సాక్షి, హైదరాబాద్ : ఇల్లు ఖాళీ చేయడం లేదన్న సాకుతో సదరు ఇంటి యజమాని దౌర్జన్యానికి దిగాడు. కిరాయిదారుడి కుటుంబాన్ని గదిలో బంధించాడు. రౌడీ మూకలతో దాడి చేయించాడు. అడ్డుచెబితే పిల్లలను చంపివేస్తామని బెదిరింపులకు పాల్పడిన ఘటన గురువారం ఉదయం కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని దాష్టీకం వెనుక అధికార టీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్త హస్తం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు.
బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. కడప జిల్లా వేంపల్లెకు చెందిన కొక్కంటి మోహన్‌రెడ్డి మూడేళ్లుగా కేపీహెచ్‌బీ కాలనీ మూడో ఫేజ్ ఎంఐజీ 6/1లోని ఎంఎల్‌ఎం ప్రసాద్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. 12 ఏళ్ల కాలానికి లీజ్ అగ్రిమెంట్ చేసుకున్న అతను అద్దె ఇంటికి దాదాపు రూ.4.లక్షలతో మరమ్మతులు చేయించి, టాటా స్కై డిస్ట్రిబ్యూషన్ కేంద్రం కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రసాద్ సదరు ఇంటిని మరొకరికి విక్రయించడంతో కొనుగోలు చేసిన వ్యక్తులు ఇంటిని ఖాళీ చేయాలని మోహన్‌రెడ్డిపై ఒత్తిడి చేయగా, తనకు 12 ఏళ్ల అగ్రిమెంట్ ఉన్నట్లు చెప్పడంతో వారు వెళ్లిపోయారు. ఏడాది క్రితం ఇంటిని కొనుగోలు చేసిన గోపాల శ్రీహరి అనే మరో వ్యక్తి ఇల్లు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నాడు.
ఈ వివాదం స్థానిక కార్పొరేటర్ కావ్య భర్త హరీష్‌రెడ్డి వద్దకు చేరగా, ఆయన మోహన్‌రెడ్డిని పిలిపించి ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించడమేగాక కాగితాలపై సంతకం చేయాలని ఒత్తిడి చేసినట్లు మోహన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మోహన్‌రెడ్డి ఇంటి యజమాని శ్రీహరికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించి స్టేటస్‌కో ఉత్తర్వులు తెచ్చుకోవడంతో అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది. గత నెల 11న కోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులు పొడించకపోవడంతో ఇదే అదనుగా భావించిన ఇంటి యజమాని శ్రీహరి గురువారం ఉదయం 50 మంది అనుచరులనతో కలిసి ఇంటిపై దాడిచేశాడు. మోహన్‌రెడ్డి, అతని భార్య, బిడ్డను వంట గదిలో బంధించి సామాను బయట పారేశారు. ఇంటి గోడలను యంత్రాల సహాయంతో కూల్చివేయించాడు. చుట్టుపక్కల వారు వచ్చి నిలదీయగా.. తాము కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నట్లు చెప్పారు.
వంట గదిలో నుంచి మోహన్‌రెడ్డి, భార్య సంధ్య కేకలు వేయడంతో బిడ్డను చంపేస్తామని బెదిరించారు. భయాందోళనకు గురైన వారు పక్కింటి వారికి సమాచారం ఇవ్వడంతో వారు పోలీస్ కంట్రోల్ రూం కు ఫిర్యాదు చేశారు. అప్పటికే శ్రీహరి ఇంట్లోని విలువైన వస్తువులు, నగలు, నగదు, చెక్కు బుక్‌లు, దస్తావేజులతో పాటు సీసీ కెమె రాలు, డీబీఆర్‌లను తీసుకెళ్లారని, దీనిపై కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మోహన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, ఇల్లు అమ్మిన వ్యక్తిని, కొనుగోలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ కుషాల్కర్ తెలిపారు.
ఎమ్మెల్యే ఆర్థికసాయం
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఇంటి మరమ్మతుల కోసం మోహన్‌రెడ్డికి రూ.50 వేలు అందజేశారు.
హరీష్‌రెడ్డి బెదిరించాడు: సంధ్య
బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల కావ్య భర్త హరీష్‌రెడ్డి తమను ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారని మోహన్‌రెడ్డి భార్య సంధ్య మీడియాకు తెలిపారు. తమకు రక్షణ కావాలని, తాము సంపాదించుకున్న డబ్బు, నగలు దోచుకెళ్లారని బోరున విలపించింది.
Comments
Please login to add a commentAdd a comment