చీకటి ప్రపంచపటం!
వాషింగ్టన్: ఇప్పటిదాకా భూగోళంపై పగటిపూట కనిపించే వివిధ ప్రాంతాలను గుర్తిస్తూనే ప్రపంచపటాలు(అట్లాస్‌లు) రూపొందాయి. గూగుల్ ఎర్త్‌లోనూ పగటి ఫొటోల ఆధారంగానే ప్రపంచపటాన్ని పొందుపర్చారు. అయితే.. రాత్రిపూట కనిపించే భూమిపై కూడా ఆయా దేశాలను, నగరాలను గుర్తిస్తూ సరికొత్త చీకటి అట్లాస్‌ను రూపొందించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొత్త ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకుగాను ‘ద గేట్‌వే టు ఆస్ట్రోనాట్ ఫొటోగ్రఫీ ఆఫ్ ఎర్త్’ వెబ్‌సైట్ ద్వారా లక్షలాది ఫొటోలను ప్రజలకు అందుబాటులో ఉంచింది.
1960ల నుంచీ ఇటీవలి దాకా వ్యోమగాములు తీసిన 18 లక్షల ఫొటోలను ఈ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఎవరి నగరాన్ని వారు గుర్తించడం తేలిక కాబట్టి.. ప్రజలందరూ ఈ ఫొటోలను పరిశీలించి తమతమ ప్రదేశాలను గుర్తించాలని నాసా పిలుపునిచ్చింది. ఈ వెబ్‌సైట్‌లోని ఫొటోల్లో 13 లక్షల ఫొటోలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీశారు. వీటిలో 30 శాతం ఫొటోలు రాత్రిపూట తీసినవి ఉన్నాయి.
ఇప్పటిదాకా వందలాది మంది వలంటీర్లు 20 వేల ఫొటోలను విశ్లేషించి, ఆయా ప్రదేశాలను గుర్తించారట. ఈ చీకటి అట్లాస్‌ను ప్రజలకు, మీడియాకు, శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచుతామని, ప్రపంచవ్యాప్తంగా ఇంధన వినియోగం, కాలుష్యం, వాతావరణంలో రసాయనాల వంటి అనేక అంశాలపై పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుందని నాసా పేర్కొంది.