సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతులకు అనుకూలంగా తీసుకుంటున్న పలు రకాల చర్యల ఫలితంగా వ్యవసాయ రుణాల్లో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు) తగ్గుముఖం పట్టాయి. ఈ విషయాన్ని 223వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం అజెండా పేర్కొంది. ఇది శుభ పరిణామంగా కమిటీ తెలిపింది. నిజానికి.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్నదాతలకు అన్ని రకాలుగా చేదోడువాదోడుగా నిలుస్తుండడంతో రైతులు సంతోషంగా ఉంటున్నారు.
దీంతో తాము తీసుకున్న అప్పులను ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లించేస్తున్నారు. ఫలితంగా మొండిబకాయిల శాతం ఏటేటా తగ్గుతోంది. నిజానికి.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నవరత్నాల్లో భాగంగా రైతులకు వైఎస్సార్ రైతుభరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, వైఎస్సార్ సున్నావడ్డీ వంటి అనేక పథకాలు ఏటా అమలుచేస్తుండడం.. వర్షాలు కూడా సమృద్ధిగా కురవడంతో వ్యవసాయం లాభసాటిగా మారింది. దీంతో నిర్ణీత గడువులోగా బాకీలు తీర్చడంలో రైతులు గతంలో ఎప్పుడూలేని విధంగా ముందుంటున్నారు.
టీడీపీ తీరుతో అప్పుల ఊబిలోకి..
గత తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి ఆరకొర మాఫీతో రైతులను మోసగించడంతో రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారు. దీంతో వ్యవసాయ రుణాల మొండిబకాయిలు పెరిగిపోయాయి. అయితే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు వైఎస్సార్ రైతుభరోసా క్రమం తప్పకుండా ఇవ్వడంతోపాటు రైతులకు అండగా నిలబడే పలు కార్యక్రమాలు చేపట్టింది.
ఫలితంగా.. వ్యవసాయ రుణాల్లో మొండిబకాయిలు 2019–20లో 3.57 శాతం నుంచి 2022–23 నాటికి 2.60 శాతానికి తగ్గిపోయాయి. ఇందుకు ప్రధాన కారణం.. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు సున్నా వడ్డీ రాయితీని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పునరుద్ధరించి అమలుచేయడమే. అంతేకాక.. గత టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన సున్నా వడ్డీ రాయితీ మొత్తాన్ని కూడా చెల్లించింది. దీంతో రైతులు పంట రుణాలతో పాటు వ్యవసాయ టర్మ్ రుణాలను కూడా సకాలంలో చెల్లిస్తున్నారు.
దీనికితోడు వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల పెట్టుబడి వ్యయం కోసం వైఎస్సార్ రైతుభరోసా పేరుతో ఏడాదికి రూ.13,500లను ఇస్తోంది. అలాగే, పంట నష్టపోయిన రైతులకు ఒకపక్క ఉచిత పంటల బీమాను వర్తింపజేస్తూనే మరోపక్క ఇన్‌పుట్ సబ్సిడీనీ ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. దీంతో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాల్లో మొండిబకాయిలు తగ్గుతున్నాయి.
పెరిగిన వ్యవసాయ రుణాలు..
మరోపక్క.. రైతులు తమ రుణాలను సకాలంలో చెల్లిస్తుండడంతో గత నాలుగేళ్లుగా వారికి వ్యవసాయ రుణాల మంజూరు కూడా పెరిగింది. సకాలంలో అప్పులు చెల్లించిన రైతులకు ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 73,87,602 మంది రైతులకు సున్నావడ్డీ రాయితీని చెల్లించిందని, గత టీడీపీ ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అజెండాస్పష్టంచేసింది. ఇక ఇప్పటివరకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సున్నావడ్డీ కింద రూ.1,834 కోట్లను చెల్లించింది.
ఈ నేపథ్యంలో.. వ్యవసాయ రంగంలో రైతులకు మేలు కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల కారణంగా బ్యాంకులు కూడా వ్యవసాయ రంగానికి రుణాల మంజూరును ఏటేటా పెంచుతున్నాయి. ఉదా.. 2019 మార్చి నాటికి మొత్తం వ్యవసాయ రుణాలు రూ.1,40,034 కోట్లు ఉంటే.. 2022–23 నాటికి అవి రూ.2,34,124 కోట్లకు పెరిగాయి. ఇలా వ్యవసాయానికి అవసరమైన రుణాల మంజూరును బ్యాంకులు పెంచుతుండగా మరోపక్క ఆ రుణాల్లో మొండిబకాయిలు తగ్గుతున్నాయంటే ప్రభుత్వ జోక్యమే కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment