిజ్ సెంటినెల్ ప్లాట్‌ఫామ్ ద్వారా భౌతిక దూరం, ఎక్కడ ఉన్నదీ గుర్తించే సేవలను అందిస్తున్నాం. తద్వారా వ్యాపార కార్యకలాపాలు ఆటంకాల్లేకుండా సాయపడుతున్నాము. హార్డ్‌వేర్ (ఉద్యోగులకు రిస్ట్‌బ్యాండ్), సాఫ్ట్‌వేర్ కూడా ఈ సేవల్లో భాగంగా ఉంటాయి. ఇదే ప్లాట్‌ఫామ్ ద్వారా 2,500 మందికి పైగా ఐపీఎల్ యూజర్ల కోసం వర్చువల్ బయో బబుల్ జోన్‌నూ నెలకొల్పాం. తద్వారా ఆటగాళ్లు, వారికి సేవలు అందించే సిబ్బంది, మ్యాచుల అధికారుల భద్రత కు భరోసా ఇచ్చాం. ఇండియా–ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా ఇదే విధమైన సేవలు అందించాము. 1,0,000 మందికి పైగా జీవితాలపై మా ప్రభావం ఉంటుంది’అని సెన్స్‌విజ్ టెక్నాలజీస్ మార్కెటింగ్ హెడ్ కుల్‌దీప్ రాణే వివరించారు. (వ్యాక్సిన్ తరువాత పాజిటివ్ : ఐసీఎంఆర్ సంచలన రిపోర్టు)
వీడియో కన్సల్టేషన్లు..
వైద్యులు, రోగుల మధ్య వీడియో సంప్రదింపులకు ‘ఎంఫైన్’ అనే ప్లాట్‌ఫామ్ సేవలు అందిస్తోంది. యాప్ ద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకునే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇటీవలే ఈ సంస్థ ఎంఫైన్ పల్స్ పేరుతో ఒక యాప్‌ను ఆవిష్కరించింది. దీని సాయంతో రక్తంలో ఆక్సిజన్ పరిమాణం (ఆక్సిజన్ శాచురేషన్/ఎస్‌పీవో2) ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని తమ ఎస్‌పీవో2ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవచ్చు. కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న తరుణంలో ఎస్‌పీవో2 ట్రాక్ టూల్‌ను వినియోగించే వారి శాతం పది రెట్లు పెరిగినట్టు ఈ సంస్థ పేర్కొంది. అలాగే, కరోనా స్వీయ పర్యవేక్షణ టూల్‌ను వినియోగించే వారు ఐదు రెట్లు, వీడియో కన్సల్టేషన్లు 80 శాతం పెరిగినట్టు తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి సంక్షోభంలో టెలిమెడిసిన్, డిజిటల్ ఆరోగ్య సంరక్షణ సేవలన్నవి సాధారణంగా మారిపోయాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, పర్యవేక్షణ, చికిత్సల ప్రణాళికల విషయంలో ఎంఫైన్ పల్స్ కీలకపాత్ర పోషిస్తోంది’’ అని ఎంఫైన్ సీటీవో అజిత్ నారాయణన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment