
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో అద్దె ఇళ్ల మార్కెట్ (రెంటల్ మార్కెట్) అంతకంతకూ వృద్ధి చెందుతోంది. సింగిల్, డబుల్ బెడ్‌రూం అద్దె ఇళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్న వారిలో అత్యధికశాతం (80 శాతం) మంది సౌకర్యవంతమైన చిన్న అపార్ట్‌మెంట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అద్దె ఇళ్ల డిమాండ్‌లో దేశరాజధాని ఢిల్లీ 27.25 శాతంతో ప్రథమ స్థానంలో, హైదరాబాద్ నగరం 22 శాతంతో ద్వితీయ స్థానంలో నిలుస్తోంది.
పుణే (19.3 శాతం), ముంబై (18.35 శాతం), బెంగళూరు (12.8 శాతం) తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. గతంతో పోల్చితే గత మూడునెలల్లో (ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో) రెంటల్ డిమాండ్ 18.1 శాతం పెరగగా, అదే సమయంలో రెంటల్ సప్లయ్‌లు కూడా 9.6 శాతం, అద్దెలు 4.9 శాతం పెరిగాయి. ఆ మూడునెలల కాలంలో సగటు అద్దెల పెరుగుదలలో బెంగళూరు (8.1 శాతం). నవీ ముంబై (7.3 శాతం), గురుగ్రామ్ (5.1 శాతం) ముందువరసలో నిలుస్తున్నాయి.
అదేసమయంలో కొన్ని నగరాల్లో అద్దెల్లో స్వల్ప శాతం పెరుగుదల నమోదైంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘మ్యాజిక్ బ్రిక్స్’గత ఏప్రిల్–జూన్ నెలలకు సంబంధించి దేశంలోని 13 ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్లకున్న డిమాండ్‌ను పరిశీలించి విడుదల చేసిన రెంటల్ ఇండెక్స్‌లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.
‘డబుల్’కు లేదు సాటి...
మరీ విలాసవంతంగా కాకపోయినా ఉన్నంతలో సౌకర్యవంతంగా ఉండేలా డబుల్ బెడ్‌రూం ఇళ్లను అద్దెకోసం అత్యధికులు కోరుకుంటున్నారు. అద్దె ఇళ్ల డిమాండ్, సప్లయ్ శాతంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు 57 శాతం, వన్ బీహెచ్‌కే ఇళ్లకు 27 శాతం, ట్రిపుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం 18 శాతం డిమాండ్ ఉన్నట్టుగా ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది.
అంతకు ముందు నెలలతో (జనవరి–మార్చి మధ్యలో) పోల్చితే గత ఏప్రిల్–జూన్‌ల మధ్య త్రీ బీహెచ్‌కేల డిమాండ్ 36 శాతం నుంచి 18 శాతానికి (సగానికి) పడిపోయినట్టు తెలిపింది. అదే సింగిల్ బెడ్‌రూంల డిమాండ్ 17 శాతం నుంచి 27 శాతానికి పెరిగింది. సామాన్య, దిగువ, ఎగువ మధ్యతరగతి కుటుంబా లకు అందుబాటులో ఉండేలా అద్దెలు ఉండటమే ఆయా ప్రధాన నగరాల్లో సింగిల్, డబుల్ బెడ్‌రూం ఇళ్ల డిమాండ్ పెరగడానికి ముఖ్య కారణంగా మ్యాజిక్ బ్రిక్స్ అంచనా వేస్తోంది.
నెలకు రూ.10 నుంచి 20 వేలలోపు అద్దె ఉన్న ఇళ్లకు కిరాయిదారులు అత్యధికంగా మొగ్గుచూపుతున్నారు. వీరిలో ఎక్కువమంది 500 చదరపు అడుగుల నుంచి వెయ్యి చదరపు అడుగుల కవర్డ్ ఏరియా ఉన్న అద్దె ఇళ్లు తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకంగా హైదరాబాద్ విషయానికొస్తే...
(గత ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో)
♦ హైదరాబాద్‌లో అద్దె ఇళ్ల డిమాండ్ 22 శాతం పెరుగుదల (ఆన్‌లైన్, ఇతరత్రా రూపాల్లో వెతకడం–యాక్టివ్ లిస్టింగ్స్‌లో)
♦ ఏప్రిల్–జూన్‌ల మధ్య అద్దెలు 4.5 శాతం వృద్ధి
♦ ఓఆర్‌ఆర్‌కు దగ్గరలో ఉండడంతో పాటు ప్రధాన ఐటీ, ఇతర ఉద్యోగ కేంద్రాలకు సమీపంగా ఉన్న కారణంగా మైక్రో మార్కెట్స్‌లో అద్దె ఇళ్ల కోసం అత్యధికంగా సెర్చ్ చేస్తున్న ప్రాంతాల్లో గచి్చ»ౌలి, కొండాపూర్ అగ్రభాగాన నిలుస్తున్నాయి
♦ నగరంలోని ఆయా ప్రాంతాల్లో రూ.20 వేలు–32 వేలలోపున్న టూ బీహెచ్‌కేల కోసం ఎక్కువ మంది ప్రాధాన్యతనిస్తున్నారు
దేశంలోని ప్రధాననగరాలకు గత ఏడాది కాలంగా ఉద్యోగులు, విద్యార్థులు తిరిగి చేరుకుంటుండడంతో అద్దె ఇళ్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఉద్యోగుల్లో అత్యధిక శాతం ఆఫీసుల నుంచి పనిచేస్తుండటంతో వాటికి దగ్గరగా ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు.
– సుధీర్ పాయ్, సీఈవో, మ్యాజిక్ బ్రిక్స్
Comments
Please login to add a commentAdd a comment