గూగుల్ ఎర్త్ ప్రతినిధులతో కలసి పంటల నమోదు ప్రక్రియను పరిశీలిస్తున్న రఘునందన్‌రావు, కలెక్టర్ హనుమంతరావు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: శాటిలైట్ ద్వారా పంటల నమోదు (క్రాప్ బుకింగ్) ప్రక్రియకు వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. వ్యవసాయ క్షేత్రాల భావన–నిర్ధారణ (ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్ ఆన్ ఫీల్డ్ సెగ్మెంటేషన్) పేరుతో ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. పైలెట్ ప్రాజెక్టు కింద అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 16 గ్రామాలను ఎంపిక చేశారు.
ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది గ్రామాలు, మెదక్ జిల్లాలో ఐదు, మహబూబాబాద్ జిల్లాలో మూడు గ్రామాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. రైతులు తమ భూముల్లో ఏయే పంటలు సాగు చేస్తున్నారనే వివరాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్ ద్వారా నమోదు చేస్తారు. సంగారెడ్డి జిల్లాలోని అంకేపల్లి, ఎల్లారం, చందాపూర్, నాగులపల్లి, ఇసోజీపేట, కోడూరు, మంతూరు, పోచారం గ్రామాలలో పంటల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టినట్టు ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ తరహాలో దేశంలోనే ఇది తొలి ప్రాజెక్టు అని వారు చెబుతున్నారు.
గ్రౌండ్ యాప్‌లో వివరాలు నమోదు
వ్యవసాయ శాఖ వినూత్నంగా చేపట్టిన ఫీల్డ్ సెగ్మెంటేషన్ ప్రాజెక్టును గూగుల్ ఎర్త్ సంస్థ సహకారంతో ప్రారంభించారు. ఇందుకోసం ఆ సంస్థ ప్రత్యేకంగా ‘గ్రౌండ్’యాప్‌ను రూపొందించింది. గూగుల్ ఎర్త్ సంస్థకు చెందిన ప్రత్యేక బృందంతో పాటు, ఏఓలు, మండల వ్యవసాయ శాఖ అధికారులు కలసి పంటల నమోదు ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం ఉపగ్రహం ద్వారా రైతుల పొలాల మ్యాప్ (పాలిగాన్)లను రూపొంది స్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
సర్వేనంబర్లతో సంబంధం లేకుండా..
క్రాప్ బుకింగ్ ప్రక్రియలో సర్వే నంబర్లతో సంబంధం ఉండదని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. తొలుత రైతుల భూమికి సంబంధించి మ్యాప్‌లను రూపొందిస్తారు. ఈ పాలిగాన్ ఎంత విస్తీర్ణం ఉంటుంది, అందులో ఎలాంటి పంట వేశారు. రైతు ఎవరు.. వంటి వివరాలు నమోదు చేస్తారు. పైలెట్ ప్రాజెక్టులో లోటుపాట్లను పరిశీలించాక ఇక్కడ విజయవంతమైతే దేశ వ్యాప్తంగా ఈ నూతన విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుత విధానంలో కచ్చితత్వం లేదు
ప్రస్తుతం రైతులు తమ భూముల్లో ఏయే పంటలు సాగు చేశారు. ఏ సర్వే నంబర్‌లో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో విత్తుకున్నారు.. వంటి వివరాలను వ్యవసాయ శాఖ ఏఈఓలు గ్రామాలకు వెళ్లి పంటల నమోదు (క్రాప్‌బుకింగ్) చేస్తున్నారు. అయితే ఈ విధానంలో కచ్చితత్వం ఉండటం లేదు. వాస్తవంగా సాగైన పంటలకు, రికార్డులకు పొంతన ఉండటం లేదు.
దీంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఏ పంట ఎంత మేర మార్కెట్‌లోకి వస్తుంది, వాటి కొనుగోళ్లకు ఎలాంటి ప్రణాళిక రూపొందించాలన్న అంశాలపై ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఆయా పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల సరఫరా వంటి ఏర్పాట్లు చేయడంలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి.
కొన్ని చోట్ల మొక్కుబడిగా..
పంటల నమోదు ప్రక్రియ చాలా చోట్ల మొక్కుబడిగా సాగుతోందన్న విమర్శలున్నాయి. కొందరు సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లడం లేదని, గ్రామంలో ఒక చోట కూర్చుని రైతుల పేర్లు, ఏ పంట వేశారు.. అనే వివరాలను రికార్డుల్లో రాసుకుని వస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు వ్యవసాయ శాఖ శాటిలైట్ ద్వారా పంటల నమోదు ప్రక్రియను చేపట్టిందని చెబుతున్నారు.
పంట రంగు, ఎత్తు కూడా గుర్తించే వెసులుబాటు..
ఈ అధునాత క్రాప్‌బుకింగ్ విధానంలో పంట ఏ రంగులో ఉంది, ఎంత ఎత్తు పెరిగింది, ఎక్కడైనా చీడ, పీడలు ఆశించాయా, భూమి స్వభావం ఎలాంటిది.. ఇలా సుమారు 18 నుంచి 20 రకాల అంశాలను గుర్తించవచ్చని ప్రాజెక్టు నిపుణులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment