Telangana Agriculture Department
-
రైతు సేవలకే మొదటి ప్రాధాన్యం: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుల సేవలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, మార్కెటింగ్ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని శాఖ అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. సోమవారం టీఎన్జీవో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం డైరీ, కేలండర్‌ను తన కార్యాలయంలో నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎనిమిదేళ్లలో పెరిగిన పంటల విస్తీర్ణం, ఉత్పత్తితో మార్కెటింగ్ ఉద్యోగులపై బాధ్యత పెరిగిందని తెలిపారు. పంటల కొనుగోళ్లలో మార్కెటింగ్ ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి ప్రతాప్, మార్కెటింగ్ సంచాలకురాలు లక్ష్మీ బాయి, అడిషన ల్ డైరెక్టర్లు లక్ష్మణుడు, రవికుమార్, టీఎన్జీవోస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యదర్శి ఫసియొద్దీన్ పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కేలండర్ ఆవిష్కరణ వ్యవసాయశాఖ రూపొందించిన నూతన సంవత్సర కేలండర్‌ను మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో సోమవారం నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమానికి వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
యాసంగిలో పత్తి ప్రయోగం
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో పత్తి సాగు చేయించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తోంది. వాస్తవంగా వానాకాలంలోనే పత్తి సాగు చేస్తారు. అదే కాలం అనుకూలం కూడా. కానీ పత్తికి మంచి డిమాండ్ ఉండటంతో యాసంగిలోనూ సాగు చేసే అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిశోధనలు చేసింది. అవి ఫలించాయి. దీంతో దేశంలోనే మొదటిసారిగా యాసంగిలో పత్తిసాగు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. వరికి బదులుగా యాసంగిలో పత్తి సాగు చేయాలని రైతులకు వ్యవసాయశాఖ పిలుపు ఇచ్చింది. మరోవైపు సాగు కోసం భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) అనుమతి కోరింది. ఆ అనుమతి లాంఛనమేనని వ్యవసాయ విశ్వవిద్యాలయ వర్గాలంటున్నాయి. అలాగే.. పత్తి సాగుకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేయాలని కంపెనీలను వ్యవసాయశాఖ అధికారులు కోరినట్లు సమాచారం. ఇది విజయవంతమై మంచి దిగుబడులొస్తే.. మున్ముందు యాసంగిలో వరికి పత్తి ప్రత్యామ్నాయం అయ్యే అవకాశముంది. భారీ లాభాలు ఉన్నందునే..: దేశంలో పత్తి పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. అయితే ఈ ఏడాది వానాకాలం సీజన్లో పత్తి ప్రతిపాదిత లక్ష్యం 70 లక్షల ఎకరాలు కాగా, తీవ్రమైన వర్షాల కారణంగా 50 లక్షల ఎకరాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఇప్పుడు యాసంగిలో కొద్ది మొత్తంలో పత్తిని సాగు చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్ నుంచి పత్తిని వేయించాలని భావిస్తున్నారు. వానాకాలంలో పత్తికి మంచి ధర పలుకుతుంది. మద్దతు ధరకు మించి గతేడాది క్వింటాకు రూ.10 వేల వరకు వచ్చాయి. కాబట్టి యాసంగిలోనూ పత్తిని ప్రోత్సహిస్తే రైతులకు మరింత లాభం ఉంటుందని వ్యవసాయశాఖ భావిస్తోంది. గులాబీ రంగు పురుగు ఆశించే చాన్స్? కాగా, వానాకాలంలో, యాసంగిలో పత్తిని వేయడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ విశ్వవిద్యాలయం పేర్కొంది. వానాకాలంలో పత్తికి గులాబీ రంగు పురుగు పడుతుంది. దీనివల్ల లక్షలాది ఎకరాల్లో దిగుబడి తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వానాకాలం తర్వాత వెంటనే యాసంగిలో వేయడం వల్ల అది కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వానాకాలంలో వేసిన పంటకు నవంబర్లోనే పత్తి పూర్తిగా తీసేయాలని సూచిస్తున్నారు. లేకుంటే గులాబీ రంగు పురుగు ఆశిస్తుందని, అది వెయ్యి కిలోమీటర్ల వరకు పాకుతుందని చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే... యాసంగిలో వేసే పత్తిని గతంలో జనవరి వరకు పరీక్షించారు. ఎండలు కూడా ఇబ్బంది కలిగిస్తాయని నిర్ధారణకు వచ్చారు. అయితే.. పరిశోధనల అనంతరం కొన్ని రకాల జాగ్రత్తలతో యాసంగిలో పత్తి వేయొచ్చని తుది నిర్ణయానికి వచ్చినట్లు విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. గతేడాది యాసంగిలో పత్తి సాగుపై చేసిన పరిశోధనలపై నివేదిక తయారు చేశామని, ఆ మేరకు ఐకార్‌కు ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. దీనిపై కేంద్రం నిర్ణయంతోపాటు జాతీయ విధానం రావాల్సి ఉందని, అనుమతి వస్తే పండిన పంటకు మద్దతు ధర వస్తుందని చెబుతున్నారు. కాగా పత్తి.. ఏ సమయంలో వేయాలన్న దానిపై అధికారులు త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు. -
పత్తికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ఈసారి వానాకాలం సీజన్ సాగు విస్తీర్ణంలో దాదాపు సగం మేరకు పత్తి సాగు చేసేలా రైతులను సన్నద్ధం చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 2022 వానాకాలం సీజన్ వ్యవసాయ ప్రణాళికను ప్రకటించింది. గతేడాది వానాకాలం సీజన్లో 1.29 కోట్ల ఎకరాల్లో పంటలు వేయగా, ఈసారి ఏకంగా 1.42 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పేర్కొంది. అంటే సాగు విస్తీర్ణం 13 లక్షల ఎకరాలు పెరగనుందన్నమాట. మొత్తం 1.42 కోట్ల ఎకరాల్లో ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలో వ్యవసాయ శాఖ ప్రణాళికలో స్పష్టత ఇచ్చింది. ఆ మేరకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఈ వానాకాలం సీజన్లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారు. గతేడాది వానాకాలం సీజన్లో 46.42 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవగా, ఈసారి మరో 23.58 లక్షల ఎకరాలు పెంచేలా ప్రణాళిక రూపొందించింది. -
అగ్రిడేటా.. ఆవిష్కరణల బాట
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో సాంకేతిక ఆవిష్కర ణలను ప్రోత్సహిం చేందుకు దేశంలోనే తొలి సారిగా ‘అగ్రికల్చర్ డేటా మేనేజ్మెంట్’ పాలసీని రూపొందిం చడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి అనుబంధంగా ఉండే ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ‘విధి ఇండియా’, వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో ఈ పాలసీ విధివిధానాలను రూపొందిస్తోంది. కొత్త పాలసీకి సంబంధించి ముసాయిదాను వివిధ ప్రభుత్వ విభాగాలు, సంబంధిత రంగాల నిపుణుల సలహాలు, సూచనల కోసం విడుదల చేశారు. ముసాయిదాకు తుదిరూపు ఇచ్చి మరో పదిరోజుల్లో విడుదల చేసేందుకు ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనడంలో వివిధ ప్రభుత్వ విభాగాల సమాచారం అత్యంత కీలకం. అయితే ఈ సమాచారం వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి సేకరించాల్సిరావడం, సమా చారం ఇవ్వడంలో పారదర్శక విధానాలు లేకపోవడం అగ్రిటెక్ రంగానికి అవరోధంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో సాంకేతిక ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వ విభాగాలు డేటాను పంచు కోవడం లో బాధ్యతతో వ్యవహరించేందుకు ‘అగ్రి కల్చర్ డేటా మేనేజ్మెంట్ పాలసీ’ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవ సాయం, భూ పరిపాలన, నీటిపారుదల, ప్రణాళిక విభాగాలతోపాటు జయ శంకర్ యూనివర్సిటీ, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ (ట్రాక్) వంటి విభాగాల సమాచారం ఒకే చోట లభించేలా ఈ పాలసీ విధి విధానాలు ఉంటాయి. అగ్రిటెక్ ఆవిష్కరణలకు అవకాశాలు ఎన్నో! వ్యవసాయంలో పంటల ప్రణాళిక, వాటి రక్షణ, నీటిపారుదల, పోషకాల యాజ మాన్యం, యాంత్రీకరణ, సాగు విధానాలు, పంట నూర్పిళ్లు, పంటలబీమా, పంట రుణాలు, మార్కెటింగ్ వంటి ఎన్నో అంశాల్లో సాంకేతిక ఆవిష్కరణలకు అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ సాంకేతికతను ప్రోత్సహించేందుకు రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్) ఇటీవల నిర్వహించిన అగ్రి టెక్ సదస్సులో 83కుపైగా స్టార్టప్‌లు పాల్గొనగా, 90కి పైగా ఎమర్జింగ్ టెక్నాలజీ ఆధారిత పరిష్కారా లను సూచించాయి. ఇప్పటికే కృత్రిమ మేథస్సు(ఏఐ) టెక్నాలజీ ఆధారంగా పంటల ప్రణాళిక, సాగు విధానాలు, మార్కెటింగ్‌ల్లో 30కి పైగా అగ్రిటెక్ ఆవిష్కరణలు రాష్ట్రంలో పురుడు పోసుకున్నాయి. సమా చారం వినియోగించే వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరిం చేందుకు ఓ ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ విభాగాల భాగస్వామ్యంతో రైతులు, భూముల వివరాలు, వాతావరణం, భూసారం, చీడపీడలు తదితర అన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చేలా ‘అగ్రికల్చర్ డేటా మేనేజ్మెంట్ పాలసీ’ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఇదిలా ఉంటే ‘అగ్రిటెక్ డేటా మేనేజ్మెంట్ తరహాలో ఆరోగ్యం, రవాణా, స్మార్ట్‌సిటీ రంగాల్లోనూ డేటా మేనేజ్మెంట్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. -
పంటల నమోదుకు ఉపగ్రహబలం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: శాటిలైట్ ద్వారా పంటల నమోదు (క్రాప్ బుకింగ్) ప్రక్రియకు వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. వ్యవసాయ క్షేత్రాల భావన–నిర్ధారణ (ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్ ఆన్ ఫీల్డ్ సెగ్మెంటేషన్) పేరుతో ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. పైలెట్ ప్రాజెక్టు కింద అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 16 గ్రామాలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది గ్రామాలు, మెదక్ జిల్లాలో ఐదు, మహబూబాబాద్ జిల్లాలో మూడు గ్రామాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. రైతులు తమ భూముల్లో ఏయే పంటలు సాగు చేస్తున్నారనే వివరాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్ ద్వారా నమోదు చేస్తారు. సంగారెడ్డి జిల్లాలోని అంకేపల్లి, ఎల్లారం, చందాపూర్, నాగులపల్లి, ఇసోజీపేట, కోడూరు, మంతూరు, పోచారం గ్రామాలలో పంటల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టినట్టు ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ తరహాలో దేశంలోనే ఇది తొలి ప్రాజెక్టు అని వారు చెబుతున్నారు. గ్రౌండ్ యాప్‌లో వివరాలు నమోదు వ్యవసాయ శాఖ వినూత్నంగా చేపట్టిన ఫీల్డ్ సెగ్మెంటేషన్ ప్రాజెక్టును గూగుల్ ఎర్త్ సంస్థ సహకారంతో ప్రారంభించారు. ఇందుకోసం ఆ సంస్థ ప్రత్యేకంగా ‘గ్రౌండ్’యాప్‌ను రూపొందించింది. గూగుల్ ఎర్త్ సంస్థకు చెందిన ప్రత్యేక బృందంతో పాటు, ఏఓలు, మండల వ్యవసాయ శాఖ అధికారులు కలసి పంటల నమోదు ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం ఉపగ్రహం ద్వారా రైతుల పొలాల మ్యాప్ (పాలిగాన్)లను రూపొంది స్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సర్వేనంబర్లతో సంబంధం లేకుండా.. క్రాప్ బుకింగ్ ప్రక్రియలో సర్వే నంబర్లతో సంబంధం ఉండదని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. తొలుత రైతుల భూమికి సంబంధించి మ్యాప్‌లను రూపొందిస్తారు. ఈ పాలిగాన్ ఎంత విస్తీర్ణం ఉంటుంది, అందులో ఎలాంటి పంట వేశారు. రైతు ఎవరు.. వంటి వివరాలు నమోదు చేస్తారు. పైలెట్ ప్రాజెక్టులో లోటుపాట్లను పరిశీలించాక ఇక్కడ విజయవంతమైతే దేశ వ్యాప్తంగా ఈ నూతన విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత విధానంలో కచ్చితత్వం లేదు ప్రస్తుతం రైతులు తమ భూముల్లో ఏయే పంటలు సాగు చేశారు. ఏ సర్వే నంబర్లో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో విత్తుకున్నారు.. వంటి వివరాలను వ్యవసాయ శాఖ ఏఈఓలు గ్రామాలకు వెళ్లి పంటల నమోదు (క్రాప్‌బుకింగ్) చేస్తున్నారు. అయితే ఈ విధానంలో కచ్చితత్వం ఉండటం లేదు. వాస్తవంగా సాగైన పంటలకు, రికార్డులకు పొంతన ఉండటం లేదు. దీంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఏ పంట ఎంత మేర మార్కెట్లోకి వస్తుంది, వాటి కొనుగోళ్లకు ఎలాంటి ప్రణాళిక రూపొందించాలన్న అంశాలపై ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఆయా పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల సరఫరా వంటి ఏర్పాట్లు చేయడంలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల మొక్కుబడిగా.. పంటల నమోదు ప్రక్రియ చాలా చోట్ల మొక్కుబడిగా సాగుతోందన్న విమర్శలున్నాయి. కొందరు సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లడం లేదని, గ్రామంలో ఒక చోట కూర్చుని రైతుల పేర్లు, ఏ పంట వేశారు.. అనే వివరాలను రికార్డుల్లో రాసుకుని వస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు వ్యవసాయ శాఖ శాటిలైట్ ద్వారా పంటల నమోదు ప్రక్రియను చేపట్టిందని చెబుతున్నారు. పంట రంగు, ఎత్తు కూడా గుర్తించే వెసులుబాటు.. ఈ అధునాత క్రాప్‌బుకింగ్ విధానంలో పంట ఏ రంగులో ఉంది, ఎంత ఎత్తు పెరిగింది, ఎక్కడైనా చీడ, పీడలు ఆశించాయా, భూమి స్వభావం ఎలాంటిది.. ఇలా సుమారు 18 నుంచి 20 రకాల అంశాలను గుర్తించవచ్చని ప్రాజెక్టు నిపుణులు వెల్లడించారు. -
తెలంగాణలో సిరుల ‘పంట’.. లక్ష కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అదే స్థాయిలో పంట దిగుబడులూ గణనీయంగా పెరుగుతున్నాయి. కాలం కలిసి రావడం, సాగునీటి వసతులు పెరగడం, ప్రభుత్వం రైతుబంధు కింద అన్నదాతలకు ఆర్థిక సాయం చేయడంతో పరిస్థితి మరింత మెరుగుపడింది. దీంతో 2020-21లో రెండు సీజన్లలో వ్యవసాయ, ఉద్యాన పంటల స్థూల ఉత్పత్తి విలువ (ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి మొత్తం దిగుబడుల విలువ) ఏకంగా రూ.లక్ష కోట్లని ఉద్యానశాఖ తేల్చింది. 2019-20లో మొత్తం పంటల విలువ రూ.89,058 కోట్లని పేర్కొంది. ఏడాది కాలంలోనే అదనంగా పంటల ఉత్పత్తి విలువ రూ. 10,942 కోట్లు పెరగడం విశేషం. ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి.. 2020–21లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 2.09 కోట్ల ఎకరాలు కావడం గమనార్హం. 2014–15 వానాకాలం, యాసంగి కలిపి పంటల సాగు విస్తీర్ణం 1.40 కోట్ల ఎకరాలు. ఈ ఏడేళ్లలో సాగు విస్తీర్ణం ఏకంగా 69 లక్షల ఎకరాలు పెరిగింది. 2020–21 ఖరీఫ్‌లో 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి కాగా, రబీలో దాదాపు 1.35 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా వస్తుందని అంచనా. ఈ యాసంగిలో 65.02 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇది తెలంగాణలో ఆల్‌టైం రికార్డుగా వ్యవసాయశాఖ పేర్కొంది. యాసంగి వరిసాగు కూడా ఆల్‌టైం రికార్డు నమోదైనట్లు వెల్లడించింది. 50.49 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడినట్లు తెలిపింది. యాసంగిలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 22.19 లక్షల ఎకరాలు కాగా, గతేడాది యాసంగిలో 26.97 లక్షల ఎకరాల్లో సాగైంది. అదే ఇప్పటివరకు యాసంగి రికార్డు సాగు. కానీ ఈయేడు యాసంగిలో భారీగా వరి సాగై కొత్త రికార్డును నెలకొల్పింది. వరి సాగు విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌గా నిలిచినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 12.50 లక్షల ఎకరాలు ఉండగా, దాన్ని దీర్ఘకాలికంగా 66లక్షల ఎకరాలకు విస్తరించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. అంటే 5 రెట్లకుపైనే ఉద్యాన పంటలను విస్తరించాలని భావిస్తోంది. 2027 నాటికి ఎగుమతి చేసే స్థాయికి ఆయిల్‌పాం వంట నూనెలను ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో విదేశీ మారకద్రవ్యం కరిగిపోవడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులు నూనె ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆయిల్‌పాం సాగు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలోనూ ఆయిల్‌పాం సాగుపై ఉద్యాన శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయిల్‌ఫాం సాగు విస్తీర్ణం కేవలం 38 వేల ఎకరాలు మాత్రమే. దీంట్లో 2.08లక్షల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి వస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని.. 2026 నాటికి స్వయం సమృద్ధి సాధించాలని, 2027 నుంచి ఎగుమతులు చేసే స్థాయికి చేరుకోవా లని ఉద్యానశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో స్వల్పకాలిక విస్తరణలో భాగంగా 8.52 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం ఆయిల్‌ఫెడ్ సహా వివిధ కంపెనీలకు సాగు ప్రాంతాలను అప్పగించింది. దీర్ఘకాలిక విస్తరణ కింద 15 లక్షల ఎకరాల్లో సాగు, 1.65 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పండ్లు, కూరగాయల సాగు నాలుగున్నర రెట్లు రాష్ట్రంలో పండ్లు, కూరగాయలు సమృద్ధిగా పండటం లేదు. టమాటా సహా అనేక కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నాం. పండ్లదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంలో రాష్ట్రంలో పండ్లు, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని నాలుగున్నర రెట్ల వరకు పెంచాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పండ్ల సాగు విస్తీర్ణం 4.49 లక్షల ఎకరాలు కాగా, స్వల్పకాలిక విస్తరణలో భాగంగా 5.13 లక్షల ఎకరాలకు, మధ్యకాలిక లక్ష్యంలో భాగంగా 10 లక్షల ఎకరాలు, దీర్ఘకాలిక విస్తరణలో భాగంగా 19.50 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఉల్లి సహా అన్ని రకాల కూరగాయల సాగు ప్రస్తుత విస్తీర్ణం 2.73 లక్షల ఎకరాలు కాగా, దీర్ఘకాలికంగా దీన్ని 12 లక్షల ఎకరాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇక సుగంధ ద్రవ్యాల ప్రస్తుత సాగు విస్తీర్ణం 3.73 లక్షల ఎకరాలు కాగా, దీర్ఘకాలికంగా 16 లక్షల ఎకరాలకు విస్తరించాలని భావిస్తున్నట్లు ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. అంటే మొత్తం ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం అదనంగా 53.50 లక్షల ఎకరాలు పెంచాలని దీర్ఘకాలిక లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఉల్లి సాగు లక్ష్యం.. 3 లక్షల ఎకరాలు ఉల్లి లొల్లి నుంచి బయటపడే దిశగా ఉద్యానశాఖ కసరత్తు ప్రారంభించింది. ఉల్లి కోసం మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలపై ఆధారపడే పరిస్థితి ఇక ఉండకూడదని నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో ఉల్లి కొరత ఉంటే, ఇక్కడ ధరలు పెరగడం... ఫలితంగా వినియోగదారులు ఇబ్బందులు పడటం తెలిసిందే. దానికి కారణం రాష్ట్రంలో ఉల్లి విస్తీర్ణం పెద్దగా లేకపోవడమే. ప్రస్తుతం రాష్ట్రంలో 18 వేల ఎకరాల్లోనే ఉల్లి సాగవుతోంది. 1.82 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపులో భాగంగా స్వల్పకాలిక, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను ఉద్యానశాఖ నిర్దేశించుకుంది. ఆ ప్రకారం స్వల్పకాలిక విస్తరణలో భాగంగా 75 వేల ఎకరాలకు ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా 7.90 లక్షల టన్నుల దిగుబడి సాధించాలని నిర్ణయించింది. ఆపై లక్షన్నర ఎకరాలకు ఉల్లి సాగు పెంచి, ఉత్ప త్తిని 16.50 లక్షల టన్నులు చేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక దీర్ఘకాలిక విస్తరణలో భాగంగా 3 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు చేపట్టి, 35 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. -
వరి ఉత్పత్తే 2.54 లక్షల మెట్రిక్ టన్నులు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్రంలో భారీగా ఆహారధాన్యాల ఉత్పత్తి వస్తుందని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఈ మేరకు 2020–21 వ్యవసాయశాఖ కార్యాచరణ ప్రణాళికలో ఉత్పత్తి అంచనాలను పొందుపర్చింది. నైరుతి రుతుపవనాలతో మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు పూర్తి కావడం, నియంత్రిత సాగు పద్ధతులను అనుసరిస్తుండటం వంటి కారణాలతో బంఫర్ క్రాప్ వస్తుందని వ్యవసాయశాఖ ప్రకటించింది. ఈ ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లలో 2.88 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ తెలిపింది. ఇందులో వానాకాలంలో 1.28 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా, యాసంగిలో 1.60 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. గతేడాది ఉత్పత్తితో పోలిస్తే ఈ ఏడాది 44 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఉంటుందని తెలిపింది. కోటి మెట్రిక్ టన్నులు అధికంగా.. ఈసారి వరి ఉత్పత్తే 2.54 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని వ్యవసాయశాఖ తెలిపింది. గతేడాది కంటే కోటి మెట్రిక్ టన్నులు అధికం కావడం గమనార్హం. ఈ వానాకాలంలో 1.21 కోట్ల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 1.33 కోట్ల మెట్రిక్ టన్నులు ఉంటుందని తెలిపింది. రెండు సీజన్లలో కలిపి వరి 81.05 లక్షల ఎకరాలలో సాగవుతుందని అంచనా వేసింది. ఇక పత్తి 60.17 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 14.71 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేశారు. పప్పు ధాన్యాలు రెండు సీజన్లలో కలిపి 8.35 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి వస్తుందని కార్యాచరణ ప్రణాళికలో వ్యవసాయశాఖ పేర్కొంది. -
పంటల వివరాలకు ప్రత్యేక పోర్టల్
సాక్షి, హైదరాబాద్ : వానాకాలం నుంచి నియంత్రిత సాగు విధానం అమలులో భాగంగా రైతు లు, విస్తీర్ణం, పంటల వారీగా వివరాలు నమో దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ గుంట భూమిలోనూ వేసిన పంటల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌లో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఈ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ కె.విజయ్ కుమార్‌ను చీఫ్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా నియమించింది. పంటల సాగు విస్తీర్ణం మాడ్యూల్ రైతులు, పంటలు, సర్వే నంబరు వారీగా వివరాలు నమోదు చేసేందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతో వ్యవసాయ శాఖ ప్రత్యేక మాడ్యూల్‌ను రూపొందించింది. క్రాప్సోన్ ఏరియా మాడ్యూల్ (పంటల సాగు విస్తీర్ణం నమూనా)లో రైతులు, పంటల వివరాలు నమోదు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిపై ముందస్తు అంచనా వేయడం సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఆయా పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడంపై ప్రణాళికలు రూపొందించడం కూడా సులభమవుతుందని అధికారులు చెప్తున్నారు. -
ఆరోగ్యపథం.. సంక్షేమ రథం
సాక్షి, హైదరాబాద్: మూడు నెలలుగా కరోనా వ్యాధి నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించి పనిచేసిన ప్రభుత్వ యంత్రాంగం ఇక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వైపు మళ్లనుంది. వైరస్ కట్టడికి మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటూనే, ప్రగతి కార్యక్రమాలను పరుగులు పెట్టించనుంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరగనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేయనున్నారు. కరోనా వైరస్ నియంత్రణతోపాటు ప్రభుత్వం చేపట్టాల్సిన పలు కార్యక్రమాల అమలుపై ఆయన కలెక్టర్లకు సూచనలు చేసే దిశగా సమావేశపు ఎజెండాను ఖరారు చేశారు. (ప్రొఫెసర్ ఖాసీం విడుదల) ఈ సమావేశంలో నియంత్రిత వ్యవసాయంతో పాటు భూముల ప్రక్షాళన, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, భూసేకరణ, రుణమాఫీ, ఉపాధి హామీ పనులు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, రానున్న వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర పది అంశాలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జరిగే విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు. సేద్యం..రైతులు..భూములు కలెక్టర్లతో నేడు జరిగే సమావేశంలో నియంత్రిత వ్యవసాయం, భూముల ప్రక్షాళన, రైతు రుణమాఫీ అంశాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. రాష్ట్రంలో ఏ పంట ఎంత సాగు చేయాలి?, ఏ ప్రాంతంలో ఎలాంటి పంటల సాగుకు రైతులు అలవాటుపడ్డారు?, ఒకవేళ ఆ ప్రాంతంలో పంటమార్పిడి చేయాలనుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రైతులకు ఆ దిశగా కౌన్సెలింగ్ ఎలా చేయాలనే విషయాలపై కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా నేటి సమావేశానికి వ్యవసాయ శాఖ, జిల్లా రైతుసమన్వయ కమిటీ అధ్యక్షులను కూడా ఆహ్వానించారు. భూముల ప్రక్షాళన అంశంపై కేసీఆర్ ఈ సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములపై హక్కుల మార్పిడి, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, వ్యవసాయ భూములుగా పేర్కొంటూ వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూముల లెక్కలు తేల్చనున్నారు. అలాగే ఇంకా రాష్ట్రంలో జరగాల్సిన భూసేకరణ, ప్రజలకు కనీస అవసరాల కల్పనలో (పట్టణ ప్రాంతాల్లో) భూముల లభ్యత, ఆహారశుద్ధి పరిశ్రమలు, వ్యవసాయ గిడ్డంగులు, ఆగ్రి కాంప్లెక్సుల నిర్మాణానికి భూముల లభ్యతపై కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించనున్నారు. తద్వారా రైతు సంబంధ పరిశ్రమల అభివృద్ధికి బాటలు వేసేలా ఏ జిల్లాలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటుచేయాలనే దానిపై కూడా కలెక్టర్లకు మార్గదర్శనం చేయనున్నారని తెలుస్తోంది. ప్రధాన ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీపై కలెక్టర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు స్థానిక బ్యాంకర్లతో సమావేశమై ఏ మేరకు మాఫీ జరిగిందన్న వివరాలు తీసుకురావాలని కలెక్టర్లకు సమాచారమందింది. ఇంకా ఉపాధిహామీ పథకం అమలు, పనిదినాల కల్పన, జాబ్‌కార్డుల జారీ, పల్లె ప్రగతి అమలుపైనా సీఎం కలెక్టర్లతో చర్చించే వీలుంది. సమావేశ ముఖ్యాంశాలు రైతులకు రుణమాఫీ కరోనా నియంత్రణ చర్యలు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, అగ్రి కాంప్లెక్సులు, గోదాముల నిర్మాణానికి భూముల లభ్యత ప్రభుత్వ అవసరాలకు సేకరించిన భూములను సమగ్ర భూరికార్డుల నిర్వహణ విధానం (ఐఎల్‌ఆర్‌ఎంఎస్)తో సరిపోల్చే అంశం ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌లో అన్ని ప్రభుత్వ ఆస్తుల మార్కింగ్ పంచాయతీల్లో లేఅవుట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విశ్లేషణ ద్వారా వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూముల గుర్తింపు, వాటిని ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌లో నవీకరణ భూసేకరణ తప్పనిసరి అయిన ప్రాజెక్టులు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు పట్టణాల్లో ప్రజావసరాలకు భూముల లభ్యత ఉపాధి హామీ అమలు, జాబ్ కార్డులు, ఉపాధి పనుల కల్పన, పల్లె ప్రగతి వర్షాకాలంలో పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో తీసుకోవాల్సిన చర్యలు -
ఆ విధానం బ్రహ్మ పదార్థం కాదు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : నియంత్రిత పంటల విధానం అంటే బ్రహ్మ పదార్థం కాదు. ఎక్కడ, ఎప్పడు ఏ పంట వేయాలో, ఎంత విస్తీర్ణంలో వేస్తే లాభదాయకంగా ఉంటుందో చెప్పేదే నియంత్రిత పంటల విధానం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మన శాస్త్రజ్ఞులు మంచి దిగుబడి వచ్చే పంటలనే సూచిస్తారని స్పష్టం చేశారు. సోమవారం ఆయన వానాకాలం సీజన్లో వ్యవసాయ సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు మొదలు వ్యవసాయ శాఖకు చెందిన కిందిస్థాయి ఏఈవో నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ప్రాజెక్టులన్నీ పూర్తయితే కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వీటిలో పూర్తిగా వరి పంట వేస్తే నాలుగున్నర కోట్ల టన్నుల వరి దిగుబడి వస్తుందని, అంత పెద్ద మొత్తంలో వరి వస్తే తట్టుకునే శక్తి, బియ్యం తయారు చేసే శక్తి మన రైస్ మిల్లులకు లేదన్నారు. అందుకే ఇతర పంటలను సైతం రైతులు వేసేలా ప్రోత్సహించాలని సూచించారు. పంటలు వేసే ముందు లాభసాటి అంశాన్ని తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. (చదవండి : తెలంగాణలో ఆర్టీసీకి గ్రీన్ సిగ్నల్..!) ‘కరోనా వల్ల ఈ ఏడాది వరి ధాన్యాన్ని కొన్నాము.. కానీ పంటలు కొనడం ప్రభుత్వ విధానం కాదు. ఇప్పుడు రైతులంతా విడిపోయి ఉన్నారు. కానీ సంఘటితం అయితే దేనినైనా సాధించగలం. రాబోయే 15 రోజులలో ప్రతి జిల్లా అధికారులు వ్యవసాయ సంబంధిత పనులు మాత్రమే చేస్తారు. మన రాష్ట్రంలో ఎకరా పత్తి వేస్తే దాదాపు 50 వేల రూపాయల లాభం వస్తుంది. అదేవిధంగా ఒక ఎకరాలో వరి పంట వేస్తే 25 వేల రూపాయల గరిష్టంగా మిగులుతుంది. కనుక పత్తి పంటలో అధిక లాభాలను గడించవచ్చు. గత ఏడాది 53 లక్షల ఎకరాలలో పత్తి పంట వేశాం. ఈసారి 70 లక్షల ఎకరాల దాకా పత్తి సాగు చేయాలి. 40 లక్షల ఎకరాలలో వరి సాగు చేయవచ్చు. ఇందులో దొడ్డు రకాలు.. సన్న రకాల ధాన్యం గురించి అధికారులు నిర్ణయిస్తారు. 12 లక్షల ఎకరాలలో కంది పంట సాగు చేద్దాం.. కందులను రాష్ట్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. ఈ వర్షాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దు. మొక్కజొన్న సాగు చేస్తే రైతుబంధు వర్తించదు. కావాలంటే యాసంగి లో మొక్కజొన్న వేయండి. ఎనిమిది నుంచి పది లక్షల ఎకరాలలో మిర్చి, కూరగాయలు, సోయా, పప్పు ధాన్యాలు ఇతర పంటలు వేయండి. ప్రతి మండలంలోనూ పంటలు సాగు చేసేందుకు ఉండే యాంత్రిక శక్తి ఎంత అనే లెక్క మండల వ్యవసాయ అధికారితో ఉండాలి. రాబోయే రోజుల్లో యాంత్రిక సాయం పైనే వ్యవసాయం ఆధారపడుతుంది. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తుంది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు -
వానాకాలం వ్యవసాయంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్లో వ్యవసాయ సన్నద్ధతపై సీఎం కేసీఆర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లు మొదలు వ్యవసాయ శాఖకు చెందిన కిందిస్థాయి ఏఈవో నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు ఇందులో పాల్గొననున్నారు. అలాగే ఉద్యాన, మార్కెటింగ్ జిల్లా ఉన్నతాధికారులు, మార్క్‌ఫెడ్ మేనేజర్లు, ఆగ్రోస్ రీజనల్ మేనేజర్లు, విత్తన కార్పొరేషన్ జిల్లా మేనేజర్లు, జిల్లా సహకారశాఖ అధికారులు, రైతుబంధు సమితి గ్రామ, మండల, జిల్లా కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. కాన్ఫరెన్స్ ఎజెండా అంశాలను వ్యవసాయశాఖ ఆదివారం జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు అందజేసింది. ఎజెండా అంశాలు ఇవే... గ్రామాలు, మండలాల వారీగా ప్రస్తుత వానాకాలం సీజన్లో సాగు చేయాల్సిన వరి, మేలు రకం విత్తనాలు } గ్రామాలు, మండలాలవారీగా మొక్కజొన్న ప్రత్యామ్నాయ పంటల సాగు, ∙గ్రామాలు, మండలాలవారీగా కంది పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు అవకాశాలపై సలహాలు గ్రామాలు, మండలాలవారీగా పత్తి పంట సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు గల అవకాశాలపై చర్చ ఆయిల్‌పామ్, నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడానికి అనుకూలమైన మండలాలు, గ్రామాల వారీగావివరాలు ∙పచ్చిరొట్టను ప్రోత్సహించడంపై వివిధ రకాల పంటలకు సంబంధించి అందుబాటులో ఉన్న విత్తనాల వివరాలు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ఎరువుల సరఫరా, ప్రస్తుతం అందుబాటులో ఉన్నది ఎంత? జిల్లాలు, మండలాల వారీగా పంటల మ్యాపింగ్ -
పత్తి వేస్తే పంట పండినట్టే!
సాక్షి, హైదరాబాద్: పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే రాష్ట్రంలో వానాకాలం, యాసంగి కలిపి ఏడాదికి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేయాలని వ్యవసాయ రంగ నిపు ణులు ప్రభుత్వానికి, రైతులకు సూచించారు. ఇక వరి కంటే పత్తి పంటే లాభదాయకమని తేల్చి చెప్పారు. తెలంగాణలో వానాకాలం పంటగా 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో కందులు వేయడం మం చిదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శుక్రవారం వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగ నిపుణులు చేసిన ముఖ్యమైన సూచనలివీ... వరిని ఎక్కువగా పండించడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర అవసరాలు, బియ్యం మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో రెండు పంటలకు కలిపి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పండించాలి. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేస్తే రైతుకు ధర రాదు. ఈ 65 లక్షల ఎకరాల్లో సన్న, దొడ్డు రకాలు కలిపి వానాకాలంలో 40 లక్షల ఎకరాలు, యాసంగిలో 25 లక్షల ఎకరాలు సాగు చేయాలి. వరితో పోల్చుకుంటే పత్తి సాగు చాలా లాభదాయకం. కాల్వల ద్వారా వచ్చే నీటితో పత్తిని సాగు చేస్తే ఎక్కువ దిగుబడితోపాటు నాణ్యమైన పత్తి వస్తుంది. వరిలో ఎకరానికి 30 వేల నికర ఆదాయం వస్తే, పత్తి పంటకు ఎకరానికి అన్ని ఖర్చులు పోను 50 వేల వరకు ఆదాయం వస్తుంది. తెలంగాణలో 65 నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు చేయడం శ్రేయస్కరం. కందులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలో వర్షాకాలం పంటగా కందులను 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో సాగు చేయడం ఉత్తమం. వర్షాకాలంలో మక్కలు పండించకపోవడం చాలా మంచిది. వర్షాకాలంలో మక్కల దిగుబడి ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. అదే యాసంగిలో 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు ఉంటుంది. మక్కలకు మార్కెట్లో డిమాండ్ కూడా అంతగా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ అవసరాలకు తగినట్టు యాసంగిలో మాత్రమే మక్కలు సాగు చేసుకోవడం మంచిది. 18న సీఎం వీడియో కాన్ఫరెన్స్... వ్యవసాయరంగ నిపుణులు చేసిన సూచనలపై ప్రభుత్వం చర్చించిన తర్వాత నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసే విధానాన్ని ఖరారు చేస్తుంది. అనంతరం సమగ్ర వ్యవసాయ విధానం, పంటల సాగు పద్ధతులపై క్షేత్రస్థాయి అధికారులు, రైతుబంధు సమితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. వాస్తవానికి శుక్రవారం ఈ వీడియో కాన్ఫరెన్స్ జరగాల్సి ఉండగా.. అది ఈ నెల 18కి వాయిదా పడింది. -
రైతు సంతకంతోనే రుణమాఫీ!
సాక్షి, హైదరాబాద్ : రైతు రుణమాఫీపై కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రైతులు తమ సంతకంతో స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే రుణమాఫీ అమలు చేయాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బ్యాంకుల వద్ద ఉన్న రైతు రుణాలు, వడ్డీ సమాచారంతో ఆ ధ్రువీకరణ పత్రం ఉండాలని అధికారులు అంటున్నారు. ఒకవేళ అలా లేకుంటే ఆయా రైతులకు రుణమాఫీ అమలు చేయడం కుదరదని చెబుతున్నారు. గతంలో రుణమాఫీ అమలు చేసినప్పుడు పారదర్శకతపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అభ్యంతరాలు వ్యక్తం చేసినందున ఈసారి రైతు స్వీయ ధ్రువీకరణ చేయాలని ఆలోచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లేకుంటే గ్రామ సభలు పెట్టి అర్హులైన రైతుల సంఖ్య తేల్చాలన్న నిబంధనను కూడా తెరపైకి తెస్తున్నారు. 2014లో రుణమాఫీ అమలు సమయంలో అర్హులైన రైతుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించినా కొందరు అర్హులకు రుణమాఫీ జరగలేదన్న విమర్శలు వచ్చాయి. రుణమాఫీ అందని కొందరు రైతులు ఉన్నతస్థాయి వరకు వెళ్లి పోరాడారు. అలాగే ఆడిట్ అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. రుణమాఫీ పొందిన వారంతా రైతులనే గ్యారంటీ ఏంటంటూ కాగ్ ప్రశ్నించింది. గ్రామాల్లో జాబితాలు ప్రదర్శించామని వ్యవసాయశాఖ ఇచ్చిన వివరణతో కాగ్ ఏమాత్రం సంతృప్తి చెందలేదని అధికారులు అంటున్నారు. గ్రామ సభలు ఎందుకు నిర్వహించలేదని, రుణమాఫీ లబ్ధిదారులంతా రైతులేనని ఎవరు ధ్రువీకరించారని కాగ్ నిలదీసింది. ఈ నేపథ్యంలోనే రైతుల స్వీయ ధ్రువీకరణ అంశాన్ని వ్యవసాయశాఖ తెరపైకి తీసుకొచ్చింది. దీనివల్ల ఎక్కడైనా అక్రమాలు జరిగితే అప్పుడు రైతునే బాధ్యుడిని చేసే అవకాశముందని అంటున్నారు. దీనిపై ఇప్పుడు ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. మాఫీ సొమ్ము నేరుగా మాకే బదిలీ చేయాలి రుణమాఫీపై బ్యాంకర్లు, అధికారులకు మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత మంది రైతులకు రుణమాఫీ చేయాలి? ఎంత చేయాలి? వడ్డీ వివరాలు ఎలా అమలు చేయాలన్న దానిపై స్పష్టత ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది. అధికార టీఆర్ఎస్ రూ. లక్షలోపు రైతు రుణమాఫీ అమలుకు గతేడాది డిసెంబర్ 11ను కట్ ఆఫ్ తేదీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే అప్పటి వరకు రైతులు తీసుకున్న సొమ్ములో రూ. లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని సర్కారు ప్రకటించింది. అంటే ఏడాదిగా అనేక మంది రైతుల బకాయిలకు వడ్డీ కూడా తోడు కానుంది. దీనిపై ఏం చేయాలన్న దానిపైనా చర్చ జరుగుతోంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ ప్రకటించి అమలు చేసింది. అప్పుడు 35.29 లక్షల మంది రైతులకు రూ. 16,138 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఆ సొమ్మును ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగు బడ్జెట్లలో నిధులు కేటాయించి మాఫీ చేసింది. ఈసారి రుణమాఫీ సొమ్ము మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు. వ్యవసాయ వర్గాల సమాచారం ప్రకారం రూ. 26 వేల కోట్ల నుంచి రూ. 36 వేల కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు. రుణమాఫీ సొమ్మును నేరుగా రైతులకే ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా బ్యాంకర్లు మాత్రం అలా చేయవద్దని, గతంలోలాగా తమకే అందజేయాలని కోరుతున్నారు. ఎలక్ట్రానిక్ కార్డుల పద్ధతి లేదా రైతుబంధు నిధులను నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లోకి వేసినట్లుగా ఏదో ఒక పద్ధతిలో రుణమాఫీ సొమ్మును జమ చేస్తామని అధికారులు చెబుతుండగా అలా చేస్తే రైతులు బకాయిలు చెల్లించరని బ్యాంకర్లు అంటున్నారు. రైతులు ఇతర బ్యాంకు ఖాతాలు చూపించి వాటిల్లో జమ చేసుకునే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. బంగారంపై తీసుకున్న రుణాలపై తర్జనభర్జన రైతులు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాల మాఫీపై తర్జనభర్జన జరుగుతోంది. 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి బంగారంపై తీసుకున్న రుణాలను పంట రుణాలుగా పరిగణించబోమని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బంగారంపై తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తింపజేయాలా వద్దా? అనే చర్చ జరుగుతోంది. దీనిపై బ్యాంకర్ల మధ్యే భిన్నాభిప్రాయాలున్నాయి. ఆర్బీఐ నిబంధన ప్రకారం మాఫీ చేయొద్దని కొందరు అంటుంటే మాఫీ చేయాలని మరికొందరు అంటున్నారు. ఆ ప్రకారం బ్యాంకర్లు వేర్వేరుగా జాబితాలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం 5.56 లక్షల మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ. 5,253 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. ఈ బకాయిలు మాఫీ చేస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 2014లో రుణమాఫీ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసి పట్టణాల్లో గోల్డు లోన్లు తీసుకున్న రైతులకు మాఫీ చేయలేదు. కుటుంబమే యూనిట్‌గా...? 2014లో రుణమాఫీ చేసినప్పుడు కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని రుణమాఫీ చేశారు. 18 ఏళ్లలోపు పిల్లలు ఉంటే తల్లిదండ్రులతో కలిపి ఒక కుటుంబంగా పరిగణించారు. అంతకుమించి వయసుంటే మరో కుటుంబంగా గుర్తించారు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టత లేదు. ఈసారీ కుటుంబం యూనిట్‌గానే రుణమాఫీ చేస్తారని అంటున్నారు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటే సర్కారు ఆర్థిక భారం తగ్గుతుంది. దీనిపై పెద్దగా అభ్యంతరాలు లేవు. కుటుంబమే యూనిట్‌గా రుణమాఫీ జరగవచ్చని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. -
దిగుబడి తగ్గినా.. విత్తన కంపెనీదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్ : పంట దిగుబడి తక్కువైనా విత్తన కంపెనీలే బాధ్యత వహించడంతోపాటు రైతులకు నష్ట పరిహారం చెల్లించేలా చూడాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయశాఖ కీలక ప్రతిపాదన చేసింది. కేంద్ర విత్తన ముసాయిదా బిల్లు–2019పై ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. ప్రైవేటు కంపెనీలు విత్తనాల సామర్థ్యంపై చేస్తున్న అధిక ప్రచారం వల్ల రైతులు వాటిని కొనుగోలు చేసి పంటలపై ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారని సర్కారు పేర్కొంది. తీరా పంట దిగుబడి తక్కువయ్యే సరికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యవసాయశాఖ ఆ సమావేశంలో ప్రస్తావించింది. అందువల్ల నిర్ధారించిన మేరకు పంట దిగుబడి రాకపోతే కంపెనీలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్రం కోరింది. దీనివల్ల కంపెనీల ఇష్టారాజ్య ప్రచారానికి అడ్డుకట్ట వేయొచ్చనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. మరోవైపు విత్తనం ద్వారా పంట నష్టం జరిగితే పరిహారాన్ని వినియోగదారుల రక్షణ చట్టం–1986 ప్రకారం ఆయా కోర్టుల్లో నిర్ధారించాలని ముసాయిదా బిల్లులో పేర్కొన్నారని, దీనివల్ల పరిహారం ఆలస్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ అభిప్రాయపడింది. దానికి బదులుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉండే వ్యవసాయ నిపుణుల కమిటీలు నష్ట పరిహారాన్ని నిర్ధారించాలని కేంద్రానికి ప్రతిపాదించింది. నకిలీ విత్తన దందా అడ్డుకట్టకు అనుమతి అక్కర్లేదు... నకిలీ విత్తనాలు విక్రయించే ముఠాలపై దాడులు చేయడం, ఆయా విత్తనాలను స్వాధీనం చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని కేంద్ర విత్తన ముసాయిదాలో ప్రస్తావించడాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ తప్పుబట్టింది. మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతిని అప్పటికప్పుడు తీసుకోవడం కష్టమని, దీనివల్ల నకిలీ విత్తన విక్రయదారులు తప్పించుకునే ప్రమాదముందని అభిప్రాయపడింది. అందువల్ల ప్రత్యేకంగా అనుమతి అవసరంలేదని సూచించింది. ముసాయిదాపై జరిగిన సమావేశంలో పాల్గొన్న పలు బడా కంపెనీలు కంపెనీకి, ప్రతి విత్తన వెరైటీకి ప్రతి రాష్ట్రంలోనూ రిజిస్ట్రేషన్ చేయాలన్న నిబంధనను ఎత్తేయాలని కోరగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను అంగీకరించొద్దని స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా అన్ని వెరైటీ విత్తనాలు అన్ని రాష్ట్రాల వాతావరణానికి తగ్గట్లుగా ఉండవని, అన్నిచోట్లా పండవని, కాబట్టి ప్రతి రాష్ట్రంలోనూ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని కేంద్రాన్ని కోరింది. ధరల నియంత్రణపై అస్పష్టత విత్తన ధరల నియంత్రణపై ముసాయిదా బిల్లులో అస్పష్టత నెలకొంది. అవసరమైతే విత్తన ధరలను నియంత్రిస్తామని మాత్రమే ముసాయిదాలో ఉంది. దీనివల్ల ధరల నియంత్రణ సక్రమంగా జరిగే అవకాశం ఉండదు. విత్తన ధరలపై స్పష్టమైన నియంత్రణ లేకపోతే కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలను పెంచే అవకాశముంది. దీనిపై ముసాయిదాలో మార్పులు చేయాలని కోరుతాం. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణుడు ఇకపై అన్ని విత్తనాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి... ఇకపై అన్ని రకాల విత్తనాలు, వెరైటీలకు రిజిస్ట్రేషన్ తప్పనసరి చేయడాన్ని ముసాయిదా బిల్లులో ప్రస్తావించడం మంచి పరిణామమని రాష్ట్ర వ్యవసాయశాఖ అభిప్రాయపడింది. ప్రస్తుతం ప్రైవేటు హైబ్రిడ్ విత్తనాల రిజిస్ట్రేషన్ జరగట్లేదని, కొత్త నిబంధన వల్ల ఇది తప్పనసరి అవుతుందని పేర్కొంది. ఖరీఫ్‌లో అన్ని పంటల కంటే పత్తి, మొక్కజొన్నను తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తారని, అవన్నీ ప్రైవేటు హైబ్రిడ్ విత్తనాలేనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ఆయా ప్రైవేటు విత్తనాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయడం వల్ల కంపెనీలకు బాధ్యత ఏర్పడుతుందని అంటున్నారు. మామిడి, మిరప, టమాట తదితర అన్ని రకాల నర్సరీలు కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని ముసాయిదాలో పేర్కొన్నారని వ్యవసాయశాఖ తెలిపింది. -
సిరులు పండాయి!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి రికార్డు స్థాయిలో ఉత్పత్తి అవుతుందని సర్కారు అంచనా వేస్తోంది. 21 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టే దిశగా వరి ఉత్పత్తి కానుందని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది 20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టగా, ఇప్పుడు దాన్ని కూడా దాటేస్తుందని అధికారులు అంచనా. గత ఖరీఫ్‌లో 61.55 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా, ఈ ఖరీఫ్‌లో 66.07 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కానుందని వెల్లడించాయి. 2019–20 ఖరీఫ్ సీజన్ గత నెలాఖరుతో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ పంటల మొదటి ముందస్తు అంచనా నివేదికను అర్థ గణాంక శాఖ తాజాగా విడుదల చేయగా, వివరాలను వ్యవసాయ శాఖ వర్గాలు విశ్లేషించాయి. ఈ ఏడాది 28.75 లక్షల ఎకరాల్లో నాట్లు పడతాయని, 59.57 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ తన ప్రణాళికలో ప్రకటించింది. కానీ నైరుతి రుతుపవనాలతో పెద్ద ఎత్తున వర్షాలు కురవడం, జలాశయాలు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లడంతో 31.67 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. దీంతో వరి రికార్డులను బద్దలుకొట్టనుంది. పత్తి ఉత్పత్తి కూడా భారీనే... ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, 1.10 కోట్ల ఎకరాల్లో సాగయ్యింది. అందులో అత్యధికంగా పత్తి సాగైంది. దాని సాధారణ సాగు విస్తీర్ణం 43.12 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 46.48 లక్షల ఎకరాల్లో (108 శాతం) సాగైంది. పప్పు ధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా... 9.42 లక్షల (91 శాతం) ఎకరాల్లో సాగు చేశారు. పత్తి గతేడాది 41 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా, ఈసారి 45.93 లక్షల బేళ్లు ఉత్పత్తి అవుతుందని సర్కారు అంచనా వేసింది. మొక్కజొన్న 13.79 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని పేర్కొంది. ఇక కందులు 7.11 లక్షల ఎకరాల్లో సాగు కాగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రానున్నట్లు పేర్కొంది. జొన్నలు 42 వేల మెట్రిక్ టన్నులు, పెసర 45 వేల మెట్రిక్ టన్నులు, వేరుశనగ 30 వేల మెట్రిక్ టన్నులు, సోయాబీన్ 2.82 లక్షల మెట్రిక్ టన్నులు, పసుపు 3.14 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కానుందని అంచనా వేసింది. ఉత్పత్తి పెరుగుతుం డటంతో సర్కారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై దృష్టి సారించింది. దీని ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలని నిర్ణయిం చారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు. మరోవైపు నైరుతి సీజన్లో కురిసిన వర్షాలతో రబీ సీజన్ కూడా ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. -
13న రాష్ట్రంలోకి నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకాయి. ఆదివారం ఉదయం కేరళను తాకినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతాలు పూర్తిగా, దక్షిణ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలు, లక్ష దీవుల్లో చాలా ప్రాంతాలు, కేరళ, దక్షిణ తమిళనాడుల్లో కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పుమధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతాల్లో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి, సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. అక్కడినుంచి ఈ నెల 11 లేదా 12 తేదీల్లో రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయన్నారు. అనంతరం 13న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. ఆ తర్వాత ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని పేర్కొన్నారు. వాస్తవంగా రుతుపవనాలు ముందు ప్రకటించినట్లుగా ఈ నెల 6న కేరళలోకి, 11న తెలంగాణలోకి ప్రవేశించాలి. రెండ్రోజులు ఆలస్యంగా కేరళలోకి ప్రవే శించాయి. భూమి వేడి తగ్గితేనే రుతుపవనాలు వేగం గా ప్రవేశిస్తాయని, వాటికి అనుకూల పరిస్థితులు ఏర్పడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది 97 శాతం వర్షాలు... సాధారణంతో పోలిస్తే ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంటే ఆ లెక్కను కూడా సాధారణ వర్షాలుగానే పరిగణిస్తామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో సాధారణ నైరుతి సీజన్ వర్షపాతం 755 మిల్లీమీటర్లు కాగా, 97 శాతం లెక్కన ఈసారి 732 ఎంఎంలు కురిసే అవకాశముంది. గతేడాది ఇదే సీజలో సాధారణ వర్షపాతాలే కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించినా కేవలం 92 శాతమే వర్షం కురిసింది. 2016లోనైతే సాధారణం కంటే ఏకంగా 19 శాతం అధిక వర్షపాతం తెలంగాణలో నమోదైంది. రుతుపవనాలు ఒకసారి ప్రవేశించాక రెండ్రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయి. కొన్నిసార్లు విస్తరించడానికి నాలుగైదు రోజులు పడుతుంది. గతేడాది ఒకేసారి రాష్ట్రమంతటా విస్తరించాయి. కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించడం గత ఆరేళ్ల లెక్కలతో పోలిస్తే ఇప్పుడే మరింత ఆలస్యంగా వచ్చాయి. గతేడాది మే 29న రాగా, 2016లో జూన్ 7న ప్రవేశించాయి. ఇప్పుడు 8న వచ్చాయి. ఉపరితల ఆవర్తనంతో అక్కడక్కడా వర్షాలు.. మరోవైపు తూర్పు పశ్చిమ షియర్ జోన్ దక్షిణ భారత్ మీదుగా 2.1 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల మధ్య కొనసాగుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. ఫలితంగా రాగల మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. మరోవైపు రాగల మూడురోజులు ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గి కాస్తంత ఉపశమనం ఏర్పడింది. రుతుపవనాల రాకకు ముందు కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వివిధ సంవత్సరాల్లో కేరళకు, తెలంగాణల్లోకి చల్లబడ్డ హైదరాబాద్... నైరుతి రుతుపవనాలు నాలుగు రోజుల్లో నగరాన్ని తాకనున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి నగరంలో పలుచోట్ల తేలికపాటి వర్షం కురవటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు శుక్ర, శనివారాల్లో కాసింత ఉపశమనం పొందారు. ఇదిలా ఉంటే శనివారం నగరంలో పగటిపూట 34 డిగ్రీల సెల్సియస్ రికార్డు కాగా, అత్యల్పంగా 22.7 డిగ్రీలుగా నమోదైంది. సాధారణంతో పోలిస్తే 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తక్కువ కావటం విశేషం. కాగా, శుక్రవారం నగరంలో అత్యధికంగా హకీంపేటలో 26.4 ఎంఎం, మేడ్చల్‌లో 17.8 ఎంఎం వర్షం కురిసింది. వ్యవసాయ ప్రణాళిక విడుదలపై అధికారుల నిర్లక్ష్యం... ఖరీఫ్ మొదలైంది. త్వరలో రాష్ట్రంలోకి రుతుపవనాలు రానున్నాయి. రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఆ ప్రకారం వ్యవసాయశాఖ ప్రణాళిక విడుదల చేయాలి. మే నెలలోనే రైతుల ముందుకు తీసుకురావాల్సి ఉండగా ఇప్పటికీ విడుదల చేయలేదు. ఆ ప్రణాళిక ప్రకారమే రాష్ట్రంలో వ్యవసాయశాఖ కార్యక్రమాలు చేపడుతుంది. సాధారణ పంటల సాగు 2019–20 ఖరీఫ్, రబీల్లో ఎంతెంత చేసే అవకాశముందో ప్రణాళికలో వివరిస్తారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న తరుణంలో వచ్చే ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో అదనంగా ఏడెనిమిది లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశముంది. ఆ ప్రకారం ఎంత సాగు పెరిగే అవకాశముందో అంచనా వేస్తారు. అంటే సాధారణ సాగు విస్తీర్ణం, పెరిగే విస్తీర్ణాన్ని ప్రణాళికలో ప్రస్తావిస్తారు. మరోవైపు ఉత్పత్తి, ఉత్పాదకతల లక్ష్యాన్ని కూడా వ్యవసాయ శాఖ తన ప్రణాళికలో ప్రస్తావిస్తుంది. ఎరువులు, విత్తనాల లక్ష్యం, సరఫరాలను ప్రస్తావిస్తారు. కానీ ఇంతవరకు ప్రణాళికను అధికారులు విడుదల చేయకపోవడంపై సర్కారు పెద్దలు గుర్రుగా ఉన్నారు. మరోవైపు రైతుబంధు పథకం కింద నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు ఖరీఫ్‌కు సంబంధించి రెండు విడతల సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. -
పేరుకే నిషేధం!
సాక్షి, హైదరాబాద్: బీజీ–3 పత్తి (హెచ్‌టీ) విత్తనంపై నిషేధం అమలు తూతూమంత్రంగా సాగుతోంది. దీన్ని వినియోగిస్తే కేన్సర్ వ్యాధి వస్తుందని తెలిసినా.. విచ్చలవిడిగా మార్కెట్లో ఈ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. వచ్చేనెల నుంచి ఖరీఫ్ సీజన్ మొదలవుతుండటంతో మళ్లీ రైతులకు వీటిని కట్టబెట్టేందుకు దళారులు సిద్ధమయ్యారు. బీజీ–2కు బీజీ–3 పత్తి విత్తనానికి తేడా గుర్తించని స్థితి ఉండటంతో దీన్నే అవకాశంగా తీసుకొని అక్రమదందాకు తెరలేపారు. రెండు మూడేళ్లుగా ఇదే తీరులో బీజీ–3 పత్తి విత్తనాన్ని గ్రామాల్లో పండిస్తున్నప్పటికీ.. అడ్డుకోవడంలో వ్యవసాయశాఖ ఘోరంగా విఫలమైంది. గతేడాది కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం తెలంగాణలో 15% బీజీ–3 పత్తి సాగైంది. అనధికారికంగా చూస్తే దాదాపు 25% సాగవుతుందని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో సాగవుతున్నా వ్యవసాయశాఖ తూతూమంత్రపు చర్యలకే పరిమితమైంది. ఈ రకం పత్తి విత్తనాన్ని విక్రయించేవారిపై నామమాత్రపు కేసులు పెట్టి వదిలేస్తున్నారు. దీంతో బీజీ–3 పత్తి విత్తన దందాకు చెక్ పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. పైపెచ్చు ఈ పత్తి విత్తనానికి వ్యవసాయశాఖ అధికారులు కొందరు వంత పాడుతున్నారు. అనుమతిస్తే తప్పేంటన్న ధోరణిలో కొందరు కీలకాధికారులున్నారు. దీంతో బీజీ–3 పత్తి విత్తనం చాపకింద నీరులా రాష్ట్రంలో విస్తరిస్తుంది. గ్లైపోసేట్‌తో కేన్సర్ రాష్ట్రంలో ఖరీఫ్‌లో ఎక్కువగా పత్తి సాగవుతుంది. ఖరీఫ్‌లో పత్తి సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాల్లో ఉంటుంది. ఆ తర్వాత వరిని 23.75 లక్షల ఎకరాల్లో సాగుచేస్తారు. అయితే.. 2018–19 ఖరీఫ్‌లో పత్తి సాధారణం కంటే ఎక్కువగా ఏకంగా 44.91 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 2.91 లక్షల ఎకరాల్లో అదనంగా సాగైంది. దేశంలో పత్తి సాగు అత్యధికంగా చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. దీంతో తెలంగాణపై ప్రపంచంలోని బహుళజాతి పత్తి విత్తన కంపెనీలు దృష్టిసారించాయి. బీజీ–2 పత్తి విత్తనం ఫెయిల్ కావడంతో మోన్శాంటో కంపెనీ రౌండ్ ఆఫ్ రెడీ ఫ్లెక్స్ (ఆర్ఆర్ఎఫ్) అనే కీటక నాశినిని తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్మింది. మన దేశంలో బీజీ–3కి అనుమతి నిరాకరించడంతో దీన్ని అడ్డదారిలో విస్తరించే పనిలో కంపెనీలు నిమగ్నమయ్యాయి. బీజీ–3లో వచ్చే కలుపు నివారణకు గ్లైపోసేట్ అనే ప్రమాదకరమైన పురుగుమందును వాడతారు. బీజీ–3 పండిస్తున్నారంటే గ్లైపోసేట్ కచ్చితంగా వాడాల్సిందే. ఈ గ్లైపోసేట్ అత్యంత ప్రమాదకరమైందని, దీని వల్ల కేన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్ధారించింది. 28 శాతానికిపైగా బీజీ–3 విత్తనాలు తెలంగాణ వ్యవసాయశాఖ అధికారిక నివేదిక ప్రకారం.. 2017–19 మధ్య 1062 పత్తి విత్తన శాంపిళ్లను హైదరాబాద్ మలక్‌పేటలోని డీఎన్ఏ ల్యాబ్‌లో పరీక్షించింది. అందులో ఏకంగా 302 శాంపిళ్లలో నిషేధిత బీజీ–3 విత్తనాలు ఉన్నట్లు తేలింది. అంటే ఏకంగా 28.43% అన్నమాట. ఇంత పెద్ద ఎత్తున బీజీ–3 విత్తనం సాగవుతున్నా అధికారులు తూతూమంత్రపు చర్యలకే పరిమితమవుతున్నారు. వ్యవసాయశాఖ వర్గాలు బీజీ–3ని ఉత్పత్తి చేస్తున్న 8 కంపెనీలపై చర్యలు తీసుకోవాలని భావించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వచ్చే ఖరీఫ్ కోసం దాదాపు 1.30 కోట్ల పత్తి ప్యాకెట్లను రైతులకు సరఫరా చేయాలని దళారులు ప్రయత్నాల్లో ఉన్నారు. గతేడాది మార్కెట్లో 68,766 లీటర్ల గ్లైపోసేట్‌ను వ్యవసాయశాఖ వర్గాలు పట్టుకున్నాయి. కానీ సీజ్ చేయలేదు. దీంతో గ్రామాల్లో విషం ఏరులై పారుతోంది. తినే తిండి, గాలి, వాతావరణం కలుషితమై జనజీవనానికి జబ్బులను తెచ్చి పెడుతుంది. బీజీ–3పై తూతూమంత్రపు చర్యలు బీజీ–3కి అడ్డుకట్టవేయాలని పైకి చెబుతున్నా వ్యవసాయ శాఖ సీరియస్‌గా తీసుకోవడంలేదు. తయారీదారులపై చర్యలు తీసుకోకుండా, మార్కెట్లోకి ప్రవేశించాక చేసే దాడులతో వచ్చే ప్రయోజనముండదు. అధికారుల చిత్తశుద్దిని శంకించాల్సి వస్తోంది. – నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు క్యాన్సర్ కారకం గ్లైపోసేట్‌తో కేన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015లోనే నిర్ధారించింది. దేశంలో ఈ అమ్మకాలపై అనేక పరిమితులున్నాయి. కానీ విచ్చలవిడిగా వాడటం వల్ల జీవవైవిధ్యానికి ప్రమాదం ఏర్పడనుంది. దీనిపై సర్కారు చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ కమల్‌నాథ్, జనరల్ సర్జన్, హైదరాబాద్ -
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం: పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. శనివారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ.. వచ్చే ఖరీఫ్ సీజన్‌కి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో కల్తీ విత్తనాల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఖరీఫ్ సీజన్లో కల్తీ విత్త నాలు లేకుండా చేసేందుకు అధికా రు లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, విత్తన ధ్రువీకరణ, విత్తనాభివృద్ధి సంస్థ ల డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు. -
‘రైతు బీమా’ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రైతు బీమా పథకం సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో 13వ తేదీ అర్ధరాత్రి నుంచి నలుగురు రైతులు మరణించినట్లు గుర్తించిన అధికారులు.. ఆయా కుటుంబాల నామినీలకు రూ. 5 లక్షల పరిహారపు సొమ్ము అందించనున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన రైతు జి.బాలకొండయ్య, సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన జె.పోచయ్య, అదే జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన రాచర్ల బూదవ్వ, జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పూడూరు గ్రామానికి చెందిన బీసన్న చనిపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ నలుగురిలో ఒకరికి మినహా మూడు కుటుంబాలకు బీమా సెటిల్మెంట్ చేశామని, వారికి రూ.5 లక్షలు మంజూరయ్యాయని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఆ కుటుంబాల్లోని నామినీలకు సొమ్ము చేరుతుందన్నారు. మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాల్లోనూ ఒక్కో రైతు చనిపోయినట్లు చెబుతున్నా ఆ వివరాలు సేకరించలేదని, వారికి పాలసీ బాండ్లు ఇచ్చారో లేదో తెలుసుకుంటామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. తొలి నలుగురు రైతుల బాధిత కుటుంబాలకు స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చేతుల మీదుగా రూ. 5 లక్షల చెక్కు ఇద్దామని అనుకున్నారు. కానీ చనిపోయిన రైతు కుటుంబాన్ని మరుసటి రోజే హైదరాబాద్ పిలిపించడం సరికాదని చివరి నిమిషంలో ఉపసంహరించుకున్నారు. ఆ జిల్లాల మంత్రులు లేదా ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో సొమ్ము ఇచ్చేలా సర్కారు సన్నాహాలు చేస్తోంది. రూ. 636 కోట్ల ప్రీమియం వ్యవసాయ శాఖ దాదాపు 28 లక్షల మంది రైతుల పేరుతో ఎల్ఐసీకి రూ. 636 కోట్ల ప్రీమియం చెల్లించింది. రైతు బీమా గ్రూప్ పాలసీ కావడంతో రైతులందరి తరపున ఆ శాఖకు మాస్టర్ బీమా పాలసీ బాండు ఎల్ఐసీ ఇవ్వనుంది. బుధవారం స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ సమక్షంలో బాండును ఎల్ఐసీ నుంచి పార్థసారథి తీసుకోనున్నారు. 25 లక్షల మందికి.. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నాటికి 25 లక్షల మందికి పైగా రైతులకు బీమా బాండ్లు పంపిణీ చేశారు. మిగిలిన వాటిని వారంలోగా ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఆలస్యం చేసే కొద్దీ ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబ సభ్యులు నష్టపోయే ప్రమాదముంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సున్న.. రైతుబంధు చెక్కు పొందిన ప్రతి రైతుకూ సర్కారు బీమా కల్పిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 48.77 లక్షల మందికి రైతుబంధు చెక్కులిచ్చారు. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం 47.31 లక్షల మంది రైతులు బీమా కోసం వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించారు. ఇందులో దాదాపు 28 లక్షల మంది బీమాకు అర్హులయ్యారు. చనిపోయిన వారి క్లెయిమ్స్ 10 రోజుల్లో అందించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించింది. వారికి సంబంధించిన 5 డాక్యుమెంట్లను స్కాన్ చేసి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఎన్ఐసీకి సమాచారమిస్తారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఎన్ఐసీ నుంచి ఎల్ఐసీకి డాక్యుమెంట్లతో సమాచారం వెళ్తుంది. ప్రతాలను పరిశీలించిన వెంటనే ఎల్ఐసీ వర్గాలు నామినీ బ్యాంకు ఖాతాలో క్లెయిమ్ సొమ్ము జమ చేస్తారు. -
పప్పుధాన్యాల సాగు భేష్
సాక్షి, హైదరాబాద్: ఈ రబీలో అంచనాలకు మించి పప్పుధాన్యాలు సాగయ్యాయి. ప్రభుత్వం ఈసారి పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలనుకున్న నేపథ్యంలో సాగు పెరగడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగా 3.17 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 4.52 లక్షల ఎకరాల్లో (146%) సాగైనట్లు తెలంగాణ వ్యవసాయశాఖ తన నివేదికలో తెలిపింది. సాధారణం కంటే ఏకంగా 1.35 లక్షల ఎక రాల్లో సాగయ్యాయి. అందులో శనగ సాధారణ సాగు 2.20 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.05 లక్షల ఎకరాల్లో (158%) సాగైంది. పెసర సాధారణ సాగు 35 వేల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37,400 ఎక రాల్లో (127%) సాగైంది. మినుము సాధారణ సాగు 32,500 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 45 వేల ఎకరాల్లో (141%) సాగైంది. ఇక రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 13.32 లక్షల ఎకరాలు కాగా... ఏకంగా 14.60 లక్షల ఎకరాల్లో (110%) నాట్లు పడ డం గమనార్హం. మొక్కజొన్న సాధారణ విస్తీ ర్ణం 4.07 లక్షల ఎకరాలు కాగా,3.80 లక్షల ఎకరాల్లో (93%) సాగైంది. రాష్ట్రవ్యాప్తంగా రబీ పంటల సాగు విస్తీర్ణం 97 శాతానికి చేరు కుంది. సాధారణంగా అన్ని పంటలు 30.20 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 29.45 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వంద శాతానికి మించి పంటల సాగు జరిగింది. -
హైబ్రీడ్ కంది రెడీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్‌ను ప్రోత్సహించాలని వ్యవసాయాధికారులు భావిస్తోంటే.. ఇక్రిశాట్ మాత్రం హైబ్రీడ్ కందినే సరైన ప్రత్యామ్నాయం అంటోంది. కంది సాగు కు పెద్దగా పెట్టుబడులు అవసరం లేకపోవడం.. దిగుబడి కూడా అధికంగా ఉండటంతో రైతులకు ఇది లాభసాటిగా ఉంటుందన్నది శాస్త్రవేత్తల అంచనా. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా మన్నెంకొండ పరిశోధన కేంద్రంలో ఇక్రిశాట్ హైబ్రీడ్ కందిని అభివృద్ధి చేసింది. దీనికి ‘మన్నెంకొండ హైబ్రీడ్ కంది’గా నామకరణం చేసింది. నల్లరేగడి నేలల్లో పండే ఈ హైబ్రీడ్ కంది వల్ల ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని తేలినట్టు వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. మార్కెట్లో కందికి క్వింటాలుకు రూ.4 వేల నుంచి 6 వేల వరకు మద్దతు ధర లభిస్తుందని, ఇది రైతులకు లాభసాటిగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ హైబ్రీడ్ కందికి చీడపీడలను తట్టుకునే శక్తి ఉంది. ఇక్రిశాట్‌తో చర్చిం చాక తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ ద్వారా హైబ్రీడ్ కందిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు పార్థసారథి తెలిపా రు. దీనిపై మంగళవారం ఇక్రిశాట్లో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ పట్నాయక్ ఈ సదస్సుకు రానున్నారు. రెండేళ్లలో పూర్తి ప్రత్యామ్నాయం రెండు మూడేళ్లలో హైబ్రీడ్ కందిని పత్తికి పూర్తి ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దేందు కు ఇక్రిశాట్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఖరీఫ్‌లో కంది సాగు సాధారణ విస్తీర్ణం 6.95 లక్షల ఎకరాలు. గతేడాది ఖరీఫ్‌లో 5.62 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తితో రైతులు నష్టపోతుండటం, ఎగుమతి సుంకంపై కేంద్రం ఇటీవలి నిర్ణయంతో ఆ పంటను నిరుత్సాహపరచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వచ్చే ఖరీఫ్‌లో కనీసం 10 లక్షల ఎకరాల్లో పత్తి సాగును తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పప్పు ధాన్యాల దిగుబడి పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యం లో హైబ్రీడ్ కందికి ఇక్రిశాట్ రూపకల్పన చేయడం ప్రాధాన్యం సంతరిం చుకుంది. -
వాటి ‘పంట’ పండింది
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) పథకంలోకి 12 పంటలను తీసుకొస్తూ తెలంగాణ వ్యవసాయశాఖ నిర్ణయం తీసుకుంది. వరి, జొన్న, మొక్కజొన్న, కందులు, పెసర, మినప, వేరుశనగ (సాగునీటి వసతి ఉన్నచోట), వేరుశనగ (సాగునీటి వసతి లేని చోట), సోయాబీన్, పసుపు, మిరప (సాగునీటి వసతి ఉన్న చోట), మిరప (సాగునీటి వసతి లేనిచోట) పంటలను తీసుకొచ్చింది. వచ్చే ఖరీఫ్‌లో ఈ పంటలకు పీఎంఎఫ్‌బీవై పథకం కింద బీమా వర్తిస్తుంది. అదే పథకంలో భాగంగా ఉన్న గ్రామ బీమాయూనిట్ పథకం(వీఐఎస్)లోకి మూడు పంటలను తీసుకొచ్చింది. జిల్లాల వారీగా పంటలను నిర్దారించింది. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్‌కు, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వరి పంటలకు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మొక్కజొన్న పంటకు గ్రామం యూనిట్‌గా బీమా వర్తింపచేస్తారు. ఇదిలావుంటే ఏకీకృత ప్యాకేజీ బీమా పథకం(యూపీఐఎస్)ను నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని వ్యవసాయశాఖ నిర్ధారించింది. ఈ పథకంలో రైతుకు జరిగే నష్టానికి బీమా వర్తింపజేస్తారు. వ్యవసాయ యంత్రాలకు, జీవిత, ప్రమాద బీమా, ఇంటికి, విద్యార్థి భద్రతకు ఈ బీమా వర్తిస్తుంది. పీఎంఎఫ్‌బీవై పథకాన్ని అమలుచేసేందుకు రాష్ట్రా న్ని మూడు క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. తక్కువ, మధ్యమ, అధికంగా పంట ప్రమాదం ఉండే జిల్లాలను కలిపి ఈ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఒకటో క్లస్టర్లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలున్నాయి. రెండో క్లస్టర్లో వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలున్నాయి. మూడో క్లస్టర్లో నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలున్నాయి. ప్రభుత్వం ప్రతీ ఏడాది అమలుచేసే వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం(డబ్ల్యుబీసీఐఎస్)ను వచ్చే ఖరీఫ్‌లో పత్తి, మిరప, ఆయిల్‌ఫాం, బత్తాయిలకు వర్తింప చేయాలని నిర్ణయించారు. పత్తిని అన్ని జిల్లాల్లో అమలుచేస్తారు. మిరపను ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో, ఆయిల్‌ఫాంను ఖమ్మం, బత్తాయిని నల్లగొండ జిల్లాల్లో అమలుచేస్తారు. ప్రైవేటు బీమా కంపెనీల భాగస్వామ్యం ఇప్పటివరకు దేశంలో వ్యవసాయ బీమా కంపెనీ(ఏఐసీ) మాత్రమే పంటల బీమాను అమలుచేసేది. మొదటిసారిగా ప్రైవేటు బీమా కంపెనీలను పీఎంఎఫ్‌బీవై పథకంలోకి ప్రవేశపెడుతున్నారు. ఆ కంపెనీలు, ఇతర అధికారులతో సోమవారం వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధి ఆధ్వర్యంలో పంటల బీమా రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీ (ఎస్‌ఎల్‌సీసీసీఐ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రైవేటు బీమా కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వం ఆహ్వానించిన 10 కంపెనీల్లో ఐసీఐసీఐ లొంబార్డ్, హెచ్డీఎఫ్సీ-ఈఆర్జీవో,ఇఫ్కో-టొకియో, చోలమండలం ఎంఎస్, బజాజ్ అలియెంజ్, రిలయెన్స్, ఫ్యూచ ర్ జనరల్ ఇండియా, టాటా-ఏఐజీ, ఎస్బీఐ, యూనివర్సల్ సొంపొ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలున్నాయి. ఈ నెల ఏడో తేదీన ఆయా కంపెనీలు పీఎంఎఫ్‌బీవై పథకం కోసం బిడ్ దాఖలు చేస్తాయని అధికారులు వెల్లడించారు. 20వ తేదీ నాటికి బిడ్‌ను ఖరారు చేస్తారు. తెలంగాణలో పంటల బీమా పథకం వల్ల అధిక లాభాలుంటాయని... కాబట్టి దాదాపు అన్ని ప్రైవేటు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఒక అధికారి వ్యాఖ్యానించారు.