ఏదీ భరోసా..
- కౌలు రైతులకు అందని చేయూత
- రుణఅర్హత కార్డుల లక్ష్యం 40వేలు
- జారీచేసినవి 15,700
- గతేడాది 32 మందికే రుణం
సాక్షి, విశాఖపట్నం: వ్యవసాయం భారంగా మారడంతో అన్నదాతలు కాడిని వదిలేస్తున్నారు. పుడమిని మాత్రమే నమ్ముకున్న కౌలు రైతులు మాత్రం విధిలేని పరిస్థితుల్లో కాలం కలిసొస్తుందనే ఆశతో సాగు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాల మోస పూరిత మాటలకు ఏటా వీరు సమిధలవుతున్నారు. జిల్లాలో 2,79,481 హెక్టార్ల సాగుభూమి ఉంది. దీనిపై ఆధారపడి 4,29,773 మంది సన్న, చిన్నకారు రెతులున్నారు. మరో 44,965 మంది పెద్ద రైతులున్నారు. సన్న, చిన్నకారు రైతుల్లో మూడొంతుల మంది అంటే సుమారు మూడులక్షల మంది కౌలురైతులే.
ఎంత ఎక్కువ సాగువిస్తీర్ణం చేపడితే రైతు అంత ఎక్కువ నష్టపోతున్నాడు. ఒకసారి కాకపోతే మరొక సారైనా పంట కలిసొస్తుందన్న ఆశతో ఏటా కాడినెత్తు కుంటున్నారు. అటువంటి వీరికి బ్యాంకు రుణాలు, రాయితీపై యంత్ర పరికరాలుఅందజేయాలి. బీమా సౌకర్యం కల్పించాలి. కానీ ఆ దిశగా వీరిని ఆదుకునే చర్యలు కానరావడం లేదు. కౌలురైతులకు భరోసా కల్పిస్తూ ఏడాది పాటు వినియోగంలో ఉండేలా రుణ అర్హత కార్డులు (ఎల్‌ఏసీ) జారీ 2011లో అమలులోకి వచ్చింది. ఎటువంటి హామీ లేకుండా ఈ కార్డులపై బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి.
సాగు ప్రారంభమయ్యే నాటికి కార్డుల జారీ పూర్తి చేసి, ఆ వెంటనే ఈ రుణాలు మంజూరుచేయాలి. ఏటా సాగు సగం పూర్తయ్యే వరకు కార్డులు జారీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ కారణంగా పంట ఆఖరి దశలో రుణాలివ్వడానికి బ్యాంకర్లు విముఖత చూపుతున్నారు. ఒక వేళ ముందుగానే దరఖాస్తు చేసుకున్నా.. సవాలక్ష ఆంక్షలతో మోకాలడ్డుతున్నారు. ఏదో ఇచ్చామంటూ కొద్దిమందికిరుణాలు మంజూరు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
దీంతో ఈ కార్డులు నిరుపయోగంగా మారుతున్నాయి. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మేనాటికే జారీచేసి, జూన్ నుంచి కొత్త రుణాలిచ్చేలా చూడాలి. జూన్ నెల పూర్తవుతున్నా జిల్లాలో ఈ ప్రక్రియ నత్తనడనకన సాగుతుంది. జిల్లాలో గతేడాది 10,432 మంది కౌలురైతులకు రుణ అర్హతకార్డులు (ఎల్‌ఏసీ) జారీ చేయగా వీరిలో 32 మందికి మాత్రమే కేవలం రూ.8లక్షల రుణం మంజూరు చేయడం వీరి దుస్థితికి అద్దం పడుతోంది.
ఈ ఏడాది 40వేల మందికి ఎల్‌ఏసీలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు కేవలం 15,700 మందికి మాత్రమే జారీ చేశారు. గతేడాది ఎల్‌ఏసీలు తీసు కున్న వారిలో 3868 మంది మాత్రమే రెన్యువల్ కోసం దరఖాస్తుచేసుకున్నారు. గతేడాది తీసుకున్న వారిలో మూడొంతుల మంది కనీసం దరఖాస్తు కు కూడా ఆసక్తి చూపలేదు. రుణ భరోసా లేక పోవడంతో కార్డులు తీసుకున్న ప్రయోజనం లేదన్న భావనతో కౌలురైతులు అటువైపు కన్నెత్తయినా చూడడంలేదు. తమ సాగు అవసరాల కోసం ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.