కరోనా ప్రమాద ఘంటికలు.. తెలుసుకోవాల్సిన విషయాలు | Myths And Facts About Corona Are As follows | Sakshi
Sakshi News home page

కరోనా ప్రమాద ఘంటికలు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

Published Tue, Mar 30 2021 3:27 AM | Last Updated on Tue, Mar 30 2021 9:26 AM

Myths And Facts About Corona Are As follows - Sakshi

సంవత్సర కాలంగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు బలిగొంది. కరోనాకు టీకాలు కనుగొన్నా అన్ని దేశాల్లో ఇంకా హెర్డ్‌ ఇమ్యూనిటీ స్థాయిలు రాలేదు. మరోవైపు కరోనా సెకండ్‌వేవ్‌ పలు దేశాల్లో ఆరంభమై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా బయటపడినప్పటినుంచి ఈ వైరస్‌ను ఫలానా ఫలానా వాటితో నిర్మూలించవచ్చంటూ రకరకాలు అపోహలు బయలుదేరాయి. వీటిలో కొన్ని కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు సాయపడినా, వైరస్‌ను పూర్తిగా నిర్మూలిస్తాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిపుణులు. కరోనాపై అపోహలు, వాస్తవాల గురించి ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి..  

అపోహ: విటమిన్‌ ‘సి’లేదా జింక్‌ కరోనా నుంచి రక్షిస్తుంది..
వాస్తవం: సిట్రస్‌ జాతి పండ్లయిన నిమ్మ, నారింజ, బత్తాయి వంటి వాటిని ఏ రూపంలో తీసుకున్నా వాటిలోని విటమిన్‌ ‘సి’ ప్రధానంగా శ్వాసకోశ సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. అలాగే జింక్‌ను తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కరోనా తగ్గుతుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. 

అపోహ: శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కోవచ్చు.
వాస్తవం: వేడి నీటిని తాగడం, పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు తినడంద్వారా శరీర ఉష్ణోగ్రతను పెంచుకొని తద్వారా కరోనాను ఎదుర్కోవచ్చనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే కరోనా వ్యాధి రాకుండా శరీర ఉష్ణోగ్రతను మార్చుకోవడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) అయితే ఈ అపోహపై కాస్త హాస్యాస్పదంగా స్పందించింది. ఇలా వేడినీటిని అధికంగా తాగడం వలన తమను తాము కాల్చుకునే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది.

అపోహ: వెల్లుల్లిని తరచూ తింటే కరోనా వైరస్‌ నుంచి రక్షించుకోవచ్చు.
వాస్తవం: వెల్లుల్లిలో శరీరానికి ఉష్ణాన్నిచ్చే కారకాలు ఉంటాయి. అలాగే కొన్ని యాంటిమైక్రోబియల్‌ గుణాలున్న కారకాలూ ఉంటాయని పరిశోధనల్లో తేలింది. లవంగంలోనూ ఇలాంటి యాంటీ ఇన్ఫెక్టివ్‌ లక్షణాలుంటాయి. కానీ ఇవి కరోనాను సంపూర్ణంగా ఎదుర్కొంటాయని చెప్పటానికి ఎలాంటి శాస్త్రీయ డేటా లేదు.

అపోహ: సెలైన్‌తో ముక్కును కడిగితే కరోనా వైరస్‌ను బయటకు తీయొచ్చు.
వాస్తవం: మన నాసికా రంధ్రాలను సెలైన్‌తో కడగడం వల్ల కరోనా వైరస్‌ను బయకు పారదోలవచ్చనేది మరికొంత మంది నమ్మే అపోహ. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవని, నిజానికి సెలైన్‌ను అధికంగా ఉపయోగిస్తే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని, శరీరంలో సహజంగా ఉండే వ్యాధి నిరోధక శక్తి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అపోహ: శరీరంపై మందుల పిచికారీతో కరోనా దరిచేరదు! 
వాస్తవం: చేతులను తరచూ శానిటైజ్‌ చేసుకుంటే చాలు కరోనా దరి చేరదని చాలా మంది అనుకుంటున్నారు. అయితే, కేవలం చేతులనే కాదు.. శరీరం మొత్తం క్రిమిసంహారక మందులతో పిచికారీ చేసుకున్నా కరోనా సోకే ప్రమాదం ఉందన్నది నిపుణుల మాట. అంతేకాదు, ఈ క్రిమిసంహారక స్ప్రే, శానిటైజర్లను అతిగా వాడితే కరోనా కంటే ముందు వేరే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. అందుకే, ఇలాంటి క్రిమిసంహారక మందులను అధికంగా వాడే బదులుæ శుభ్రత, సామాజిక దూరంలాంటి జాగ్రత్తలు పాటించడం మంచిది.

అపోహ: మినరల్స్‌ ప్రయోగాలతో కరోనా మాయం!
వాస్తవం: యూట్యూబ్‌ పుణ్యమా అని ప్రతి ఒక్కరూ ఆహార నిపుణులుగా మారిపోతున్నారు. ‘ఫలానా వాటిలో ఫలానా.. వాటిని కలిపి తింటే మీ దగ్గరకు కరోనా దరిచేరదని’ కొంతమంది కల్లబొల్లి కబుర్లు చెబుతుంటారు. ఆహార పదార్థాలన్నింటిలోనూ విటమిన్స్, మినరల్స్‌ ఉండటం నిజమే. అయితే కొన్ని కొన్ని ఆహారపదార్థాల కలయిక ఔషధం కంటే విషాన్ని తయారు చేయగలదు. ఉదాహరణకు ఆపిల్‌ గింజల పొడి విషఫూరితమని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే.. వివిధ మసాలా దినుసుల వాసన కూడా శ్యాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. తెలిసీ తెలియక చేసే ఇలాంటి మినరల్స్‌ ప్రయోగాలు ప్రాణాలకు ప్రమాదం. కాబట్టి, యాట్యూబ్‌ చానల్స్‌ చెప్పే అన్నింటినీ నమ్మొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అపోహ: వేడి వాతావరణం వైరస్‌ను చంపేస్తుంది!
వాస్తవం: మనిషి శరీరం నీరు, నిప్పులకు స్పందించినట్లే ఈ కరోనా వైరస్‌ కూడా స్పందించగలదని చాలా మంది భావన. దీంతో, చాలా మంది ‘ఈ వేసవిలో మనుషులే ఎండదెబ్బ తగిలి చనిపోతుంటే.. వైరస్‌ ఎంత?’ అంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజానికి వేడి, తేమతో సహా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రదేశాల్లోనూ కరోనా కేసులను ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నిర్ధారించింది. అంతేకాదు, ఈ స్థితిగతులకు కరోనా ఏ విధంగానూ స్పందించలేదని కూడా ప్రకటించింది. కాబట్టి, ఇలాంటి అపోహలు పెట్టుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 

అపోహ: యాంటీ బయోటిక్స్‌తో కరోనా దూరం!
వాస్తవం: సహజంగానే ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత వ్యాధినిరోధక శక్తి ఉంటుంది. ఫలితంగానే జలుబు వంటి కొన్ని చిన్న చిన్న వ్యాధులు ఎలాంటి మందులూ వాడకుండానే నయమవుతుంటాయి. ఇలాగే కొన్ని వ్యాధులను ఎదుర్కొనేందుకు మనలోని శక్తిని పెంపొందించేలా మార్కెట్‌లో వివిధ రకాల యాంటీబయోటిక్స్‌ లభ్యమవుతున్నాయి. అలాగని, ప్రతి వ్యాధికీ ఇవి పనిచేయవు. ఈ విషయం తెలియక చాలామంది కరోనాను ఎదురించేందుకు, వారిలోని శక్తిని కృత్తిమంగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా యాంటీబయోటిక్స్‌ మందులను వాడటం ద్వారా కరోనాను అరికట్టలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

చేయాల్సిందేంటంటే..
కరోనా వైరస్‌ మహమ్మారి కథ ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకోవడం కంటే, మీ ఆరోగ్యాన్ని కాపాడే మార్గాలను తెలుసుకోవడం ముఖ్యం. ఇందుకు మూడు విధానాలు ఉన్నాయి. 

శక్తి : 
సహజంగా రోగనిరోధక వ్యవస్థను బాగా పనిచేసేలా చూసుకోవడం. దీనికోసం చక్కని ఆహార, జీవన అలవాట్లను పాటించడం అవసరం. ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయమం చేయాలి. అలాగే తగినంత నిద్ర పోవాలి, కాబట్టి ఎలాంటి ఒత్తిడికీ లోనుకాకుండా చూసుకోవాలి. 

శుభ్రత : 
రోజూ స్నానం చేయడం, తినే ముందు, తర్వాత చేతులను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటితో పాటు ఇతర వ్యక్తులను, వస్తువులను తాకినపుడు లేదా బయటకు వెళ్లి వచ్చినప్పుడు చేతులను, కాళ్లను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. కేవలం మిమ్మల్నే కాదు, చుట్టూ ఉండే పరిసరాలను, వస్తువులను కూడా శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.

సామాజిక దూరం : 
కరోనా ఒక అంటువ్యాధి. అందుకే, వ్యక్తులతో తగినంత దూరం పాటించడం ముఖ్యం. అంతేకాదు, తినేటపుడు, తాగేటపుడు, మినహా అన్నివేళలా మాస్క్‌ ధరించాలి. అలాగే తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఈ మూడు దశలను చక్కగా పాటిస్తూ కరోనా బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement