సాక్షి, హైదరాబాద్ : రైతు రుణమాఫీపై కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రైతులు తమ సంతకంతో స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే రుణమాఫీ అమలు చేయాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బ్యాంకుల వద్ద ఉన్న రైతు రుణాలు, వడ్డీ సమాచారంతో ఆ ధ్రువీకరణ పత్రం ఉండాలని అధికారులు అంటున్నారు. ఒకవేళ అలా లేకుంటే ఆయా రైతులకు రుణమాఫీ అమలు చేయడం కుదరదని చెబుతున్నారు.
గతంలో రుణమాఫీ అమలు చేసినప్పుడు పారదర్శకతపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అభ్యంతరాలు వ్యక్తం చేసినందున ఈసారి రైతు స్వీయ ధ్రువీకరణ చేయాలని ఆలోచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లేకుంటే గ్రామ సభలు పెట్టి అర్హులైన రైతుల సంఖ్య తేల్చాలన్న నిబంధనను కూడా తెరపైకి తెస్తున్నారు. 2014లో రుణమాఫీ అమలు సమయంలో అర్హులైన రైతుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించినా కొందరు అర్హులకు రుణమాఫీ జరగలేదన్న విమర్శలు వచ్చాయి. రుణమాఫీ అందని కొందరు రైతులు ఉన్నతస్థాయి వరకు వెళ్లి పోరాడారు.
అలాగే ఆడిట్ అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. రుణమాఫీ పొందిన వారంతా రైతులనే గ్యారంటీ ఏంటంటూ కాగ్ ప్రశ్నించింది. గ్రామాల్లో జాబితాలు ప్రదర్శించామని వ్యవసాయశాఖ ఇచ్చిన వివరణతో కాగ్ ఏమాత్రం సంతృప్తి చెందలేదని అధికారులు అంటున్నారు. గ్రామ సభలు ఎందుకు నిర్వహించలేదని, రుణమాఫీ లబ్ధిదారులంతా రైతులేనని ఎవరు ధ్రువీకరించారని కాగ్ నిలదీసింది. ఈ నేపథ్యంలోనే రైతుల స్వీయ ధ్రువీకరణ అంశాన్ని వ్యవసాయశాఖ తెరపైకి తీసుకొచ్చింది. దీనివల్ల ఎక్కడైనా అక్రమాలు జరిగితే అప్పుడు రైతునే బాధ్యుడిని చేసే అవకాశముందని అంటున్నారు. దీనిపై ఇప్పుడు ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది.
మాఫీ సొమ్ము నేరుగా మాకే బదిలీ చేయాలి
రుణమాఫీపై బ్యాంకర్లు, అధికారులకు మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత మంది రైతులకు రుణమాఫీ చేయాలి? ఎంత చేయాలి? వడ్డీ వివరాలు ఎలా అమలు చేయాలన్న దానిపై స్పష్టత ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం బ్యాంకర్లను కోరింది. అధికార టీఆర్‌ఎస్ రూ. లక్షలోపు రైతు రుణమాఫీ అమలుకు గతేడాది డిసెంబర్ 11ను కట్ ఆఫ్ తేదీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే అప్పటి వరకు రైతులు తీసుకున్న సొమ్ములో రూ. లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని సర్కారు ప్రకటించింది. అంటే ఏడాదిగా అనేక మంది రైతుల బకాయిలకు వడ్డీ కూడా తోడు కానుంది.
దీనిపై ఏం చేయాలన్న దానిపైనా చర్చ జరుగుతోంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ ప్రకటించి అమలు చేసింది. అప్పుడు 35.29 లక్షల మంది రైతులకు రూ. 16,138 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఆ సొమ్మును ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగు బడ్జెట్లలో నిధులు కేటాయించి మాఫీ చేసింది. ఈసారి రుణమాఫీ సొమ్ము మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు. వ్యవసాయ వర్గాల సమాచారం ప్రకారం రూ. 26 వేల కోట్ల నుంచి రూ. 36 వేల కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు.
రుణమాఫీ సొమ్మును నేరుగా రైతులకే ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా బ్యాంకర్లు మాత్రం అలా చేయవద్దని, గతంలోలాగా తమకే అందజేయాలని కోరుతున్నారు. ఎలక్ట్రానిక్ కార్డుల పద్ధతి లేదా రైతుబంధు నిధులను నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లోకి వేసినట్లుగా ఏదో ఒక పద్ధతిలో రుణమాఫీ సొమ్మును జమ చేస్తామని అధికారులు చెబుతుండగా అలా చేస్తే రైతులు బకాయిలు చెల్లించరని బ్యాంకర్లు అంటున్నారు. రైతులు ఇతర బ్యాంకు ఖాతాలు చూపించి వాటిల్లో జమ చేసుకునే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు.
బంగారంపై తీసుకున్న రుణాలపై తర్జనభర్జన
రైతులు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాల మాఫీపై తర్జనభర్జన జరుగుతోంది. 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి బంగారంపై తీసుకున్న రుణాలను పంట రుణాలుగా పరిగణించబోమని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బంగారంపై తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తింపజేయాలా వద్దా? అనే చర్చ జరుగుతోంది.
దీనిపై బ్యాంకర్ల మధ్యే భిన్నాభిప్రాయాలున్నాయి. ఆర్‌బీఐ నిబంధన ప్రకారం మాఫీ చేయొద్దని కొందరు అంటుంటే మాఫీ చేయాలని మరికొందరు అంటున్నారు. ఆ ప్రకారం బ్యాంకర్లు వేర్వేరుగా జాబితాలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం 5.56 లక్షల మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ. 5,253 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. ఈ బకాయిలు మాఫీ చేస్తారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 2014లో రుణమాఫీ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసి పట్టణాల్లో గోల్డు లోన్లు తీసుకున్న రైతులకు మాఫీ చేయలేదు.
కుటుంబమే యూనిట్‌గా...?
2014లో రుణమాఫీ చేసినప్పుడు కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని రుణమాఫీ చేశారు. 18 ఏళ్లలోపు పిల్లలు ఉంటే తల్లిదండ్రులతో కలిపి ఒక కుటుంబంగా పరిగణించారు. అంతకుమించి వయసుంటే మరో కుటుంబంగా గుర్తించారు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టత లేదు. ఈసారీ కుటుంబం యూనిట్‌గానే రుణమాఫీ చేస్తారని అంటున్నారు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటే సర్కారు ఆర్థిక భారం తగ్గుతుంది. దీనిపై పెద్దగా అభ్యంతరాలు లేవు. కుటుంబమే యూనిట్‌గా రుణమాఫీ జరగవచ్చని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment