మీరే తాగించండి... మీరే మాన్పించండి...! | Manpincandi tagincandi yourself ... you ...! | Sakshi
Sakshi News home page

మీరే తాగించండి... మీరే మాన్పించండి...!

Published Tue, Jun 24 2014 12:59 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM

మీరే తాగించండి... మీరే మాన్పించండి...! - Sakshi

మీరే తాగించండి... మీరే మాన్పించండి...!

  •     ఎక్సైజ్‌లో నూతన విధానం
  •      జిల్లాలో 458 మద్యం షాపులకు నోటిఫికేషన్
  •      రూ.117 కోట్ల ఆదాయం లక్ష్యం
  •      నేటి నుంచి దరఖాస్తుల విక్రయం
  •      27న టెండర్లకు ఆఖరు
  •      28న లాటరీ పద్ధతిన దుకాణాల కేటాయింపు
  • చిత్తూరు (అర్బన్) : ‘మీరే తాగించండి. తాగి బానిసలయిన వారు మద్యం జోలికి వెళ్లకుండా మీరే మాన్పించండి...’ఇదీ నూతన ఎక్సైజ్ పాలసీ విధానం. జిల్లాలో మద్యం దుకాణాలకోసం టెండర్లకు తెర లేచింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగానూ నూతన ఎక్సైజ్ పాలసీనిప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ డీవీఎన్ ప్రసాద్ సోమవారం రాత్రి చిత్తూరులో గెజిట్‌ను విడుదల చేశారు.

    జిల్లాలోని మొత్తం 458 మద్యం దుకాణాలను ఏడాది పాటు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ పేర్కొన్నారు. లెసైన్సు పొందిన వ్యక్తులు ఈ ఏడాది జూలై 1 నుంచి 2015 జూన్ 30 వరకు దుకాణాలను నిర్వహించుకోవచ్చని తెలిపారు. నోటిఫికేషన్‌లోని ప్రధాన అంశాలు పరిశీలిస్తే...
     
    లక్ష్యమిదీ

    జిల్లాలో 458 మద్యం దుకాణాలు ఉండగా, ఇందులో చిత్తూరు ఎక్సైజ్ జిల్లాలో 214 దుకాణాలకు రూ.79.23 కోట్లు లెసైన్సు ఫీజుల వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు. తిరుపతి ఎక్సైజ్ జిల్లాలో 244 దుకాణాలకుగానూ రూ.97.86 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో 10 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లోని 211 మద్యం దుకాణాల లెసైన్సు ఫీజు రూ.32.52 లక్షలు ఉండగా, కొత్త పాలసీలో కూడా అదే ధరను ఉంచారు.

    10 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో 67 మద్యం దుకాణాలుండగా, వీటికి లెసైన్సు ఫీజును రూ.36 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లోని 112 దుకాణాలకు రూ.45 లక్షల రుసుము, 3 లక్షల జనాభా పైబడ్డ ప్రాంతాల్లో ఉన్న 68 దుకాణాలకు రూ.50 లక్షలుగా లెసైన్సు రుసుము నిర్ణయించారు. గతంలో ఉన్న లెసైన్సు రుసుముతో పోలిస్తే ఈ సారి 8 నుంచి 10 శాతం వరకు పెంచారు. ఇప్పటికే ఏడు సార్లు షాపు నిర్వహించిన ప్రాంతాల్లో అదనంగా 8 శాతం ప్రివిలైజేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
     
    నూతనమార్పులివీ

    ఈ సారి ఎక్సైజ్ విధానంలో రెండు నూతన మార్పులు చేశారు. మొదటిది మద్యానికి బానిసలుగా మారిన వ్యక్తులను అందులోంచి బయటపడేసే బాధ్యత  ప్రభుత్వ అధికారులదే. మద్యానికి బానిసలైన వారిని ఎక్సైజ్ అధికారులే గుర్తించాలి. ఇందుకోసం ప్రతినెలా డీ-అడిక్టివ్ క్యాంపులు నిర్వహించాలి. మద్యపానం వల్ల కలిగే ఇబ్బందులను వారికి చెప్పి మద్యం మానేసేలా చేయాలి.
         
    ఇక రెండో విషయం చూస్తే స్కాన్ అండ్ ట్రేస్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి మద్యం సీసాపై హోలోగ్రాఫిక్ ఎక్సైజ్ అడహేషన్ లేబుల్ (హెచ్‌ఈఏఎల్) ఏర్పాటు చేయాలి. దీనిపై మద్యం సీసాలు ఏయే దుకాణానికి సరఫరా చేశామనే వివరాలు ఉంటాయి. బెల్టు షాపుల్లో ఈ మద్యం సీసాలు దొరికితే వచ్చిన సమాచారం ఆధారంగా ఆయా దుకాణాల లెసైన్సులను రద్దు చేస్తారు.
     
    షెడ్యుల్ వివరాలు...

    మంగళవారం నుంచి జిల్లాలోని అన్ని ఎక్సైజ్ కార్యాలయాల్లో మద్యం దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తులను అందచేయాలి. 28న మధ్యాహ్నం 2 గంటల నుంచి లాటరీ పద్ధతిన లెసైన్స్‌దారున్ని ఖరారు చేస్తారు. అదే రోజు ప్రొవిజన్ లెసైన్సును అందజేస్తారు. టెండర్లు స్వీకరించడానికి చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చిత్తూరులోని కలెక్టరేట్ కార్యాలయాల్లో ప్రత్యేక బాక్సులను ఏర్పాటు చేశారు.
     
    బార్‌ల రెన్యువల్ కు...
     
    ఈ సారి పాలసీలో కొత్త బార్ల ఏర్పాటు అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే ఉన్న బార్లను ఏడాది వరకు రెన్యువల్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 50 వేల జనాభా ఉన్న బార్లకు రూ.25 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.38 లక్షలు, 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ల రెన్యువల్‌కు రూ.41 లక్షలుగా రుసుమును నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement