అమరావతి భూముల్లో వెలుగులోకి వస్తున్న వాస్తవాలెన్నో! | Two Arrested In Connection With Amaravati Land Irregularities | Sakshi
Sakshi News home page

అమరావతి భూముల్లో వెలుగులోకి వస్తున్న వాస్తవాలెన్నో!

Published Sat, Jul 18 2020 10:50 AM | Last Updated on Sat, Jul 18 2020 11:40 AM

Two Arrested In Connection With Amaravati Land Irregularities - Sakshi

పోలీసుల అదుపులో ఉన్న మాజీ తహసీల్దార్‌ సుధీర్‌బాబు, వ్యాపారవేత్త గుమ్మడి సురేష్‌(ఫైల్‌)

సాక్షి, గుంటూరు: భూమి ఒకటే... సర్వే నంబరూ అదే... భూ యజమానులూ వారే... అయినా రికార్డులు మారాయి. ఇతరుల పేరిట భూమి బదలాయింపునకు తారుమారయ్యాయి. ఇలా ఒకటి రెండూ కాదు. పెద్ద సంఖ్యలోనే. రూ.కోట్లు చేతులు మారాయి. ఇదంతా నెలల వ్యవధిలోనే జరిగిపోయింది. ప్రపంచ స్థాయి నగరంగా చెప్పుకున్న రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఎన్నెన్ని లుకలుకలో. మరెన్ని లోగుట్లు ఎక్కడెక్కడ దాక్కుని ఉన్నాయో... పెదలంక భూ ఉదంతాన్నే పరిశీలిస్తే... 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో భూసమీకరణ కింద దాదాపు 33 వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకుంది. ఆ సమయంలో తమకు అనుకూలురైన అధికారులను నియమించుకుని అప్పటి అధికార పార్టీ పెద్దలు అన్యాయాలకు పాల్పడ్డారని, పేదలు, నిరుపేదలను దారుణంగా మోసగించారని నిర్దిష్ట ఆరోపణలు వచ్చాయి.

భూముల విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర వర్గాలకు చెందిన వారు పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులను కలిసి నేటికీ ఫిర్యాదులు అందజేస్తూ న్యాయాన్ని కోరుతున్నారు. అలాంటి ఫిర్యాదుల్లో భాగంగానే తుళ్లూరు మండలం రాయపూడి పంచాయతీలోని పెదలంకలో జరిగిన మోసాన్ని రెవెన్యూ సహకారంతో పోలీసులు ఛేదించారు. తుళ్లూరు మండల మాజీ (రిటైర్డు) తహసీల్దారు అన్నే సుధీర్‌బాబు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, విజయవాడలో ప్రముఖ ఎం అండ్‌ ఎం వస్త్ర దుకాణ యజమాని గుమ్మడి సురేష్‌లను బుధవారం తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తుండటంతో విచారణాధికారులు సైతం విస్తుపోతున్నారు. అన్నే సు«దీర్‌బాబు 2014 నుంచి 2017 ఆగస్టు వరకు తుళ్లూరు తహసీల్దారుగా పనిచేసి రిటైరయ్యారు.  

సమీకరణలో అసైన్డు భూమి పట్టా భూమిగా మారింది 
పెదలంక సర్వే నంబరు 376/2ఎలో 3.70 ఎకరాలు ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం ద్వారా 1975లో ప్రభుత్వపరమైంది. ఆ భూమిని అసైన్‌మెంట్‌ పట్టా కింద యలమంచిలి సూరయ్య, ఆయన కుమారులతో పాటు పలువురు స్థానికులకు ప్రభుత్వం అప్పట్లోనే పంపిణీ చేసింది. రాజధాని పేరిట ఆ భూమిని కూడా సమీకరణ కింద సర్కారు తీసుకుంది. అసైన్డ్‌ ల్యాండ్‌ను పట్టా భూమిగా అప్పటి తహసీల్దారు అన్నే సుధీర్‌బాబు రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించారు. అడంగల్, ఆర్‌ ఒ ఆర్‌– 1బి, పట్టాదారు పాస్‌ పుస్తకం, టైటిల్‌ డీడ్, ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్‌లలో మార్పులు చేసేశారు.  

ఆరు పర్యాయాలు ఆరు రకాలుగా...  
యలమంచిలి సూరయ్య, ఆయన కుమారులకు చెందిన 86 సెంట్ల భూమికి ఆరుసార్లు ఆరు రకాలుగా రికార్డులు మార్పులు జరిగినట్లు పరిశీలనలో వెల్లడైంది. తొలుత సీలింగ్‌ ల్యాండ్‌ను అసైన్డ్‌ పట్టాల కింద ప్రభుత్వం పంపిణీ చేసింది. రాజధాని కోసం భూసమీకరణ ప్రక్రియ ఆరంభమైనప్పటి నుంచి 2017 ఆగస్టు మధ్య కాలంలో అసైన్డ్‌ నుంచి పట్టాగా మళ్లీ అసైన్డ్, ఆపై పట్టా, తిరిగి అసైన్డ్, ఆ తరువాత పట్టాగా రికార్డుల్లో మార్పులు జరిగాయి. అవసరాన్ని, సమయాన్ని బట్టి ఆన్‌లైన్‌ ద్వారా వెబ్‌ల్యాండ్‌లో ఈ మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నట్లు పోలీసు పరిశీలనలో తేటతెల్లమైంది.  

ఎందుకిలా చేశారంటే... 
అసైన్డ్‌ ల్యాండ్‌గా ఉంటే రిజిస్ట్రేషన్లకు వీలుకాదు. విక్రయానికీ కుదరదు. అందువల్లే వెబ్‌ల్యాండ్‌లో పట్టా భూమిగా  మార్పుచేశారు. ఆ తరువాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గుమ్మడి సురేష్‌ పేరిట సేల్‌ కమ్‌ జీపీ చేశారు. ఆ తరువాతే  గుమ్మడి సురేష్‌ వల్లూరు శ్రీనివాస్‌బాబుకు విక్రయించగలిగారు. అదే భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కింద సీఆర్‌డీఏకి ఇవ్వగలిగారు. 

ఎస్సీలను మోసగించినందున...  
ఎస్సీ వర్గానికి చెందిన రైతులను మోసగించే ఉద్దేశంతోనే అన్నే సుధీర్‌బాబు, గుమ్మడి సురేష్‌ ఉమ్మడిగానే వ్యవహారాలు నడిపారనేది వెల్లడైనందున వారివురిని అరెస్టు చేయడంతోపాటు సెక్షన్‌ 3(1)(ఎఫ్‌)(జి), 3(2)(విఎ) ఎస్సీ, ఎస్టీ అమెండ్‌మెంట్‌ యాక్టు–1989 కింద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తుళ్లూరు డీఎస్పీ మీడియాకు తెలిపారు. రికార్డుల తారుమారుతో పాటు సీఆర్‌డీఏకి భూమి అప్పగించడం వెనుక కుట్ర, మోసం ఉన్నందున సెక్షన్‌–7 ఆఫ్‌ ఏపీ అసైన్డ్‌ ల్యాండ్స్‌ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌ యాక్ట్‌– 1977తో పాటు 120–బి, 407, 420, 465, 468,471,477(ఎ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ వ్యవహారంలో  ఆ ఇద్దరితో పాటు అసైనీలు సహా సంబంధితులందరూ నిందితులేనని తెలిపారు.  

మరో 9 సర్వే నంబర్లలోనూ...  
రాజధాని గ్రామాలైన అనంతవరం, నేలపాడు, వెలగపూడి, రాయపూడి, పెదలంక తదితర గ్రామాల్లోని తొమ్మిది సర్వే నంబర్లలోని రికార్డులు తారుమారయ్యాయని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. ఆయా గ్రామాలకు చెందిన పేద రైతులు తమను మోసగించారని రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. వీటిపై లోతైన దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని దళిత సంఘాలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement