సరికొత్తగా గూగుల్ ఎర్త్
శాన్‌ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన మ్యాపింగ్ సర్వీసు గూగుల్ ఎర్త్‌ను మరిన్ని కొత్త అంశాలతో మంగళవారం ఆవిష్కరించింది. కొత్తగా విడుదలైన గూగుల్ ఎర్త్‌ను కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు స్మార్ట్ ఫోన్లలో సైతం వాడుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కొత్త ప్రదేశాల గురించి అనుభవజ్ఞులు తెలిపిన వివరాలను ‘వాయెజర్’ పేరుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వారు వెల్లడించారు.
కృత్రిమ మేధతో పనిచేసే వాయెజర్‌లో వివిధ పర్వతాలు, దేశాలు, ప్రముఖ స్థలాలను గుర్తించడానికి వీలుగా నాలెడ్జ్ కార్డులను ప్రవేశపెట్టినట్లు గూగుల్ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీని రూపకల్పనలో నాసా, బీబీసీ ఎర్త్, సీసెమ్ స్ట్రీట్, జేన్‌గుడెల్ ఇన్‌స్టిట్యూట్ పాలుపంచుకున్నట్లు గూగుల్ తెలిపింది. యాపిల్ ఉత్పత్తులతో పాటు ఇతర బ్రౌజర్ల కోసం క్రోమ్, ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్లను విడుదల చేసినట్లు వెల్లడించింది. క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో పట్టుకోసమే గూగుల్ ఈ చర్య తీసుకున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఈ సరికొత్త గూగుల్ ఎర్త్‌ను ప్రపంచానికి తామిచ్చిన బహుమతిగా డైరెక్టర్ రెబెక్కా మూరే ప్రకటించారు.