ఓ కుదుపు కుదిపింది... కరోనా! | Coronavirus After Human Health Life And Lifestyle | Sakshi
Sakshi News home page

కరోనా తర్వాత లైఫ్‌ అండ్‌ లైఫ్‌ స్టైల్‌

Published Thu, Aug 20 2020 10:49 AM | Last Updated on Thu, Aug 20 2020 12:48 PM

Coronavirus After Human Health Life And Lifestyle - Sakshi

ప్రపంచం అంతా దాదాపు 1950–60ల వరకు అంటువ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉండేది. కలరా, ప్లేగు వంటి ఎపిడమిక్స్‌ తరచూ జనాభాను తుడిచిపెడుతూ ఉండేవి. దాంతో ఆ కాలాన్ని కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ యుగంగా నిపుణులు అభివర్ణిస్తుండేవారు. మొట్టమొదటిసారిగా 1928లో అలగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ ‘పెన్సిలిన్‌’ అనే యాంటీబయాటిక్‌ కనిపెట్టడం... ఆ తర్వాత 1950–60 ల వరకు కొత్త కొత్త యాంటీబయాటిక్స్‌ రావడంతో ప్రపంచ ఆరోగ్య చరిత్రలోనే ఓ విప్లవం చోటు చేస్తుంది. 1970ల నుంచి అడపాదడపా తప్ప ప్రజలంతా కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ అనే జబ్బులను క్రమంగా మరచిపోసాగారు. కొన్ని మినహాయింపులు తప్ప చాలావరకు మరచిపోయారు కూడా. ఆ ‘కమ్యూనికబుల్‌ డిసీజెస్‌’ స్థానాన్ని క్రమంగా ‘లైఫ్‌స్టైల్‌ డిసీజెస్‌’ ఆక్రమించుకోవడం మొదలైంది.

1970వ పడి నుంచి ప్రజల కొనుగోలుశక్తి క్రమంగా పెరుగుతూ పోతుండటం... ఆ పరిణామం కారణంగా మనం తినే తిండి, ఉండే తీరు మారడం, దాదాపు గా వృత్తులన్నీ మారిపోయి ప్రజలందరూ శారీరక శ్రమ నుంచి దూరంకావడం... ఇలాంటి పరిణామాల కారణంగా ప్రజలందరి జీవనశైలి లో మార్పులు వచ్చింది. దాంతో ‘లైఫ్‌స్టైల్‌ వ్యాధులు’ అని పిలుచుకునే డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌... వాటి కారణంగా వచ్చే ఇతరత్రా సమస్యలే ప్రపంచాన్ని ఆక్రమించాయి. వైద్యరంగమంతా ఇలా సాఫీగా లైఫ్‌స్టైల్‌ వ్యాధులకు చికిత్స చేసుకుంటూ, ఆ వ్యాధులతో వచ్చే ఇతర అనర్థాలూ, వాటి కారణంగా వచ్చే జబ్బులకు అడ్వాన్స్‌డ్‌ చికిత్సలు కనిపెడుతూ ఉండగా... ప్రపంచ ఆరోగ్యవ్యవస్థనంతటినీ ఓ కుదుపు కుదిపింది... కరోనా! ప్రపంచాన్ని దాదాపు వందేళ్ల కిందినాటి పరిస్థితికి తీసుకెళ్లింది. ఇప్పుడు కరోనా వచ్చాక... దాంతో మనం సహజీవనం చేస్తూ, ఆ పరిస్థితికి అలవాటు పడ్డా మన జీవనశైలిలో మార్పులు అవసరమని చెబుతున్నారు వైద్యనిపుణులు. అవి ఎలా ఉండాలో, ఆ సూచనలేమిటో, అవి ఎందుకు అవసరమో అనే విషయాలపై అవగాహన పెంచుకుందాం. 

పౌష్టికాహారం తీసుకోండి:
కోవిడ్‌–19 ప్రబలుతున్న నాటి నుంచి ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా మంచి సమతులాహారం తీసుకోవడం అవసరమని ప్రజలంతా గ్రహించారు. దానికి తగ్గట్లే... వారంలో రెండు రోజులైనా మాంసాహారం లేదా శాకాహారులైతే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటున్నారు. ఇదే అలవాటును ఇప్పుడు ఆ తర్వాత కూడా కొనసాగించడం మంచిది. 

విటమిన్లు, జింక్, మినరల్స్‌ ఎక్కువగా 
ఇటీవల వ్యాధి నిరోధకశక్తి కోసం అన్ని విటమిన్లతో పాటు ముఖ్యంగా విటమిన్‌–సి ఉండే పండ్లూ, పదార్థాలతో పాటు జింక్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలన్న విషయాన్ని దాదాపు ప్రజలందరూ పాటిస్తున్నారు. ఇలా విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థం, ఇతర పోషకాలు తీసుకుంటూ ఉండటం అన్నది చాలామంది ప్రజలకు ఇప్పటికే అలవాటైనందున... కోవిడ్‌ ప్రభంజనం ముగిశాక కూడా దాన్ని కొనసాగించడం మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. 

బరువు తగ్గించుకోండి
ఇటీవల యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌లో దాదాపు మూడు లక్షల మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో స్థూలకాయం కూడా కోవిడ్‌–19 తీవ్రత ఎక్కువగా ఉండటానికి ఒక కారణమని నిశ్చయంగా తేలిపోయింది. సాధారణ బరువుండే వారితో పోలిస్తే ఎక్కువ బరువుండే వారిలో కరోనా వైరస్‌ తీవ్రత దాదాపు 40% ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. స్థూలకాయం వల్ల ఇటు లైఫ్‌స్టైల్‌ డిసీజెస్‌ అయిన హైపర్‌ లిపిడేమియా, అధిక రక్తపోటు, టైప్‌–2 డయాబెటిస్‌కు దోహదపడతాయి. అంటే బరువును నియంత్రించుకోవడం అన్న ఒకే ఒక్క చర్య ద్వారా అటు కమ్యూనికబుల్‌ డిసీజ్‌ ఇటు లైఫ్‌స్టైల్‌ డిసీజెస్‌ కూడా నియంత్రణలో ఉంటాయని తెలిసిపోవడం లేదా. అందుకే సరైన ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ (బి.ఎం.ఐ) ఉండేలా బరువు అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. 

కొలెస్ట్రాల్‌ తగ్గించుకోండి
కరోనా వల్ల వచ్చే కోవిడ్‌–19 కారణంగా రక్తనాళాల్లో క్లాట్‌ పెరగడం జరుగుతుందని అధ్యయనాల్లో నిర్ద్వంద్వంగా తేలిపోయింది. కోవిడ్‌–19 రోగుల్లో కొంతమందికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి అది మరణానికి సైతం దారి తీయడానికి ఇదే కారణం. అందుకే కేలరీలు మాత్రం తక్కువుండే ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, చేపలు, కాయధాన్యాలు తినాలి. మనం తినే ఆహారంలో కొలెస్ట్రాల్‌ మోతాదులను తగ్గించుకోవాలి. అందుకు వీలుగా కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వులు పెరిగేలా గుడ్లు, కోల్డ్‌ప్రెస్‌డ్‌ ఆయిల్స్‌ వంటివి వాడుకోవాలి. శ్యాచురేటెడ్‌ కొవ్వు పదార్థాల లాంటివి అంటే... నెయ్యి వంటివి ఎక్కువగా తినకూడదు. 

రోజూ శారీరక  శ్రమ చేయండి
రోజూ కనీసం సగటున 45 నిమిషాల పాటైనా వ్యాయామం చేయాలి. వారానికి కనీసం అయిదారు రోజులైనా వ్యాయామాన్ని కొనసాగించాలి. వ్యాధి నిరోధకతకు ఇదెంతో అవసరం. 

స్ట్రెస్‌ తగ్గించుకోండి
వ్యాధి నిరోధకత పెరగడానికి ఒత్తిడి లేని జీవితం ఎంతో అవసరం. కోవిడ్‌–19 బారిన పడ్డప్పటికీ... కోలుకున్న వారంతా ఒత్తిడిని తగ్గించుకుంటూ, వ్యాధి పట్ల భయాన్ని అదుపులో పెట్టుకుని జాగ్రత్త పడ్డవాళ్లేనని కోవిడ్‌ విజేతల మాటలను బట్టి తెలుస్తోంది. కోలుకునేందుకు అవకాశాలున్నవారు కూడా అనవసర ఒత్తిడి కారణంగా... ప్రమాదకరమైన స్థితికి వెళ్లడాన్ని కూడా వైద్యనిపుణులు గుర్తించారు. 

పొగ తాగడం మానండి
కోవిడ్‌–19 వచ్చిన కొత్తలో అది ప్రధానంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిగా పరిగణించారు. ఆ తర్వాత అది రక్తనాళాల్లో క్లాట్స్‌ను పెంపొందించి ‘ఎంబాలిజమ్‌’ ద్వారా ప్రాణాలు తీసే రక్తప్రసరణ వ్యాధిగానూ పరిగణించడం మొదలు పెట్టారు. పొగతాగడం అన్నది అటు ఊపిరితిత్తులను బలహీనపరచడానికీ, ఇటు రక్తంలో క్లాట్స్‌ను పెంచడానికి దోహదపడుతుంది. అందుకే పొగ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. మీ ఇంట్లో ఎవరికైనా ఆ అలవాటు ఉంటే దాన్ని మాన్పించండి. 

మద్యపానం మానేయండి
మద్యం ఎలాగూ వ్యాధి నిరోధకశక్తిని తగ్గిస్తుంది. పైగా ఇక్కడ ఒక చిక్కుంది. మద్యం తాగేటప్పుడు సాధారణంగా మద్యపానప్రియులు వాడే ఐస్‌క్యూబ్స్, చల్లటినీరు, చల్లటిసోడా... ఇవన్నీ ఛాతీలోని ఇబ్బందులనూ, కఫాన్ని, దగ్గు వంటి కరోనా సంబంధిత లక్షణాల (అసోసియేటెడ్‌ సింప్టమ్స్‌)ను పెంచే అవకాశాలు ఎక్కువ. అది కరోనా కాకపోయినా... ఈ లక్షణాలున్నవారిని ఇప్పుడు సమాజం ఎలా చూస్తుందో అందరికీ తెలిసిందే. అందుకే మద్యం మానేయడమే మంచిది. 

కషాయాల్లో దినుసుల మోతాదు తగ్గించాలి
ఇప్పుడు మనలో చాలామంది కరోనాను ఎదుర్కొనేందుకు కషాయాలను విరివిగా తాగుతున్నాం. ఈ కషాయాల్లో మనం మిరియాలూ, లవంగాలూ, యాలకులు, వాము, జిలకర, అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, ధనియాలు, పసుపు వంటి వాటితో పాటు ‘కలోంజీ’ వంటి మరికొన్ని రకాల దినుసులూ వాడుతున్నాం. అయితే తమకు వెన్వెంటనే వ్యాధినిరోధకత సమకూరాలంటూ కొంతమంది కషాయాల్లో ఉపయోగించే దినుసుల మోతాదులను చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. దాంతో కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు ముప్పు వచ్చినట్టుగా... కషాయాలు తాగేవారిలో గ్యాస్ట్రో ఇంటస్టినల్‌ సమస్యలు పెరుగుతున్నాయి. వాటిని నివారించేందుకు కషాయాల్లోని దినుసులను చాలా చాలా పరిమితంగా మాత్రమే వాడాలి. వాటిని వైద్యపరంగా ఉపయోగం కలిగే మోతాదులో అంటే ‘మెడిసినల్‌ డోసెస్‌’లాగే వాడాలన్నమాట. కషాయంలో ఏ దినుసు ఉపయోగించినా అది చిటికెడంతే వాడితే మేలు అని గ్రహించండి. 

మరికొన్ని కీలక ప్రదేశాల్లో మార్పులిలా...
మనం మన రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా నిత్యం వ్యవహరించే ప్రదేశాల్లో పాటించాల్సిన ముఖ్యమైన జీవనశైలి మార్పులివి... 

పనిచేసే చోట 
ప్రతి వ్యక్తీ ఇంటి తర్వాత ఎక్కువసేపు గడిపేది తన కార్యస్థలంలోనే. ఇక్కడ భౌతిక దూరం పాటించడం చాలా అవసరం. మునుపటి కంటే వ్యక్తుల కుర్చీల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో పాటు వాటినీ, మీటింగ్‌ రూమ్స్‌నూ డిస్‌ఇన్ఫెక్ట్‌ చేసి ఉండటం చాలా ముఖ్యం. 

స్కూళ్లు 
పాఠశాలలు, కాలేజీలు తెరిచాక... స్కూలుకు వచ్చే పిల్లలూ, టీచర్లు, ఇతర సిబ్బందికి స్కూలు ఆవరణలోకి ప్రవేశించే ముందరే థర్మల్‌ స్క్రీనింగ్‌ వంటి పరీక్షలు నిర్వహించాలి. పిల్లవాడికి ఏమాత్రం నలతగా ఉన్నా అతడిని అనుమతించకూడదు. స్కూల్‌ వ్యాన్‌లో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి ఉండటం అవసరం. 

ఈ–లెర్నింగ్‌ / ఆన్‌లైన క్లాసుల విషయంలోసుదీర్ఘకాలం పాటు పిల్లలు స్క్రీన్‌ను చూస్తుండటం, అందుకోసం పిల్లలు అదేపనిగా చాలాసేపు కూర్చుండటం వంటివి వారికి చెరుపు చేస్తాయి. పిల్లల నిద్రసమయాన్ని తగ్గిస్తాయి. అందుకే ఆన్‌లైన్‌ క్లాసుల ఈ వ్యవధిని గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. 

ప్రయాణాల్లో ...
మీటింగ్స్‌ అన్నీ జూమ్‌ ద్వారానే నిర్వహితమవుతున్నందున దాదాపుగా బిజినెస్‌ లేదా ఇతరత్రా ప్రయాణాలు చాలావరకు తగ్గాయి, తగ్గుతాయి. అయితే ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే వాహనాన్ని ముందే బాగా డిజ్‌ఇన్ఫెక్ట్‌ చేయాలి. వాహనం లోపల కూడా ఒక్కక్కరూ ఒకరి నుంచి మరొకరు వీలైనంత దూరంగా ఉండాలి. 

షాపింగ్‌ మాల్స్‌ 
ఇప్పటికే షాపింగ్‌ మాల్స్‌ తమ వంతుగా థర్మల్‌ స్క్రీనింగ్స్‌ అనుసరించడం, లోపలికి రాగానే కొనుగోలుదారులు అక్కడి వస్తువులు (ప్రాడక్ట్స్‌) ముట్టుకున్నప్పుడు ఎక్కడికక్కడే శానిటైజింగ్‌ చేసుకునేలా శానిటైజర్లు ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు. దీనికితోడు బిల్లింగ్‌ ప్రదేశాల వంటి చోట క్యూ పాటిస్తున్నప్పుడు ఒకరి నుంచి మరొకరు వీలైనంత దూరాలు పాటించడం అవసరం. 

ఆటల విషయంలో...
ఇటీవల ఐపీఎల్‌ వంటి మ్యాచ్‌లు చూడలేకపోతున్నాం అంటూ స్పోర్ట్స్‌ ప్రియులు వాపోతున్నారు. అయితే వీలైనంత వరకు క్రీడల్ని ఇంట్లో ఉంటూ టీవీల్లో చూడటమే మంచిదన్నది వైద్యనిపుణుల అభిప్రాయం. ఇక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ... ఆటల్లో పాల్గొనేవారు సైతం అతిసమీపంగా వెళ్లి ప్రత్యర్థిని పట్టుకునే కబడ్డీ వంటి ఆటలు కాకుండా... ఆటగాళ్లు ఒకరికొకరు కాస్త దూరం దూరంగా ఉంటూనే ఆడగలిగే క్రికెట్‌ వంటివి ఆడటమే మంచిది. 

ఏం తినాలి? ఏం తాగాలి? ఎలా ఉండాలి? 

  • ప్రోటీన్‌ కోసం వైట్‌మీట్‌ అంటే చికెన్, చేపలు మాత్రమే తీసుకోండి. చేపల్లో సాల్మన్‌ ఫిష్‌ లాంటివి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని నివారిస్తాయి. ఇందులో కొవ్వులను తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. 
  • పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం మేలు. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి కోవిడ్‌–19 అన్నది కొంతమందిలో చిన్నపేగుల పైన, జీర్ణవ్యవస్థపైనా ప్రభావం చూపడం జరుగుతుంది. పీచుపదార్థాలు జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అదేసమయంలో ఇవి ఆహారం ప్రయాణం చేసే మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేస్తూ, కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. దాంతో రక్తపు క్లాట్స్‌ వచ్చే అవకాశాలూ తగ్గుతాయి. పొట్టుతోనే ఉన్న అన్ని రకాల కాయధాన్యాల వల్ల పీచు ఎక్కువగా సమకూరుతుంది. అవిసె గింజలు (ఫ్లాక్స్‌ సీడ్స్‌)లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు పీచు పదార్థం కూడా ఎక్కువే. 
  • విటమిన్‌ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల లాంటి నిమ్మజాతి పండ్లు తినాలన్న అవగాహన ఇటీవల మనందరిలోనూ పెరిగిపోయింది. అలాగే నిమ్మ, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లు కూడా. అయితే, ఈ పండ్లను ఉపయోగించి తయారు చేసుకునే పండ్ల రసాల్లో మళ్లీ పంచదార కలుపుకోకూడదు. 
  • బాదంపప్పు, అక్రోటు కాయలు (వాల్‌నట్స్‌), వేరుసెనగ లాంటి నట్స్‌ను తగు మోతాదులో తినాలి. 
  • రోజూ రెండు కప్పుల గ్రీన్‌ టీ తాగడం మేలు. 
  • చివరగా... అన్నిటికంటే ముఖ్యంగా... పైన చెప్పిన సూచనలన్నింటికీ తోడు నిత్యం ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలి. ఇందుకోసం హాస్యభరితమైన పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటంతోపాటు... భౌతిక దూరం (ఫిజికల్‌ డిస్టాన్స్‌) స్నేహితులూ, మన శ్రేయోభిలాషులూ వంటి వారిని తరచూ ఫోన్లలో పలకరిస్తూ, అందరితో బాగా ఉంటూ... వీలైనంత వరకు అందరికీ మేలు చేస్తూ ఉండటం లాంటి లైఫ్‌స్టైల్‌ ఈ కరోనా అనంతర జీవితంలోనూ అవసరమన్నది నిపుణుల సూచన.  -డాక్టర్‌ శరత్‌రెడ్డి సీనియర్‌ కన్సల్టెంట్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement