rent houses
-
ఢిల్లీ తరువాత మనమే..
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో అద్దె ఇళ్ల మార్కెట్ (రెంటల్ మార్కెట్) అంతకంతకూ వృద్ధి చెందుతోంది. సింగిల్, డబుల్ బెడ్రూం అద్దె ఇళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్న వారిలో అత్యధికశాతం (80 శాతం) మంది సౌకర్యవంతమైన చిన్న అపార్ట్మెంట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అద్దె ఇళ్ల డిమాండ్‌లో దేశరాజధాని ఢిల్లీ 27.25 శాతంతో ప్రథమ స్థానంలో, హైదరాబాద్ నగరం 22 శాతంతో ద్వితీయ స్థానంలో నిలుస్తోంది. పుణే (19.3 శాతం), ముంబై (18.35 శాతం), బెంగళూరు (12.8 శాతం) తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. గతంతో పోల్చితే గత మూడునెలల్లో (ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో) రెంటల్ డిమాండ్ 18.1 శాతం పెరగగా, అదే సమయంలో రెంటల్ సప్లయ్‌లు కూడా 9.6 శాతం, అద్దెలు 4.9 శాతం పెరిగాయి. ఆ మూడునెలల కాలంలో సగటు అద్దెల పెరుగుదలలో బెంగళూరు (8.1 శాతం). నవీ ముంబై (7.3 శాతం), గురుగ్రామ్ (5.1 శాతం) ముందువరసలో నిలుస్తున్నాయి. అదేసమయంలో కొన్ని నగరాల్లో అద్దెల్లో స్వల్ప శాతం పెరుగుదల నమోదైంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘మ్యాజిక్ బ్రిక్స్’గత ఏప్రిల్–జూన్ నెలలకు సంబంధించి దేశంలోని 13 ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్లకున్న డిమాండ్‌ను పరిశీలించి విడుదల చేసిన రెంటల్ ఇండెక్స్‌లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ‘డబుల్’కు లేదు సాటి... మరీ విలాసవంతంగా కాకపోయినా ఉన్నంతలో సౌకర్యవంతంగా ఉండేలా డబుల్ బెడ్రూం ఇళ్లను అద్దెకోసం అత్యధికులు కోరుకుంటున్నారు. అద్దె ఇళ్ల డిమాండ్, సప్లయ్ శాతంలో డబుల్ బెడ్రూం ఇళ్లకు 57 శాతం, వన్ బీహెచ్‌కే ఇళ్లకు 27 శాతం, ట్రిపుల్ బెడ్రూం ఇళ్ల కోసం 18 శాతం డిమాండ్ ఉన్నట్టుగా ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. అంతకు ముందు నెలలతో (జనవరి–మార్చి మధ్యలో) పోల్చితే గత ఏప్రిల్–జూన్‌ల మధ్య త్రీ బీహెచ్‌కేల డిమాండ్ 36 శాతం నుంచి 18 శాతానికి (సగానికి) పడిపోయినట్టు తెలిపింది. అదే సింగిల్ బెడ్రూంల డిమాండ్ 17 శాతం నుంచి 27 శాతానికి పెరిగింది. సామాన్య, దిగువ, ఎగువ మధ్యతరగతి కుటుంబా లకు అందుబాటులో ఉండేలా అద్దెలు ఉండటమే ఆయా ప్రధాన నగరాల్లో సింగిల్, డబుల్ బెడ్రూం ఇళ్ల డిమాండ్ పెరగడానికి ముఖ్య కారణంగా మ్యాజిక్ బ్రిక్స్ అంచనా వేస్తోంది. నెలకు రూ.10 నుంచి 20 వేలలోపు అద్దె ఉన్న ఇళ్లకు కిరాయిదారులు అత్యధికంగా మొగ్గుచూపుతున్నారు. వీరిలో ఎక్కువమంది 500 చదరపు అడుగుల నుంచి వెయ్యి చదరపు అడుగుల కవర్డ్ ఏరియా ఉన్న అద్దె ఇళ్లు తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్ విషయానికొస్తే... (గత ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో) ♦ హైదరాబాద్‌లో అద్దె ఇళ్ల డిమాండ్ 22 శాతం పెరుగుదల (ఆన్లైన్, ఇతరత్రా రూపాల్లో వెతకడం–యాక్టివ్ లిస్టింగ్స్‌లో) ♦ ఏప్రిల్–జూన్‌ల మధ్య అద్దెలు 4.5 శాతం వృద్ధి ♦ ఓఆర్ఆర్కు దగ్గరలో ఉండడంతో పాటు ప్రధాన ఐటీ, ఇతర ఉద్యోగ కేంద్రాలకు సమీపంగా ఉన్న కారణంగా మైక్రో మార్కెట్స్‌లో అద్దె ఇళ్ల కోసం అత్యధికంగా సెర్చ్ చేస్తున్న ప్రాంతాల్లో గచి్చ»ౌలి, కొండాపూర్ అగ్రభాగాన నిలుస్తున్నాయి ♦ నగరంలోని ఆయా ప్రాంతాల్లో రూ.20 వేలు–32 వేలలోపున్న టూ బీహెచ్‌కేల కోసం ఎక్కువ మంది ప్రాధాన్యతనిస్తున్నారు దేశంలోని ప్రధాననగరాలకు గత ఏడాది కాలంగా ఉద్యోగులు, విద్యార్థులు తిరిగి చేరుకుంటుండడంతో అద్దె ఇళ్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఉద్యోగుల్లో అత్యధిక శాతం ఆఫీసుల నుంచి పనిచేస్తుండటంతో వాటికి దగ్గరగా ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. – సుధీర్ పాయ్, సీఈవో, మ్యాజిక్ బ్రిక్స్ -
ఇల్లు లేకపోయినా హోమ్ ఇన్సూరెన్స్! ఎందుకు.. ఏంటి ప్రయోజనం?
వేగవంతమైన పట్టణీకరణ, అభివృద్ధి చెందుతున్న జీవనశైలి కారణంగా భారతదేశంలో అద్దె ఇళ్ల భావన ఎక్కువైంది. దేశంలో చాలామంది అద్దె ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. అద్దె ఇళ్లతో అనేక రకాల సౌలభ్యాలు ఉంటాయి. ఇంటి యజమానులతో పోలిస్తే అద్దెకు ఉండే వారికి బాధ్యతలు తక్కువగా ఉన్నప్పటికీ.. వారితో అద్దెకు ఉంటున్నవారికీ ఓ బాధ్యత ఉంది. అదే హోమ్ ఇన్సూరెన్స్. అదేంటి హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి ఓనర్‌కు సంబంధించింది కదా.. దీంతో అద్దెకు ఉంటున్నవారికి పనేంటి అనుకోవద్దు.. హోమ్ ఇన్సూరెన్స్ ఇంటి యజమానికి ఎంత అవసరమో.. అద్దెకుంటున్నవారికీ అంతే అవసరం. అది ఎందుకు.. ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. వస్తువుల రక్షణ ఇళ్లలో అద్దెకుండేవారు హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ముఖ్యమైన కారణం ఇది. ఈ హోమ్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత వస్తువులు అంటే టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫర్నీచర్, దుస్తులతోపాటు ఇతర విలువైన వస్తువులకు రక్షణ కల్పిస్తుంది. ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు, అగ్నిప్రమాదం, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దెబ్బతిన్న లేదా చోరీకి గురైన వస్తువులకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కొత్తవాటిని కొనుగోలు లేదా మరమ్మతుకు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. ఆస్తుల డ్యామేజీ కవరేజ్ వస్తువుల రక్షణతోపాటు ఇంటి ఆస్తుల రక్షణను ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అద్దెదారు అనుకోకుండా ఇంటి ఆస్తిని పాడు చేసినట్లయితే, అంటే కిచెన్‌లో మంటలు ఏర్పడి ఇంటికి సంబంధించిన వస్తువులు దెబ్బతింటే ఆ నష్టాన్ని ఓనర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. ఇలాంటి ప్రమాదాల్లో గాయపడిన ఇంట్లోకి వారికి బీమా వర్తిస్తుంది. తాత్కాలిక జీవన వ్యయాలు అగ్నిప్రమాదం లేదా వరదలు వంటివి సంభవించినప్పుడు ఇళ్లను ఖాళీ చేసి తాత్కాలికంగా వేరొక చోట ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమయాల్లో హోటళ్లలో ఉండటానికి, భోజనం, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను ఈ హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. క్లిష్టమైన సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇది చాలా తోడ్పాటు అందిస్తుంది. అందుబాటులోనే ప్రీమియం హోమ్ ఇన్సూరెన్స్‌పై భారతదేశంలో చాలా అపోహలు ఉన్నాయి. ప్రీమియం ఎక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ అందుబాటు ప్రీమియంతోనే ఈ ఇన్సూరెన్స్ పొందవచ్చు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు తలెత్తే ఆర్థిక నష్టాలతో పోల్చినప్పుడు అది సహేతుకంగానే ఉంటుంది. అద్దెదారుల నిర్దిష్ట అవసరాలు, ఆర్థిక పరిమితుల ప్రకారం దేశంలో అనేక కంపెనీలు ఈ రెంటర్స్ హోమ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. -
హైదరాబాద్‌లో అద్దెలు పెరిగాయ్, సగం జీతం.. ఇంటి అద్దెకే!
సాక్షి, సిటీబ్యూరో: విద్యా సంస్థలు, కార్యాలయాల పునఃప్రారంభంతో అద్దె గృహాలకు గిరాకీ పెరిగింది. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో లగ్జరీ ఇళ్ల నెలవారీ అద్దెలలో తొలిసారిగా రెండంకెల వృద్ధి నమోదయింది. కరోనా కంటే ముందు ప్రీమియం ప్రాపర్టీల రెంట్లు 5–7 శాతం వృద్ధిని నమోదవుతుండగా.. గత రెండేళ్లలో ఏకంగా 18 శాతం పెరిగాయని అనరాక్ సర్వేలో తేలింది. ప్రధాన ప్రాంతాలలో డిమాండ్‌కు తగిన లగ్జరీ గృహాల సప్లయి లేకపోవటమే అద్దె పెరుగుదలకు కారణం. అలాగే కరోనా తర్వాతి నుంచి అద్దెదారులు పెద్ద సైజు గృహాల అద్దెలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఫలితంగా అందుబాటుతో పోల్చితే లగ్జరీ ప్రాపర్టీల రెంట్లు పెరిగాయని సర్వే వెల్లడించింది. ♦అత్యధికంగా ముంబైలోని వర్లీలో 18 శాతం మేర అద్దెలు పెరిగాయి. ఇక్కడ 2020లో 2 వేల చ.అ ఇంటి అద్దె రూ.2 లక్షలుగా ఉండగా.. 2022 నాటికి రూ.2.35 లక్షలకు పెరిగింది. టార్డియోలో రెండేళ్ల క్రితం రూ.2.70 లక్షలుగా ఉన్న అద్దె.. ఇప్పుడు 15 శాతం పెరిగి రూ.3.10 లక్షలకు చేరింది. ♦బెంగళూరులోని జేపీ నగర్లో 13 శాతం వృద్ధితో రూ.46 వేల నుంచి రూ.52 వేలకు, రాజాజీనగర్‌లో 16 శాతం వృద్ధితో రూ.56 వేల నుంచి రూ.65 వేలకు అద్దెలు పెరిగాయి. రాజాజీనగర్ అత్యధిక మూలధన విలువను సాధించిన ప్రాంతంగా నిలిచింది. చ.అ. ధర రూ.5,698 నుంచి 9 శాతం వృద్ధి రేటుతో రూ.6,200లకు పెరిగింది. ♦చెన్నైలోని కొత్తూరుపురంలో 14 శాతం ♦వృద్ధితో రూ.74 వేల నుంచి రూ.84 వేలకు, కోల్‌కత్తాలోని బల్లీగంజ్‌లో 10 శాతం పెరుగుదలతో రూ.88 వేల నుంచి రూ.97 వేలకు, ఎన్సీఆర్లోని గోల్ఫ్‌కోర్స్ ఎక్స్టెన్షన్ రోడ్లో 12 శాతం వృద్ధితో రూ.50 వేల నుంచి రూ.56 వేలకు, పుణేలోని కోరాగావ్ పార్క్‌లో 14 శాతం వృద్ధితో రూ.59,500ల నుంచి రూ.68 వేలకు నెలవారీ అద్దెలు పెరిగాయి. జూబ్లీహిల్స్‌లో 62 వేలు.. హైదరాబాద్‌లో లగ్జరీ గృహాల అద్దెలకు డిమాండ్ పెరిగింది. రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో 2 వేల చ.అ. ఇంటి అద్దె రూ.54 వేలుగా ఉండగా.. 2022 నాటికి 15 శాతం మేర పెరిగి రూ.62 వేలకు చేరింది. అలాగే హైటెక్‌సిటీలో 2020లో రూ.53 వేలుగా ఉన్న రెంట్.. ప్రస్తుతం 11 శాతం వృద్ధితో రూ.59 వేలకు పెరిగింది. అలాగే జూబ్లీహిల్స్‌లో 2020లో చ.అ. సగటు ధర రూ.6,950గా ఉండగా.. 2022 నాటికి 6 శాతం వృద్ధి రేటుతో రూ.7,400లకు పెరిగింది. హైటెక్‌సిటీలో రెండేళ్ల క్రితం చ.అ.కు రూ.5,675గా ఉండగా.. ప్రస్తుతం 7 శాతం పెరుగుదలతో రూ.6,100లకు చేరింది. చదవండి👉 లబోదిబో.. హైదరాబాద్‌లో పెరిగిపోతున్న అమ్ముడు పోని ఇళ్లు -
Chennai: నగరజీవికి మోయలేని భారం.. తప్పక కట్టాల్సిందే గురూ!
చెన్నై మహానగరం పరిధిలో అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న వారికి.. యజమానులు చుక్కలు చూపిస్తున్నారు. ఎడాపెడా అద్దె మొత్తాన్ని పెంచేస్తూ సామాన్యులపై భారం మోపుతున్నారు. అంత కట్టలేమంటే వెళ్లిపోమంటూ ఈసడించుకుంటున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ నిర్ణయం అశనిపాతంగా మారుతోంది. సాక్షి, చెన్నై: పెరిగిన విద్యుత్ బిల్లులు, ఆస్తి, నీటిపన్నులతో సతమతం అవుతున్న నగరజీవికి ఇంటి అద్దె పెరుగుదల మోయలేని భారంగా మారుతోంది. చెన్నై మహానగరంలో ఉద్యోగం, విద్యా, వ్యాపారం కోసం వచ్చి స్థిర పడ్డ వారి సంఖ్య ఎక్కువే. వీరిలో మెజారిటీ ప్రజలు అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. వీరి అవసరాలు ఇంటి యజమానులకు కాసుల వర్షం కురిపిస్తోంది. చెన్నై శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో పెద్దసంఖ్యలో పారిశ్రామిక వాడలున్నాయి. ఇక్కడ ఉద్యోగ రిత్యా రాష్ట్రానికి చెందిన వారే కాదు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారూ ఉన్నారు. ఇటీవల ఉత్తరాది నుంచి వివిధ పనుల నిమిత్తం చెన్నై వస్తున్న వారి సంఖ్య పెరిగింది. దీంతో చెన్నై, సెంట్రల్ చెన్నై, దక్షిణ చెన్నైతో పాటు శివారులలోని వేళచ్చేరి, ఈసీఆర్, ఓఎంఆర్ మార్గాలు, అంబత్తూరు, పూందమల్లి, రెడ్ హిల్స్, మాధవరం, ఆవడి, తాంబరం, పల్లావరం, క్రోం పేట, పెరుంగళ్తూరు, ముడిచ్చూరు పరిసరాలలో అద్దె ఇల్లు దొరకడం గగనంగా మారింది. సాఫ్ట్వేర్ వంటి పెద్ద సంస్థలలో పనిచేసే ఉద్యోగులు మాత్రం తమకు సౌకర్యవంతంగా ఉండే అపార్ట్‌మెంట్స్‌ను బాడుగకు తీసుకుంటున్నారు. వడ్డనతో భారం.. చెన్నై నగరంలో నెలసరి అద్దె అధికంగానే ఉంటోంది. చిన్న గది అయినా కనీసం రూ. 5 వేలు పైగా వెచ్చించాల్సిందే. సింగిల్ బెడ్ రూమ్ కావాలంటే రూ.10 వేలు, మరి కాస్త పెద్దది కావాలంటే రూ. 15 వేలు, రూ. 20 వేలు, రూ. 25 వేలు వరకు అద్దె చెల్లించాల్సిందే. అన్నానగర్, అడయార్, తిరువాన్మీయూరు, ఈసీఆర్, ఓఎంఆర్ తదితర మార్గాల్లో కొంత సౌకర్యాలు కల్గిన ప్రాంతాల్లో రెట్టింపు అద్దె చెల్లించుకోక తప్పదు. ఇక, కొన్నిచోట్ల విద్యుత్ బిల్లులకు మీటరుతో సంబంధం ఉండదు. ఇంటి యజమాని నిర్ణయించే మీటర్ రీడింగ్ చార్జీను చెల్లించక తప్పదు. పన్నులు పెంచితే చాలు.. అసలే కరోనా మిగిల్చిన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ప్రజల్ని ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి. చెన్నై వంటి నగరాలలో ఆస్తిపన్ను, నీటి పన్ను ఇటీవలే అదనంగా వడ్డించారు. అలాగే, విద్యుత్ బిల్లుల మోత మోగింది. ఈ ప్రభావం ఇళ్ల యజమానులపై పడింది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు వారు అద్దెను అమాంతం పెంచేస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబరు నుంచి అనేక చోట్ల అద్దె పెంచుతూ యజమానులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అద్దెతో పాటు అదనంగా.. కొన్నిచోట్ల ఇంటి అద్దెతో పాటు విద్యుత్, తాగునీరు, మెయింట్‌నెన్స్ చార్జీలను పెంచేశారు. ఈ విధంగా కుటుంబ ఆదాయంలో గణనీయమైన మొత్తాన్ని ఇంటి అద్దె రూపంలో చెల్లించడం ద్వారా మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాయి. ప్రస్తుతం లగ్జరీతో కూడిన అపార్ట్మెంట్లకు 13, 14 శాతం మేరకు, చిన్న చిన్న రూములు, సింగిల్ బెడ్ రూం, డబుల్‌బెడ్ రూం ఇళ్లకు 25 శాతం వరకు అద్దెను పెంచారు. దీంతో ఇది వరకు రూ. 5 వేలు చెల్లిస్తున్న వారు ప్రస్తుతం రూ. 7 వేల వరకు, రూ.10 వేలు చెల్లిస్తున్న వారు రూ. 13 వేల వరకు అద్దె భారాన్ని భరించాల్సిన పరిస్థితి చెన్నైలో నెలకొంది. నిబంధనలు దాటి ఇంటి అద్దెలు అధికంగా వసూలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నా, ఆ దిశగా చర్యలు తీసున్న దాఖలాలు లేవు. ఇంటి బాడుగలను క్రమబద్దీకరించే విధంగా మార్గదర్శకాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న వారిలో మధ్య తరగతి కుటుంబాలే అధికంగా ఉండడం గమనార్హం. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
న్యూయర్ వేడుకలపై ఆంక్షలు.. అద్దెకు న్యూ ఇయర్ అడ్డాలు!
సాక్షి,హైదరాబాద్: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో జన సమూహాలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించడంతో కొత్త సంవత్సర వేడుకలకు నగరవాసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదారుగురు స్నేహితులు బృందంగా ఏర్పడి ఫామ్ హౌస్‌లో పార్టీలకు ప్లాన్స్ చేస్తుంటే.. మరికొందరేమో గోవాలో న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నారు. హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు నిర్వహించే పార్టీలలో పాల్గొని తిరుగు ప్రయాణంలో పోలీస్ తనిఖీలతో ఇబ్బందులు పడే బదులు.. శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్‌లు, వ్యక్తిగత గృహాలను యజమానుల నుంచి అద్దెకు తీసుకొని వ్యక్తిగత ఏర్పాట్లతో న్యూ ఇయర్ వేడుకలకు రెడీ అవుతున్నారు. ప్రతి ఏడాది హోటళ్లు, పబ్, క్లబ్‌లే కాకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు న్యూ ఇయర్ పార్టీలను నిర్వహిస్తుంటాయి. 2–3 నెలల ముందు నుంచే ప్రణాళికలు వేసుకునేవారు. పాపులర్ సింగర్స్, డీజేలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినిమా సెలబ్రిటీలతో ఈవెంట్లను నిర్వహిస్తుంటాయి. కరోనా కంటే ముందు కొత్త సంవత్సరం వేడుకలు నగరంలో 250కు పైగా జరిగేవి. ఈవెంట్ కోసం ప్రాంగణం దొరకడమే కష్టంగా ఉండేది. కానీ, గత రెండేళ్లుగా కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఆయా ఈవెంట్లు పెద్దగా జరగడం లేదు. ఈసారి ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా మరోసారి నిరుత్సాహామే ఎదురైందని ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వాహకులు తెలిపారు. సెలబ్రిటీలతో పెద్ద షోలు చేయాలంటే కనీసం నెల రోజుల ముందు నుంచి ప్లాన్ చేయాలి. సెలబ్రిటీల డేట్స్, విమాన టికెట్ల బుకింగ్స్, పబ్లిసిటీ, స్పాన్సర్షిప్ వంటి చాలా తతంగమే ఉంటుంది. అలాంటి వారం రోజుల వ్యవధిలో భారీ స్థాయిలో పెట్టుబడి ఆదాయం రాబట్టడం కుదిరేపని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ఈవెంట్ సైట్లలో ఒకట్రెండు ఈవెంట్లు కనిపిస్తున్నా.. పార్టీ ప్రియులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉండగా.. మరోవైపు హోటళ్లు రూమ్స్‌కు ఎక్కువ చార్జీ వసూలు చేసి, గదికే ఫుడ్, వైన్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇక రేవ్ పార్టీలు జరిగే అవకాశాలున్నాయని సమాచారం అందిన నేపథ్యంలో గట్టి నిఘా పెట్టామని సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫామ్ హౌస్ ఫర్ రెంట్ పబ్‌లు, క్లబ్‌లలో కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌పై పోలీసుల పరిమితుల నేపథ్యంలో పార్టీ ప్రియులు వ్యక్తిగత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఐదారు మంది స్నేహితులు బృందంగా ఏర్పడి. గేటెడ్ కమ్యూనిటీలోని రెండు మూడు ఫ్యామిలీలు కలిసి కొత్త సంవత్సర వేడుకలను ప్లాన్ చేస్తున్నారు. శివరాంపల్లి, శామీర్‌పేట, ఘట్కేసర్, కీసర, భువనగిరి, కొల్లూరు, గండిపేట, షాద్‌నగర్, హయత్‌నగర్ వంటి ఔటర్ రింగ్ రోడ్‌కు చేరువలో ఉన్న శివారు ప్రాంతాల్లోని విల్లాలు, వ్యక్తిగత గృహాలను యజమానులు న్యూ ఇయర్ వేడుకల కోసం అద్దెకు ఇస్తున్నారు. దీంతో చాలా మంది ఫామ్‌హౌస్‌లలో పార్టీలు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. కరోనా కంటే ముందుతో పోలిస్తే 20–30 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారని ఓ కస్టమర్ తెలిపారు. రోజుకు అద్దె రూ.5 వేలుగా చెబుతున్నారని పేర్కొన్నారు. అదనపు చార్జీలతో మద్యం, ఫుడ్ ఇతరత్రా వాటిని కూడా ఫామ్‌హౌస్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. -
అడ్డగోలు ఇల్లు కిరాయి.. వారం రోజులకే రూ.10 వేలు..అయినా కష్టమే?
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంతో అద్దెకుండే వారికి ఇళ్లు కరువయ్యాయి. కళాకారులు, కార్యకర్తలు, నేతలు, అనుచరులు ఉండేందుకు ఇళ్లకు విపరీత డిమాండ్ పెరిగింది. పోలింగ్ ముందు వరకు ఉండేందుకు కేవలం వారం రోజుల వ్యవధికే రూ.10వేల కిరాయి చెల్లిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇతర వర్గాలంతా ఇక్కడే బస చేస్తుండటంతో ఒక్కసారిగా గృహ యజమానులకు డిమాండ్ ఏర్పడింది. హుజూరాబాద్ పట్టణంలో ఇళ్లు దొరకకపోవడంతో ఇప్పల నర్సింగపూర్, సింగపూర్ గ్రామాల్లో అద్దె ఇళ్ల కోసం అన్వేషిస్తున్నారు. చదవండి: సెక్షన్ 49 పీ: మీ ఓటును మరెవరైనా వేశారా? వెంటనే ఇలా చేయండి.. కాగా మరో ఏడు రోజుల్లో అంటే ఈ నెల 30 న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. నవంబర్2న ఓట్లు లెక్కించి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికలో ప్రముఖంగా మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇక బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్లో బరిలో నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: అనగనగా.. ఓ ఈవీఎం.. దీని జీవితకాలమెంతో తెలుసా? -
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో సీన్ మారింది!
ఐటీ కారిడార్‌లో అన్నీ కాస్ట్లీనే. ఇక్కడ ఇల్లు లేదా ఫ్లాట్ అద్దెకు తీసుకోవాలంటే నెలకు రూ.50 వేల పైనే ఆదాయం ఉండాలి. అసలిక్కడ ఇల్లు కావాలంటే ముందు రెంటల్ ఏజెన్సీలను..బ్రోకర్లను ఆశ్రయించాలి. వారు అడిగినంత కమీషన్ ఇవ్వాలి. లేకుంటే ఇల్లు అద్దెకు దొరకదు.. ఇదీ కోవిడ్–లాక్‌డౌన్‌కు ముందు ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని పరిస్థితి... ఇప్పుడు సీన్ మారింది. ఇళ్లు, ఫ్లాట్లు అన్నీ ఖాళీ అయ్యాయి. కోవిడ్ ఎఫెక్ట్‌తో ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం ప్రకటించడం.. స్కూళ్లు మూతబడి ఆన్లైన్ క్లాసులు జరుగుతుండడం, కొందరు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోవడం వంటి కారణాల వల్ల వేలాది మంది నగరం విడిచి వెళ్లారు. దీంతో ఐటీ కారిడార్‌కు ఆనుకొని ఉన్న కొండాపూర్‌లో వైట్‌ఫీల్డ్, గ్రీన్‌ఫీల్డ్ , వసంత వ్యాలీ, మాదాపూర్, గచ్చిబౌలిలో వందలాది ఫ్లాట్లు, ఇళ్లు ఖాళీగా మారాయి. అద్దె సగానికి భారీగా తగ్గించినా ఫలితం లేదు. ఎక్కడ చూసినా టులెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అద్దెల ఆదాయం పడిపోయి ఓనర్లు దిగాలు చెందుతున్నారు. కమీషన్లు రాక రెంటల్ ఏజెన్సీల నిర్వాహకులు, బ్రోకర్లు బోరుమంటున్నారు. సాక్షి, హైదరాబాద్: వర్క్‌ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులతో ఐటీ కారిడార్‌లో అద్దె ఇళ్లపై తీవ్ర ప్రభావం పడింది. టు లెట్ బోర్డులు పెట్టడంతోపాటు అద్దెకు ఇస్తామని ఆన్‌లైన్‌లోనూ వందల కొద్దీ ప్రకటనలు ఇస్తున్నారు. అద్దె తగ్గించినా వచ్చే వారు కనుచూపు మేరలోనూ కనిపించడం లేదు. అద్దెకు దిగేవారి కోసం ఓనర్లు ఎదురుచూడాల్సి వస్తోంది. ► కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వెళ్లే ప్రధాన రహదారి, కొత్తగూడ నుంచి మాదాపూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న వైట్ పీల్డ్, గ్రీన్ఫీల్డ్లో అద్దెకు ఫ్లాట్లు అందుబాటులో ఉంటాయి. అక్కడ దాదాపు 100కు పైగా అపార్ట్మెంట్లు ఉన్నాయి. ప్రతి అపార్ట్మెంట్ ముందు టులెట్ బోర్డులు పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ► లాక్‌డౌన్‌కు ముందు ఫ్లాట్ అద్దెకు దొరకాలంటేనే ఎంతో శ్రమించాల్సి వచ్చేది. గతంలో బ్యాచ్‌లర్స్‌కు అద్దెకు ఇచ్చేవారు. బ్రోకర్లకు ముందే కమిషన్ ఇస్తే ఫ్లాట్ చూసి పెట్టేవారు. ప్రస్తుతం అక్కడ బ్రోకర్ల జాడే కనిపించడం లేదు. వీకెండ్లో ఐటీ ఉద్యోగులతో ఆ ప్రాంతం కోలాహలంగా ఉండేది. ప్రతి అపార్ట్మెంట్లో 30 మందికి పైగా సర్వెంట్లు పని చేసే వారు. వారి సంఖ్య ప్రస్తుతం 15కు పడి పోయింది. బ్యాచ్లర్స్ ఎక్కువగా ఉండటంతో పని మనుషులకు చేతి నిండా పని దొరికేది. ఆన్లైన్లో అప్లోడ్ అద్దెకు ఫ్లాట్ కావాలనుకునే వారు ఆన్లైన్లో వెబ్సైట్లను సంప్రదిస్తే ఫ్లాట్ ఫొటోలతో పాటు అద్దె వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇక ఓనర్లు సైతం ఎక్కువగా ఆన్లైన్ వెబ్సైట్లను సంప్రదిస్తున్నారు. హౌసింగ్ డాట్.కామ్‌లోనే 73 ఫ్లాట్లు అద్దెకు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయని పెట్టారు. అందులో వైట్‌ఫీల్డ్, గ్రీన్ఫీల్డ్లోని ఖాళీగా ఉన్న ఫ్లాట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. తీవ్ర ప్రభావం చూపిన వర్క్ ఫ్రం హోం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఐటీ కంపెనీలలో పని చేసే ఉద్యోగులు ఎక్కువగా ఫ్లాట్లలో అద్దెకు ఉండేవారు. అపార్ట్మెంట్లు, సర్వీస్ అపార్ట్మెంట్లు, గెస్ట్‌హౌస్‌లు కిటకిటలాడేవి. కంపెనీలు వర్క్‌ఫ్రం హోంకు అవకాశం కల్పించడంతో ఐటీ ఉద్యోగులందరూ సొంత ఊర్లకు వెళ్లి అక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. వైట్‌ఫీల్డ్‌లోని ఎట్ హోం సర్వీస్ అపార్ట్మెంట్లో దాదాపు 40 ఫ్లాట్లు ఉండగా ప్రస్తుతం 30 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. రూ.5 వేలు తగ్గించినా.. వాస్తవంగా ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ అద్దె రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు, త్రిబుల్ బెడ్ రూమ్‌కు విస్తీర్ణాన్ని బట్టి రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటుంది. దీంట్లో ఇప్పుడు దాదాపు ఐదు వేల రూపాయల వరకు అద్దె తగ్గించారు. అయినా వచ్చేందుకు ఎవ్వరూ ఆసక్తి కనబర్చడం లేదు. గతంలో రెంటల్ ఏజెన్సీలను సంప్రదించే ఓనర్లు.. ఇప్పుడు వారే స్వయంగా ఆన్లైన్లో వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. ఇళ్ల ముందు టులెట్ బోర్డుల్లో వారి ఫోన్ నెంబర్లే ఇస్తున్నారు. ఐటీ ఉద్యోగులు వస్తేనే కోలుకుంటాం ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోంకు అవకాశం ఉండటంతో అంతా వెళ్లిపోయారు. ఎట్ హోం ఎప్పుడూ ఉద్యోగులతో సందడిగా ఉండేది. ప్రస్తుతం అద్దెకు వచ్చే వారే కరువయ్యారు. ఐటీ కంపెనీలు తెరిస్తేనే మళ్లీ ఫ్లాట్లు నిండుతాయి. ఇప్పట్లో పరిస్థితి మారేలా కన్పించడం లేదు. మాకు ఉపాధి సమస్యగా మారింది. – రాజు, సూపర్వైజర్, ఎట్ హోం 40 శాతం ఖాళీ వైట్ ఫీల్డ్‌లో 40 శాతం ఫ్లాట్లు ఖాళీ అయ్యాయి. గతంలో జయదర్శిని రెసిడెన్సీలో అద్దెకు ఇళ్లు దొరికేది కాదు. ఇప్పుడు అక్కడా టు లెట్ బోర్డులు వెలిశాయి. 15 ఏళ్లుగా ఇక్కడ కూరగాయలు, కిరాణా సరుకులు అమ్ముతున్నా. ఇప్పుడు మాకు అస్సలు గిరాకీ లేదు. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు 15 ఇళ్లకు సరుకులు డోర్ డెలివరీ చేస్తే ఇప్పుడు నలుగురైదుగిరికి మాత్రమే చేస్తున్నాం. – ముదసిర్, వైట్‌ఫీల్డ్ -
సగం జీతం.. ఇంటి అద్దెకే..!
సాక్షి, సిటీబ్యూరో: అంబర్‌పేట్‌లో స్నేహితులతో షేరింగ్ రూమ్‌లో ఉంటున్న మహేశ్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ. 20,000ల జీతం. ఇటీవలే పెళ్లి అయ్యింది. అంతకుముందు స్నేహితులతో కలిసి అంబర్పేట్ నుంచి బేగంపేట్‌లో ఉన్న తన ఆఫీస్‌కు వచ్చేవాడు. పెళ్లి కావడంతో ఇల్లు మారాల్సి వచ్చింది. బేగంపేట్‌లో ఇల్లు అద్దెకు తీసుకుందామని నిశ్చయించుకుని వెతకడం మొదలుపెట్టాడు. తీరా అక్కడి అద్దెలు చూసి ఆశ్చర్యపోయాడు. నెలకు రూ. 12,000 అద్దె కడితే కానీ అన్ని వసతులతో సింగల్ బేడ్ రూమ్ ఇల్లు లభించడంలేదు. ఖమ్మం ట్రాన్స్‌పోర్టు కంపెనీలో విధులు నిర్వహిస్తున్న షేక్ ఇమామ్ ఇటీవల నగరంలోని దివాన్‌దేవిడిలోని ట్రాన్స్‌పోర్టు కంపెనీకి ట్రాన్స్ఫర్ అయింది. అతని వేతనం 16,000. ఉద్యోగం ఉన్న చోటే ఇల్లు తీసుకుందామని పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల అద్దె కోసం వెతికాడు. సర్వసాధారణంగా ఇళ్ల అద్దెలు పాతబస్తీకి తక్కువగా ఉంటాయాని ఉండాలనుకున్నాడు. కానీ సింగల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని సౌకార్యలతో రూ. 8500 కంటే తక్కువ లేదు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన రవితేజకు ఇటీవలే హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఫ్రెషర్ అవడంతో శిక్షణలో నెలకు రూ. 25,000 జీతం వస్తోంది. అప్పటి వరకు అమీర్‌పేట్‌లో సాఫ్ట్వేర్ శిక్షణ తీసుకున్నాడు. తొందరగా ఉద్యోగం రావడంలో సమయానికి ఆఫీసు వెళ్లాలని క్రమశిక్షణ పాటించాలని ఇల్లు హైటెక్ సిటీ ప్రాంతంలో తీసుకుందామనుకున్నాడు. తీరా అక్కడికి వెళ్లి గది అద్దెకు తీసుకుందామంటే అద్దెను చూసి విస్తుపోయాడు. రూ. 13,000 నుంచి రూ. 15,000కు మించి పెడితేనే సౌకర్యవంతమైన గది దొరికే పరిస్థితి ఉందక్కడ. వచ్చిన జీతంలో సగం గది అద్దెకే వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ.. నగరంలోని అద్దెల పరిస్థితి. ఏటా నగరంలో అద్దెలు పెరిగిపోతున్నాయ్. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోని పలు ప్రాంతా ల్లో అద్దెలు ఎక్కువగా పెరిగాయని పలు సంస్థల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నగరంలోని బేగంపేట్, అమీర్‌పేట్, కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, హై టెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో అద్దెలు ఏటా పెరుగున్నాయే తప్ప తగ్గడం లేదు. 2019 జూన్ నాటికి అద్దెల్లో 8 శాతం వృద్ధి ఏర్పడిందని సంస్థలు తమ సర్వేల్లో పేర్కొంటున్నాయి. మొత్తం 15 నగరాల్లో అధ్యయనం చేయగా అత్యధిక అద్దెలు ఉన్న నగరాలుగా కోల్‌కతా, బెంగుళూరు, అహ్మదాబాద్ 6.5 శాతంగా ఉండగా, 8 శాతం వృద్ధితో హైదరబాద్ నగరం నిలిచింది. నగరం ఒక్కటే ఇళ్ల అద్దెలు 60 శాతం వ్యత్యాసం నగరం ఒక్కటైనా ఇళ్ల అద్దెల వ్యత్యాసం ఓల్డ్‌సిటీకి హైటెక్ సిటీ 60 శాతం తేడా ఉంది. 900 చగదరపు గజాల ఇళ్లు ఓల్డ్‌సిటీలో రూ. 8,000 ఉండగా అదే ఇల్లు హైలెక్ సిటీలో రూ. 20 వేల వరకు ఉంది. నగరంలో గడచిన మూడేళ్లలో ఓల్డ్ సిటీలోనూ ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరగాయి. హైటెక్ సిటీతో పోలస్తే ఓల్డ్ సిటీలో తక్కువగా అద్దెలు పెరగాయని పలు సంస్థలు సర్వేల్లో వెల్లడైంది. అద్దెల వివరాలివీ బేగంపేటలో అద్దెను పరిశీలిస్తే ఒక పడకగది ఉన్న ఇల్లు 600 చదరపు అడుగుల నుంచి 900 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటే రూ. 7500 నుంచి రూ. 16,000 వరకు ఉంది. సికింద్రాబాద్‌లో పరిశీలిస్తే రూ. 7,000 నుంచి రూ. 13,000 వరకు ఉంది. కొండాపూర్‌లో రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు ఉంది. హైటెక్‌సిటీలోనూ ఇదే పరిస్థితి. నెలకు రూ. 10,000 నుంచి రూ. 13,500 వరకు అద్దెలు ఉన్నాయి. కొత్తగా ఇల్లు కట్టేవారికి వరం గచ్చిబౌలి, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో కొత్తగా ఇల్లు నిర్మించేవారు సైతం అద్దెలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణం రెండు లేదా మూడు సంవత్సరాల్లో తీర్చేలా ముందు జాగ్రత్తలు తీసు కుంటున్నారు. తమ కుటుంబం కోసం ఒక అం తస్తు, అద్దెల కోసం మరో రెండస్తుల చొప్పున ప్రణాళిక వేసి అందుకు అవసరమయ్యే సొమ్మును బ్యాంకులో రుణంగా పొందుతున్నారు. ఇదిలా ఉంటే అద్దెలు చెల్లించేవారు వచ్చే నెల జీతంలో సగం అద్దెకే చెల్లించాల్సి వస్తోందని, పొదుపు సంగతి ఏనాడో మర్చిపోయామని చిరుద్యోగులు వాపోతున్నారు. -
మంత్రులకు, ఐఏఏస్లకు అద్దె ఇల్లు
-
వాయనం: ఫర్నిచర్ కొంటున్నారా?
ఒంటికి వాడే వి కొనేటప్పుడు మన ఇష్టానికే ప్రాధాన్యం ఇస్తాం కానీ ఇంటికి సంబంధించినవి కొనేటప్పుడు మాత్రం ఇష్టాయిష్టాలతో పాటు మరికొన్ని విషయాలు కూడా గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఫర్నిచర్ విషయంలో! సొంత ఇల్లు అయితే ఫర్వాలేదు... ఫర్నిచర్‌ని కదల్చాల్సిన పని ఉండదు. కానీ అద్దె ఇల్లు అయితే మారినప్పుడు కష్టమవుతుంది. అందుకే అద్దె ఇళ్లలో ఉండేవారయితే కాస్త తేలికపాటివి కొనుక్కోవడమే మంచిది. కలపవి కొనేట్లయితే అది ఎలాంటి కలప, ఎంతవరకు మన్నుతుంది వంటివి తెలుసుకోవాలి. ఇనుము తదితర లోహాలతో చేసినవి అయితే... అది ఏ లోహం, తుప్పు పడుతుందా వంటివి చూసుకోవాలి. కాలం గడిచేకొద్దీ వాటిలో ఎలాంటి మార్పులు రావచ్చో తెలుసుకోవడం మంచిది. ఫర్నిచర్ మెటీరియల్‌ని బట్టి... వాటిని శుభ్రం చేసే విధానాన్ని అడగడం మర్చిపోకూడదు. ఏ వస్తువు కొన్నా, ఒక్కచోట చూసి కొనేయకుండా, నాలుగైదు చోట్ల రేట్లు వాకబు చేసి కొనుక్కోవడం లాభకరం! ఫర్నిచర్‌ని ఆన్లైన్లో కొనకపోవడం మంచిది. ఎందుకంటే... పొరపాటున ఏదైనా తేడా ఉంటే దాన్ని తిప్పి పంపడం, మళ్లీ మరో సెట్ వచ్చేవరకూ ఎదురు చూడటం... వీటన్నిటికీ బోలెడంత టైమ్ వేస్టవుతుంది. అదేదో షాపుకెళ్లి మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే ఒక్కసారికి పనైపోతుంది. మొక్కజొన్న... ఒలవండిలా! ప్రపంచమే మెచ్చిన పౌష్టికాహారం... మొక్కజొన్న. దీనిలో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టే మొక్కజొన్నని వీలైనంత ఎక్కువగా తినమని వైద్యులు చెబుతుంటారు. తినడం మనకూ ఇష్టమే. కానీ దాన్ని ఒలుచుకోవడమే పెద్ద పని. ఈ మధ్య ఒలిచిన గింజలు కూడా దొరుకుతున్నాయి గానీ ప్రతిసారీ అవి అందుబాటులో ఉండాలి కదా! అందుకే ‘కార్న్ స్ట్రిప్పర్’ని కొనుక్కోవడం బెటర్. కంప్యూటర్ మౌస్లా ఉండే ఈ చిన్ని యంత్రం... మొక్కజొన్న గింజల్ని ఇదిగో, ఇంత తేలిగ్గా ఒలిచి పెట్టేస్తుంది మనకి. అసలు ధర 500 రూపాయలు. ఆన్లైన్లో అయితే రెండు మూడొంద ల్లో కూడా వచ్చేస్తోంది! ప్లాస్టిక్ సీసాతో ఫ్లవర్‌వాజ్! ఇంటిని అందంగా అలంకరించుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఫ్లవర్‌వాజులు, ప్లాస్టిక్ పూలు, వాల్ హ్యాంగింగ్స్ అంటూ ఖర్చు పెట్టడం కాస్త తలకు మించిన భారమే. అలాంటప్పుడు ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులతో అలంకరణ సామగ్రిని తయారు చేసుకోవచ్చు కదా! అదేం పెద్ద కష్టం కూడా కాదు. కావాలంటే ప్లాస్టిక్ సీసాతో ఇలా ఫ్లవర్‌వాజ్ చేసి చూడండి... మీకే అర్థమైపోతుంది ఎంత ఈజీయో! ఖాళీ అయిపోయిన అర లీటరు కూల్‌డ్రింక్ బాటిల్‌ను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తరువాత దాన్ని మధ్యకు కట్ చేయాలి. అడుగున కొంతమేర వదిలేసి, మిగిలిన భాగాన్ని పొడవుగా కత్తిరించుకోవాలి (ఫొటో చూడండి). ఇప్పుడు బాటిల్‌ని తిరగేసి, నేలమీద పెట్టి గట్టిగా నొక్కితే, కత్తిరించిన ముక్కలన్నీ వెనక్కి వంగి పువ్వులా అవుతాయి. ఆపైన ఒక్కో ముక్కనీ ఫొటోలో చూపినట్టుగా క్రాస్‌గా సగానికి మడవాలి. అంతే... అందమైన ఫ్లవర్‌వాజ్ రెడీ. ఇందులో మీకు నచ్చిన పూలను అమర్చి టేబుల్ మీద పెడితే సూపర్‌గా ఉంటుంది! -
అద్దె భవనాలతో అవస్థలు
సోంపేట : పీహెచ్‌సీలకు అనుబంధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన సబ్ సెంటర్లు అద్దె కొంపల్లో నిర్వహిస్తుండడంతో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. సొంత భవనాలకు నోచుకోవడం లేదు. సోంపేట మండలంలో 12 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క ఆరోగ్య ఉప కేంద్రానికి కూడా సొంత భవనానికి నోచుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో సరైన అద్దె భవనాలు కూడా దొరక్క పోవడంలో ఆరోగ్య సిబ్బంది విధులున ఇర్విహ ంచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోంపేట- 1, సోంపేట-2, జింకిభద్ర, కొర్లాం, పాలవలస, కొరంజిభద్ర, మాఖన్నపురం, బారువ-1, బారువ-2, బట్టిగళ్లూరు, మామిడిపల్లి, తాళభద్ర గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో కొన్ని చోట్ల అద్దె భవనాల్లో, మరికొన్ని గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. గర్భిణులకు వైద్య సేవలు, విషజ్వరాలు, డయేరియా వంటి అత్యవసర సమయాల్లో రోగులు సోంపేట, బారువ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. భవనాలు నిర్మిస్తే అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. అద్దె భవనాలు లేని గ్రామాల్లో కనీసం ఆరోగ్య సిబ్బంది మందులు ఉంచుకునే అవకాశం కూడా సాధ్యం కావ డం లేదు. ప్రభుత్వం వేలాది రూపాయల మందులు సరఫరా చేస్తున్న సొంత భవనాలు లేక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వివిధ గ్రామాల్లో గర్బిణులు, బాలింతలకు టీకాలు వేసేం దుకు అంగన్వాడీ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలను ఏర్పాటు చేసి గ్రామాల్లోనే వైద్య సేవలు అందేవిధంగా చర్యలు చేపట్టాలని పలు గ్రామాలప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.