సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి రూ. 20 లక్షల కోట్లు, గొర్రెల కోసం రూ. 23 వేల కోట్ల రుణాలు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గొప్పగా చెప్పుకోవడం శోచనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రుణాలివ్వడమూ సాయమేనా అని శనివారం ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఎరువుల సబ్సిడీ అనాదిగా వస్తున్నదేనని, బీజేపీ పాలనలో కొత్తగా వచ్చింది కాదని పేర్కొన్నారు.
బీజేపీ పాలనలో ఎరువుల సబ్సిడీ తగ్గి, వినియోగం పెరిగిందని విమర్శించారు. రూ.6,300 కోట్లతో ప్రారంభించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి అరబస్తా యూరియానైనా రైతుల కోసం ఉత్పత్తి చేశారా? దానిని మార్కెట్‌లోకి పంపించారా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి వాస్తవాలను దాచిపెట్టి రైతులను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుబంధు కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.65 వేల కోట్లు ఇస్తే, రైతుబంధును అనుకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చింది కేవలం రూ.9,500 వేల కోట్లు మాత్రమేనని వివరించారు.
ఫసల్ భీమా యోజన.. బీమా కంపెనీల ప్రయోజనాల కోసమేనని, ఈ పథకం ప్రీమియం ఎక్కువ.. పరిహారం తక్కువ అని వ్యాఖ్యానించారు. పెంచిన మద్దతుధరల గురించి మాట్లాడుతున్న కేంద్ర మంత్రి, పెరిగిన సాగు ఖర్చుల గురించి మాట్లాడాలని, డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో రైతాంగం నడ్డి విరిగిందని మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అన్న కేంద్రప్రభుత్వం.. రైతుల సాగు ఖర్చులను రెట్టింపు చేసిందని విమర్శించారు.
సాగునీటి ప్రాజెక్టుల గురించి కిషన్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌కు జాతీయహోదా ఇచ్చి నిధులు కేటాయిస్తే, తెలంగాణలో ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాకూ నిధులు కావాలని అడిగిన పాపాన పోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment