Commercial tax
-
తెలంగాణలో మరో భారీ స్కాం.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై కేసు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. కమర్షియల్ ట్యాక్స్‌లో కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కమర్షియల్ ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో భారీ కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. దాదాపు రూ.1000 కోట్ల అవకతవకలు జరిగినట్టు అధికారులు తెలిపారు. కాగా, 75 కంపెనీలు ఈ కుంభకోణానికి పాల్పడ్డినట్టు చెప్పారు. ఇక, ఈ స్కాంలో లబ్ధి పొందిన జాబితాలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉంది. అయితే, ఈ మొత్తం వ్యవహారం ఫోరెన్సిక్ అడిట్‌తో వెలుగు వచ్చింది.ఇక, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనలతో ట్యాక్స్ పేమెంట్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు ఐఐటీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, పిలాంటో టెక్నాలజీస్లపై కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో, స్కామ్‌కు పాల్పడిన నిందితులపై ఐపీసీ 406,409,120B ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. -
సంస్కరణలతో ఆదాయం వృద్ధి
సాక్షి, అమరావతి: వాణిజ్యపన్నుల శాఖలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలతో ఆ శాఖ ఆదాయం భారీగా పెరిగింది. 2022–23లో జీఎస్టీ ఆదాయం 20.13% వృద్ధితో ఏకంగా రూ.28,092.87 కోట్లు నమోదవడం విశేషం. గతంలో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు అంటే వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఎప్పుడు తనిఖీలు చేస్తారో.. ఎలాంటి జరిమానాలు విధిస్తారో.. అన్న భయం ఉండేది. కానీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అధికారులు వాణిజ్యపన్నుల శాఖను పూర్తిగా స్నేహపూర్వక శాఖగా మార్చారు. గత ఏడాది కాలంగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అవకతవకలకు పాల్పడకుండా పన్నులు చెల్లించే వ్యాపారులకు రక్షణ కల్పిస్తూ.. అదే సమయంలో పన్నులు ఎగ్గొట్టేవారిని గుర్తించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో తనిఖీల భయం లేకుండా నిజమైన వ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ సంస్కరణలతో రాష్ట్రంలో పన్ను ఎగవేతలకు అడ్డుకట్టపడింది. గతేడాది (2022–23)లో ఈ సంస్కరణల ద్వారా అదనంగా రూ.1,745 కోట్ల ఆదాయం సమకూరినట్లు రాష్ట్ర పన్నుల ప్రధాన అధికారి గిరిజాశంకర్ ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఒకే సంవత్సరం 10కిపైగా కీలక సంస్కరణలతో పూర్తిస్థాయి ప్రక్షాళన చేశామన్నారు. పన్ను చెల్లించని వ్యాపారులను గుర్తించి వారితో పన్ను కట్టించడం ద్వారా రూ.263.9 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఆటోమేటిక్ రిటర్న్ స్క్రూట్నీ ద్వారా రూ.132.91 కోట్ల ఆదాయం సమకూరిందని చెప్పారు. ఆడిటింగ్ ద్వారా రూ.38.79 కోట్లు, తనిఖీల ద్వారా రూ.64.29 కోట్లు, వ్యాట్ బకాయిలను వసూలు చేయడం ద్వారా రూ.235.13 కోట్లు వచ్చాయన్నారు. 2021–22తో పోలిస్తే రాష్ట్ర జీఎస్టీ ఆదాయం (పరిహారం లేకుండా) 2022–23లో 20.13% వృద్ధితో రూ. 28,092.87 కోట్లుగా నమోదైందని తెలిపారు. పరిహారంతో కలిపి చూస్తే మొత్తం జీఎస్టీ ఆదాయం రూ.33,511.33 కోట్లని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక సంస్కరణలివే.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అధికారుల ప్రమేయం లేకుండా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాహనాలను తనిఖీచేసే ఆటోమేటెడ్ చెక్ ఆఫ్ వెహికల్ ట్రాఫిక్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానంలో ఏ అధికారి వాహనాలను చెకింగ్ చేస్తారన్న విషయాన్ని 24 గంటలు ముందుగానే ఎస్ఎంఎస్ విధానంలో తెలియజేస్తారు. రిటర్నుల స్క్రూట్నీలో కూడా అధికారుల ప్రమేయం లేకుండా ర్యాండమ్ విధానంలో ఎంపిక చేసేలా రిటర్న్ స్క్రూట్నీ ఆటోమేటెడ్ టూల్‌ను అందుబాటులోకి తెచ్చారు. జీఎస్టీ పోర్టల్‌లోని డేటా, ఎనలిటికల్ నివేదికల ఆధారంగా స్క్రూట్నీ కోసం రిటర్నులను ఎంపిక చేస్తారు. అలాగే ఎనలిటిక్ రిపోర్టులను ఎప్పటికప్పుడు తెలిపేలా డ్యాష్‌బోర్డు, కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించేలా లీగల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్, ఈ–జర్నల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్రీకృత డేటా ఎనలిటికల్ సెంటర్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. తద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి నేరుగా వారివద్దే తనిఖీలు చేస్తున్నారు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’.. -
సీఎస్‌కు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: ఎక్సై జ్, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పూ ర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమెకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి.శేషాద్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సీఎస్‌గా ఉన్న సోమేశ్‌కుమార్ ఈ శాఖలను పర్యవేక్షించేవారు. కొత్త సీఎస్‌గా శాంతికుమారి బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఆ రెండు శాఖల బాధ్యతలు ఆమె తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే సీఎస్‌కు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
సెలవురోజూ పనిచేయాలా?
అబిడ్స్: వాణిజ్య పన్నులశాఖ ఉన్నతాధికారుల తీరుతో కింది స్థాయి అధికారులు, వ్యాపార డీలర్లు లబోదిబోమంటున్నారు. ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్‌తో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మాల్స్, సినిమా థియేటర్లు, జనసంద్ర ప్రాంతాలు, విద్యా సంస్థలు ఈ నెల 31 వరకు మూసివేయాలని సీఎం కేసీఆర్ స్వయానా ఆదేశించారు. అయితే సీఎస్ శని, ఆదివారాల్లో కూడా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా వి«ధులు నిర్వహించాలని సర్క్యులర్ జారీ చే శారు. ఈ నెల 31 వరకు అన్ని వాణిజ్య పన్నుల శాఖా కార్యాలయాల్లో సెలవు దినాల్లో కూడా, రెండవ శనివారం, ఆదివారాల్లో కూడా కార్యాలయాలు తెరిచి ఉండాలని హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు, సిబ్బంది లబోదిబోమంటున్నారు. అంతేకాక కరోనా భయంతో గజగజలాడుతున్న వ్యాపారస్తులు, హోల్ సేల్ డీలర్లు కూడా వాణిజ్య పన్నులశాఖ అధికారుల తీరుపట్ల మండిపడుతున్నారు. శని, ఆదివారాల్లో పలువురు వాణిజ్య పన్నుల అధికారులు డీలర్లకు ఫోన్లు చేసి తమ కార్యాలయాల్లోకి రావాలని, పన్నులు చెల్లించాలని కోరడంతో పలువురు వ్యాపారస్తులు ప్రభుత్వ తీరుపట్ల విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాక పలువురు అధికారులు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ జారీ చేసిన సర్క్యులర్‌ను మీడియాకు చూపిస్తూ ఆయన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చే శారు. టార్గెట్లే... టార్గెట్లు సర్కిల్ స్థాయి అధికారులు, సిబ్బంది సెలవు దినాల్లో కూడా ట్యాక్స్ అధిక మొత్తం వసూలు చేయాలని ఉన్నతాధికారులునిర్ణయాలు తీసుకుంటడంతో పలువురు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరోనై వైరస్‌తో భయపడుతున్న వ్యాపారస్తులు కానీ, అధికారులు కానీ, సిబ్బంది కానీ పై అధికారుల తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక అధికారుల మధ్య పన్నులు వసూళ్ళు టార్గెట్లు, పోటీలు పెట్టి వేధిస్తున్నారని పలువురు వాపోయారు. కొంత మంది యూనియన్‌లో ఉన్నప్పటికీ వారిని కూడా సెలవు దినాల్లో పన్నులు వసూళ్ళు చేయాలని హుకుం జారీ చేయడంతో యూనియన్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సిటీలో జోరుగా బిల్లుల్లేని వ్యాపారం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ‘జీరో’ వ్యాపారం జోరుగా సాగుతోంది. బిల్లులు లేకుండా లక్షల్లో లావాదేవీలు తెల్లకాగితాల పైనే నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. జీఎస్టీ లాంటి పన్ను విధానాలు అమలు చేస్తున్నా..కొందరు వ్యాపారులు అడ్డదారుల్లో బిల్లులు ఇవ్వకుండా జీరో వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ‘ఏ వస్తువు కొనుగోలు చేసినా..బిల్లు తీసుకోవటం తప్పనిసరి. బిల్లు అడగటం వినియోగ దారుడి హక్కు. మేలుకో వినియోగదారుడా మేలుకో’ అంటూ వినియోగదారుల శాఖ...‘సకాలంలో పన్నులు చెల్లించండి.. దేశాభివృద్ధిలో పాలుపంచుకోండి’ అంటూ వాణిజ్య పన్నుల శాఖ చేస్తున్న ప్రచారం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది. బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, మొజంజాహీ మార్కెట్, ట్రూప్‌బజార్, సికింద్రాబాద్, మలక్‌పేట్ గంజ్, చార్మినార్, పత్తర్ఘాట్తో పాటు నగరం వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల మార్కెట్లలో బిల్లులు ఇవ్వకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. నగరంలో కొన్ని షాపింగ్ మాల్స్‌లో సైతం బిల్లులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కొందరు మాత్రం వినియోగదారులు అడిగితే ఇవ్వడం..లేదంటే వదిలేయడం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులకు ఈ విషయం తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. వారికి మామూళ్లు మడుతున్నందున జీరో వ్యాపారం జోరుగా సాగుతోందిని పలువురు ఆరోపిస్తున్నారు. జీఎస్టీ ఉన్నా... జీఎస్టీ చట్టం అమలులో ఉన్నా జీరో బిజినెస్ మాత్రం ఆగడం లేదు. అమ్మకాల విలువలో కొంత శాతం మాత్రమే వాణిజ్య పన్నుల శాఖ రికార్డుల్లో కనిపిస్తుంది. ఎంత పెద్ద మొత్తంలో బిల్లు అయినా తెల్ల కాగితంపై రాసిస్తారు. దీనిపై తీసుకున్న వస్తువుల పేర్లు, దుకాణం పేరు, రిజిస్టర్ నెంబర్ కనిపించవు. వినియోగదారులకు బిల్లు ఇస్తే ట్యాక్స్‌తో వస్తువుల ధర పెరుగుతుందని వ్యాపారులు చెబుతారు. దీంతో వినియోగదారులు సైతం ఎక్కువ మొత్తం చెల్లించలేక బిల్లులు ఇవ్వకున్నా నిమ్మకుండిపోతున్నారు. ఈ విషయం వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు కూడా తెలుసు. అయినా చర్యలు తీసుకోవటంలో విఫలమవుతున్నారు. పన్ను వసూళ్లు పెరిగేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడంలేదు. దీంతో అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. అన్ని వస్తువులూ అంతే... చౌక ధరకే వస్తువులు లభించటం బేగంబజార్ ప్రత్యేకత. 1770 నుంచే ఇక్కడ మార్కెట్ కొనసాగు తోంది. వందల సంఖ్యలో ఉన్న దుకాణాల్లో రోజూ రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. దుకాణాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. గృహోపకరణాలు, మేకప్ వస్తువులు, డ్రైఫూట్స్, మసాలాలు, సుగంధ ద్రవ్యాలు, స్టీల్ వస్తువులు, కిరాణా, ట్రాన్స్‌పోర్టు, దీపావళి టపాసులు, ప్లాసిక్ వస్తువులు, ఫర్నిచర్, బంగారం...ఇలా అనేక వ్యాపారాలకు బేగంబజార్ ప్రసిద్ధి. ఇక్కడి నుంచే జిల్లాలకు వస్తువులు సరఫరా అవుతుంటాయి. జిల్లాల్లో రిటైల్, హోల్‌సేల్ దుకాణాలు నిర్వహించే వారు సరుకుల్ని ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటారు. బేగంబజార్‌ను ఆనుకొని ఉన్న ముక్తియార్‌గంజ్, కిషన్‌గంజ్, ఉస్మాన్‌గంజ్, మహరాజ్‌గంజ్ తదితర మార్కెట్లలో చిరుధాన్యాలు, పిండి, బియ్యం, నూనె హోల్‌సేల్ వ్యాపారం జరుగు తుంది. దుకాణాలు చూసేందుకు చిన్నగా కనిపిస్తాయి. వీటికి సంబంధించిన గోడౌన్లు ప్రత్యేకంగా ఉంటాయి. కేవలం బిల్లు మాత్రమే దుకాణాల్లో ఇస్తారు. సరుకు మాత్రం గోడౌన్ల నుంచే సరఫరా చేస్తారు. ఇలా నిత్యం పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతున్నా కొంతమంది లెక్కల్లో కనిపించేది మాత్రం స్వల్పమే. ప్రభుత్వ ఆదాయానికి గండి రాష్ట్రవ్యాప్తంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి అమ్మకం పన్ను రూపంలో దాదాపు రూ.60 వేల కోట్లు ఆదాయం సమకూరిందని అధికారుల చెబుతున్నారు.. ఇందులో హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయమే సుమారు 60–65 శాతంగా ఉంటు ంది. నగరంలో పన్నులు చెల్లించని జీరో వ్యాపారం పెరిగిపోవటంతో ఆశించినంత స్థాయిలో ఆదాయం రావటం లేదు. వాణిజ్య పన్నుల శాఖ లెక్కల ప్రకా రం బేగం బజార్ సర్కిల్లో సుమారు 2 వేల వరకు రిజిస్టర్డ్ డీలర్లు ఉన్నారు. ఇందులో రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులున్నారు. వీరిలో కొంతమంది పూర్తిస్థాయి లో అమ్మకాల లెక్కలు చూపటం లేదు. మిగిలిన మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
‘బోధన్ స్కాం’ దర్యాప్తు ముగిసినట్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్కారు ఖజానాకు రూ.300 కోట్లు గండి కొట్టిన బోధన్ స్కాంలో సీఐడీ దర్యాప్తు ముగిసినట్లేనని తెలుస్తోంది. ఈ స్కాంలో ప్రధాన సూత్రధారి శివరాజు, అతడి కుమారుడితో పాటు 9 మంది కమర్షియల్ ట్యాక్స్ అధికారులను సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ స్కాం రెండో దశ దర్యాప్తులో భాగంగా మరో 16 మంది కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో పాటు 250 మందికి పైగా ఉన్న లబ్ధిదారులను విచారిం చాలని భావించింది. కానీ కొద్ది రోజులుగా బోధన్ స్కాంలో ఎలాంటి పురోగతి కనిపించక పోవడంతో దర్యాప్తు అధికారులు చార్జిషీట్ దాఖలుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. డీలర్లు, డిస్టిబ్యూటర్లకు ఊరటేనా? ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన చలాన్ల సొమ్మును శివరాజు తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఒకే చలాన్‌పై ఇద్దరు, ముగ్గురు వ్యాపారుల పన్ను చెల్లించినట్లు చూపించి నకిలీ చలాన్ల నంబర్లతో కమర్షియల్ ట్యాక్స్ వెబ్సైట్లో లెక్కలు సృష్టించడంతో రూ.300 కోట్ల మేర వాణిజ్య పన్నుల శాఖకు నష్టం వాటిల్లినట్లు సీఐడీ గుర్తించింది. అయితే స్కాంలో పాలుపంచుకున్న నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లోని వ్యాపారులను విచారించాలని సీఐడీ తొలుత భావించినా అది సాధ్యపడలేదని సమాచారం. 2010 నుంచి 2016 వరకు జరిగిన ఈ కుంభకోణంలో డిప్యూటీ కమిషనర్లతో పాటు ఆపై స్థాయి అధికారులు కూడా పాత్రధారులేనని, వారిని కూడా విచారించాలని వాణిజ్య పన్నుల శాఖకు లేఖ రాసినా ఆ విభాగం పట్టించుకోలేదు. స్కాంతో సంబంధం ఉన్న అధికారుల వివరాలు, వారు నిజామాబాద్‌లో పనిచేసిన వివరాలు కావాలని సీఐడీ కోరినా పట్టించుకోలేదు. ఇక చేసేదేమీ లేక సీఐడీ అధి కారులు చార్జిషీట్ దాఖలు చేసే పనిలో పడ్డట్లు తెలు స్తోంది. దీంతో అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఇటు అధికారు లకు ఊరట లభించినట్లేనన్న వాదన వినిపిస్తోంది. -
పన్నుల వసూళ్లలో వరంగల్ ముందంజ
కరీమాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డివిజన్ల కన్నా వాణిజ్య పన్నుల వసూళ్లలో వరంగల్ డివిజన్ ముందంజలో ఉందని కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్(డీసీ) గీత బుధవారం వెల్లడించారు. వరంగల్, ఖమ్మం జిల్లాలోని మొత్తం 11 సర్కిళ్లలో మార్చి 2018 నాటికి మొత్తం 21044 మంది డీలర్స్ ఉండగా వీరిలో 15948 మంది గతంలో జీఎస్టీలోకి మైగ్రేషన్ అయ్యారన్నారు. కొత్తగా 5096 మంది గత జులై నుంచి ఈ మార్చి వరకు జీఎస్టీలో మైగ్రేట్ అయినట్లు డీసీ గీత వివరించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది(2018–18)కి ఎక్కువ పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు. ప్రధానంగా 2017–18 సంవత్సరానికి గాను రాబడి రూ.431 కోట్లు వచ్చినట్లు తెలిపారు. కేవలం ఈ మార్చి 2018 వరకు రూ. 56.32 కోట్ల పన్నులు వసూలు చేసినట్లు డీసీ గీత వివరించారు. అలాగే 2017–18 సంవత్సరానికి గాను పాత బకాయిలు రూ.13.6 కోట్లు వసూలు చేశామన్నారు. ఇక జులై 2017 నుంచి మార్చి 2018 వరకు 81 శాతం జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయించినట్లు డీసీ పేర్కొన్నారు. పన్నుల వసూళ్లలో వరంగల్ డివిజన్ వాణిజ్య పన్నులు శాఖా సిబ్బంది ఉత్సాహంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. -
23.50 లక్షలతో పట్టుబడ్డారు
సాక్షి, విజయవాడ: భారీగా లంచం తీసుకుంటూ కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ ఏడుకొండలు, అసిస్టెంట్ కమిషనర్ అనంతరెడ్డి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు దొరికారు. వీరిద్దరూ తమ ఛాంబర్లో ఐటీడీ సిమెంటేషన్ కంపెనీ ప్రతినిధుల నుంచి రూ.23.50 లక్షలు లంచం తీసుకుంటూ శుక్రవారం పట్టుబడ్డారు. రూ.4.50 కోట్ల మేర పన్ను రాయితీ ఇప్పించేందుకు ఏడుకొండలు పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్టు తెలిసింది. వాణిజ్యపన్నుల శాఖలో ఆయన జీఎస్టీ విభాగం బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఐటీడీ కంపెనీకి చెల్లించాల్సిన ఇన్‌ఫుట్ పన్ను రాయితీ విడుదలకు ఏడుకొండలు, అనంతరెడ్డి రూ. 25 లక్షలు డిమాండ్ చేశారని ఏసీబీ డీజీ ఠాకూర్ తెలిపారు. కంపెనీలు ప్రతినిధులు తమను ఆశ్రయించడంతో ఈ బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చామన్నారు. కమర్షియల్ టాక్స్ విభాగంకు సంబంధించి మొత్తం నలుగురి అధికారుల ప్రమేయం వుందని వెల్లడించారు. నిందితులను విచారించిన తర్వాత రేపు అరెస్ట్ చేస్తామన్నారు. ఐటీడీ సిమెంటేషన్ సంస్థ.. విశాఖ, గంగవరం పోర్ట్ బెర్త్ నిర్మాణాలను చేపడుతోంది. -
జీఎస్టీ హెల్ప్ డెస్క్ ప్రారంభం
సందేహాల నివృత్తికి డయల్ 08518–247772 కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): జీఎస్టీపై ప్రజలకున్న సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ తాతారావు స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానిక స్కందా కాంప్లెక్స్‌లో జీఎస్టీ హెల్ప్ డెస్క్ కార్యాలయాన్ని చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు విజయ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రజలు, పన్ను దారుల సందేహాలను నివృత్తి చేసేందుకు 08518–247772 ఫోన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ ద్వారా మొదటి కాల్‌ను స్వీకరించిన తాతారావు ప్రజల సందేహాన్ని నివృత్తి చేసి జీఎస్టీ ప్రాధాన్యతను వివరించారు. -
వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు ఎత్తివేత
కర్నూలు (హాస్పిటల్): వస్తు సేవల పన్ను(జీఎస్టి) అమలు నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుంచి కర్నూలు నగర శివారులోని పంచలింగాల వద్ద ఉన్న వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టును ఎత్తివేశారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణా రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలను ఈ చెక్‌పోస్టులో తనిఖీ చేసేవారు. రోజుకు 1500 నుంచి 2వేల నుంచి వాహనాలు ఇక్కడకు వచ్చేవి. వీటిలో ఉన్న సరుకు తాలూకు పత్రాలను తనిఖీ చేసి, అవసరమైన మేరకు రుసుము వసూలు చేసేవారు. జీఎస్టి అమలు నేపథ్యంలో ఈ చెక్‌పోస్టులను ఎత్తివేశారు. శనివారం సాయంత్రం ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ తాతారావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటి దాకా నిర్వహించిన సేవలను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్‌లో నిర్వర్తించాల్సిన విధుల గురించి చర్చించుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్లు వెంకటేశ్వర్, గీతామాధురి, సీటీవోలు నాగేంద్రప్రసాద్, హుసేన్ సాహెబ్, రామాంజనేయప్రసాద్, డీసీటీవోలు, ఏసీటీవోలు పాల్గొన్నారు. అధికారుల హోదాలు మార్పు జీఎస్టీ అమలు నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ అధికారుల హోదాలు మారాయి. ప్రస్తుతం ఆ శాఖలో డిప్యూటీ కమిషనర్ ఇకపై జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్‌గా మారారు. అలాగే అసిస్టెంట్ కమిషనర్‌ను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, సీటీవోలను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, డీసీటీవోలను డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, ఏసీటీవోలను జీఎస్టి ఆఫీసర్స్‌గా మార్చారు. -
జీఎస్టీపై ప్రత్యేక దృష్టి!
వ్యాట్ డీలర్ల నమోదు షురూ... జీఎస్టీపై డీలర్లకు అవగాహన సదస్సులు జూలై 1 నుంచి అమలుకు సన్నాహాలు సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలుకు రంగం సిద్ధమవుతుండటంతో జీఎస్టీపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారులను గుర్తించేందుకు సర్వేకు శ్రీకారం చుట్టింది. మరోవైపు జీఎస్టీఎన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారా వ్యాట్ పరిధిలోని డీలర్లను జీఎస్టీ కింద మార్పు చేస్తోంది. జీఎస్టీ పన్ను విధానంపై సర్కిల్ వారిగా సదస్సులు నిర్వహిస్తూ వ్యాపారులకు అవగాహ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ, యుటీజీఎస్టీ నాలుగు పన్నులు అమోదించింది. పన్ను రేట్ల కూడా 6, 12, 18, 28గా విభజించింది. ఆయితే ఏ ఏ వస్తువులపై ఎంత పన్ను విధించాలన్న నిర్ణయం తీసుకోలేదు. జూలై1 నుంచి జీఎస్టీ చట్టం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. జీఎస్టీ కింద రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు వార్షిక టర్నోవర్ గల వ్యాపారులు కాంపొజిషన్‌లో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ పరిధిలోకి వచ్చే వ్యాపారులు ప్రభుత్వానికి ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆయితే రాష్ట్ర పరిధి దాటితే మాత్రం పన్ను రేటులో మార్పు ఉంటుంది. వ్యాపారులందరూ జీఎస్టీ కింద నమోదు చేసేవిధంగా విస్తృత అవగాహన కార్యక్రమాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. నగరంలో 1.30 లక్షలపైనే డీలర్లు.. గ్రేటర్ హైదరాబాద్‌లోని వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో ఏడు డివిజన్లలు ఉండగా, వాటి పరిధిలో గల 55 సర్కిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థల టర్నోవర్ ఏడాదికి రూ.7.50 లక్షల నుంచి రూ.50 లక్షల టర్నోవర్ సంస్థలు టర్నోవర్ టాక్స్ (టీవోటీ), వ్యాపార టర్నోవర్ రూ.50 లక్షలు దాటిన సంస్థలు వ్యాట్ (విలువ ఆథారిత పన్ను) పరిధిగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం వ్యాట్ డీలర్లుగా 1.11 లక్షలు, టీవోటీ డీలర్లుగా 21 వేల సంస్థలు మాత్రమే నమోదు చేసుకొని ఉన్నాయి. మహానగరంలోని మొత్తం వాణిజ్య, వ్యాపార సంస్థల్లో వ్యాట్, టర్నోవర్ టాక్స్ కింద నమోదైన సంస్థలు 60 శాతానికి మించి లేనట్లు తెలుస్తోంది. మిగిలిన 40 శాతం సంస్థలు నమోదుకు దూరం పాటిస్తున్నారు. వాటిని సైతం జీఎస్టీ పరిధిలోకి తేచ్చేందుకు వాణిజ్య పన్నుల శాఖ కసరత్తు చేస్తోంది -
చెక్‌పోస్టుల్లో ఏసీబీ తనిఖీలు
– అనధికార డబ్బు రూ.69,765 సీజ్ – ఇద్దరు ఏఎంవీఐలు, ఇద్దరు హోంగార్డులపై చర్యలకు సిఫారసు కర్నూలు: కర్నూలు శివారులోని హైదరబాద్ జాతీయ రహదారిపై పంచలింగాల క్రాస్ రోడ్డు వద్దనున్న అంతర్రాష్ట్ర రవాణా శాఖ, వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు నిరంతరాయంగా తనిఖీలు చేపట్టారు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ జయరామ రాజు, సీఐ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో వాణిజ్య పన్నుల తనిఖీ కేంద్రంలో సోదాలు నిర్వహించారు. అక్కడ అన్నీ సక్రమంగా ఉండటంతో సమీపంలోని ఆర్టీఏ చెక్‌పోస్టులో సోదాలు జరిగాయి. ఏఎంవీఐలు శ్రీనివాసులు, రఘునాథ్‌తో పాటు హోంగార్డు హుసేని, నరసింహులు కార్యాలయం వద్ద ఉండి వాహనాల తనిఖీ చేస్తుండటం గుర్తించారు. కార్యాలయం గల్లాపెట్టెలో రూ.3,28,165 ఉండగా, అందులో రూ.69,765 అనధికార సొమ్ముగా వెల్లడయింది. అందుకు సంబంధించి రవాణా శాఖ అధికారులు లెక్కలు చూపకపోవడంతో అనధికార సొమ్మును సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేసి చర్యలకు ప్రభుత్వానికి రిపోర్టు పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు. -
ఆదాయం ఢమాల్..
⇒ఆబ్కారీ శాఖ మినహా.. సర్కారీ విభాగాల కుదేలు ⇒పెద్ద నోట్ల రద్దుతో భారీ గండి ⇒లక్ష్య సాధనలో చతికిలబడ్డ శాఖలు సిటీబ్యూరో: ఆదాయార్జనలో నగరంలోని పలు ప్రభుత్వ విభాగాలు చతికిలపడ్డాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆబ్కారీ శాఖ మినహా.. రవాణా, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఈ శాఖలు ఆర్జించిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. పెద్దనోట్ల రద్దు దెబ్బతో రియల్ ఎస్టేట్ రంగంతో పాటు సకల వ్యాపార, వాణిజ్య రంగాలకు గట్టి దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఆయా విభాగాలకు ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యానికి భారీగా గండిపడింది. ఆర్టీఏ ఆదాయానికి బ్రేకులు.. ఈ ఏడాది (2016–2017) రవాణాశాఖ ఆదాయానికి బ్రేకులు పడ్డాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వాహనాల అమ్మకాలు తగ్గడంతో పాటు.. జీవితకాల పన్నుపై భారీగా ప్రభావం చూపాయి. త్రైమాసిక పన్ను కూడా కొంతమేర తగ్గింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం లక్ష్యంలో 85 శాతమే సాధించగలిగారు. అంటే అనుకున్న లక్ష్యంలో 15 శాతం మేర కోత పడింది. తగ్గిన ‘వాణిజ్య పన్నుల’ రాబడి గ్రేటర్ హైదరాబాద్‌లో వాణిజ్య పన్నుల శాఖ ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్య సాధనలో వెనుకబడింది. 2016–17లో సుమారు రూ.24 వేల కోట్ల ఆదాయాన్ని పన్నుల రూపంలో సమకూర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. కానీ మార్చి చివరి నాటికి కేవలం రూ.19 వేల కోట్లతో సరిపెటుకొంది. ఈ శాఖకు సమకూరే ఆదాయంలో మహానగర రాబడి అత్యంత కీలకం. ఈ శాఖలో మొత్తం 12 డివిజన్లు ఉండగా, సిటీలో ఏడు డివిజన్లు ఉన్నాయి. నగరంలోని అబిడ్స్, చార్మినార్, బేగంపేట, పంజగుట్ట, సికింద్రాబాద్, సరూర్‌నగర్, హైదరాబాద్ రూరల్ డివిజన్ల పరిధి నుంచే అత్యధికంగా ఆదాయం సమకూరుతోంది. కానీ, అధికారులు చేతివాటం, పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంతో ఆదాయానికి గండి కొట్టినట్లయింది. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ తీరును కాగ్ తప్పు పట్టిన విషయం తెలిసిందే. లక్ష్యం చేరని రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ సైతం ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేక చతికిలబడింది. 2016–17లో గ్రేటర్లో రూ.3 వేల కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకుంది. కానీ మార్చి చివరికి రూ.2400 కోట్లకు మించలేదు. పెద్దనోట్ల రద్దు, కరెన్సీ కట్టడితో స్థిరాస్తి లావాదేవీలు భారీగా తగ్గిపోయాయి. దీంతో ఈ రంగం కుదేలైంది. రిజిస్ట్రేషన్ శాఖలో మొత్తం 12 జిల్లా రిజిస్ట్రార్లు (డీఆర్) ఉండగా అందులో మహానగరంలో నాలుగు డీఆర్ పరిధులు ఉన్నాయి. వీటిలో 41 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేస్తున్నాయి. మొత్తంమీద రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో మహానగరం వాటా 68.89 శాతం ఉంది. కానీ, ఈ ఏడాది వరుసగా ఐదు మాసాలుగా స్థిరాస్తి రంగం స్తబ్ధతగా మారడంతో ఆ ప్రభావం రిజిస్ట్రేషన్ శాఖపై పడినట్లయింది. -
గురుకులాల్లో ప్రమాణాలు పతనం
పదో తరగతి ఉత్తీర్ణత తగ్గిపోతోందన్న కాగ్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఈఐఎస్ (తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ) పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పతనమవుతున్నాయని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. పదోతరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతంతో పాటు గ్రేడ్ పాయింట్ల సాధన పడిపోతోందని అభిప్రాయపడింది. రాష్ట్రంలోని 47 గురుకులాల్లో 2013–16 మధ్య పదో తరగతి ఉత్తీర్ణత క్రమంగా తగ్గిందని తేల్చింది. 2013లో ఉత్తీర్ణత 98.40% ఉండగా 2016 నాటికి 93.10%కి తగ్గిందని.. మైనారిటీ గురుకులాల్లో 92.37% నుంచి 87.33%కి పడిపోయిందని పేర్కొంది. మొత్తంగా 2013లో వందశాతం ఫలి తాలు సాధించిన గురుకులాలు 28 కాగా.. 2016 నాటికి 14కు తగ్గిందని తెలిపింది. 2013లో గ్రేడ్ పాయింట్ 9కిపైగా సాధించిన విద్యార్థులు 34 శాతంకాగా.. 2016కు వచ్చేసరికి 14 శాతానికి తగ్గిపోయారని నివేదికలో పేర్కొంది. ఆర్సీఈ, సర్వేల్లో 2013లో గ్రేడ్ పాయింట్ 9 సాధించిన విద్యార్థులు 44 మందికిగాను 20 మంది ఉండగా.. 2016లో 73 మందికిగాను 10 మంది మాత్రమే ఉన్నారని విశ్లేషించింది. 1.11 కోట్ల పరికరాలు నిరుపయోగంగా.. సాక్షి, హైదరాబాద్: గ్రామీణులకు అవసరమైన శిక్షణ, విస్తరణ, పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఏర్పాటు చేసిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ (ఎస్ఆర్టీఆర్ఐ)లో రూ.1.11 కోట్లతో కొనుగోలు చేసిన పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని కాగ్ పేర్కొంది. జీవ విజ్ఞానం, భూసార పరీక్షా కేంద్రం నెలకొల్పేందుకు కొనుగోలు చేసిన ఈ పరికరాలను గత పదేళ్లుగా ఎవరూ వినియోగించడం లేదు. అలాగే ప్రయోగశాల నిర్వహణకు చేసిన రూ.22.03 లక్షల ఖర్చు కూడా వృథా అయింది. 2014లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల్లో ఏసీ బిల్లులను డ్రా చేసుకోవడంలో డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారులు నిబంధనలను పాటించలేదని కాగ్ పేర్కొంది. ఎనిమిది జిల్లాల్లో ఈ మేరకు రూ.86.80 లక్షల దుర్వినియోగం జరిగినట్లుగా వెల్లడైంది. కమర్షియల్ ట్యాక్స్‌లో అన్నీ అవకతవకలే! వాణిజ్య పన్నుల విభాగంలో ఎన్నో అవకతవకలు నెలకొన్నాయని కాగ్ ఎత్తిచూపింది. ఆరు కార్యాలయాల్లో ఏడుగురు డీలర్లకు సరైన పన్ను ఇన్వాయిస్ లేకుండానే రూ.9.83 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అనుమతించారని వెల్లడించింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల.. మినహాయింపు పొందిన అమ్మకాలు, లావాదేవీలపై 18 మంది డీలర్లు రూ.2.5కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అధికంగా క్లెయిమ్ చేశారని తెలిపింది. ఇక 17 కార్యాలయాల పరిధిలో 26 మంది డీలర్లు, ఎయిర్ కండిషనర్లు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, మిఠాయిలు తదితర వస్తువుల అమ్మకాలపై తక్కువ రేట్లలో పన్నులను వెల్లడించారని, దాంతో రూ.23.79 కోట్ల మేర తక్కువగా పన్ను తక్కువగా వసూలు చేశారని స్పష్టం చేసింది. 12 కార్యాలయాలకు సంబంధించిన 27 కేసుల్లో చేనేత, ఇతర వస్త్రాలకు చెందిన రూ.263.76 కోట్ల అమ్మకపు టర్నోవర్‌ను తప్పుగా మినహాయించడంతో.. రూ.13.19 కోట్ల వ్యాట్ నష్టపోయినట్లు తెలిపింది. ఫీజుల వసూలులో ఎక్సైజ్ శాఖ విఫలం మద్య నిషేధం పనితీరుకు సంబంధించి, ఇథనాల్ తయారీకి సంబంధించి లెవీ లైసెన్స్ ఫీజు వసూలులో ఎక్సైజ్ శాఖ విఫలమైందని కాగ్ మండిపడింది. ఫలితంగా రూ.98 లక్షలు నష్టం జరిగిందని పేర్కొంది. రెండు కార్యాలయాల పరిధిలో ఐదు లిక్కర్ షాపులకు సంబంధించిన పర్మిట్ రూమ్‌లకు రూ.10 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేయలేదని తెలిపింది. భూభారతి కింద రూ.37 కోట్లు వృథా! రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో గత 68 ఏళ్లుగా భూముల రీసర్వే జరగలేదని కాగ్ స్పష్టం చేసింది. ఏడు జిల్లాల్లో సేత్వార్, టిప్పన్లు తదితర మౌలిక వసతులు అందుబాటులో లేవని తెలిపింది. భూభారతి ప్రాజెక్టు కింద న్యాయబద్ధమైన భూమి రికార్డులను ప్రభుత్వం రూపొందించకపోవడంతో ఆ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.37.73 కోట్లు వృథా అయినట్లు పేర్కొంది. భూమి రికార్డులను భద్రపరిచేందుకు స్కానింగ్/ కంప్యూటరైజేషన్ వంటి జాగ్రత్తలేమీ చేపట్టలేదని... గ్రామ పటాలను తప్పుగా రూపొందించడం వల్ల భూ వివాదానికి దారితీసిందని తెలిపింది. భూసేకరణ, భూముల అన్యాక్రాంతం తర్వాత ఏర్పడిన సబ్‌డివిజన్ సర్వే నంబర్లు, వాటిలోని లోపాలను సరిదిద్ది రూపొందించాల్సిన సేత్వార్ జారీకి సంబంధించి.. రంగారెడ్డి జిల్లాలో 20 ఏళ్లకుపైగా 94 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని... 22 మండలాల్లో 110 జమాబందీలకు గాను, 74 చోట్ల పూర్తి చేయలేదని తెలిపింది. మార్కెట్ విలువ సవరించకపోవడంతో నష్టం రాష్ట్రంలో భూములు, భవనాల మార్కెట్ విలువలను సవరించకపోవడం, రిజిస్ట్రర్లను సరిగా నిర్వహించకపోవడాన్ని కాగ్ తప్పు పట్టింది. రిజిస్ట్రేషన్ శాఖలో నాన్ అగ్రికల్చర్‌గా మార్చిన భూమిని వ్యవసాయ భూమి కింద రిజిస్ట్రేషన్ చేయ డంతో రూ.1.38 కోట్ల నష్టం వాటిల్లిందని తేల్చింది. మార్కెట్ విలువను తక్కువగా చూపినందున రూ.71 లక్షల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఇక భవనాల అద్దెకు సంబంధించి సమర్పించిన పత్రాల్లో వాస్తవ వివరాలు కాకపో వడంతో 52.74 లక్షలు నష్టం వచ్చింది. అభివృద్ధికి ప్రతిపాదించిన భూముల్లోనూ మార్కెట్ విలువను తక్కువగా చూపి రూ.20.34 లక్షల ఫీజు వసూలు చేయలేదు. లక్ష్యం చేరని రుణమాఫీ రైతుల రుణమాఫీ పథకం లక్ష్యం పూర్తిగా నెరవేరలేదని కాగ్ స్పష్టం చేసింది. మార్గదర్శకాలకు భిన్నంగా లబ్ధిదారులను ఎంపిక చేశారని పేర్కొంది. బ్యాంకులు 455 రైతు మిత్ర బృందాలకు చెందిన ఉమ్మడి ఖాతాలను 1,159 వ్యక్తిగత ఖాతాలుగా విడగొట్టి.. రూ.2.75 కోట్లు లబ్ధి చేకూర్చాయని తెలిపింది. ఇక లబ్ధిదారులు చెల్లించా ల్సిన పంట రుణాలపై బ్యాంకులు రూ.183.98 కోట్ల వడ్డీని ఎక్కువగా క్లెయిమ్ చేశాయని పేర్కొంది. మాఫీ చేసే మొత్తంలో వడ్డీ కలిపి ఉంటుందని పథకం మార్గద ర్శకాలు నిర్దేశించినా కొన్ని బ్యాంకులు వడ్డీని క్లెయిమ్ చేయలేదని తెలిపింది. దాంతో అర్హులైన రైతులు రూ.66.16 కోట్ల వడ్డీ మాఫీని పొందలేకపోయారని చెప్పింది. టెక్స్టైల్ పార్కుల్లో తీవ్ర జాప్యం చేనేత, టెక్స్టైల్ రంగంలో ఉపాధి అవకాశాల కల్పన, ఎగుమతుల పెంపు లక్ష్యంగా టెక్స్టైల్, వస్త్రాల పార్కులను స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చినా.. వాటిని పూర్తి చేయడంతో జాప్యం చేసిందని కాగ్ పేర్కొంది. సిరిసిల్ల టెక్స్టైల్ పార్కు, వైట్‌గోల్డ్ ఇంటిగ్రేటెడ్ స్పిన్టెక్స్ పార్కు ప్రైవేటు లిమిటెడ్‌లకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.04 కోట్లు, కేంద్రం రూ.14.34 కోట్లు ఖర్చు పెట్టినా ఆశించిన ఫలితాలు రాబట్టలేదు. సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులో విద్యుత్, నీటి సరఫరా, అంతర్గత రోడ్లకు తొలుత ఆమోదించిన వ్యయం రూ.1.64 కోట్లుకాగా.. పరిశ్రమల శాఖ మాత్రం రూ.5.86 కోట్లు ఖర్చు చేసిందని తెలిపింది. 2015–16 ఏడాదికి ఎగుమతుల లక్ష్యం సిరిసిల్ల పార్కులో రూ.10 కోట్లు, స్పిన్టెక్స్ పార్కులో రూ.650 కోట్లుగా పేర్కొన్నా.. ఎటువంటి ఎగుమతులు జరగలేదని స్పష్టం చేసింది. కాంట్రాక్టర్ల నుంచి పరిహారం వసూలేదీ? రాష్ట్రంలో రోడ్డు నిర్మాణ పనుల్లో పురోగతి నిరాశజనకంగా ఉన్నా.. ఆర్అండ్బీ శాఖ వారికి ఎలాంటి జరిమానా విధించడం లేదని కాగ్ తప్పుపట్టింది. జగిత్యాల–పెద్దపల్లి రోడ్డు స్థాయిని పెంచే ప్యాకేజీ పూర్తయినట్లుగా ప్రకటించినా.. అది పూర్తి కాలేదని తెలిపింది. విభజన తర్వాత సంస్థాగత బలోపేతానికి సరిపడా ప్రయత్నాలు చేయలేదని.. ప్రమాద స్థలాల వద్ద రోడ్డు నిర్వహణ మెరుగుపరిచే పనుల్లో రాష్ట్రం పూర్తిగా వెనకబడిందని స్పష్టం చేసింది. -
దేశానికి ఆదర్శంగా నిలిచాం: ఈటల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే పరిపాలనపై పట్టు సాధించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే మార్గాల్ని అన్వేషించేందుకు బుధవారం కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంట్ నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంలో వాణిజ్య పన్నుల శాఖదే కీలక పాత్ర అని, ఆర్థిక శాఖ కేవలం నిధుల్ని ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలను మాత్రమే రూపొందిస్తుందన్నారు. ‘‘రాష్ట్ర ఏర్పాటుకు ముందు మనం నిలదొక్కుకోగలమా అని అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారని, కానీ నేడు దేశ మన్ననలు పొందిన ఏకైక రాష్ట్రం తెలంగాణే’’ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సమర్థులైన అధికారులకు బాధ్యతలు అప్పగించారని, ఆ నమ్మకాన్ని వాళ్లు నిలబెట్టుకున్నారంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌ను మంత్రి అభినందించారు. దౌర్జన్యంగా పన్నులు వసూలు చేయాల్సిన అవసరం లేదన్నారు. పన్నులు చెల్లిస్తే సొమ్ము భద్రంగా ఉంటుందనే భావన అందరిలోనూ వచ్చిందని, అందుకే చెల్లించే వారి సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిధుల విషయంలో పురోగతి సాధిం చామన్నారు. నీళ్ల విషయంలో ముందడుగు వేస్తున్నామని, ఉపాధి కల్పనలోనూ వృద్ధి సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతు న్నాయని వివరించారు. -
సీఐడీ వర్సెస్ కమర్షియల్ ట్యాక్స్!
⇒ బోధన్ స్కాంలో నిందితులకు ఉన్నతాధికారుల వత్తాసు ⇒ పరారీకి సహకరించారని సీఐడీ ఆగ్రహం ⇒ ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో నకిలీ చలాన్లతో కోట్లు కొట్టేసిన (బోధన్ స్కాం) నిందితులకు ఆ విభాగపు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారంటూ సీఐడీ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై వాణిజ్య పన్నుల విభాగం ముఖ్య కార్యదర్శికి సీఐడీ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో ఆ విభాగపు ఉన్నతాధికారుల పాత్రపైనా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నుంచి పక్కాగా ఆదేశాలు వచ్చాయని సీఐడీ వర్గాలు తెలిపాయి. (బో‘ధన్’ దొంగలెందరో?) పరారీ.. ఆశ్రయం: బోధన్ స్కాంలో ప్రాథమికంగా నిందితులుగా ఉన్న ఏసీటీవో, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు పరారీలో తోడ్పడింది ఇద్దరు íసీటీవోలు, ఇద్దరు జాయింట్ కమిషనర్లని సీఐడీ విచారణలో బయటపడింది. ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, అతడి కుమారుడు సునీల్‌కు ఆశ్రయం ఇవ్వడంలోనూ వీరి పాత్ర కీలకమని సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. స్కాంలో కీలక సూత్రధారిగా ఉన్న శివరాజ్, సునీల్ కర్ణాటకలో తలదాచుకున్నట్టు గుర్తించారు.(‘కమర్షియల్’ స్కాంపై సీఎం కేసీఆర్ సీరియస్) విచారణకు సహకరించాలి: ఈ కుంభకోణం వ్యవహారంలో తమ దర్యాప్తునకు సహకరించాలని సీఐడీ విజ్ఞప్తి చేసిందని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఉదంతంపై తాము కూడా అంతర్గతంగా విచారణ జరుపుతున్నామని, తమ అధికారుల పాత్రపై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని, దాన్ని బట్టి సీఐడీ అధికారులు విచారించుకోవచ్చని స్పష్టం చేశారు. నిందితులకు సహకరిస్తున్న అధికారుల వివరాలను సీఐడీ నుంచి తీసుకుంటామని, ఈ కేసులో సీఐడీకి ఒత్తిళ్లు లేకుండా చూస్తున్నామని కమర్షియల్ ట్యాక్స్ విభాగంలోని కీలక అధికారి ఒకరు చెప్పారు. వణికిపోతున్న అధికారులు... ఈ స్కాంలో దోచుకున్న డబ్బులు ఖాతాల్లో వేసుకున్న కమర్షియల్ ట్యాక్స్ ఉన్నతాధికారుల్లో వణుకు మొదలైనట్టు తెలిసింది. శివరాజ్, సునీల్ సహా 22 మంది ములాఖత్ అయ్యారని, హైదరాబాద్‌లోని రెండు హోటళ్లలో రహస్యంగా సమావేశమై డబ్బు పంచుకున్నట్టు సీఐడీ గుర్తించింది. వీరిలో నలుగురు సీటీవోలు, నలుగురు జాయింట్ కమిషనర్లు కూడా ఉండటంతో ఆ విభాగంలో తీవ్ర చర్చ ప్రారంభమైంది. ఎప్పుడు, ఏ సమయంలో సీఐడీ అధికారులు ఎవరి ఇంట్లో దాడులు చేస్తారో తెలియక ఆ అధికారులు భయాందోళనలో ఉన్నారని తెలుస్తోంది. శివరాజ్, సునీల్ సీఐడీకి దొరికితే అందరి బాగోతం బయటపడుతుందని, వారి విచారణలో ఎవరి పేర్లు బయటకు వస్తాయోనని హడలిపోతున్నారని సమాచారం. -
వంద కోట్లకుపైగా నొక్కేశారు!
బోధన్ ట్యాక్స్ స్కాంలో వెలుగులోకి సంచలనాలు ⇒ ఉన్నతాధికారుల పాత్ర ఉందంటున్న సీఐడీ వర్గాలు ⇒ వారిని విచారించేందుకు అనుమతి కోరనున్న అధికారులు ⇒ త్వరలో అరెస్టులకు రంగం సిద్ధం సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జరిగిన కమర్షియల్ ట్యాక్స్ కుంభ కోణం వ్యవహారంలో రూ.100 కోట్లకుపైగా గల్లంతైనట్లు సీఐడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. తొలుత రూ.60 కోట్లు మాత్ర మే పక్కదారి పట్టాయని కమర్షియల్ ట్యాక్స్ అధికారుల విచారణలో బయటప డగా, సీఐడీ దర్యాప్తు ప్రారంభమైన రెండు రోజుల్లోనే భారీగా అవకతవకలను గుర్తించారు. రూ.100 కోట్లకుపైగా పన్నుల సొమ్మును అధికారులు, బ్రోకర్లు కలిసి నొక్కేశారని తేలింది. ఉన్నతా ధికారుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తం లో ట్యాక్స్ డబ్బులు గల్లంతయ్యాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఆడిటింగ్‌లో అడ్డదారి.. బోధన్ సర్కిల్ కార్యాలయంలో పనిచేసిన ఏసీటీవీ, నలుగురు సిబ్బంది బ్రోకర్లతో కలసి ట్రెజరీకి ట్యాక్స్ డబ్బులు చెల్లించినట్టు నకిలీ చలానాలు సృష్టించారు. ఇలా 2012 నుంచి 2015 వరకు దందా సాగించారని సీఐడీ దర్యాప్తులో బయటపడింది. అంతేకాదు ఏటా జరిగే ఆడిటింగ్ రిపోర్టులోనూ తప్పుడు లెక్కలు చూపించినట్టు తేలింది. సర్కిల్ కార్యా లయాల్లో జరిగిన ఆడిట్ రిపోర్టును కమ ర్షియల్ ట్యాక్స్ ఉన్నతాధికారులు సరిగా పరిశీ లించకపోవడం, కొందరు ట్రెజరీ ఉద్యోగులు మామూళ్లు పుచ్చుకుని నకిలీ చలానాలపై దృష్టి సారించలేదని గుర్తించినట్లు తెలిసింది. ఫైలు బూడిద చేశారు బోధన్ సర్కిల్లో పనిచేసిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నకిలీ చలానాలతోపాటు మిల్లర్లు ట్యాక్స్ కట్టినట్టు పక్కాగా రికార్డులు సృష్టించారు. కానీ అలా సృష్టించిన ఖాతా బుక్కులు, డాక్యుమెంట్లను తర్వాత కాల్చేసినట్టు సీఐడీ అనుమానిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా గతంలో కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగినట్టుగా బోధన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. తాజాగా కేసులో విచారణలో భాగంగా సీఐడీ అధికారులు ఆ ఘటనపైనా విచారణ జరపబోతున్నారు. ఉన్నతాధికారులను విచారిస్తాం..! బోధన్ స్కాం వ్యవహారంలో కమర్షియల్ ట్యాక్స్ ఉన్నతాధికారులను ప్రశ్నిం చేందుకు అనుమతించాలని సీఐడీ అధికా రులు ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడిన ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు కూడా కీలకపాత్ర వహించారని, వారి అండదండలు లేనిదే కింది స్థాయిలో వందల కోట్లు గల్లంతయ్యే అవకాశం లేదని వారు పేర్కొంటున్నారు. ఇక ఈ కేసులో ఉన్న ఏసీటీవోతో పాటు మరో నలుగురు సిబ్బందిని అరెస్ట్ చేసేందుకు సీఐడీ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నట్టు తెలిసింది. -
బిగుస్తున్న ఉచ్చు
సిట్ లేదా సీఐడీకి కేసు.. పన్ను ఎగవేత కుంభకోణంపై సర్కారు సీరియస్ సీఎస్ ఎస్పీ సింగ్ ప్రత్యేక సమీక్ష అక్రమార్కుల గుండెల్లో రైళ్లు నిజామాబాద్ : వాణిజ్య పన్నుల శాఖ పన్ను ఎగవేత కుంభకోణంలో అక్రమార్కులపై ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ మేరకు సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే కీలక సూత్రధారి శివరాజ్ అతని కుమారుడు సునీల్‌తోపాటు, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బందిపై బోధన్‌లో కేసు నమోదైన విషయం విదితమే. వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని నియమించారు. మరోవైపు ఎగవేసిన పన్నును వసూలు చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ చర్యలు చేపట్టిన విషయం విధితమే. మొత్తం 117 మంది వ్యాపారులకు నోటీసులు జారీ చేసిన అధికారులు ఎగవేసిన రూ.50 కోట్లను రాబట్టే చర్యలను ముమ్మరం చేశారు. లోతైన విచారణ కేవలం 2012–13, 2013–14 ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.50 కోట్ల పన్ను ఎగవేసినట్లు ప్రకటించినప్పటికీ, ఆ శాఖ ఉన్నతాధికారులు దశాబ్ద కాలంగా జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు అందుబాటులో ఉన్న డాటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే బోధన్‌లోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో రికార్డులు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, కీలక సూత్రధారి శివరాజ్ కార్యాలయంలో ఉన్న రికార్డులను, ఫైళ్లను, కంప్యూటర్ హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని ఆ శాఖ కమిషనరేట్‌కు తరలించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ఆ శాఖలో నిపుణులైన అధికారులు, సిబ్బందిని నియమించి లావాదేవీలను పరిశీలిస్తున్నా రు. డాటా అందుబాటులో ఉన్న 2005 నుంచి జరిగిన లావాదేవీలను ఆరా తీస్తున్నారు. బోగస్ చలానాలు, బోగస్ బ్యాంకు ఖాతాలు సృష్టించి పన్ను ఎగవేసిన వ్యాపారులు ఎవరనే అంశంపై ఆరా తీసున్నారు. -
జీఎస్టీతో దేశమంతా ఒకే ధర..ఒకే పన్ను
వాణిజ్యపన్నుల అధికారి(కర్నూలు) పి. నాగేంద్రప్రసాద్ వెల్లడి కర్నూలు(హాస్పిటల్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే జీఎస్టీ అమల్లోకి వస్తే దేశమంతా ఒకే ధర...ఒకే పన్ను ఉంటుందని వాణిజ్యపన్నుల అధికారి(కర్నూలు) పి. నాగేంద్రప్రసాద్ చెప్పారు. జీఎస్టీ పన్నుపై సోమవారం స్థానిక మామిదాలపాడు రోడ్డులోని ఓ హోటల్లో సెంట్రల్ ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ వ్యాట్ స్థానంలో త్వరలో జీఎస్టీ అమల్లోకి రానుందన్నారు. ప్రస్తుతం వివిధరాష్ట్రాల్లో ఒక్కో వస్తువుపై ఒక్కో విధంగా పన్నులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ నెల 24వ తేదీ వరకు వాణిజ్యపన్నులు, పాతబకాయిలు పాతనోట్ల ద్వారానే వ్యాపారులు, డీలర్లు చెల్లించవచ్చన్నారు. సమావేశంలో సెంట్రల్ ఎక్సైజ్ శాఖ నుంచి సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ ఏసీలు, వాణిజ్యపన్నుల శాఖ నుంచి ఏసీలు, సీటీఓలు, డీసీటీఓలు, ఏసీటీఓలు పాల్గొన్నారు. డీలర్ల వివరాలు అప్లోడ్ చేయండి జిల్లాలోని అధీకృత డీలర్లు తమ వివరాలను ఎSఖీN పోర్టల్‌లో జనవరి ఒకటి నుంచి 15వ తేది వరకు అప్లోడ్ చేసుకోవాలని వాణిజ్యపన్నుల శాఖ అధికారి నాగేంద్రప్రసాద్ చెప్పారు. డీలర్లు వారి స్టేట్/సెంట్రల్ అధికారుల నుంచి పొందిన ప్రొవిజనల్ ఐడీ, పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ ¯ð ంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ తిరిగి అప్లోడ్ చేయాలని సూచించారు. -
పన్ను వసూలుకు టెక్నాలజీ వినియోగం
- సీసీ కెమెరా ఏర్పాటు చేసిన వాణిజ్య పన్నుల శాఖ కర్నూలు(హాస్పిటల్): తెలంగాణ నుంచి కర్నూలు మీదుగా వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి పన్ను వసూలు చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆధునిక టెక్నాలజీ వాడుకుంటున్నారు. ఈ మేరకు హై డెఫనేషన్ సీసీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. మంగళవారం స్థానిక నగర శివారులోని పంచలింగాల గ్రామం వద్ద ఉన్న వాణిజ్య పన్నుల శాఖ తనిఖీ కేంద్రం వద్ద సీసీ కెమెరాలను బిగించారు. ఇకపై అలంపూర్ టోల్ గేట్ నుంచి కర్నూలు మీదుగా వెళ్లే వాహనాలు తనిఖీ కేంద్రం వద్ద ఆగివెళ్లి పత్రాలు చూపించాల్సిందే. అలాకాకుండా కన్ను గప్పి వెళ్లాలనుకుంటే మాత్రం హెచ్డీ కెమెరా వాహనం నెంబర్‌తో సహా ఇట్టే పట్టేస్తుంది. వెంటనే అధికారులు అప్రమత్తమై సదరు వాహనాన్ని వెంబడించి మరీ పన్ను వసూలు చేయడం, సరుకు సీజ్ చేయడం వంటి చర్యలకు చేపట్టేందుకు సులభతరం చేసుకుంటున్నారు. తెలంగాణ నుంచి కర్నూలు మీదుగా ప్రతిరోజూ 1400 నుంచి 1600 వరకు వాహనాలు తనిఖీ చేసుకుని వెళ్తున్నాయి. వీటిలో కొన్ని వాహనాలు తనిఖీ చేసుకోకుండా వెళ్తున్నాయని అధికారులు గుర్తించారు. ప్రతిసారీ అధికారులు, సిబ్బంది రోడ్డుపై కాపు కాసి వాహనాలను పట్టుకోవడం కష్టం కాబట్టి, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటే మంచి ఫలితం ఉంటుందని అధికారులు భావించారు. ఈ మేరకు మంగళవారం నుంచి హెచ్డి సీసీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు. -
వాణిజ్య పన్ను వసూళ్లలో దూకుడు
సాక్షి, హైదరాబాద్: వ్యాట్‌తోపాటు లగ్జరీ ట్యాక్స్, వినోదపన్ను మొదలైన 7రకాల పన్ను వసూళ్లలో రాష్ట్రం దక్షిణాదిలో రెండోస్థానంలో నిలిచింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు జరిగిన పన్ను వసూళ్లలో కర్ణాటక 12.50% వృద్ధిరేటుతో తొలిస్థానంలో నిలవగా, రాష్ట్రం 11.88%తో రెండోస్థానంలో నిలిచింది. ఏపీ 11.60% వృద్ధితో 3వ స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో కేరళ (7%), తమిళనాడు (6.5%) ఉన్నాయి. వాణిజ్యపన్నుల శాఖ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.43 వేల కోట్ల మేర ఆదాయం వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. తొలి 4 నెలల్లో(ఏప్రిల్-జూలై) రూ.11,500 కోట్లు సాధించింది. -
వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ప్రారంభం
ఈడుపుగల్లు (కంకిపాడు) : గ్రామ పరిధిలోని ఆర్కే వ్యాలీ భవనంలో ఏర్పాటు చేసిన కమిషనర్ కార్యాలయాన్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్‌కల్లం బుధవారం ప్రారంభించారు. వివిధ విభాగాధిపతుల చాంబర్లను పరిశీలించారు. అనంతరం కమిషనర్ చాంబర్లో ఆ శాఖ ఉద్యోగులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. అజయ్‌కల్లం మాట్లాడుతూ దసరాకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ శాఖలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఆ శాఖ కమిషనర్ జే శ్యామలరావు, కమిషనర్ కార్యదర్శి సీ నాగరాణి, అడినల్ సీసీ జీ వెంకటేశ్వర్లు, పంపాపతి, జాయింట్ కమిషనర్ యు.ఏడుకొండలు, డిప్యూటీ కమిషనర్లు రఘునాథ్, వై.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
డీసీ దృష్టికి వ్యాపారుల సమస్యలు
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వ్యాపారాలు సన్నగిల్లాయని, దీంతో వ్యాపారులు చాలా ఇబ్బందులతో వ్యాపారాలు కొనసాగిస్తున్నారని శ్రీకాకుళం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు విజయనగరం వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనర్ ఎల్.శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు. మంగళవారం ఆయన ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపార సంఘాల తరఫున డీసీని సత్కరించారు. అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వాణిజ్యపన్నుల విభాగం వారి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, తమకు సహకరించాలని డీసీకి విన్నవించారు. దీనికి సానుకూలంగా స్పందించిన శ్రీనివాస్ అధికారులతో మాట్లాడి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తెలిపారు. డీసీని కలిసిన వారిలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అందవరపు వరహానరసింహం (వరం), ప్రధాన కార్యదర్శి పీవీ రమణ, ఉపాధ్యక్షులు కె.వాసు, పేర్ల సాంబమూర్తి, గుమ్మా నాగరాజు, కోశాధికారి గుమ్మా నగేష్, ఇతర ప్రతినిధులు ఏఎన్ఆర్ రాజు, కోణార్క్ శ్రీను, తంగుడు బాబు, ఎస్వీడీ మురళి, అమరావతి శ్రీను, కి ల్లంశెట్టి నరసింహమూర్తి, నవతా బాబ్జి, కోరాడ రమేష్, గుడ్ల చక్రధరరాజు, పేర్ల మహేష్, సుప్రీమ్ దివాకర్, దీర్ఘాశి సూర్యనారాయణ, గెంబలి శ్రీను, వీఎం రావు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి వ్యాపారుల బంద్
మూడ్రోజుల పాటు హోటళ్లు, దుకాణాలన్నీ మూత సీటీవో వేధింపులపై భగ్గుమంటున్న వ్యాపారులు తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులంతా ట్రేడ్బంద్కు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి మూడ్రోజుల పాటు దుకాణాలన్నీ మూసి నిరసన తెలిపేందుకు సమాయత్తమవుతున్నారు. తిరుపతి, తిరుచానూరు, రేణిగుంట, చంద్రగిరి పట్టణాలకు చెందిన సుమారు 10 వేల మంది వ్యాపారులు బంద్‌లో పాల్గొంటున్నారు. తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సభ్యత్వం ఉన్న 27 వ్యాపార సంఘాలు మూకుమ్మడిగా బంద్‌కు పిలుపునిచ్చాయి. తిరుపతి సిటీ: వ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్న తిరుపతి కమర్షియల్ ట్యాక్స్ అధికారి-2 శ్రీనివాసులు నాయుడును బదిలీ చేస్తేనే బంద్‌ను విరమిస్తామని తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మంజునాథ్ తెలిపారు. సీటీవోను బదిలీ చేయాలని కోరుతూ బుధవారం నుంచి చేపట్టిన బంద్‌కు మద్దతుగా మంగళవారం నగరంలోని వ్యాపారులంతా నల్లజెండాలను ధరించి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా మంజునాథ్ మాట్లాడుతూ సీటీవో-2 బెదిరిస్తూ విపరీతమైన పన్నులు వసూలు చేయడంతోపాటు అధికంగా పెనాల్టీలు వ సూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన్ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. చర్చల సమయంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కూడా ఆ సీటీవోను వెంటనే బదిలీ చేయాలని మంత్రికి సూచించారన్నారు. ఆ శాఖ కమిషనర్ సెలవులో ఉన్నారని మంత్రి దాటవేస్తున్నారన్నారు. మూడు రోజులు బంద్ చేయడమే కాకుండా ఆయనను జిల్లా నుంచి బదిలీ చేసేంతవరకు అన్ని ట్రేడ్ యూనియన్ల సహకారంతో బంద్ కొనసాగిస్తామని హెచ్చరించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి కెవి.చౌదరి (ఎస్ఎస్బీ) మాట్లాడుతూ తిరుమలకు వచ్చే యాత్రికులను దృష్టిలో పెట్టుకుని 10 రోజులుగా ప్రకటనలు చేస్తున్నామని, యాత్రికులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. బంద్‌కు ప్రజలందరూ సహకరించాలని కోరారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి కూడా వెనుకాడబోమని చెప్పారు. కార్యక్రమంలో ఆయా ట్రేడ్ యూనియన్ల నేతలు బిరుదాల హనుమంతురెడ్డి,బైఅండ్సేవ్ మధు, బి.రఘురామ్, జీత్తు, నరసింహులు, మంగళ్‌చంద్,కిషోర్,నవరతన్, తోట రమణ, కళానికేతన్ రాజేంద్రప్రసాద్, విజయబాబు, నరసింహులు, రాజా, మల్లిశెట్టి రవి వ్యాపారస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నుంచి మొదలై మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు కొనసాగింది. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కమర్షియల్ టాక్స్ ఉద్యోగి
మలక్‌పేట కమర్షియల్ టాక్స్ ఉద్యోగి నరహరి లంచం తీసుకుంటూ నాంపల్లి కమర్షియల్ టాక్స్ ఆఫీసులో ఏసీబీ అధికారులకు గురువారం చిక్కాడు. వ్యాట్ రిజిస్ట్రేషన్ కోసం లక్ష్మి అనే మహిళ నుంచి రూ.2,500 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాణిజ్య పన్నుల శాఖలో స్పెషల్ దోపిడీ
► దారికి రాని వ్యాపారులపై ఆడిట్ కొరడా ► ఏసీబీ దాడులకూ వెరవని అధికారులు విజయవాడ సిటీ : వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి పెచ్చరిల్లింది. రకరకాల కొర్రీలతో వ్యాపారుల నుంచి ముక్కు పిండి మరీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఇవ్వని వారిని చట్టాల కొరడా ఝళిపించి దారికి తెచ్చుకుంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖ సేవల్లో పారదర్శకత కోసం ఈ-రిజిస్ట్రేషన్లు, ఈ-వే బిల్లులు, ఈ-వసూళ్లు సహా ఎన్ని కొత్త విధానాలు అమలులోకి తెస్తున్నా.. ఆ శాఖలో వేళ్లూనుకున్న అవినీతికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తరచూ జరుగుతున్న ఏసీబీ దాడులే దీనికి నిదర్శనం. మామూళ్లు గుంజేందుకు వాణిజ్య చట్టంలోని ‘స్పెషల్ ఆడిట్’ను అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మామూళ్ల వసూలుకు సీటీవో (కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్)లు పథకం రచన చేస్తే.. సీనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు వసూళ్లకు తెగబడుతున్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద సర్కిళ్లలజుో ఒకటైన నందిగామ (భవానీపురం) వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడుల్లో దొరికిన రూ.1.02 లక్షల అనధికార నగదే ఇక్కడి అవినీతికి నిదర్శనం. మిగిలిన సర్కిళ్లలో పరిస్థితి కూడా ఇందుకు భిన్నమేమీ కాదనేది వ్యాపారుల ఆరోపణ. ఇలా చేస్తారు... సర్కిల్ పరిధిలోని వ్యాపారులు, ట్రేడర్ల జాబితాను అధికారులు తమ వద్ద అట్టిపెట్టుకుంటారు. వారు నిర్వహించే వ్యాపారాలను బట్టి వార్షిక టర్నోవర్‌ను అంచనా వేస్తారు. ఆపై ఆయా వ్యాపారుల సంఘాలు, మధ్యవర్తుల ద్వారా మూమూళ్లకు తెరలేపుతారు. ఒక్కొక్క వ్యాపారి కనిష్టంగా రూ.10 వేలు, గరిష్టంగా రూ.30 వేలు వీరికి ఏటా మామూళ్లు ఇవ్వాలి. లేకుంటే వారిని రకరకాలుగా వేధిస్తుంటారు. ఆయా వ్యాపారుల నుంచి ఒకేసారి మామూళ్లు తీసుకోకుండా కేటగిరీలుగా విభజించి నెలవారీ వసూళ్లు నిర్దేశిస్తారు. ఒక్క నందిగామ (భవానీపురం) సర్కిల్లోనే 3800 మంది డీలర్లు(వ్యాపారులు) ఉన్నట్టు అధికారిక సమాచారం. వీరి వద్ద నుంచి ఏడాదికి సగటున ఒక్కొక్కరి నుంచి రూ.15 వేలు మామూళ్లు తీసుకున్నా.. అక్రమంగా వచ్చే ఆదాయం రూ.4 కోట్ల పైమాటే ఉంటుంది. ఆ మొత్తాన్ని అధికారులు, సిబ్బంది స్థాయిని బట్టి పంపకాలు జరుగుతుంటాయి. మామూళ్లు ఇవ్వకుంటే ఇలా... నిర్దేశించిన మేరకు మామూళ్లు ఇవ్వని వ్యాపారులపై ‘స్పెషల్ ఆడిట్’ను ప్రయోగిస్తారు. ఆయా వ్యాపారుల లొసుగులను ముందుగానే గుర్తిస్తారు. ఆపై వారికి నోటీసులు జారీ చేస్తారు. ఇక ఫైళ్ల తనిఖీ పేరిట రకరకాల కొర్రీలు పెడుతుంటారు. రికార్డుల్లో నమోదు కాని వస్తువుల ఖరీదుతో పాటు పెనాల్టీ కింద వ్యాపారుల కళ్లు తిరిగే మొత్తాలను చెపుతారు. దీంతో బెంబేలెత్తిన వ్యాపారులు అధికారుల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునేందుకు సిద్ధమవుతారు. ఇక దారికి వస్తాడనుకుంటే తమ ఉద్యోగులను పంపి వారితో బేరసారాలు సాగిస్తారు. తమ వద్ద పనిచేసే సీనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు సహా కలెక్షన్లలో చురుకుగా వ్యవహరించే వారికి మామూళ్ల వసూళ్ల బాధ్యతలను అప్పగిస్తారు. వీరు ఆయా వ్యాపారుల సామర్థ్యాన్ని బట్టి ‘ప్రత్యేక’ మామూళ్లు వసూలు చేస్తారు. నందిగామ సర్కిల్లో ఏసీబీ అధికారుల దాడికి ముందు స్పెషల్ ఆడిట్ నోటీసు అందుకున్న ఓ వ్యాపారి రూ.80 వేలు లంచంగా ఇచ్చినట్టు వెలుగు చూసింది. ఏడాదిలో నలుగురు దొరికారు... గత ఏడాది కాలంలో జిల్లాలోని ఇద్దరు సీటీవోలు, ఒక ఏసీటీవో, ఒక సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఆరోపణలపై తిరువూరు వద్ద ఏర్పాటు చేసిన బోర్డర్ చెక్‌పోస్టును ఏసీబీ అధికారులు తనిఖీ చేసి అనధికారిక నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం నందిగామ సర్కిల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసి రూ.1.02 లక్షల అనధికారిక నగదును స్వాధీనం చేసుకోవడం విశేషం. -
పన్ను వసూళ్లలో ‘లీకేజీ’లు
- సర్కార్‌కు రూ. 2వేల కోట్లకు పైగా నష్టం - వాణిజ్య పన్ను నిర్ధారణల్లో అవకతవకలు - వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు - 2014-15లో పన్ను నిర్ధారణలో లోపాల వల్ల రూ. 308 కోట్ల నష్టంగా గుర్తించిన కాగ్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, పాలన పరమై న లోపాలు... సిబ్బంది కొరత... వ్యాపారులతో కుమ్మక్కు... వెరసి సర్కారుకు వేల కోట్ల రూపాయల పన్ను రాకుండా పోతుంది. చెక్‌పోస్టుల నిర్వహణలో లోపాలు, తనిఖీ వ్య వస్థ బలంగా లేకపోవడం, రాజకీయ ఒత్తిళ్లకు తోడు వ్యాపారులు చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ధారించడంలో జరుగుతున్న అవకతవకల వల్ల సర్కార్ ఖజానాకు భారీగా గండిపడుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖ సుమారు రూ. 30 వేల కోట్ల పన్ను వసూలు చేసింది. ఈ ‘లీకేజీ’లను అరికట్టి మరింత జాగ్రత్తగా వ్యవహరించకపోవడం వల్ల మరో రూ. 2వేల కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. లీకేజీలు ఇలా..: వ్యాపారం చేస్తున్న డీల ర్లకు పన్ను వర్తింపజేయడంలో అధికార యంత్రాంగం చూపే నిర్లక్ష్యం ఫలితంగా ఏటా రూ.300 కోట్లు, చెక్‌పోస్టులను ఆధునికీకరించకపోవడం వల్ల మరో రూ. 250 కోట్లు నష్టపోతుండగా, ముందస్తు పన్ను చెల్లింపులు ప్రోత్సహిం చడం, పన్ను వాయిదా వేసిన వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేయడం వంటి చర్యల వల్ల మరో రూ. 150 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఇవి కాకుండా 14.5 శాతం వ్యాట్ ఉన్న వస్తు సామగ్రి రాష్ట్రంలోకి వివిధ మార్గాల ద్వారా అక్రమంగా రాకుండా అడ్డుకోవడం, ఆడిట్స్ నిర్వహించడం వల్ల మరో రూ. 300 కోట్ల వరకు రాబడి ఉంటుం దని వాణిజ్యపన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇవికాక సర్కార్ తక్షణమే స్పందించి తీసుకునే చర్యల వల్ల మరో రూ. 1000 కోట్ల వరకు రాబట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు పన్ను వసూళ్లలో అవకతవకలు, లీకేజీలతో పాటు వాటిని అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యల గురించి సర్కార్‌కు నివేదికను సమర్పించారు. అధికారుల చిత్తశుద్ధే ముఖ్యం.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సర్కార్‌కు వాణిజ్యపన్నుల ద్వారా వచ్చిన రెవెన్యూ రూ. 30వేల కోట్లలో 12 డివిజన్ల వ్యాపారుల నుంచి వసూలైన మొత్తం సుమారు రూ. 12 కోట్ల వరకే ఉండడం గమనార్హం. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే మరో వందల కోట్ల రూ పాయలు వసూలు చేసే అవకాశం ఉంది. వాణిజ్యపన్ను తక్కువ నిర్ధారణతోనే రూ. 308 కోట్ల నష్టం: కాగ్ 2014-15 ఆర్థిక సంవత్సరంలో తక్కువ పన్ను నిర్ధారణ కేసుల్లోనే రూ. 308 కోట్లు సర్కార్ నష్టపోయినట్లు ‘కాగ్’ తన నివేదికలో తేల్చింది. ఈ తతంగం ప్రతి ఏటా జరిగేదేనని, ఫైళ్లను పరిశీలించినప్పుడు మాత్రమే ఇలాంటివి వెలుగు చూస్తాయని రిటైర్డ్ వాణిజ్యపన్నుల అధికారి ఒకరు తెలిపారు. జిల్లాల స్థాయిలో ఉన్న ఖాళీలతో పాటు చె క్‌పోస్టుల వద్ద అదనపు సిబ్బందిని నియమించడం వల్ల ఈ ‘లీకేజీ’లను అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
అంతా ‘కమర్షియల్’
► నో వేబిల్.. జేబులు ఫుల్ నిత్యం సరుకు సరఫరా ► పన్నులు మాత్రం ఎగనామం ప్రభుత్వ ఆదాయానికి గండి ► మామూళ్ల మత్తులో వాణిజ్యశాఖ అధికారులు ► కావలిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏసీటీఓ నెల్లూరు వాణిజ్యపన్నుల శాఖలో అవినీతికి అంతులేకుండా పోతోంది. లెసైన్స్ దగ్గర నుంచి పన్ను చెల్లింపు వరకు కొందరు అధికారులు పనికోరేటు నిర్ణయించి వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. జాక్‌పాట్ లారీలు వీరికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అధికారుల కక్కుర్తితో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నిత్యం సరకులు.. విలువైన వస్తువులను లారీల ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చేరవేస్తుంటారు. అయితే ఏ ఒక్క లారీకి వే బిల్లు ఉండదు. వే బిల్లుకు చెల్లించే మొత్తాన్ని కొందరు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల జేబుల్లోకి చేరుతోంది. లారీల యజమానులు కూడా కొందరు అధికారులకు నెలనెలా మామూళ్లు సమర్పించుకుంటున్నారు. వ్యాపారులు క్రయ, విక్రయాలకు సంబంధించి వ్యాట్ రూపంలో ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తుంటారు. అటువంటి వారికి వాణిజ్య పన్నులశాఖ అధికారులు సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొందరు అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వకుండానే వ్యాపారుల నుంచి మామూళ్లు పుచ్చుకుని వదిలేస్తున్నారు. మరికొందరు సర్టిఫికెట్స్ కోసం మమూళ్లు తీసుకుని ఇస్తున్నారు. అందుకు నిదర్శనం సోమవారం కావలి ఏసీటీఓ బాలాజీసింగ్ సర్టిఫికెట్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడటమే. ఇటీవల కాలంలో నెల్లూరు సీటీఓగా పనిచేస్తున్న అధికారి నివాసంపై ఏసీబీ అధికారులు సోదాలు చేయగా రూ.కోట్ల అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదీ విషయం జిల్లాలోని వాణిజ్యపన్నుల శాఖలో 5 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 3, గూడూరు, కావలి ప్రాంతాల్లో ఒక్కో సర్కిల్ కార్యాలయం ఉంది. జిల్లాలో ఐదుగురు సీటీఓలు, 11 మంది డీసీటీఓలు, 23 మంది ఏసీటీలు విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సర్కిల్ కార్యాలయంలో వాణిజ్యపన్నుల అధికారి ఒకరు ఉంటారు. వీరంతా ప్రతినిత్యం వ్యాపార లావాదేవీలను పర్యవేక్షిస్తుంటారు. ఎవరైనా వ్యాపారం చేసుకోవాలంటే లెసైన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యాపారులు ఆయా వస్తువులును బట్టి ఒక శాతం నుంచి 14.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.5లక్షల నుంచి రూ.40లక్షల లోపు వ్యాపారం చేసే ప్రతి వ్యాపారి ఒక శాతం పన్నును చెల్లించాలి. అటువంటి వారు జిల్లావ్యాప్తంగా 3వేలమందికిపైగా ఉన్నట్లు సమాచారం. వీరంతా టీఓటీ (టాట్) పరిధిలోకి వస్తారు. అందుకే వీరు రాష్ట్ర పరిధిలోనే వ్యాపార లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ పైన వ్యాపారం చేసేవారు వ్యాట్ పరిధిలోకి వస్తారు. వీరంతా ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు నిర్వహిస్తుంటారు. ఏడాదికి రూ. 5 లక్షల లోపు వ్యాపారం చేసేవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. వ్యాట్‌కు తూట్లు... ప్రభుత్వ ఆదాయానికి గండి జిల్లావ్యాప్తంగా 10వేలమందికి పైగా వ్యాట్ డీలర్లు ఉన్నారు. ప్రతిరోజూ కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. కొంతమంది వ్యాపారులు అధికారులకు మామూళ్లు ఇచ్చి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. గతంలో ఏసీబీకి దొరికిన సీటీఓపై గూడూరులో పనిచేస్తున్నడప్పుడు పలు ఆరోపణలు వచ్చాయి. బియ్యం, ఇనుము పరిశ్రమలతో పాటు సెజ్‌లకు సంబంధించిన పరిశ్రమల లావాదేవీలకు సంబంధించి ఎలాంటి పన్నులు వసూలు చేయకుండా భారీ అక్రమాలకు పాల్పడినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కొంతమేర పరిశ్రమల నుంచి పన్నులు వసూలు చేశారు. జిల్లాలోని కొన్ని పరిశ్రమలు ఎలాంటి పన్ను చెల్లించకుండా వివిధ రకాల సరుకులు, వస్తువులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ పరిశ్రమల అధినేతలు కొందరు అధికారులకు మామూళ్లు ఇచ్చి వాణిజ్యశాఖకు పన్ను చెల్లించకుండా ఎగనామం పెడుతున్నారు. జాక్‌పాట్ లారీల ద్వారా రవాణా బియ్యం, ధాన్యం, వంటనూనెలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, జీడీపప్పు, వేస్ట్‌పేపర్, డగ్స్ తదితర సరుకులకు సంబంధించి వ్యాపారులు వాణిజ్యశాఖకు 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. టింబర్ సోప్స్, కాస్మోటిక్స్, కర్ర, మిషనరీ, స్పేర్స్, ఆటోమొబైల్స్ తదితర వస్తువులకు 14.5శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది వ్యాపారులు కోట్లల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నా ఏడాదిలో కేవలం రూ.5లక్షల లోపే క్రయ, విక్రయాలు చేసినట్లు లెక్కలు చూపించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అదేవిధంగా జిల్లా నుంచి బియ్యం, చక్కెర, ధాన్యం, పప్పులు భారీగా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆయిల్స్, కాస్మోటిక్స్, వేస్ట్‌పేపర్, తదితర సరుకులు జిల్లాకు రవాణా అవుతున్నాయి. పార్శిల్ రూపంలో జాక్‌పాట్ లారీల ద్వారా తరలిస్తుంటారు. అయితే వాటికి ఎలాంటి వేబిల్లులు లేకుండా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రూ.కోట్ల ఆదాయాన్ని కొందరు అధికారులు, వ్యాపారులు కుమ్ముక్కై పంచుకుతింటున్నారు. ఈ అక్రమాలపై ఏసీబీ అధికారలు పూర్తిస్థాయిలో దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. -
భర్త అయినా... మౌనం సమాధానం కాదు!
ఈ విషయం గురించి మాట్లాడాలంటేనే దిగులుగా ఉంటుంది... ఇంత సున్నితమైన విషయాన్ని బజార్లో పెట్టాలంటే ఆలోచించాల్సి వస్తోంది. మేలు చేయబోయి కీడు చేస్తామా? అన్న ప్రశ్న వేధిస్తోంది. కానీ, మౌనం సమాధానం కాదు. ఒక చెల్లి, అక్క, బిడ్డ పడుతున్న వేదనకు మౌనం సమాధానం కాదు. ఆడపిల్లను జాగృతం చెయ్యడం ఒక అవసరం అయితే, మగవారిని సెన్సిటైజ్ చెయ్యడం అత్యవసరం. భార్యాభర్త అన్యోన్యంగా ఉండడానికి ఈ చర్చ ఒక అవకాశం కావాలి. మన ఫ్యామిలీని నిండుగా నూరేళ్లు ఉంచే బాధ్యతను మనందరం తీసుకోవాలి! ‘‘విడాకుల కోసం మా దగ్గరకొచ్చే కేసుల్లో 50 శాతం కేసులు ఇలాంటివే’’ అంటున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న ఫ్యామిలీ కోర్టు న్యాయవాది పార్వతి. వారిజ (పేరు మార్చాం) పెళ్లయి ఏడేళ్లు. ఇద్దరు పిల్లలు. ఆమె భర్త ప్రసాద్ (అసలు పేరు కాదు) కమర్షియల్‌టాక్స్ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నాడు. అయిదేళ్లు బాగానే సాగింది వాళ్ల కాపురం. రెండేళ్ల నుంచే కలతలు మొదలయ్యాయి. అన్ని విషయాల్లో ఇద్దరూ బాగా ఉంటారు. ఆ ఒక్క విషయంలోనే ఇద్దరికీ పొసగడంలేదు. పిల్లల చదువు, ఇంటి బాధ్యతలతో వారిజ విపరీతంగా అలసిపోతోంది. దీంతో తనను పట్టించుకోవడంలేదనేది ప్రసాద్ కంప్లయింట్. విసిగిపోయి పిల్లలిద్దర్నీ తీసుకొని తల్లిగారింటికి వచ్చేసింది. ‘‘పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి నడుం వాల్చేదాకా క్షణం విశ్రాంతి ఉండట్లేదు. యంత్రంలా పనిచేస్తున్నాను. రాత్రిపూటైనా హాయిగా నిద్రపోతున్నానా అంటే అదీ లేదు. స్నేహితులు, సిట్టింగులు అంటూ అర్ధరాత్రి ఇంటికి చేరుతాడు. మంచి నిద్రను చెడగొడ్తాడు. అలసిపోయాను అన్నా వినడు. పైగా మొరటుగా ప్రవర్తిస్తున్నాడు. నావల్ల కావట్లేదమ్మా’’ అని తల్లి దగ్గర వాపోయింది. విషయం అర్థమైంది వారిజ తల్లికి. తన యవ్వనపు రోజులు గుర్తొచ్చాయి. తనూ తన తల్లి దగ్గర దిగాలు పడ్డ క్షణాలు మదిలో మెదిలాయి. అప్పుడు తన తల్లి తనకు చెప్పిన మాటల్నే ఇప్పుడు నా బిడ్డకు చెప్పాలా? ఆ మీమాంసతోనేవారిజ తల్లి నెమ్మదిగా గొంతు సవరించుకుంది.. ‘‘ఇంత చిన్న విషయానికే ఇక్కడికి వచ్చేయాలా? భర్త భార్య దగ్గరకి రాకపోతే ఎక్కడికి వెళ్తాడు? వల్లకాని పక్షంలో మెల్లగా సర్దిచెప్పుకోవాలి.. వినకపోతే నువ్వే ఓపిక పట్టాలి. తప్పదు. నువ్వు కాదంటే అతను వేరే దారి చూసుకుంటాడు. అప్పుడు నెత్తినోరు కొట్టుకున్నా ప్రయోజనం ఉండదు’’ అని చెప్పి కూతుర్ని అత్తారింటికి పంపింది కానీ.. ఇష్టంలేకుండా భర్తకైనా సరే తన శరీరాన్ని అప్పజెప్పడం ఎంత నరకమో తనకు తెలియదా? తప్పు చేశాననే భావన. నీ శరీరం మీద నీకు హక్కు ఉందని బిడ్డకెందుకు తను చెప్పలేకపోయింది? ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోయింది? కుటుంబం, సమాజం, పరువు, మర్యాద అని తన తల్లి భయపడ్డట్టే తనూ భయపడిందా? తన బిడ్డకు తాను సర్ది చెప్పినట్టే.. ఆడపిల్ల మనసు, సున్నితమైన ఆమె శరీరం గురించి అల్లుడికీ ఎవరైనా చెప్పగలిగితే ఎంత బాగుండు.. ఈరోజు నా కూతురికి ఈ సమస్య వచ్చేది కాదు కదా..! ఇవి వారిజ తల్లి ఆలోచనలు మాత్రమే కాదు.. ఇప్పుడు ఒక చర్చ కూడా. తన శరీరం మీద తనకు హక్కులేదా? భర్త అయినంత మాత్రాన బలవంత పెడితే భరించాలా? అన్న ప్రశ్న మ్యారిటల్ రేప్‌ను చట్టం కిందికి తేవాలి అన్నంత పదును తేలింది. ఇంకోవైపు భార్యాభర్తలకు చెందిన ఈ సమస్యను పరస్పర అవగాహన, సహనంతో నాలుగు గోడలమధ్యే పరిష్కరించుకోవాలి.. కుటుంబం కూలిపోకుండా కాపాడుకోవాలి అన్న అభిప్రాయమూ వినపడుతోంది. నేపథ్యం: నిర్భయ సంఘటన జరిగిన తర్వాత నిర్భయ యాక్ట్ సందర్భంలో జస్ట్టిస్ వర్మ కొన్ని మార్గదర్శకాలను సూచించారు. వాటిలో భార్యభర్తల మధ్య జరిగే బలవంతపు శృంగారాన్ని... అంటే భార్య అంగీకారం లేకుండా భర్త జరిపే శృంగారాన్నీ రేప్‌గానే పరిగణించాలని చెప్పారు. కానీ నాటి ప్రభుత్వం దీన్ని అంగీకరించలేదు. పార్లమెంటేరియన్లంతా దీనివల్ల వివాహ వ్యవస్థకున్న పవిత్రత పోతుందని, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని వాటిని వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్లీ ఈ అంశం వార్తల్లోకి వచ్చి జస్టిస్ వర్మ సూచన ప్రకారం దీన్ని వైవాహిక అత్యాచారంగా పరిగణించాలనే చర్చ మొదలైంది. భార్య, భర్త జ్యుడీషియల్ సపరేషన్లో ఉన్నా, విడాకులకు సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్నా, ఒప్పందం ప్రకారం ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నా భర్త, భార్యతో బలవంతంగా శృంగారం జరిపితే దాన్ని రేప్‌గా పరిగణించాలనే క్లాజ్ 376బిలో ఇదివరకే ఉంది. భార్య ఫిర్యాదు చేస్తే ఆ క్లాజు ప్రకారం 2 నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధిస్తారు. బ్రూటాలిటీ... బీస్టాలిటీ... పెరిగిన ఒత్తిళ్లు, ఆర్థిక అవసరాలు, కుటుంబ బాధ్యతల దృష్ట్యా భార్యాభర్తల మధ్య సెక్స్ పరంగా సత్సంబంధాలు ఉండడం లేదు. భర్త సెన్సిటైజ్ కావాలి.. అవసరం కూడా. స్త్రీకి భద్రత, భరోసా అవసరం. కాబట్టి బ్రూటాలిటీ, బీస్టాలిటీ కింద పరిగణించి మ్యారిటల్ రేప్‌ను 376బిలో చేర్చాలి. - పార్వతి, ఫ్యామిలీ కోర్టు న్యాయవాది. ఎవరు చేసినా నేరమే! సెక్సువల్ అబ్యూజ్.. సెక్సువల్ అసాల్ట్.. సెక్సువల్ అటాక్.. ఎవరు చేసినా నేరమే. మహిళ సమ్మతి లేకుండా ఆమెను బలవంతం చేస్తే అది రేప్. భర్త చేస్తే మ్యారిటల్ రేప్. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. - సంధ్య, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు బలహీనుల పక్షానే... స్త్రీ్త్ర మానసికంగా బలవంతురాలైనప్పటికీ శారీరకంగా బలహీనురాలు. రాజ్యమెప్పుడూ బలహీనుల పక్షానే నిలబడాలి. వాళ్ల హక్కులకు రక్షణ కల్పించాలి. అందులో భాగంగానే మ్యారిటల్రేప్ను చట్టం కిందికి తీసుకురావాలి. - సామాన్య, రచయిత్రి ఇద్దరూ సమానమే... మన రాజ్యాంగం ప్రకారం మన న్యాయవ్యవస్థలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే. దీనిప్రకారం ఆమె శరీరం మీద ఆమెకు హక్కు ఉన్నట్టే! ఒక మనిషి హక్కును ఇంకో మనిషి బలవంతంగా లాక్కోవడం నేరం. దాన్నే ప్రశ్నిస్తోంది వివాహిత. తన శరీరం మీద తనకున్న హక్కును పరిరక్షించే చట్టం కావాలి. అలాగే పురుషుడినీ సెన్సిటైజ్ చేయాలి. - ప్రజ్ఞారశ్మి సైకాలజిస్ట్ అందుకే విముఖత! సహజంగా భార్య ఇంటిపనితో (ఉద్యోగి అయితే బయటపని కూడా) శారీరకంగా, మానసికంగా అలసిపోయినప్పుడు. హార్మోనల్ ఇమ్బ్యాలెన్స్ ఉన్నప్పుడు. ఎండోమెట్రియాసిస్ ప్రాబ్లమ్, పెల్విక్ ఇన్ఫామెట్రీడిసీస్ ఉన్నప్పుడు. భర్త మొరటు ప్రవర్తన వల్ల కలిగే భయం వల్ల సెక్స్ పట్ల విముఖతతో ఉంటుంది స్త్రీ. ఇలాంటప్పుడు భార్యాభర్తలిద్దరూ కౌన్సెలింగ్‌కు వచ్చి సమస్యను చక్కదిద్దుకోవచ్చు. - డాక్టర్ వి.శోభ, లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
లక్ష్యం... సుదూరం
ఆదాయ సముపార్జనలో వివిధ విభాగాల వెనుకబాటు వాణిజ్య పన్నుల శాఖలో నిరాశ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖదీ అదే తీరు రవాణా శాఖ ఆదాయానికి బ్రేకులు ఆబ్కారీ శాఖకు మాత్రం కాసుల పంట సిటీబ్యూరో: గ్రేటర్‌లోని వివిధ ప్రభుత్వ విభాగాలు ఆదాయ లక్ష్యాలకు అల్లంత దూరంలో నిలిచిపోయాయి. నిర్దేశించిన లక్ష్యం మేరకు రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చిపెట్టేవిషయంలో వివిధ శాఖలు వెనుకబడినట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆబ్కారీ శాఖలో మాత్రమే పురోగతి కనిపించింది. మిగిలిన విభాగాలు డీలా పడ్డాయి. మంగళవారంతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖల ఆదాయం ఇలా ఉంది... వాణిజ్య పన్నుల శాఖ డీలా రాష్ట్ర ఖజానాకు కీలకమైన హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత ఆదాయ లక్ష్యాలను చేరుకోలేదు. నూతన రాష్ట్ర ఆవిర్భావంతో నెలకొన్న పరిస్థితులు, మహా నగరంలో స్థిరాస్తి క్రయ విక్రయాలు మందగించడం, వ్యాపార, వాణిజ్య రంగాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. గ్రేటర్‌లోని ఏడు డివిజన్లకు కలిపి 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.19,435 కోట్ల లక్ష్యానికి గాను రూ.16,420 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది రూ.14,542 లక్ష్యానికి గాను రూ.10,224 కోట్లు లభించింది. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి వ్యాట్ (విలువ ఆథారిత పన్ను), అమ్మకం పన్నులు ప్రధానమైనవి. వృత్తి, వినోద పన్నుల ద్వారా కొంత వరకు రాబడి లభిస్తుంది. మొత్తం వసూళ్లలో వ్యాట్‌తోనే సుమారు 85 శాతంపైగా, మిగతా పన్నులతో మరో 15 శాతం వరకు ఆదాయం సమకూరింది. రిజిస్ట్రేషన్ శాఖదీ అదే తీరు ఇక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ 2014-15 వార్షికాదాయం పూర్తిగా పడిపోయింది. ఈ శాఖ మొత్తం ఆదాయంలో మహా నగర వాటా 68.89 శాతం. ఈ ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ వార్షికాదాయ లక్ష్యం రూ.923.27 కోట్లకు గాను రూ.540.20 కోట్లు మాత్రమే సమకూరింది. గత ఏడాది రూ.814.60 కోట్లకు గాను రూ.600.88 కోట్లు లభించింది. రంగారెడ్డి జిల్లాలోఈ ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ.2361.69 కోట్లు కాగా... రూ.1278.11 కోట్లు సమకూరింది. గత ఏడాది రూ.2262.19 కోట్ల లక్ష్యమైతే... రూ.1378.05 కోట్లు లభించింది. రియల్ బూమ్ మందగించడంతో ఆదాయం పడిపోయింది. రాష్ట్ర విభజన అంశం స్థిరాస్తి రంగాన్ని అచేతనంగా మార్చినట్లయింది. భూములు, ఫ్లాట్లకు డిమాండ్ తగ్గడంతో పాటు ధర కూడా పడిపోయింది. ఫలితంగా హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో స్థిరాస్తి లావాదేవీలు తగ్గి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పడిపోయినట్లు ఆ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రవాణా ఆదాయానికి బ్రేక్ హైదరాబాద్ జిల్లా పరిధిలో ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయ లక్ష్యం రూ.740 కోట్లు కాగా... సాధించింది కేవలం రూ.500 కోట్లు మాత్రమే. అంటే కేవలం 70 శాతమే లక్ష్యాన్ని చేరుకోగలిగింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో రూ.900 కోట్ల ఆదాయ లక్ష్యానికి.. రూ.638.56 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాలు, రియల్ బూమ్ తగ్గడంతో... నూతన వాహనాల కొనుగోళ్లు పడిపోవడం... పర్యాటకం మందగించడంతో ట్రావెల్స్ వ్యాపారం తగ్గడమే దీనికి ప్రధాన కారణమని ఆర్టీఏ వర్గాలు తెలిపాయి. ఆబ్కారీ శాఖకు మాత్రం కాసుల పంట హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఆబ్కారీ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండింది. ఉభయ జిల్లాల పరిధిలో నిర్దేశిత లక్ష్యం రూ.265 కోట్లకు ఈ ఏడాది రూ.296 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. గతఏడాదితో పోలిస్తే సుమారు 11.69 శాతం పెరుగుదల నమోదైనట్లు వెల్లడించాయి. గ్రేటర్లో రియల్, ఐటీ, టూరిజం వంటి రంగాల్లో స్తబ్ధత నెలకొన్న తరుణంలోనూ ఆబ్కారీ శాఖ ఆదాయం మెరుగుపడడం గమనార్హం. -
'నంది అవార్డుల పేరు మారుస్తాం'
-
'నంది అవార్డుల పేరు మారుస్తాం'
హైదరాబాద్: నంది అవార్డుల పేరు మారుస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. అందుకు సంబంధించి సీఎం కేసీఆర్ పరిశీలనలో మూడు పేర్లు ఉన్నాయని వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చిత్ర పరిశ్రమలో అనేక సంఘాలు, గ్రూపులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. సోమవారం సచివాలయంలో తలసాని శ్రీనివాసయాదవ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ ఆరు నెలల పాలన తర్వాత వ్యాపారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. అయితే బంగారం, వెండి ఆభరణాల వ్యాపారులు పూర్తిస్థాయిలో ట్యాక్స్ చెల్లించడం లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నగరంలో బంగారు దుకాణాలు అధికంగా ఉన్న అబిడ్స్, ప్యాట్నీ, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లోని బంగారు వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని వ్యాపార సంస్థలు వినియోగదారుడికి బిల్లులు ఇవ్వకుండా తక్కువ టర్నోవర్ చూపించి రాష్ట్ర ఖజానాకు ట్యాక్స్ కట్టడం లేదన్నారు. ఇదే తరహాలో కొబ్బరి, రబ్బరు వ్యాపారులు కూడా ఇదే దారిలో పయనిస్తున్నారని చెప్పారు. పాన్ మసాలా రాష్ట్రంలో నిషేధించినప్పటికీ... ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు జరుగుతున్నాయిని ఆయన ఆరోపించారు. వ్యాపారుస్తులంతా పన్నుల సక్రమంగా పన్నులు కట్టేలా చర్యలు చేపడతామని ఆయన వివరించారు. -
'న్యూ ఇయర్ పార్టీలకు ఎంటర్ టైన్మెంట్ ట్యాక్స్'
హైదరాబాద్:న్యూ ఇయర్ పార్టీ వేడుకలకు నగరం సిద్ధమవుతున్న తరుణంలో కమర్షియల్ ట్యాక్స్ కమిషన్ కూడా అంతే స్థాయిలో కసరత్తులు ఆరంభించింది. ఈసారి న్యూ ఇయర్ పార్టీలు నిర్వహించే ఆర్గనైజర్లు ట్యాక్స్ కట్టకపోతే భారీగా పన్ను చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేసింది. న్యూ ఇయర్ పార్టీలకు ఎంటరైన్మెంట్ ట్యాక్స్ వర్తిస్తుందని శనివారం కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్ పార్టీ నిర్వహించే ఆర్గనైజర్లు ముందుగా సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ట్యాక్స్ కట్టకపోతే ఐదు రెట్లు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. -
ఏకీకృత పన్నుల విధానంతో మేలు
వ్యాట్ నుంచి జీఎస్టీ దిశగా పన్నుల మార్పు వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీఓ అధికారుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఏయూ క్యాంపస్ : పన్నుల విధానంలో ఏకీకృత వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ఉద్యోగ సంఘాలు కృషి చేయాలని ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీఓ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ సూచించారు. సంఘం ఆధ్వర్యంలో ఏయూ వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వస్తు, సేవా పన్ను (జీఎస్టీ)పై శనివారం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. వ్యాట్ నుంచి నేడు జీఎస్టీ దిశగా పన్నులు మార్పు చెందనున్నాయన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా మనం ఎంతవరకు లబ్ధిపొందుతున్నామనే విషయం పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పన్ను సంస్థలన్నీ సమైక్యంగా పనిచేయాలని సూచించారు. సదస్సు ముఖ్య సమన్వయకర్త, కమర్షియల్ ట్యాక్స్ అదనపు కమిషనర్ జి.లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలనే లక్ష్యంతో ఏకీకృత పన్నుల విధానం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనిపై ఉద్యోగులు విస్తృత అవగాహన పెంచుకోవాలన్నారు. ఏఐఎఫ్‌టీపీ కేంద్ర జీఎస్టీ కమిటీ చైర్మన్ ముకుల్ గుప్తా మాట్లాడుతూ జీఎస్టీ అమలు చేయాలంటే బలమైన కేంద్రం ఉండాలని, ప్రస్తుత పరిస్థితులలో ఇది సాధ్యపడుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక రాష్ట్రాలలో జీఎస్టీ అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో జీఎస్టీకి సామీప్యంగా భారత్‌లో దీన్ని రూపొం దిస్తున్నారని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ న్యా య విభాగం రిటైర్డ అదనపు కమిషనర్ యోగేందర్ కుమార్, ట్యాక్స్ రెగ్యులేటరీ సర్వీసెస్ సభ్యుడు ప్రశాంత్ రైజాడా తదితరులు జీఎస్టీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ సంయుక్త కమిషనర్ పి.వి.సుబ్బారావు, డిప్యూటీ కమిషనర్ ఎస్.శేఖర్, విశాఖ డిప్యూటీ కమిషనర్ టి.శివ శంకరరావు, సంస్థ కార్యదర్శి జి.సత్యనారాయణ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ఉద్యోగులు, యూపీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, పాండిచ్చేరి తదితర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
బాగా తాగాలి.. ఆదాయం రావాలి
ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్ వ్యాఖ్య మద్యం ఆదాయాన్ని పెంచడానికే ప్రయత్నిస్తాం దసరాలోగా నగరంలో కల్లు దుకాణాలు హైదరాబాద్: ‘‘ఎక్కువ కాలం బతకాలి. బాగా తాగాలి. ప్రభుత్వానికి బాగా ఆదాయం రావాలి’’ - ఈ మాటలన్నది మరెవరో కాదు.. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్. ఈ విషయంలో ముసుగులో గుద్దులాట ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ‘‘ఆదాయం రావాలి.. ప్రభుత్వం నడవాలి.. దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారికి లబ్ధి చేకూరాలి’’ అని పేర్కొన్నారు. కమర్షియల్ ట్యాక్స్ తర్వాత ఎక్కువగా ఆదాయాన్ని ఆర్జించేది ఎక్సైజ్ శాఖేనని, ఆ శాఖ మంత్రిగా, అధికారులుగా ఆదాయం పెంచడానికే ప్రయత్నిస్తామని స్పష్టంచేశారు. మంగళవారం సచివాలయంలో జిల్లాల ఎక్సైజ్‌శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బి.ఆర్.మీనా, కమిషనర్ నదీమ్ అహ్మద్‌లతో కలిసి పద్మారావు విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఐడీ లిక్కర్‌ను అనుమతించబోమన్నారు. నియంత్రణకు కచ్చితమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. వారికి పునరావాసం కల్పించేందుకు రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. దసరా పండుగకల్లా హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని, సొసైటీల ద్వారానే వీటిని నడుపుతామని వివరించారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే చర్యలు... మద్యం దుకాణాల్లో అత్యధిక చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటె ఎక్కువ ధరకు మద్యాన్ని విక్రయిస్తే.. రెండుసార్లు వరకు రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తామని, ఆ తర్వాత కూడా అదే పద్ధతిని కొనసాగిస్తే షాప్‌ల లెసైన్స్ రద్దుచేస్తామని మంత్రి పద్మారావు వెల్లడించారు. హైదరాబాద్ శివార్లలోని కాటేదాన్‌లో దీనిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌లో 106 మద్యం దుకాణాలను ఎవరూ తీసుకోలేదని, మరోసారి ఈ షాపుల వేలానికి నోటీసు ఇస్తామని చెప్పారు. -
రవాణా, వాణిజ్య శాఖల సేవలు నేడు, రేపు బంద్
చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రభుత్వ ప్రధానశాఖలైన రవాణా, వాణిజ్య విభాగాలకు సంబంధించిన ప్రజాసేవలు రెండు రోజుల పాటు బంద్ అవుతున్నారుు. నూతన రాష్ట్రం ఏర్పడనున్న సందర్భంగా ఈ రెండు శాఖలు కొత్త సర్వర్ల ద్వారా సోమవారం నుంచి సేవలను నిర్వహించనున్నాయి. ట్రెజరీ అకౌంట్స్‌కు సంబంధించి పాతపద్ధతుల్లోనే సేవలు అందిస్తారని సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడివిడిగా సర్వర్లు రూపొందించి ఉన్నందున మే 31న (శనివారం) ఆన్లైన్ సేవలన్నింటినీ నిలిపివేయాలని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, ఎఫ్‌సీలు చేయబోరని జిల్లా రవాణాశాఖ ఉపకమిషనర్ ఎం.బసిరెడ్డి తెలిపారు. జూన్ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఆ రోజు కూడా సర్వర్లు పనిచేయవని, ఆదివారం అర్ధ రాత్రి నుంచి నూతన సర్వర్ ఓపెన్ అవుతుందని, సోమవారం యథావిథిగా రవాణా శాఖ సేవలు అందుతాయని చెప్పారు. జూన్ 2వ తేదీ సోమవారమే వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన నూతన సర్వర్ ప్రారంభమవుతుందని, ఇందుకు అనుగుణంగానే జిల్లాలోని వస్త్ర దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల యజమానులు, వారికి కేటాయించిన టిన్ నెంబర్ల ద్వారా లావాదేవీలను జరపాలని చిత్తూరు వాణిజ్య పన్నుల శాఖాధికారులు సూచించారు. ఖజానా శాఖ సేవలను యథావిథిగా అందిస్తుందని ఆ శాఖ ఉపసంచాలకులు పాలేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటివరకు తమకు ఎలాంటి సూచనలు అందలేదని, ఉత్తర్వులు అందేంతవరకు సేవలు యథావిథిగా కొనసాగిస్తామని తెలిపారు. ఉద్యోగులకు జూన్ 1వ తేదీ చెల్లించాల్సిన మే నెల జీతాన్ని ఈ నెల 24వతేదీ నాటికే వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. పెన్షన్‌దారులకు పెన్షన్ కూడా అదే రోజుకే వారి ఖాతాల్లో జమచేశామని తెలిపారు. ఇతర లావాదేవీలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు. -
కమర్షియల్ ట్యాక్స్ డీసీపై ఏసీబీ దాడులు
ఎస్ ఆర్ నగర్లో కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఆయన నివాసంలో రూ. 50 లక్షల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి అస్తులు కూడబెట్టినట్లు శ్రీనివాస్‌పై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఏసీబీ అధికారులు ఆ దాడులు నిర్వహించినట్లు సమాచారం.