సాక్షి, అమరావతి: రాజధాని భూసమీకరణ కింద రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు (యాన్యుటీ) మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. రాజధాని రైతులకు ఐదో విడతగా 2019–20 సంవత్సరం కౌలు రూ.187.40 కోట్లను విడుదల చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ విధానంలో 28,442 మంది రైతుల నుంచి 34,312 ఎకరాలను సీఆర్‌డీఏ సేకరించింది.
ఈ భూములిచ్చిన రైతులకు భూసమీకరణ ప్యాకేజీ కింద పదేళ్లపాటు వార్షిక కౌలు చెల్లించాల్సి వుంది. జరీబు భూములకు రూ.50 వేలు, మెట్ట భూములకు రూ.30 వేల చొప్పున ప్రతి సంవత్సరం పది శాతం పెంపుతో పదేళ్లపాటు ఈ కౌలు రైతులకు ఇవ్వాల్సి వుంది. గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు ఈ కౌలును చెల్లించగా ఐదో సంవత్సరం పది శాతం పెంపుతో ఇప్పటి ప్రభుత్వం రూ.187.40 కోట్లను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఫైలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్న నేపథ్యంలో కొద్దిరోజులుగా టీడీపీ నేతలు, మద్ధతుదారులు కౌలు చెల్లింపును నిలిపివేస్తున్నారని పుకార్లు సృష్టించారు. రాజధానిపై టీడీపీ నేతలు రకరకాల పుకార్లు వ్యాపింపజేసి రైతులు, స్థానికుల్లో ఆందోళనలు రేకెత్తించారు. కానీ ప్రభుత్వం రాజధాని రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పది శాతం పెంపుతో వార్షిక కౌలును విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment