Google Earth
-
పంటల నమోదుకు ఉపగ్రహబలం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: శాటిలైట్ ద్వారా పంటల నమోదు (క్రాప్ బుకింగ్) ప్రక్రియకు వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. వ్యవసాయ క్షేత్రాల భావన–నిర్ధారణ (ఫ్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్ ఆన్ ఫీల్డ్ సెగ్మెంటేషన్) పేరుతో ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించింది. పైలెట్ ప్రాజెక్టు కింద అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 16 గ్రామాలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది గ్రామాలు, మెదక్ జిల్లాలో ఐదు, మహబూబాబాద్ జిల్లాలో మూడు గ్రామాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. రైతులు తమ భూముల్లో ఏయే పంటలు సాగు చేస్తున్నారనే వివరాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్ ద్వారా నమోదు చేస్తారు. సంగారెడ్డి జిల్లాలోని అంకేపల్లి, ఎల్లారం, చందాపూర్, నాగులపల్లి, ఇసోజీపేట, కోడూరు, మంతూరు, పోచారం గ్రామాలలో పంటల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టినట్టు ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ తరహాలో దేశంలోనే ఇది తొలి ప్రాజెక్టు అని వారు చెబుతున్నారు. గ్రౌండ్ యాప్‌లో వివరాలు నమోదు వ్యవసాయ శాఖ వినూత్నంగా చేపట్టిన ఫీల్డ్ సెగ్మెంటేషన్ ప్రాజెక్టును గూగుల్ ఎర్త్ సంస్థ సహకారంతో ప్రారంభించారు. ఇందుకోసం ఆ సంస్థ ప్రత్యేకంగా ‘గ్రౌండ్’యాప్‌ను రూపొందించింది. గూగుల్ ఎర్త్ సంస్థకు చెందిన ప్రత్యేక బృందంతో పాటు, ఏఓలు, మండల వ్యవసాయ శాఖ అధికారులు కలసి పంటల నమోదు ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం ఉపగ్రహం ద్వారా రైతుల పొలాల మ్యాప్ (పాలిగాన్)లను రూపొంది స్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సర్వేనంబర్లతో సంబంధం లేకుండా.. క్రాప్ బుకింగ్ ప్రక్రియలో సర్వే నంబర్లతో సంబంధం ఉండదని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. తొలుత రైతుల భూమికి సంబంధించి మ్యాప్‌లను రూపొందిస్తారు. ఈ పాలిగాన్ ఎంత విస్తీర్ణం ఉంటుంది, అందులో ఎలాంటి పంట వేశారు. రైతు ఎవరు.. వంటి వివరాలు నమోదు చేస్తారు. పైలెట్ ప్రాజెక్టులో లోటుపాట్లను పరిశీలించాక ఇక్కడ విజయవంతమైతే దేశ వ్యాప్తంగా ఈ నూతన విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత విధానంలో కచ్చితత్వం లేదు ప్రస్తుతం రైతులు తమ భూముల్లో ఏయే పంటలు సాగు చేశారు. ఏ సర్వే నంబర్లో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో విత్తుకున్నారు.. వంటి వివరాలను వ్యవసాయ శాఖ ఏఈఓలు గ్రామాలకు వెళ్లి పంటల నమోదు (క్రాప్‌బుకింగ్) చేస్తున్నారు. అయితే ఈ విధానంలో కచ్చితత్వం ఉండటం లేదు. వాస్తవంగా సాగైన పంటలకు, రికార్డులకు పొంతన ఉండటం లేదు. దీంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఏ పంట ఎంత మేర మార్కెట్లోకి వస్తుంది, వాటి కొనుగోళ్లకు ఎలాంటి ప్రణాళిక రూపొందించాలన్న అంశాలపై ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఆయా పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల సరఫరా వంటి ఏర్పాట్లు చేయడంలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల మొక్కుబడిగా.. పంటల నమోదు ప్రక్రియ చాలా చోట్ల మొక్కుబడిగా సాగుతోందన్న విమర్శలున్నాయి. కొందరు సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లడం లేదని, గ్రామంలో ఒక చోట కూర్చుని రైతుల పేర్లు, ఏ పంట వేశారు.. అనే వివరాలను రికార్డుల్లో రాసుకుని వస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు వ్యవసాయ శాఖ శాటిలైట్ ద్వారా పంటల నమోదు ప్రక్రియను చేపట్టిందని చెబుతున్నారు. పంట రంగు, ఎత్తు కూడా గుర్తించే వెసులుబాటు.. ఈ అధునాత క్రాప్‌బుకింగ్ విధానంలో పంట ఏ రంగులో ఉంది, ఎంత ఎత్తు పెరిగింది, ఎక్కడైనా చీడ, పీడలు ఆశించాయా, భూమి స్వభావం ఎలాంటిది.. ఇలా సుమారు 18 నుంచి 20 రకాల అంశాలను గుర్తించవచ్చని ప్రాజెక్టు నిపుణులు వెల్లడించారు. -
కేరళ: వెలుగులోకి రహస్య దీవి.. ఫోటోలు వైరల్
తిరువనంతపురం: అరేబియా సముద్రం కేరళ తీరంలో బీన్ షేప్‌లో ఉన్న ఓ అనూమానాస్పద దీవి అనూహ్యంగా వెలుగు చూసింది. గూగుల్ ఎర్త్‌లో కనిపిస్తున్న ఈ మర్మ దీవి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గూగుల్ ఎర్త్‌లో కనిపించిన ఈ దీవి అరేబియా సముద్రం కొచ్చి తీరానికి పశ్చిమానా 7 కిలోమీటర్ల దూరంలో వెలుగు చూసింది. కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ పరిశోధకులు ఈ నిర్మాణం ఏంటి.. ఇది ఎలా ఏర్పడింది.. అనే అంశాలను పరిశోధించనున్నారు. చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న ఈ దీవిలాంటి నిర్మాణాన్ని తొలిసారి చెల్లమ్ కర్షిక టూరిజమ్ డెవలప్మెంట్ సొసైటీ గుర్తించింది. గూగుల్ ఎర్త్ ఇక్కడ దీవి లాంటి ఆకారం ఉందని చూపిస్తోందని తెలపడమే కాక ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇవి చర్చనీయాంశంగా మారాయి. 8 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ నిర్మాణం ఏర్పడినట్లు చెల్లనమ్ కర్షిక టూరిజం డెవలప్మెంట్ సొసైటీ తెలిపింది. దీనిపై అధ్యాయనం చేయాలని కేరళ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్‌ని కోరినట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ మాజీ డైరెక్టర్- రీసర్చ్ జయచంద్రన్ మాట్లాడుతూ.. ‘‘దీని గురించి నేను చదివిన దాని ప్రకారం ఈ రహస్య నిర్మాణం ఏర్పడానికి పాచి ఒక కారణంగా భావిస్తున్నాను. ఇలాంటి నిర్మాణాలను ఉపగ్రహ చిత్రాల ద్వారా మాత్రమే గుర్తించగలం. మట్టి నిక్షేపం వల్ల ఇది ఏర్పడినట్లు నేను భావించడం లేదు. సాధారణంగా ఇలాంటి నిర్మణాలను దేవాలయాల సమీపంలో ఉండే చెరువుల్లో గుర్తించగలం’’ అని తెలిపారు. చదవండి: వైరల్ : 100 ఏళ్లుగా అది ఒంటరి ఇళ్లు -
ఏడేళ్ల క్రితం చనిపోయిన తండ్రి.. తిరిగి ప్రత్యక్షం
టోక్యో: జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి టైంపాస్ కోసం గూగుల్ ఎర్త్ చూస్తుంటే.. ఊహించని సర్ప్రైజ్ కళ్ల ముందు ప్రత్యక్షమైంది. ఎప్పుడో ఏడేళ్ల కిందట చనిపోయిన తండ్రి.. అందులో కనిపించారు. అది చూడగానే ఆ వ్యక్తి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్లతో పంచుకున్నాడు. అంతే.. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ వివరాలు.. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల టైంపాస్ కోసం గూగుల్ ఎర్త్‌లో తన తల్లిదండ్రుల ఇల్లు ఎలా కనిపిస్తుందో చూడాలని అనుకున్నాడు. దానిలో భాగంగా గూగుల్ ఎర్త్ ఒపెన్ చేసి లోకేషన్ టైప్ చేయగా అతడికి ఆ ఇంటి ముందు ఏడేళ్ల కిందట చనిపోయిన తండ్రి ఫోటో కనిపించింది. దీనిలో వీధిలో రోడ్డు పక్కన నిలుచున్న తండ్రి ఫొటో కనిపించింది. (చదవండి: భార్య గుట్టు రట్టు చేసిన గూగుల్ మ్యాప్) ఏడేళ్ల క్రితం చనిపోయిన తండ్రి తిరిగి ఇలా కళ్ల ముందు ప్రత్యక్షం అయ్యే సరికి ఈ వ్యక్తి సంతోషం పట్టలేకపోయాడు. వెంటనే దీని గురించి తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.‘‘గూగుల్ ఎర్త్‌లో ఏడేళ్ల కిందట చనిపోయినా నా తండ్రిని చూశాను. అందులో అమ్మ.. నాన్న వద్దకు నడుస్తున్నట్లుగా ఉంది. బహుశా.. ఆయన అమ్మ కోసం రోడ్డు పక్కన ఎదురుచూస్తున్నారనుకుంటాను. ‘గూగుల్ ఎర్త్’ ఈ ప్రాంతాన్ని ఇంకా అప్డేట్ చేయకపోవడం వల్ల ఏడేళ్ల క్రితం చనిపోయిన నా తండ్రిని మళ్లీ చూడగలిగాను’’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రసుత్తం ఇది తెగ వైరలవుతోంది. ఇప్పటివరకు 6.9 లక్షల మంది లైక్ చేశారు. (చదవండి: రహస్య గది.., 9 హత్యలు) コロナでやる事ないからGoogleEarthで実家見に行ったら7年前に死んだ親父が写ってた。その先に人が居たから見に行ったら母ちゃんだった。一服しながら奥さんの帰りを待ってたんだな。無口だけど優しい親父だった。このままこの場所の写真更新しないで欲しいな。 pic.twitter.com/PXxBICAxmz — タムチンキ (@TeacherUfo) January 4, 2021 గూగుల్ ఎర్త్‌తో వల్ల 40 ఏళ్ల క్రితం మిస్సయిన వ్యక్తి ఆచూకీ లభించడం.. మరో ఘటనలో ఓ వ్యక్తి తన ఇంటి సమీపంలోని పార్క్‌లో ప్రియుడితో రొమాన్స్ చేస్తోన్న భార్యని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం.. ఆపై ఆమెకు విడాకులు ఇవ్వడం గురించి గతంలో చదివే ఉన్నాం. -
గూగుల్ ఎర్త్ కొత్త వెర్షన్‌పై లుక్కేయండి
గూగుల్ ఎర్త్ గురించి మీకు తెలుసుగా... అదేనండీ.. కంప్యూటర్ తెరపై ప్రపంచం మొత్తాన్ని మీ కళ్లముందు ఉంచే అప్లికేషన్!.. ఆ.. తెలుసు అయితే ఏంటి? ఈమధ్య కాలంలో ఎప్పుడైనా దీన్ని వాడారా? లేదంటే వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఓ లుక్కేయండి! ఏంటబ్బా అంత స్పెషల్? అంటారా..? చాలానే ఉన్నాయి. మచ్చుకు కొన్ని చూద్దామా? ఓకే.. లెట్స్ స్టార్ట్. కొత్త గూగుల్ ఎర్త్‌ను ఓపెన్ చేయగానే.. స్క్రీన్ పై ఎడమవైపున ఓ బుల్లి డైస్ లాంటిది కనిపిస్తుంది. కర్సర్‌ను దానిపై కదిలిస్తే ఐ ఆమ్ ఫీలింగ్ లక్కీ అని ఉంటుంది. ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. భూ ప్రపంచంపై ఉన్న ఎన్నో వింతలూ విడ్డూరాల గురించి మీకు ఒక్కటొక్కటే తెలుస్తూంటుంది. వికీపీడియాలోనూ ఇలాంటివి ఉంటాయిగా? ఉంటాయి కానీ.. వాటి పేర్లు తెలిస్తేగానీ వెతుక్కోలేము. ఎర్త్లోనైతే క్లిక్ చేస్తే చాలు.. బోలెడంత సమాచారం. అలా అలా వచ్చేస్తూంటుంది. ఒకటా.. రెండా దాదాపు 20 వేల ప్రదేశాలు, వింతల తాలూకూ సమాచారం ఉంది మరి! అంతేనా అనొద్దు.. దుబాయిలోని అట్లాంటిస్ హోటల్ మొదలుకొని ప్రపంచంలోని 21 వింతలను వీఆర్‌లో చూసేందుకూ వీలు కల్పిస్తోంది ఈ కొత్త వెర్షన్ గూగుల్ ఎర్త్. అమెరికా నేషనల్ పార్కులలో ఆన్లైన్లోనే తిరుగుతూ ఒక్కో అంశం గురించి తెలుసుకోవాలన్నా... చింపాంజీ పరిశోధకురాలు జేన్ గోడాల్తో కలిసి టాంజానియాలో విహరించాలన్నా సాధ్యమే. వాయేజర్ బటన్‌ను నొక్కితే చాలు.. బీబీసీ ఎర్త్ కార్యక్రమాలు, ఇతర టీవీ డాక్యుమెంటరీల సాయంతో ఆయా ప్రాంత విశేషాలను వివరించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. అప్డేట్ చేసిన గూగుల్ ఎర్త్ అప్లికేషన్ ప్రస్తుతం వెబ్‌కు మాత్రమే పరిమితం. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు మరో వారం రోజుల్లో... ఐఫోన్ వినియోగదారులకు అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని గూగుల్ చెబుతోంది! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సరికొత్తగా గూగుల్ ఎర్త్
శాన్ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన మ్యాపింగ్ సర్వీసు గూగుల్ ఎర్త్‌ను మరిన్ని కొత్త అంశాలతో మంగళవారం ఆవిష్కరించింది. కొత్తగా విడుదలైన గూగుల్ ఎర్త్‌ను కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు స్మార్ట్ ఫోన్లలో సైతం వాడుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కొత్త ప్రదేశాల గురించి అనుభవజ్ఞులు తెలిపిన వివరాలను ‘వాయెజర్’ పేరుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వారు వెల్లడించారు. కృత్రిమ మేధతో పనిచేసే వాయెజర్‌లో వివిధ పర్వతాలు, దేశాలు, ప్రముఖ స్థలాలను గుర్తించడానికి వీలుగా నాలెడ్జ్ కార్డులను ప్రవేశపెట్టినట్లు గూగుల్ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీని రూపకల్పనలో నాసా, బీబీసీ ఎర్త్, సీసెమ్ స్ట్రీట్, జేన్‌గుడెల్ ఇన్స్టిట్యూట్ పాలుపంచుకున్నట్లు గూగుల్ తెలిపింది. యాపిల్ ఉత్పత్తులతో పాటు ఇతర బ్రౌజర్ల కోసం క్రోమ్, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్లను విడుదల చేసినట్లు వెల్లడించింది. క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో పట్టుకోసమే గూగుల్ ఈ చర్య తీసుకున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఈ సరికొత్త గూగుల్ ఎర్త్‌ను ప్రపంచానికి తామిచ్చిన బహుమతిగా డైరెక్టర్ రెబెక్కా మూరే ప్రకటించారు. -
మొక్కల లెక్క చిక్కింది
► లాంటేషన్కు దూరం.. ► స్పాన్సర్ల కోసం వెతుకులాట ► కానరాని ్రప్రూనింగ్ ► చేతులెత్తేస్తున్న సర్కార్ విశాఖపట్నం: నగరంలో మొక్కలు నాటే అంశంపై సర్కారు తొలిరోజుల్లో చేసిన ప్రకటనకూ ఇప్పటి కార్యాచరణకూ పొంతన కుదరడం లేదు. లక్షల్లో మొక్కలు నాటుతామని పదేపదే చెప్పి తాజాగా అంకె కుదించింది. హుద్‌హుద్ తుపాను ఫలితంగా నగరంలో ఐదులక్షలకు పైగా వృక్షసంపద నేలమట్టమైన సంగతి తెలిసిందే. దీంతో పచ్చదనం పునరుద్ధరణకు 10లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టుగా సర్కార్ వెంటనే ప్రకటించింది. ప్రణాళికా బద్ధంగా నాటేందుకు గూగుల్ ఎర్త్‌ను ఉపయోగించుకుని పిన్పాయింట్స్ను గుర్తిస్తామని చెప్పింది. స్పాన్సర్లు ముందు కొస్తున్నారు.. సంతోషం..తాము చెప్పే వరకు ఏ ఒక్కరూ ఒక్క మొక్క కూడా నాటవద్దని కూడా చెప్పారు. ఈ కార్యక్రమానికి నోడల్అధికారిగా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రమోహన్ రెడ్డిని నియమించారు. డివిజన్కొక అధికారికి బాధ్యతలు కూడా అప్పగించారు. మొక్కల ఎంపిక బాధ్యతను ఫారెస్ట్, హార్టికల్చర్ డిపార్టుమెంట్‌కు, వాటిని పరిరక్షించే బాధ్యతను జీవీఎంసీకి అప్పగించారు. ఈ సాముహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని నవంబర్ 10న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర, రాష్ర్ట మంత్రులు ప్రారంభింస్తారంటూ ఆర్బాటంగా ప్రకటించారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు ఆచరణలోకి వచ్చేసరికి నిధులు లేమి సాకుతో సర్కార్ వెనుకడుగు వేస్తుంది. గుంత తవ్వకం, మొక్కనాటడం, ట్రీగార్డు ఏర్పాటుకు ఒక్కొక్క మొక్కకు రూ.వెయ్యి ఖర్చవుతుందని అటవీ శాఖ లెక్కలేసింది. ఈ లెక్కన 10లక్షల మొక్కలు నాటాలంటే వందకోట్లు కావాలి. పోనీ కనీసం మూడవ వంతుమొక్కలనాటే బాధ్యతను స్పాన్సర్లకు అప్పగించినా ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కనీసం రూ.60కోట్ల విడుదలచేస్తే కానీ ముందుకు కదలని పరిస్థితి. పైసా ఇచ్చేదిలేదని ప్రభుత్వం తెగేసి చెప్పింది. శాఖల వారీగా చూసుకోవాలని మెలిక పెట్టింది. ఇప్పటికే పునరావాస కార్యక్రమాల కోసం ఒక్కొక్క శాఖ కోటి నుంచి 2కోట్ల వరకు చేతి చమురువదిలిపోవడంతో ఎవరూ ఈ మొక్కల పెంపకంపై ఆసక్తి చూపడం లేదు. తొలుత 10లక్షల మొక్కలనిచెప్పుకొచ్చిన సర్కార్ ఆతర్వాత లక్షా80వేల మొక్కలని ప్రకటించారు. చివరకు ఎవెన్యూ ప్లాంటేషన్ కింద 62 వేల మొక్కలు, ప్రభుత్వ కార్యాలయలు,సంస్థల్లో మరో 1.18 లక్షల మొక్కలు నాటాలనినిర్ణయించారు. స్పాన్సర్లు కోసం ఎదురుచూపులు ఎవరైనా స్పాన్సర్లు ముందుకొస్తే ప్రోత్సహించడం తప్ప చేసేది ఏమీ లేదని ఇప్పటికే మంత్రులతో సహా ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నారు. వనప్రేమికు లెవరైనా ముందుకొచ్చి విరాళాలు ఇస్తే ఈ మొక్కలను వారి పేరిటే పెంచుతామని ప్రకటించారు. ఇప్పుడు స్పాన్సర్లు కూడా ఇప్పుడు వెనుకడుగు వేసే పరిస్థితి ఏర్పడింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, స్వచ్చంద సంస్థలతో పాటు పర్యావరణ ప్రేమికులు ఇప్పటికే నగరంలో స్వచ్చందంగా పెద్దఎత్తునమొక్కలు నాటుతున్నా ప్రోత్సహించే వారుకరువయ్యారు.నేలకొరగగా మిగిలిన వృక్షాలు, చెట్లను బతికించుకునేందుకు ప్రూడింగ్ చేస్తామని..బ్యాక్టీరియాలను చంపేస్తామని..చిగురించే అవకాశం ఉన్న ప్రతీ చెట్టును బతికించుకుందామని సర్కారు చెబుతూ వచ్చింది. ప్రస్తుతం ఆదిశగాప్రయత్నం కన్పించలేదు. -
చీకటి ప్రపంచపటం!
వాషింగ్టన్: ఇప్పటిదాకా భూగోళంపై పగటిపూట కనిపించే వివిధ ప్రాంతాలను గుర్తిస్తూనే ప్రపంచపటాలు(అట్లాస్‌లు) రూపొందాయి. గూగుల్ ఎర్త్లోనూ పగటి ఫొటోల ఆధారంగానే ప్రపంచపటాన్ని పొందుపర్చారు. అయితే.. రాత్రిపూట కనిపించే భూమిపై కూడా ఆయా దేశాలను, నగరాలను గుర్తిస్తూ సరికొత్త చీకటి అట్లాస్‌ను రూపొందించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొత్త ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకుగాను ‘ద గేట్‌వే టు ఆస్ట్రోనాట్ ఫొటోగ్రఫీ ఆఫ్ ఎర్త్’ వెబ్సైట్ ద్వారా లక్షలాది ఫొటోలను ప్రజలకు అందుబాటులో ఉంచింది. 1960ల నుంచీ ఇటీవలి దాకా వ్యోమగాములు తీసిన 18 లక్షల ఫొటోలను ఈ వెబ్సైట్లో ఉంచింది. ఎవరి నగరాన్ని వారు గుర్తించడం తేలిక కాబట్టి.. ప్రజలందరూ ఈ ఫొటోలను పరిశీలించి తమతమ ప్రదేశాలను గుర్తించాలని నాసా పిలుపునిచ్చింది. ఈ వెబ్‌సైట్‌లోని ఫొటోల్లో 13 లక్షల ఫొటోలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీశారు. వీటిలో 30 శాతం ఫొటోలు రాత్రిపూట తీసినవి ఉన్నాయి. ఇప్పటిదాకా వందలాది మంది వలంటీర్లు 20 వేల ఫొటోలను విశ్లేషించి, ఆయా ప్రదేశాలను గుర్తించారట. ఈ చీకటి అట్లాస్‌ను ప్రజలకు, మీడియాకు, శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచుతామని, ప్రపంచవ్యాప్తంగా ఇంధన వినియోగం, కాలుష్యం, వాతావరణంలో రసాయనాల వంటి అనేక అంశాలపై పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుందని నాసా పేర్కొంది. -
చందమామపై గ్రహాంతరవాసి!
చంద్రుడి ఉపరితలంపై నిలుచున్న మనిషి. ఆ మనిషి తాలూకు నీడ..! ఇంకేం.. ఈ ఫొటోలో కనిపిస్తున్నది కచ్చితంగా గ్రహాంతరవాసి(ఏలియన్) అయి ఉండవచ్చని ఇప్పుడు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఉపగ్రహం తీసిన ఈ ఫొటో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోను 20 లక్షల మంది దాకా చూసేశారు. గూగుల్ ఎర్త్‌లాగా.. గూగుల్ మూన్‌ను కూడా సిద్ధం చేయాలని ఫొటోలు తీయగా.. వాటిల్లోని ఓ ఫొటోలోనే ఈ ‘ఏలియన్’ దృశ్యం కనపడిందట. అయితే ఇంతకూ ఈ ఫొటోలో ఉన్నది ఏమిటి? అన్నది నాసా ధ్రువీకరించాల్సి ఉంది.