గురుకులాల్లో ప్రమాణాలు పతనం | CAG to audit fallout of demonetisation | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో ప్రమాణాలు పతనం

Published Tue, Mar 28 2017 4:09 AM | Last Updated on Sat, Sep 22 2018 8:48 PM

గురుకులాల్లో ప్రమాణాలు పతనం - Sakshi

గురుకులాల్లో ప్రమాణాలు పతనం

పదో తరగతి ఉత్తీర్ణత తగ్గిపోతోందన్న కాగ్‌
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఈఐఎస్‌ (తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ) పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పతనమవుతున్నాయని కాగ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. పదోతరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతంతో పాటు గ్రేడ్‌ పాయింట్ల సాధన పడిపోతోందని అభిప్రాయపడింది. రాష్ట్రంలోని 47 గురుకులాల్లో 2013–16 మధ్య పదో తరగతి ఉత్తీర్ణత క్రమంగా తగ్గిందని తేల్చింది. 2013లో ఉత్తీర్ణత 98.40% ఉండగా 2016 నాటికి 93.10%కి తగ్గిందని.. మైనారిటీ గురుకులాల్లో 92.37% నుంచి 87.33%కి పడిపోయిందని పేర్కొంది. మొత్తంగా 2013లో వందశాతం ఫలి తాలు సాధించిన గురుకులాలు 28 కాగా.. 2016 నాటికి 14కు తగ్గిందని తెలిపింది. 2013లో గ్రేడ్‌ పాయింట్‌ 9కిపైగా సాధించిన విద్యార్థులు 34 శాతంకాగా.. 2016కు వచ్చేసరికి 14 శాతానికి తగ్గిపోయారని నివేదికలో పేర్కొంది. ఆర్‌సీఈ, సర్వేల్‌లో 2013లో గ్రేడ్‌ పాయింట్‌ 9 సాధించిన విద్యార్థులు 44 మందికిగాను 20 మంది ఉండగా.. 2016లో 73 మందికిగాను 10 మంది మాత్రమే ఉన్నారని విశ్లేషించింది.

1.11 కోట్ల పరికరాలు నిరుపయోగంగా..
సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణులకు అవసరమైన శిక్షణ, విస్తరణ, పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఏర్పాటు చేసిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ (ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ)లో రూ.1.11 కోట్లతో కొనుగోలు చేసిన పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని కాగ్‌ పేర్కొంది. జీవ విజ్ఞానం, భూసార పరీక్షా కేంద్రం నెలకొల్పేందుకు కొనుగోలు చేసిన ఈ పరికరాలను గత పదేళ్లుగా ఎవరూ వినియోగించడం లేదు. అలాగే ప్రయోగశాల నిర్వహణకు చేసిన రూ.22.03 లక్షల ఖర్చు కూడా వృథా అయింది. 2014లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల్లో ఏసీ బిల్లులను డ్రా చేసుకోవడంలో డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్స్‌మెంట్‌ అధికారులు నిబంధనలను పాటించలేదని కాగ్‌ పేర్కొంది. ఎనిమిది జిల్లాల్లో ఈ మేరకు రూ.86.80 లక్షల దుర్వినియోగం జరిగినట్లుగా వెల్లడైంది.

కమర్షియల్‌ ట్యాక్స్‌లో అన్నీ అవకతవకలే!
వాణిజ్య పన్నుల విభాగంలో ఎన్నో అవకతవకలు నెలకొన్నాయని కాగ్‌ ఎత్తిచూపింది. ఆరు కార్యాలయాల్లో ఏడుగురు డీలర్లకు సరైన పన్ను ఇన్వాయిస్‌ లేకుండానే రూ.9.83 కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను అనుమతించారని వెల్లడించింది. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల.. మినహాయింపు పొందిన అమ్మకాలు, లావాదేవీలపై 18 మంది డీలర్లు రూ.2.5కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను అధికంగా క్లెయిమ్‌ చేశారని తెలిపింది. ఇక 17 కార్యాలయాల పరిధిలో 26 మంది డీలర్లు, ఎయిర్‌ కండిషనర్లు, ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు, మిఠాయిలు తదితర వస్తువుల అమ్మకాలపై తక్కువ రేట్లలో పన్నులను వెల్లడించారని, దాంతో రూ.23.79 కోట్ల మేర తక్కువగా పన్ను తక్కువగా వసూలు చేశారని స్పష్టం చేసింది. 12 కార్యాలయాలకు సంబంధించిన 27 కేసుల్లో చేనేత, ఇతర వస్త్రాలకు చెందిన రూ.263.76 కోట్ల అమ్మకపు టర్నోవర్‌ను తప్పుగా మినహాయించడంతో.. రూ.13.19 కోట్ల వ్యాట్‌ నష్టపోయినట్లు తెలిపింది.

ఫీజుల వసూలులో ఎక్సైజ్‌ శాఖ విఫలం
మద్య నిషేధం పనితీరుకు సంబంధించి, ఇథనాల్‌ తయారీకి సంబంధించి లెవీ లైసెన్స్‌ ఫీజు వసూలులో ఎక్సైజ్‌ శాఖ విఫలమైందని కాగ్‌ మండిపడింది. ఫలితంగా రూ.98 లక్షలు నష్టం జరిగిందని పేర్కొంది. రెండు కార్యాలయాల పరిధిలో ఐదు లిక్కర్‌ షాపులకు సంబంధించిన పర్మిట్‌ రూమ్‌లకు రూ.10 లక్షల లైసెన్స్‌ ఫీజు వసూలు చేయలేదని తెలిపింది.

భూభారతి కింద రూ.37 కోట్లు వృథా!
రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో గత 68 ఏళ్లుగా భూముల రీసర్వే జరగలేదని కాగ్‌ స్పష్టం చేసింది. ఏడు జిల్లాల్లో సేత్వార్, టిప్పన్‌లు తదితర మౌలిక వసతులు అందుబాటులో లేవని తెలిపింది. భూభారతి ప్రాజెక్టు కింద న్యాయబద్ధమైన భూమి రికార్డులను ప్రభుత్వం రూపొందించకపోవడంతో ఆ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.37.73 కోట్లు వృథా అయినట్లు పేర్కొంది. భూమి రికార్డులను భద్రపరిచేందుకు స్కానింగ్‌/ కంప్యూటరైజేషన్‌ వంటి జాగ్రత్తలేమీ చేపట్టలేదని... గ్రామ పటాలను తప్పుగా రూపొందించడం వల్ల భూ వివాదానికి దారితీసిందని తెలిపింది. భూసేకరణ, భూముల అన్యాక్రాంతం తర్వాత ఏర్పడిన సబ్‌డివిజన్‌ సర్వే నంబర్లు, వాటిలోని లోపాలను సరిదిద్ది రూపొందించాల్సిన సేత్వార్‌ జారీకి సంబంధించి.. రంగారెడ్డి జిల్లాలో 20 ఏళ్లకుపైగా 94 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని... 22 మండలాల్లో 110 జమాబందీలకు గాను, 74 చోట్ల పూర్తి చేయలేదని తెలిపింది.

 మార్కెట్‌ విలువ సవరించకపోవడంతో నష్టం
రాష్ట్రంలో భూములు, భవనాల మార్కెట్‌ విలువలను సవరించకపోవడం, రిజిస్ట్రర్లను సరిగా నిర్వహించకపోవడాన్ని కాగ్‌ తప్పు పట్టింది. రిజిస్ట్రేషన్‌ శాఖలో నాన్‌ అగ్రికల్చర్‌గా మార్చిన భూమిని వ్యవసాయ భూమి కింద రిజిస్ట్రేషన్‌ చేయ డంతో రూ.1.38 కోట్ల నష్టం వాటిల్లిందని తేల్చింది. మార్కెట్‌ విలువను తక్కువగా చూపినందున రూ.71 లక్షల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఇక భవనాల అద్దెకు సంబంధించి సమర్పించిన పత్రాల్లో వాస్తవ వివరాలు కాకపో వడంతో 52.74 లక్షలు నష్టం వచ్చింది. అభివృద్ధికి ప్రతిపాదించిన భూముల్లోనూ మార్కెట్‌ విలువను తక్కువగా చూపి రూ.20.34 లక్షల ఫీజు వసూలు చేయలేదు.

లక్ష్యం చేరని రుణమాఫీ
రైతుల రుణమాఫీ పథకం లక్ష్యం పూర్తిగా నెరవేరలేదని కాగ్‌ స్పష్టం చేసింది. మార్గదర్శకాలకు భిన్నంగా లబ్ధిదారులను ఎంపిక చేశారని పేర్కొంది. బ్యాంకులు 455 రైతు మిత్ర బృందాలకు చెందిన ఉమ్మడి ఖాతాలను 1,159 వ్యక్తిగత ఖాతాలుగా విడగొట్టి.. రూ.2.75 కోట్లు లబ్ధి చేకూర్చాయని తెలిపింది. ఇక లబ్ధిదారులు చెల్లించా ల్సిన పంట రుణాలపై బ్యాంకులు రూ.183.98 కోట్ల వడ్డీని ఎక్కువగా క్లెయిమ్‌ చేశాయని పేర్కొంది. మాఫీ చేసే మొత్తంలో వడ్డీ కలిపి ఉంటుందని పథకం మార్గద ర్శకాలు నిర్దేశించినా కొన్ని బ్యాంకులు వడ్డీని క్లెయిమ్‌ చేయలేదని తెలిపింది. దాంతో అర్హులైన రైతులు రూ.66.16 కోట్ల వడ్డీ మాఫీని పొందలేకపోయారని చెప్పింది.

టెక్స్‌టైల్‌ పార్కుల్లో తీవ్ర జాప్యం
చేనేత, టెక్స్‌టైల్‌ రంగంలో ఉపాధి అవకాశాల కల్పన, ఎగుమతుల పెంపు లక్ష్యంగా టెక్స్‌టైల్, వస్త్రాల పార్కులను స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చినా.. వాటిని పూర్తి చేయడంతో జాప్యం చేసిందని కాగ్‌ పేర్కొంది. సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్కు, వైట్‌గోల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ స్పిన్‌టెక్స్‌ పార్కు ప్రైవేటు లిమిటెడ్‌లకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.04 కోట్లు, కేంద్రం రూ.14.34 కోట్లు ఖర్చు పెట్టినా ఆశించిన ఫలితాలు రాబట్టలేదు. సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్కులో విద్యుత్, నీటి సరఫరా, అంతర్గత రోడ్లకు తొలుత ఆమోదించిన వ్యయం రూ.1.64 కోట్లుకాగా.. పరిశ్రమల శాఖ మాత్రం రూ.5.86 కోట్లు ఖర్చు చేసిందని తెలిపింది. 2015–16 ఏడాదికి ఎగుమతుల లక్ష్యం సిరిసిల్ల పార్కులో రూ.10 కోట్లు, స్పిన్‌టెక్స్‌ పార్కులో రూ.650 కోట్లుగా పేర్కొన్నా.. ఎటువంటి ఎగుమతులు జరగలేదని స్పష్టం చేసింది.

 కాంట్రాక్టర్ల నుంచి పరిహారం వసూలేదీ?
రాష్ట్రంలో రోడ్డు నిర్మాణ పనుల్లో పురోగతి నిరాశజనకంగా ఉన్నా.. ఆర్‌అండ్‌బీ శాఖ వారికి ఎలాంటి జరిమానా విధించడం లేదని కాగ్‌ తప్పుపట్టింది. జగిత్యాల–పెద్దపల్లి రోడ్డు స్థాయిని పెంచే ప్యాకేజీ పూర్తయినట్లుగా ప్రకటించినా.. అది పూర్తి కాలేదని తెలిపింది. విభజన తర్వాత సంస్థాగత బలోపేతానికి సరిపడా ప్రయత్నాలు చేయలేదని.. ప్రమాద స్థలాల వద్ద రోడ్డు నిర్వహణ మెరుగుపరిచే పనుల్లో రాష్ట్రం పూర్తిగా వెనకబడిందని స్పష్టం చేసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement