మూడ్రోజుల పాటు హోటళ్లు, దుకాణాలన్నీ మూత
సీటీవో వేధింపులపై భగ్గుమంటున్న వ్యాపారులు
తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులంతా ట్రేడ్‌బంద్‌కు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి మూడ్రోజుల పాటు దుకాణాలన్నీ మూసి నిరసన తెలిపేందుకు సమాయత్తమవుతున్నారు. తిరుపతి, తిరుచానూరు, రేణిగుంట, చంద్రగిరి పట్టణాలకు చెందిన సుమారు 10 వేల మంది వ్యాపారులు బంద్‌లో పాల్గొంటున్నారు. తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సభ్యత్వం ఉన్న 27 వ్యాపార సంఘాలు మూకుమ్మడిగా బంద్‌కు పిలుపునిచ్చాయి.
తిరుపతి సిటీ: వ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్న తిరుపతి కమర్షియల్ ట్యాక్స్ అధికారి-2 శ్రీనివాసులు నాయుడును బదిలీ చేస్తేనే బంద్‌ను విరమిస్తామని తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మంజునాథ్ తెలిపారు. సీటీవోను బదిలీ చేయాలని కోరుతూ బుధవారం నుంచి చేపట్టిన బంద్‌కు మద్దతుగా మంగళవారం నగరంలోని వ్యాపారులంతా నల్లజెండాలను ధరించి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా మంజునాథ్ మాట్లాడుతూ సీటీవో-2 బెదిరిస్తూ విపరీతమైన పన్నులు వసూలు చేయడంతోపాటు అధికంగా పెనాల్టీలు వ సూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన్ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. చర్చల సమయంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కూడా ఆ సీటీవోను వెంటనే బదిలీ చేయాలని మంత్రికి సూచించారన్నారు.
ఆ శాఖ కమిషనర్ సెలవులో ఉన్నారని మంత్రి దాటవేస్తున్నారన్నారు. మూడు రోజులు బంద్ చేయడమే కాకుండా ఆయనను జిల్లా నుంచి బదిలీ చేసేంతవరకు అన్ని ట్రేడ్ యూనియన్ల సహకారంతో బంద్ కొనసాగిస్తామని హెచ్చరించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి కెవి.చౌదరి (ఎస్‌ఎస్‌బీ) మాట్లాడుతూ తిరుమలకు వచ్చే యాత్రికులను దృష్టిలో పెట్టుకుని 10 రోజులుగా ప్రకటనలు చేస్తున్నామని, యాత్రికులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. బంద్‌కు ప్రజలందరూ సహకరించాలని కోరారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి కూడా వెనుకాడబోమని చెప్పారు. కార్యక్రమంలో ఆయా ట్రేడ్ యూనియన్ల నేతలు బిరుదాల హనుమంతురెడ్డి,బైఅండ్‌సేవ్ మధు, బి.రఘురామ్, జీత్తు, నరసింహులు, మంగళ్‌చంద్,కిషోర్,నవరతన్, తోట రమణ, కళానికేతన్ రాజేంద్రప్రసాద్, విజయబాబు, నరసింహులు, రాజా, మల్లిశెట్టి రవి వ్యాపారస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నుంచి మొదలై మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు కొనసాగింది.