సాక్షి, హైదరాబాద్: యాసంగిలో పత్తి సాగు చేయించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తోంది. వాస్తవంగా వానాకాలంలోనే పత్తి సాగు చేస్తారు. అదే కాలం అనుకూలం కూడా. కానీ పత్తికి మంచి డిమాండ్ ఉండటంతో యాసంగిలోనూ సాగు చేసే అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిశోధనలు చేసింది. అవి ఫలించాయి. దీంతో దేశంలోనే మొదటిసారిగా యాసంగిలో పత్తిసాగు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది.
వరికి బదులుగా యాసంగిలో పత్తి సాగు చేయాలని రైతులకు వ్యవసాయశాఖ పిలుపు ఇచ్చింది. మరోవైపు సాగు కోసం భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) అనుమతి కోరింది. ఆ అనుమతి లాంఛనమేనని వ్యవసాయ విశ్వవిద్యాలయ వర్గాలంటున్నాయి. అలాగే.. పత్తి సాగుకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేయాలని కంపెనీలను వ్యవసాయశాఖ అధికారులు కోరినట్లు సమాచారం. ఇది విజయవంతమై మంచి దిగుబడులొస్తే.. మున్ముందు యాసంగిలో వరికి పత్తి ప్రత్యామ్నాయం అయ్యే అవకాశముంది.
భారీ లాభాలు ఉన్నందునే..: దేశంలో పత్తి పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. అయితే ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో పత్తి ప్రతిపాదిత లక్ష్యం 70 లక్షల ఎకరాలు కాగా, తీవ్రమైన వర్షాల కారణంగా 50 లక్షల ఎకరాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఇప్పుడు యాసంగిలో కొద్ది మొత్తంలో పత్తిని సాగు చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్ నుంచి పత్తిని వేయించాలని భావిస్తున్నారు. వానాకాలంలో పత్తికి మంచి ధర పలుకుతుంది. మద్దతు ధరకు మించి గతేడాది క్వింటాకు రూ.10 వేల వరకు వచ్చాయి. కాబట్టి యాసంగిలోనూ పత్తిని ప్రోత్సహిస్తే రైతులకు మరింత లాభం ఉంటుందని వ్యవసాయశాఖ భావిస్తోంది.
గులాబీ రంగు పురుగు ఆశించే చాన్స్?
కాగా, వానాకాలంలో, యాసంగిలో పత్తిని వేయడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ విశ్వవిద్యాలయం పేర్కొంది. వానాకాలంలో పత్తికి గులాబీ రంగు పురుగు పడుతుంది. దీనివల్ల లక్షలాది ఎకరాల్లో దిగుబడి తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వానాకాలం తర్వాత వెంటనే యాసంగిలో వేయడం వల్ల అది కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వానాకాలంలో వేసిన పంటకు నవంబర్‌లోనే పత్తి పూర్తిగా తీసేయాలని సూచిస్తున్నారు. లేకుంటే గులాబీ రంగు పురుగు ఆశిస్తుందని, అది వెయ్యి కిలోమీటర్ల వరకు పాకుతుందని చెబుతున్నారు.
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే...
యాసంగిలో వేసే పత్తిని గతంలో జనవరి వరకు పరీక్షించారు. ఎండలు కూడా ఇబ్బంది కలిగిస్తాయని నిర్ధారణకు వచ్చారు. అయితే.. పరిశోధనల అనంతరం కొన్ని రకాల జాగ్రత్తలతో యాసంగిలో పత్తి వేయొచ్చని తుది నిర్ణయానికి వచ్చినట్లు విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు. గతేడాది యాసంగిలో పత్తి సాగుపై చేసిన పరిశోధనలపై నివేదిక తయారు చేశామని, ఆ మేరకు ఐకార్‌కు ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. దీనిపై కేంద్రం నిర్ణయంతోపాటు జాతీయ విధానం రావాల్సి ఉందని, అనుమతి వస్తే పండిన పంటకు మద్దతు ధర వస్తుందని చెబుతున్నారు. కాగా పత్తి.. ఏ సమయంలో వేయాలన్న దానిపై అధికారులు త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment