సాక్షి, హైదరాబాద్: పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే రాష్ట్రంలో వానాకాలం, యాసంగి కలిపి ఏడాదికి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేయాలని వ్యవసాయ రంగ నిపు ణులు ప్రభుత్వానికి, రైతులకు సూచించారు. ఇక వరి కంటే పత్తి పంటే లాభదాయకమని తేల్చి చెప్పారు. తెలంగాణలో వానాకాలం పంటగా 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో కందులు వేయడం మం చిదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శుక్రవారం వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగ నిపుణులు చేసిన ముఖ్యమైన సూచనలివీ...
వరిని ఎక్కువగా పండించడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర అవసరాలు, బియ్యం మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో రెండు పంటలకు కలిపి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పండించాలి. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేస్తే రైతుకు ధర రాదు. ఈ 65 లక్షల ఎకరాల్లో సన్న, దొడ్డు రకాలు కలిపి వానాకాలంలో 40 లక్షల ఎకరాలు, యాసంగిలో 25 లక్షల ఎకరాలు సాగు చేయాలి.
వరితో పోల్చుకుంటే పత్తి సాగు చాలా లాభదాయకం. కాల్వల ద్వారా వచ్చే నీటితో పత్తిని సాగు చేస్తే ఎక్కువ దిగుబడితోపాటు నాణ్యమైన పత్తి వస్తుంది. వరిలో ఎకరానికి 30 వేల నికర ఆదాయం వస్తే, పత్తి పంటకు ఎకరానికి అన్ని ఖర్చులు పోను 50 వేల వరకు ఆదాయం వస్తుంది. తెలంగాణలో 65 నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు చేయడం శ్రేయస్కరం.
- కందులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలో వర్షాకాలం పంటగా కందులను 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో సాగు చేయడం ఉత్తమం.
- వర్షాకాలంలో మక్కలు పండించకపోవడం చాలా మంచిది. వర్షాకాలంలో మక్కల దిగుబడి ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే వస్తుంది. అదే యాసంగిలో 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు ఉంటుంది. మక్కలకు మార్కెట్లో డిమాండ్ కూడా అంతగా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ అవసరాలకు తగినట్టు యాసంగిలో మాత్రమే మక్కలు సాగు చేసుకోవడం మంచిది.
18న సీఎం వీడియో కాన్ఫరెన్స్...
వ్యవసాయరంగ నిపుణులు చేసిన సూచనలపై ప్రభుత్వం చర్చించిన తర్వాత నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసే విధానాన్ని ఖరారు చేస్తుంది. అనంతరం సమగ్ర వ్యవసాయ విధానం, పంటల సాగు పద్ధతులపై క్షేత్రస్థాయి అధికారులు, రైతుబంధు సమితులతో ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. వాస్తవానికి శుక్రవారం ఈ వీడియో కాన్ఫరెన్స్ జరగాల్సి ఉండగా.. అది ఈ నెల 18కి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment