
దెబ్బతిన్న ఉద్యాన పంటలు
నరసరావుపేట రూరల్: ఈదురు గాలులు కారణంగా జిల్లాలోని 25.2 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు జిల్లా ఉద్యాన అధికారి సీహెచ్‌వీ రమణారెడ్డి మంగళవారం తెలిపారు. పంటలు దెబ్బతినడం వలన 40 మంది రైతులు నష్టపోయినట్టు వివరించారు. ఉద్యాన సహాయకులు మంగళవారం గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొన్నట్టు తెలిపారు. నరసరావుపేట మండలంలో మునగ, బొప్పాయి, రాజుపాలెం మండలంలో బొప్పాయి, అరటి, మాచవరం, పెదకూరపాడు, అమరావతి మండలాల్లో అరటి, సత్తెనపల్లి మండలంలో అరటి, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
పెదగార్లపాడులో వైభవంగా రథోత్సవం
దాచేపల్లి : పెదగార్లపాడులో రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పండుగ ముగిసిన తరువాత మూడవ రోజున ఈ గ్రామంలో రథోత్సవం జరుపుతారు. రామాలయంలో ఉన్న రథాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించి , అర్చకులు పూజలు చేసిన అనంతరం రథోత్సవ కార్యక్రమం చేపట్టారు. రథాన్ని లాగేందుకు యువకులు పోటీ పడ్డారు. రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. భక్తులు ప్రత్యేకంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జి.వెంకట్, రాధ దంపతులు రూ.1,00,116 విరాళం సమర్పించారు. మంగళవారం ఉదయం వారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డెప్యూటీ కమిషనర్‌కు చిన్నారులు లావణ్య, ప్రవీణ్ చౌదరి పేరున విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మూల విరాట్‌ను తాకిన సూర్యకిరణాలు
జంపని(వేమూరు): ఏకాదశి పర్వదినం ఉదయం ఏడున్నర గంటలకు మూలవిరాట్ చెన్నకేశవున్ని సూర్య కిరణాలు తాకాయని దేవస్థానం అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి తెలిపారు. మండలంలోని జంపని గ్రామంలో చెన్న కేశవాలయంలో మంగళవారం ఉదయం ఏడున్నర గంటలకు మూలవిరాట్ స్వరూపం చెన్నకేశవున్ని సూర్యకిరణాలు తాకాయి పాదాల నుంచి కిరీటం వరకు స్వామి వారి ప్రతి అంగాన్ని తాకుతూ 40 నిమిషాలకు పైగా సూర్య భగవాసుడు కేశవున్ని స్పృశించాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచుగా స్వామి వారిపై సూర్య కిరణాలు పడుతుంటాయని అర్చకులు తెలిపారు.
నృసింహుడిని దర్శించుకున్న శృంగేరి ప్రతినిధులు
అద్దంకి రూరల్: పుణ్యక్షేత్రమైన శింగరకొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని మంగళవారం శృంగేరి ప్రతినిధులు సందర్శించారు. మేనెల 19వ తేదిన నిర్వహించనున్న మహా కుంభాభిషేకం సందర్భంగా పిఠాధిపతులు విచ్చేయుచున్నందున ముందుగా వారి ప్రతినిధులు లక్ష్మీ నరసింహాస్వామిని సందర్శించారు. వారిని కార్యనిర్వాహణాధికారి, అర్చకులు ఆలయ సంప్రదాయాలు ప్రకారం ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దెబ్బతిన్న ఉద్యాన పంటలు