బాగా తాగాలి.. ఆదాయం రావాలి
ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్ వ్యాఖ్య
మద్యం ఆదాయాన్ని పెంచడానికే ప్రయత్నిస్తాం
దసరాలోగా నగరంలో కల్లు దుకాణాలు
హైదరాబాద్: ‘‘ఎక్కువ కాలం బతకాలి. బాగా తాగాలి. ప్రభుత్వానికి బాగా ఆదాయం రావాలి’’ - ఈ మాటలన్నది మరెవరో కాదు.. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్. ఈ విషయంలో ముసుగులో గుద్దులాట ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ‘‘ఆదాయం రావాలి.. ప్రభుత్వం నడవాలి.. దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారికి లబ్ధి చేకూరాలి’’ అని పేర్కొన్నారు. కమర్షియల్ ట్యాక్స్ తర్వాత ఎక్కువగా ఆదాయాన్ని ఆర్జించేది ఎక్సైజ్ శాఖేనని, ఆ శాఖ మంత్రిగా, అధికారులుగా ఆదాయం పెంచడానికే ప్రయత్నిస్తామని స్పష్టంచేశారు. మంగళవారం సచివాలయంలో జిల్లాల ఎక్సైజ్‌శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బి.ఆర్.మీనా, కమిషనర్ నదీమ్ అహ్మద్‌లతో కలిసి పద్మారావు విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఐడీ లిక్కర్‌ను అనుమతించబోమన్నారు. నియంత్రణకు కచ్చితమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. వారికి పునరావాసం కల్పించేందుకు రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. దసరా పండుగకల్లా హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని, సొసైటీల ద్వారానే వీటిని నడుపుతామని వివరించారు.
ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే చర్యలు...
మద్యం దుకాణాల్లో అత్యధిక చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటె ఎక్కువ ధరకు మద్యాన్ని విక్రయిస్తే.. రెండుసార్లు వరకు రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తామని, ఆ తర్వాత కూడా అదే పద్ధతిని కొనసాగిస్తే షాప్‌ల లెసైన్స్ రద్దుచేస్తామని మంత్రి పద్మారావు వెల్లడించారు. హైదరాబాద్ శివార్లలోని కాటేదాన్‌లో దీనిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌లో 106 మద్యం దుకాణాలను ఎవరూ తీసుకోలేదని, మరోసారి ఈ షాపుల వేలానికి నోటీసు ఇస్తామని చెప్పారు.