కౌలు రైతు అనాథే | Sharecroppers has become orphans to get on farmers loan waiver | Sakshi
Sakshi News home page

కౌలు రైతు అనాథే

Published Tue, Jan 6 2015 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

కౌలు రైతు అనాథే

కౌలు రైతు అనాథే

* అరకొరగానైనా రుణ మాఫీ పొందిన కౌలు రైతు అరుదే
* కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇచ్చిందే అతి తక్కువ
* తొలుత కౌలు రైతుల రుణాలే మాఫీ అంటూ చంద్రబాబు ఆర్భాటం
* కానీ కౌలు రైతుకు రూపాయి కూడా మాఫీ అయిన దాఖలాలే లేవు
* నిలువునా మోసపోయామంటున్న కౌలురైతులు
* బ్యాంకు నోటీసులు, ప్రయివేటు అప్పులతో కుదేలు
* కాడి కింద పడవేయక తప్పదంటున్న కౌలు రైతులు
* సాక్షి నెట్‌వర్క్ క్షేత్రస్థాయిలో నిర్వహించిన కేస్ స్టడీస్‌లో వాస్తవాలు

 
చంద్రబాబు సర్కారు రుణ మాఫీ మాయాజాలంలో ఇది మరో కోణం! అరకొరగా విదిల్చిన రుణ మాఫీ సొమ్ము.. రైతులు తమ సొంత భూములపై తీసుకున్న అప్పులకు ఇప్పటివరకూ అయిన వడ్డీకి కూడా ఏ మూలకూ రాలేదు. వ్యవసాయం కోసం తాకట్టు పెట్టిన పుస్తెలు, తాళిబొట్లు విడిపించి తెస్తానన్న మాట.. నీటి మూటగానే మిగిలిపోయింది. ఒక్కటంటే ఒక్క పుస్తెల తాడు కూడా విడిపించలేదు. ఇక.. ‘ఒక పొలంపై భూ యజమాని, కౌలు రైతు ఇద్దరూ రుణం పొంది ఉంటే మాఫీ కౌలురైతుకే వర్తిస్తుంద’ని చంద్రబాబు ప్రభుత్వం గంభీరమైన ప్రకటనలు చేసింది.
 
 ఆచరణలో చూస్తే.. కౌలురైతు అనాథగానే మిగిలిపోయాడు. వారు తీసుకున్న రుణాల్లో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రుణాలు మాఫీ చేస్తానంటూ ఎన్నికల్లో ఊరూ వాడా హామీలు గుప్పించిన చంద్రబాబు అందలం ఎక్కాక ఇంత మోసం చేస్తాడనుకోలేదంటూ కౌలు రైతులు బిక్కమొహం వేస్తున్నారు. ‘‘మాకు బ్యాంకులు రుణాలు ఇవ్వడమే తక్కువ.. ఆ తక్కువ రుణాలను కూడా మాఫీ చేయకుండా మమ్మల్ని బ్యాంకులు, రెవెన్యూ ఆఫీసులు, జిరాక్సు సెంటర్ల చుట్టూ చంద్రబాబు తిప్పుతున్నాడు’’ అని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రుణమాఫీ అమలులో కౌలు రైతుల స్థితిగతులను ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. రుణమాఫీ వల్ల సంతృప్తి చెందిన ఒక్క కౌలు రైతు కుటుంబమూ కనిపించలేదు. కనీసం పేద కౌలు రైతులకున్న రూ. 10 వేలు, రూ. 15 వేలు రుణాలు కూడా మాఫీకి నోచుకోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 
 కౌలు రైతు కార్డులు, ఆధార్ కార్డులు వంటి అవసరమైన పత్రాలన్నీ సమర్పించినా రుణ మాఫీ ఎందుకు కాలేదని వారు అడిగితే.. సమాధానం చెప్పే వారే కరువయ్యారు. అదేమంటే ఆ ఆఫీసుకు వెళ్లు, ఈ ఆఫీసుకు వెళ్లు అని వాళ్లు కాళ్లరిగేలా తిప్పుతున్నారు. రెండు మూడేళ్లుగా అధిక వర్షాలు, తుపానుల తాకిడికి, వర్షాభావ పరిస్థితుల్లో పంటలు చేతికందక అప్పుల్లో మిగిలిన కౌలు రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. భూ యజమానులకు ముందస్తు కౌలు చెల్లించలేక, బయట ప్రైవేటు అప్పులు పుట్టక, బ్యాంకులు జారీ చేసే నోటీసులతో.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటను నమ్మి నిలువునా మోసపోయామని వాపోతున్నారు.
 - సాక్షి నెట్‌వర్క్
 
 ప్రభుత్వ నిర్లక్ష్యం.. బ్యాంకుల నిరాదరణ...
 ప్రభుత్వాల నిర్లక్ష్యం, బ్యాంకుల నిరాదరణ కారణంగా కౌలు రైతులు చాలా కాలంగా వ్యవస్థాగత రుణాలకు (బ్యాంకు) దూరంగానే ఉన్నారు. ఉదాహరణకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో 14.55 లక్షల మంది కౌలురైతులకు ‘ఎల్‌ఈసీ’ల (రుణ ఆర్హత కార్డులు) జారీ లక్ష్యంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
 
 అయితే చివరకు జారీ చేసింది మాత్రం 4.39 లక్షల మందికే. పోనీ వీరికైనా బ్యాంకు రుణాలు అందాయా అంటే అదీలేదు. వీరిలో కేవలం 1.14 లక్షల మందికి మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. 2013-14 ఖరీఫ్‌లో రూ. 31,996 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే, అందులో రూ. 26,609 కోట్లు (83 శాతం) పంట రుణాలిచ్చారు. ఇందులో కౌలురైతులకు ఇచ్చిన రుణ మొత్తం రూ. 231.70 కోట్లు మాత్రమే. 2013-14 ఖరీఫ్‌లో బ్యాంకులు ఇచ్చిన మొత్తం పంటరుణాల్లో కౌలు రైతులకు దక్కింది కేవలం 0.87 శాతం మాత్రమే. ఈ కొద్దిపాటి రుణాలను మాఫీ చేయడానికి కూడా చంద్రబాబుకు చేతులు రావడంలేదు. ఇదమిత్థమైన కారణాలు ఏమీ తెలపకుండానే వీరు మాఫీ మాఫీకి అర్హులు కాదంటున్నారు. మేం ఎందుకు అర్హులం కాదన్న కౌలు రైతుల ప్రశ్నకు అటు బ్యాంకులు కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ సమాధానం చెప్పడం లేదు.  
 
 రైతుల ఆగ్రహాన్ని బ్యాంకులపైకి మళ్లించే ఎత్తుగడ...
 కౌలు రైతులకు రుణమాఫీ వర్తింప చేయడంలో ఇన్ని అవకతవకలు చోటుచేసుకుంటుంటే వాటిని సరిదిద్దాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా.. బ్యాం కులపై తిరగబడమంటూ రైతులకు సలహాలిస్తోంది. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రే ‘రుణాలు మాఫీ చేయకపోతే బ్యాంకుల ముందు ఆందోళనలు చేయండి. పోలీసు కేసులు లేకుండా మేం చూసుకుంటాం’ అనడంలోని పరమార్థం ఇప్పుడిప్పుడే రైతులకు అర్థమవుతోంది.రుణమాఫీలోని డొల్లతనం కారణంగా వ్యక్తమయ్యే ఆగ్రహావేశాలను ప్రభుత్వం వైపు కాకుండా బ్యాంకుల వైపు మళ్లించే చౌకబారు ఎత్తుగడే ఇది అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రుణమాఫీ వర్తించక, బ్యాంకుల్లో కొత్త రుణాలు పుట్టకపోతే కాడి కిందపడేయాల్సిందే అని కౌలు రైతు అంటున్నాడు.  
 
 పేరు: శేఖన్న
 ఊరు: కర్నూలు జిల్లా  బేవినహాల్
 కౌలు పొలం: 5 ఎకరాలు
 రుణం: రూ. 10,000,
 మాఫీ: ఒక్క పైసా కూడా కాలేదు
 కారణం: తెలీదు
 
 బాబు వచ్చాక అప్పుపోతుందనుకున్నా..
 ‘‘మూడేళ్ల కిందట.. నాతో సహా ఐదుగురు కౌలు రైతులను గ్రూపుగా చేసి ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున హాలహర్వి ఇండియన్ బ్యాంకు వారు రూ. 50,000 అప్పు ఇచ్చారు.  మూడేళ్లుగా  చెల్లిస్తూ వచ్చాం. చంద్రబాబు వచ్చాక అప్పు పోతుందని కట్టలేదు.  అన్ని పత్రాలను బ్యాంకుకు ఇచ్చాను. అయినా అప్పు పోలేదు. ఇప్పుడేమో అసలు,వడ్డీ కూడా కట్టమంటున్నారు.  .’’  
 
 పేరు: యనమదల సత్యనారాయణ
 ఊరు: తూ.గో. జిల్లా మామిడికుదురు,
 కౌలు భూమి: 70 సెంట్లు
 రుణం: రూ. 10,000
 మాఫీ: పైసా కూడా కాలేదు
 కారణం: ఎవరూ చెప్పటం లేదు
 
 మాఫీ హామీని నమ్మి మోసపోయా
 ‘‘నేను 70 సెంట్లు భూమి కౌలుకు తీసుకుని వరి వేశాను.  మా ఉళ్లో ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకులో రూ. 10 వేలు రుణం తీసుకున్నాను. మాఫీ అయిపోతుందన్న నమ్మకంతో రుణం చెల్లించలేదు. అన్ని పత్రాలిచ్చినా మాఫీ కాలేదు. ఇప్పుడు కొత్తగా రుణం పొందే అవకాశం లేదని బ్యాంకు అధికారులు అంటున్నారు. రుణ మాఫీ హామీని నమ్మి మోసపోయాను. కొత్తగా అప్పు తీసుకుని వ్యవసాయం చేసుకునే వాడిని.’’
 
 పేరు: బెలగాపు చిన పండయ్య
 ఊరు: విజయనగరం జిల్లా
 జియ్యమ్మవలస మండలం మరువాడ
 కౌలు రుణం: రూ. 50,000
 (మరో నలుగురు రైతులతో కలిసి)
 వడ్డీ: రూ. 10,000, మాఫీ: కాలేదు
 
 అన్నిపత్రాలిచ్చినా.. పైసా మాఫీ కాలేదు!
 ‘‘నాతోపాటు మాగ్రామానికి చెందిన బెలగాం సోములు, రాములు, మండంగి నర్శింహులు, పారయ్య తదితరులంతా కలిపి ఉమ్మడి కౌలు కార్డుతో జియ్యమ్మవలస వికాస్ గ్రామీణ బ్యాంకులో 2012-13లో  రూ. 50,000 వ్యవసాయ రుణం తీసుకున్నాం. రూ. 10,000 వడ్డీ అయ్యింది. చంద్రబాబు ప్రకటనతో అప్పు తీరిపోతుందని ఆశించి ఓటేశాం. పత్రాలన్నీ ఇచ్చాం. అయితే మాకు పైసా కూడా రుణ మాఫీ కాలేదు. ’’
 
 పేరు: పల్లంరెడ్డి సాయిమోహన్‌రెడ్డి
 ఊరు: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం
 కౌలు పొలం: 7 ఎకరాలు
 రుణం: రూ. 50వేలు,
 మాఫీ:  కాలేదు, కారణం:తెలియదు
 
 విముక్తి పత్రం ఇచ్చి.. మాఫీ కాలేదన్నారు!
 ‘‘ఏడెకరాల పొలం కౌలు తీసుకున్నాను. నాలుగెకరాల కు రూ.50 వేల రుణం తీసుకొని వరి పంట వేశాను. ఇటీవల రుణవిముక్తి పత్రమిచ్చారు. కానీ  గతనెల 25న నోటీసు పంపారు. ఆధార్ వివరాలు సక్రమంగా లేవని.. మాఫీ వర్తించలేదని బ్యాంకు అధికారులు చెప్పారు. కానీ వివరాలు సక్రమంగానే ఉ న్నాయి. అప్పు చెల్లించకపోతే కోర్టుకు వేస్తామంటున్నారు.’’
 
 పేరు: కలిగినీడి దుర్గాదత్
 ఊరు: పశ్చిమగోదావరి జిల్లా
 నరసాపురం
 రుణం: రూ. 15,000
 మాఫీ: రూపాయి కూడా కాలేదు
 కారణం: తెలియదు
 
 ఎంత తిరిగినా.. ప్రయోజనం లేదు
 ‘‘2012 సెప్టెంబర్‌లో నరసాపురం సహకార వ్యవసాయ పరపతి సంఘంలో రూ. 15,000 అప్పు తీసుకున్నాను. మాఫీ అవుతుందని ఆశగా ఎదురు చూసాను. అయితే పైసా కూడా రుణ మాఫీ జరగలేదు. ఆరా తీస్తే.. పాస్‌బుక్ నెంబర్ తప్పుగా ఉందన్నారు.  ఏదోరకంగా రుణ మాఫీ చేయకూడదనే ఇదంతా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రుణ మాఫీ పేరుతో మమ్మల్ని మోసం చేసారు.  
 
 పేరు: శనివాడ అప్పారావు.
 ఊరు: విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట
 కౌలు పొలం: 2.5 ఎకరాలు
 రుణం: రూ. 40,000
 వడ్డీ: రూ. 12,000
 మాఫీ: రూపాయి కూడా కాలేదు
 
 ఎంతో ఆశపడ్డాను.. ఏమీ తీరలేదు...
 ‘‘నా సొంత పొలం అర ఎకరాతో పాటు, రెండున్నర ఎకరాల మెరక భూమిని ఆరేళ్లుగా కౌలు చేస్తున్నాను. కౌలు రైతు కార్డు మీద బంగారాన్ని తాకట్టుపెట్టి 2013లో రూ. 40,000 పంట రుణం తీసుకున్నాను. చెరకే పంట వేస్తే వర్షాలు, తుపాను దెబ్బతీశాయి.  ఇప్పుడు వడ్డీతో కలిసి రూ. 52,000 కట్టాలని, లేకపోతే బంగారం వేలం వేత్తామంటున్నారు బ్యాంకోళ్లు.’’
 
 పేరు: పెరుమాళ్ల కోటయ్య
 ఊరు: గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరు ఎస్సీ కాలనీ
 కౌలు భూమి: 1.99 ఎకరాలు
 రుణం: రూ. 35వేలు,
 వడ్డీ: రూ. 5,347, మాఫీ: కాలేదు
 
 అప్పు ఎలా తీర్చాలో అర్థం కావటంలేదు
 ‘‘నేను 1.99 ఎకరాల కౌలు భూమిలో మిర్చి సాగుచేసా ను. నేను ఆదర్శరైతుగా కూడా పనిచేసాను.  2012 ఆగస్టులో బంగారం తాకట్టు పెట్టి రూ. 35,000 వ్యవసాయ రుణం తీసుకున్నా. వడ్డీతో రూ. 40,347 అయింది. రుణమాఫీ జాబితాల్లో నాకు మాఫీ కాలే దని వచ్చింది. దీంతో బంగారం బయటకు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక  ప్రైవేట్, బ్యాంకు అప్పు ఎలా తీరుదుందో ఏమో.’’  
 
  పేరు: ఈరమ్మ
 ఊరు: కర్నూలు జిల్లా తుంబళబీడు
 కౌలు పొలం: 6 ఎకరాలు
 రుణం: రూ. 15,000
 మాఫీ: రూపాయి కూడా కాలేదు
 కారణం: ఎందుకో తెలియదు
 
 మాఫీ కాలేదు.. పంట రాలేదు..
 ‘‘పదేళ్లుగా గ్రామంలో మా బంధువులకు చెందిన ఆరు ఎకరాల భూమిని నా భర్త, కుటుంబ సభ్యులతో కలిసి కౌలుకు చేస్తున్నాం.  2012-13లో ఆలూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రూ. 15,000 వేలు అప్పు ఇచ్చారు. ఆ అప్పును తిరిగి వడ్డీతో సహా ప్రతి ఏటా చెల్లిస్తున్నాం. రుణమాఫీ అవుతుందని ఈ యేడాది కట్టలేదు. కానీ బాకీ మాఫీ కింద పోలేదు. ఇప్పుడేం చేయాలో ఏమో’’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement