ఏఐబీఈఏ వ్యవస్థాపక దినోత్సవం
కొరిటెపాడు(గుంటూరు): ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐబీఈఏ) 80వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం నిర్వహించారు. తొలుత మార్కెట్ సెంటర్‌లోని హిందూ కళాశాల వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి వద్ద జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం కార్యదర్శి సయ్యద్ బాషా ఏఐబీఈఏ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ సలహాదారుడు పి.కిషోర్‌కుమార్ మాట్లాడుతూ 1946 ఏప్రిల్ 20వ తేదీన ఏఐబీఈఏను స్థాపించినట్టు తెలిపారు. 1969లో బ్యాంకుల జాతీయకరణ ఉద్యమంలో ఏఐబీఈఏ అగ్రభాగన నిలబడిందని గుర్తు చేశారు. ఉద్యోగుల మొదటి వేతన సవరణ 1966 నుంచి 2024 వరకు 12 వేతన సవరణలు విజయవంతంగా చేశారన్నారు. అనంతరం శ్రీనగర్‌లోని మాతృశ్రీ వృద్ధాశ్రమం, రింగ్ రోడ్‌లోని వికలాంగుల ఆశ్రమంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం జాయింట్ సెక్రటరీ మురళీ, సంఘం నాయకులు శివాజీ, రామకృష్ణ, షరీఫ్, పృధ్వీ, వేణు, పావని, క్రాంతి, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


