రుణం.. రణం.. | formers concern for kareef loans | Sakshi
Sakshi News home page

రుణం.. రణం..

Published Fri, Jul 15 2016 1:49 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

రుణం.. రణం..

రుణం.. రణం..

రైతులకందని ఖరీఫ్ రుణాలు
బ్యాంకుల చుట్టూ చక్కర్లు
అయినా కనికరించని బ్యాంకర్లు
రుణ లక్ష్యం రూ.1,763 కోట్లు
ఇచ్చింది రూ.261 కోట్లే ఆందోళనలో రైతాంగం

రైతులపై బ్యాంకర్లకు కనికరం లేకుండా పోయింది. ఖరీఫ్‌లో పంట సాగుకు సమయం మించిపోతున్నా రుణాలివ్వడం లేదు. రైతన్నలు బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా రేపు, మాపు అంటూ కాలం గడుపుతున్నారు. రుణాల కోసం ప్రజాప్రతినిధులను సైతం ఆశ్రయిస్తున్నారు. దిక్కులేక ప్రైవేట్ అప్పులు చేస్తూ అవస్థల పాలవుతున్నారు. అయితే ఈ ఏడాది పంటల రుణ మంజూరు లక్ష్యం రూ.1,763 కోట్లుగా నిర్ణయించుకున్న బ్యాంకర్లు ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ.261 కోట్లు మాత్రమే. లక్ష్యం బారెడు.. మంజూరు మూరెడు అన్నట్టుగా ఉంది వారి తీరు.

సాక్షి, సంగారెడ్డి: సారూ.. పంటల కాలం షురూ అయ్యి నెలదాటిపాయే.. అప్పు కోసం బ్యాంకోళ్ల కాడికి పోతే రేపిస్తం మాపిస్తం అని తిప్పుకుంటున్నరు.. పైసలు లేకపోతే పంటలు ఎలా యేసుకోవాలే.. జర బ్యాంకోళ్లకు జెప్పి పైసల్ ఇప్పింయ్యుండ్రి సారూ... ఇదీ అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్‌కు బుధవారం అందోలు మండలం పోతిరెడ్డిపల్లి రైతుల నుంచి ఎదురైన అనుభవం.  ఏం చేయాలే బ్యాంకోళ్లు అప్పు ఇయ్యమంటే ఇస్తలేరు.. లాగోడి పైసల కోసం సావుకారి దగ్గరకు పోయి అప్పుదెచ్చుకున్న ఇది సంగారెడ్డి మండలం కలివేముల గ్రామానికి చెందినఓ రైతు ఆవేదన.

 జిల్లాలో ఖరీఫ్ పంటరుణాల పంపిణీ ఆశాజనకంగా లేదు. ఖరీఫ్ కాలం ప్రారంభమై నెల గడుస్తున్నా రుణాల పంపిణీ ఇంకా మందకొడిగానే సాగుతోంది. దీంతో రైతులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. కొత్త రైతులకు రుణాల మంజూరులో జాప్యం జరగటంతోపాటు రుణాల రీషెడ్యూల్ కూడా ఆశించిన స్థాయిలో సాగటంలేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్ 2016-17 సీజన్‌కు రూ.1,763 కోట్ల మేర రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 44,334 మంది రైతులకు రూ.261.9 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. వీటిలో బ్యాంకర్లు 5,079 మంది కొత్త రైతులకు రూ.79.12 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. అలాగే 39,255 మంది రైతులకు సంబంధించి రూ.182.78 కోట్ల రుణాలు రీషెడ్యూల్ చేశారు. ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభంగానే రైతులు రుణ సహాయం కోసం బ్యాంకుల వైపు చూస్తారు. ఇందుకు అనుగుణంగానే జిల్లా యంత్రాంగం, బ్యాంకర్లు రుణ ప్రణాళికను ప్రకటించి అందుకు అనుగుణంగా రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.

 లక్ష్యానికి దూరంగా బ్యాంకర్లు...
జిల్లాలో  రెండు, మూడేళ్లుగా బ్యాంకర్లు లక్ష్యానికి అనుగుణంగా ఖరీఫ్ రుణాలు పంపిణీ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది సైతం ఖరీఫ్ రుణాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. వర్షాలు కురుస్తుండటంతో రైతులు పంటల సాగుపై దృష్టి సారించారు. వ్యవసాయ పనులు, ఎరువులు, విత్తనాలు కొనుగోలు కోసం పెట్టుబడి అవసరం. ఇందుకోసం రైతులు బ్యాంకు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయకుండా బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. రుణమాఫీ సొమ్ము జమకాకపోవటం, రుణ బకాయిలను సాకుగా చూపుతూ బ్యాంకుర్లు రుణాల రీషెడ్యూల్ చేయటంలోనూ జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విధిలేక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు డబ్బులు అప్పులు తెచ్చుకుని వ్యవసాయ పనులు కొనసాగించాల్సి వస్తోంది. బ్యాంకర్లు రైతుల అవస్థలను గుర్తించి విరివిగా రుణాలు ఇవ్వాలని  రైతు సంఘాలు కోరుతున్నాయి.

 మంజూరు చేయని బ్యాంకులు 13...
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 31 బ్యాంకులు రైతులకు రుణాలు రూ.1763.58 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. లీడ్‌బ్యాంకు సేకరించిన వివరాలను అనుసరించి ఇప్పటి వరకు 13 బ్యాంకులు రుణాల మంజూరు, రుణాల రీషెడ్యూల్ ప్రారంభించలేదు. ఇప్పటివరకు రూ.261.9 కోట్ల రుణాలు పంపిణీ చేయగా ఇందులో ప్రధానంగా ఏపీ గ్రామీణవికాస్ బ్యాంకు రూ.179 కోట్ల రుణాలు పంపిణీ చేసింది. ఎస్‌బీఐ, ఎస్‌బీహెచ్‌తోపాటు ఇతర వాణిజ్య బ్యాంకులు మందకొడిగానే మంజూరు చేస్తున్నాయి. లీడ్ బ్యాంకు ఇన్‌చార్జి మేనేజర్ రఘురాం మాట్లాడుతూ... వచ్చే రెండు వారాల్లో ఖరీఫ్ రుణాల మంజూరులో వేగం పుంజుకుంటుందని తెలిపారు. ఖరీఫ్‌లో లక్ష్యం మేరకు బ్యాంకులు రుణాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement