కరువన్నదే కానరాలేదు..
గత మూడేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కరువు లేదు. ఒక్క మండలాన్ని కూడా కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. ప్రతి రిజర్వాయర్ సకాలంలో నిండి కళకళలాడింది. అనంతపురం లాంటి కరువు జిల్లాతో సహా అన్ని చోట్లా భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. కృష్ణా, గోదావరి డెల్టాతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమకు మూడేళ్లుగా అత్యధికంగా సాగు నీరిచ్చాం. నేల తల్లి, వ్యవసాయం, మన గ్రామం, మన సంస్కృతి, రైతు కూలీలు, రైతుల కష్టంపై అవగాహన, మమకారం ఉండాలి. కానీ గత పాలకులకు ఇవేవీ లేవు.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఖరీఫ్ మొదలు కాకముందే.. వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే.. జూన్ కంటే ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా, వాచా, కర్మణా గట్టిగా నమ్మి మూడేళ్లుగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు. రైతుల స్థితిగతులను మార్చేలా గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టి క్రమం తప్పకుండా క్యాలెండర్‌ను అమలు చేస్తున్నామన్నారు.
సోమవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో వైఎస్సార్ రైతు భరోసా కింద 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికీ రూ.5,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ నేరుగా జమ చేశారు. పథకం కింద ఈ నెలాఖరున అందించే సాయంతో కలిపితే మొత్తం రూ.3,758 కోట్లు రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయంగా జమ కానున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఆ వివరాలివీ..
చిరు ధాన్యాలతో తయారు చేసిన పదార్థాలను రుచి చూస్తున్న ముఖ్యమంత్రి జగన్
ఆర్వోఎఫ్‌ఆర్, కౌలు రైతులతో సహా..
వైఎస్సార్ రైతు భరోసాను అర్హులైన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి, కౌలు రైతులకు, దేవదాయ భూములు సాగు చేస్తున్న రైతులకు, ఆర్వోఎఫ్‌ఆర్ (అటవీ భూములు) సాగు చేస్తున్న రైతులందరికీ అమలు చేస్తున్నాం. వరుసగా మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగో ఏడాది రైతు భరోసా సాయాన్ని ఇవాళ గణపవరం వేదికగా విడుదల చేస్తున్నాం. తొలి విడత కింద ఖరీఫ్ సీజన్ మొదలుకాక ముందు మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో మొత్తం రూ.13,500 ఏటా అందచేస్తున్నాం.
రైతన్నలకు మూడేళ్లలో రూ.1,10,093 కోట్లు
నాలుగో ఏడాది మొదటి విడత సాయంగా ఇవాళ రూ.5,500 గణపవరం నుంచి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. పీఎం కిసాన్ పథకంలో భాగంగా మరో రూ.2 వేలను నెలాఖరుకి కేంద్రం విడుదల చేస్తుంది. ఏటా 50 లక్షల మందికిపైగా రైతన్నలకు సుమారు రూ.7 వేల కోట్లను ఒక్క రైతు భరోసా పథకం ద్వారానే అందిస్తున్నాం.
ప్రస్తుతం అందిస్తున్న సాయాన్ని కూడా కలిపితే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే వైఎస్సార్ రైతు భరోసా కింద దాదాపు రూ.23,875 కోట్లను రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసినట్లైంది. రైతు కష్టం తెలిసిన మీ బిడ్డగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వివిధ పథకాల ద్వారా ఈ మూడేళ్లలో రైతులకు రూ.1,10,093 కోట్ల మేర లబ్ధి చేకూర్చాం.
రికార్డు స్థాయిలో దిగుబడి
గత మూడేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగింది. చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 154 లక్షల టన్నులు కాగా గత మూడేళ్లలో సగటున 170 లక్షల టన్నులకు దిగుబడి పెరిగింది. వడ్డీలేని రుణాలకు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం రూ.782 కోట్లు ఇవ్వగా ఇప్పుడు మూడేళ్లలోనే రూ.1,282 కోట్లు అందచేశాం.
పారదర్శకంగా ఈ–క్రాప్, పరిహారం
దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని విధంగా పంట నష్టపోతే అదే సీజన్ ముగిసేలోగా నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. పారదర్శకంగా ఈ–క్రాప్ అమలు చేస్తున్నాం. ఉచిత పంటల బీమాతో ఆదుకుంటున్నాం.
దురదృష్టవశాత్తూ..
రైతులకు మేలు చేయాలనే మంచి మనసుతో ఆలోచన చేస్తున్నాం. అయినా కూడా దురదృష్టవశాత్తూ కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కుటుంబాలను గత పాలకుల్లా వదిలేయకుండా, సాకులు చెప్పకుండా... పట్టాదారు పాసు పుస్తకం ఉన్నా, కౌలు రైతులకు సీసీఆర్టీ కార్డులున్నా బాధిత కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తున్నాం.
ఇంత పారదర్శకంగా చేస్తుంటే చంద్రబాబు దత్త పుత్రుడైన ఓ పెద్ద మనిషి రైతు పరామర్శ యాత్రకు బయలుదేరారు. కానీ ఆ యాత్రలో పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండి రూ.7 లక్షలు పరిహారం అందని ఒక్క రైతును కూడా ఆయన చూపించలేకపోయారు.
మనసు లేని నాయకుడు..
రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న నాయకుడు, వ్యవసాయం దండగన్న నాయకుడు, రైతుల గుండెలపై గురిపెట్టి బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి చంపించిన నాయకుడు చంద్రబాబే. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను తొలి సంతకంతో రుణమాఫీ చేస్తానని నమ్మించి ఐదేళ్లలో కేవలం రూ.15 వేలు కోట్లు మాత్రమే విదిల్చాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మి రైతులు మోసపోగా, తాకట్టుపెట్టిన వారి బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నా మనసు కరగని నాయకుడు చంద్రబాబు.
Comments
Please login to add a commentAdd a comment