సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్రంలో భారీగా ఆహారధాన్యాల ఉత్పత్తి వస్తుందని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఈ మేరకు 2020–21 వ్యవసాయశాఖ కార్యాచరణ ప్రణాళికలో ఉత్పత్తి అంచనాలను పొందుపర్చింది. నైరుతి రుతుపవనాలతో మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు పూర్తి కావడం, నియంత్రిత సాగు పద్ధతులను అనుసరిస్తుండటం వంటి కారణాలతో బంఫర్ క్రాప్ వస్తుందని వ్యవసాయశాఖ ప్రకటించింది. ఈ ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లలో 2.88 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ తెలిపింది. ఇందులో వానాకాలంలో 1.28 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా, యాసంగిలో 1.60 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి వస్తుందని అంచనా వేసింది. గతేడాది ఉత్పత్తితో పోలిస్తే ఈ ఏడాది 44 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఉంటుందని తెలిపింది.
కోటి మెట్రిక్ టన్నులు అధికంగా..
ఈసారి వరి ఉత్పత్తే 2.54 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని వ్యవసాయశాఖ తెలిపింది. గతేడాది కంటే కోటి మెట్రిక్ టన్నులు అధికం కావడం గమనార్హం. ఈ వానాకాలంలో 1.21 కోట్ల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 1.33 కోట్ల మెట్రిక్ టన్నులు ఉంటుందని తెలిపింది. రెండు సీజన్లలో కలిపి వరి 81.05 లక్షల ఎకరాలలో సాగవుతుందని అంచనా వేసింది. ఇక పత్తి 60.17 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 14.71 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేశారు. పప్పు ధాన్యాలు రెండు సీజన్లలో కలిపి 8.35 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి వస్తుందని కార్యాచరణ ప్రణాళికలో వ్యవసాయశాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment