వేగవంతమైన పట్టణీకరణ, అభివృద్ధి చెందుతున్న జీవనశైలి కారణంగా భారతదేశంలో అద్దె ఇళ్ల భావన ఎక్కువైంది. దేశంలో చాలామంది అద్దె ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. అద్దె ఇళ్లతో అనేక రకాల సౌలభ్యాలు ఉంటాయి. ఇంటి యజమానులతో పోలిస్తే అద్దెకు ఉండే వారికి బాధ్యతలు తక్కువగా ఉన్నప్పటికీ.. వారితో అద్దెకు ఉంటున్నవారికీ ఓ బాధ్యత ఉంది. అదే హోమ్ ఇన్సూరెన్స్. అదేంటి హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి ఓనర్‌కు సంబంధించింది కదా.. దీంతో అద్దెకు ఉంటున్నవారికి పనేంటి అనుకోవద్దు.. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి యజమానికి ఎంత అవసరమో.. అద్దెకుంటున్నవారికీ అంతే అవసరం. అది ఎందుకు.. ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వస్తువుల రక్షణ
ఇళ్లలో అద్దెకుండేవారు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ముఖ్యమైన కారణం ఇది. ఈ హోమ్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత వస్తువులు అంటే టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నీచర్, దుస్తులతోపాటు ఇతర విలువైన వస్తువులకు రక్షణ కల్పిస్తుంది.
ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు, అగ్నిప్రమాదం, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దెబ్బతిన్న లేదా చోరీకి గురైన వస్తువులకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కొత్తవాటిని కొనుగోలు లేదా మరమ్మతుకు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది.
ఆస్తుల డ్యామేజీ కవరేజ్
వస్తువుల రక్షణతోపాటు ఇంటి ఆస్తుల రక్షణను ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అద్దెదారు అనుకోకుండా ఇంటి ఆస్తిని పాడు చేసినట్లయితే, అంటే కిచెన్‌లో మంటలు ఏర్పడి ఇంటికి సంబంధించిన వస్తువులు దెబ్బతింటే ఆ నష్టాన్ని ఓనర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. ఇలాంటి ప్రమాదాల్లో గాయపడిన ఇంట్లోకి వారికి బీమా వర్తిస్తుంది.
తాత్కాలిక జీవన వ్యయాలు
అగ్నిప్రమాదం లేదా వరదలు వంటివి సంభవించినప్పుడు ఇళ్లను ఖాళీ చేసి తాత్కాలికంగా వేరొక చోట ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో హోటళ్లలో ఉండటానికి, భోజనం, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను ఈ హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. క్లిష్టమైన సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇది చాలా తోడ్పాటు అందిస్తుంది.
అందుబాటులోనే ప్రీమియం
హోమ్ ఇన్సూరెన్స్‌పై భారతదేశంలో చాలా అపోహలు ఉన్నాయి. ప్రీమియం ఎక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ అందుబాటు ప్రీమియంతోనే ఈ ఇన్సూరెన్స్ పొందవచ్చు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు తలెత్తే ఆర్థిక నష్టాలతో పోల్చినప్పుడు అది సహేతుకంగానే ఉంటుంది. అద్దెదారుల నిర్దిష్ట అవసరాలు, ఆర్థిక పరిమితుల ప్రకారం దేశంలో అనేక కంపెనీలు ఈ రెంటర్స్ హోమ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment