భర్త అయినా... మౌనం సమాధానం కాదు!
ఈ విషయం గురించి మాట్లాడాలంటేనే దిగులుగా ఉంటుంది...
ఇంత సున్నితమైన విషయాన్ని బజార్లో పెట్టాలంటే
ఆలోచించాల్సి వస్తోంది.
మేలు చేయబోయి కీడు చేస్తామా?
అన్న ప్రశ్న వేధిస్తోంది.
కానీ, మౌనం సమాధానం కాదు.
ఒక చెల్లి, అక్క, బిడ్డ పడుతున్న వేదనకు మౌనం సమాధానం కాదు.
ఆడపిల్లను జాగృతం చెయ్యడం ఒక అవసరం అయితే, మగవారిని సెన్సిటైజ్ చెయ్యడం అత్యవసరం.
భార్యాభర్త అన్యోన్యంగా ఉండడానికి ఈ చర్చ ఒక అవకాశం కావాలి.
మన ఫ్యామిలీని నిండుగా నూరేళ్లు ఉంచే బాధ్యతను మనందరం తీసుకోవాలి!
‘‘విడాకుల కోసం మా దగ్గరకొచ్చే కేసుల్లో 50 శాతం కేసులు ఇలాంటివే’’ అంటున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న ఫ్యామిలీ కోర్టు న్యాయవాది పార్వతి. వారిజ (పేరు మార్చాం) పెళ్లయి ఏడేళ్లు. ఇద్దరు పిల్లలు. ఆమె భర్త ప్రసాద్ (అసలు పేరు కాదు) కమర్షియల్‌టాక్స్ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నాడు. అయిదేళ్లు బాగానే సాగింది వాళ్ల కాపురం. రెండేళ్ల నుంచే కలతలు మొదలయ్యాయి. అన్ని విషయాల్లో ఇద్దరూ బాగా ఉంటారు. ఆ ఒక్క విషయంలోనే ఇద్దరికీ పొసగడంలేదు. పిల్లల చదువు, ఇంటి బాధ్యతలతో వారిజ విపరీతంగా అలసిపోతోంది. దీంతో తనను పట్టించుకోవడంలేదనేది ప్రసాద్ కంప్లయింట్. విసిగిపోయి పిల్లలిద్దర్నీ తీసుకొని తల్లిగారింటికి వచ్చేసింది. ‘‘పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి నడుం వాల్చేదాకా క్షణం విశ్రాంతి ఉండట్లేదు. యంత్రంలా పనిచేస్తున్నాను. రాత్రిపూటైనా హాయిగా నిద్రపోతున్నానా అంటే అదీ లేదు. స్నేహితులు, సిట్టింగులు అంటూ అర్ధరాత్రి ఇంటికి చేరుతాడు. మంచి నిద్రను చెడగొడ్తాడు. అలసిపోయాను అన్నా వినడు. పైగా మొరటుగా ప్రవర్తిస్తున్నాడు. నావల్ల కావట్లేదమ్మా’’ అని తల్లి దగ్గర వాపోయింది. విషయం అర్థమైంది వారిజ తల్లికి. తన యవ్వనపు రోజులు గుర్తొచ్చాయి.
తనూ తన తల్లి దగ్గర దిగాలు పడ్డ క్షణాలు మదిలో మెదిలాయి. అప్పుడు తన తల్లి తనకు చెప్పిన మాటల్నే ఇప్పుడు నా బిడ్డకు చెప్పాలా? ఆ మీమాంసతోనేవారిజ తల్లి నెమ్మదిగా గొంతు సవరించుకుంది.. ‘‘ఇంత చిన్న విషయానికే ఇక్కడికి వచ్చేయాలా? భర్త భార్య దగ్గరకి రాకపోతే ఎక్కడికి వెళ్తాడు? వల్లకాని పక్షంలో మెల్లగా సర్దిచెప్పుకోవాలి.. వినకపోతే నువ్వే ఓపిక పట్టాలి. తప్పదు. నువ్వు కాదంటే అతను వేరే దారి చూసుకుంటాడు. అప్పుడు నెత్తినోరు కొట్టుకున్నా ప్రయోజనం ఉండదు’’ అని చెప్పి కూతుర్ని అత్తారింటికి పంపింది కానీ.. ఇష్టంలేకుండా భర్తకైనా సరే తన శరీరాన్ని అప్పజెప్పడం ఎంత నరకమో తనకు తెలియదా? తప్పు చేశాననే భావన. నీ శరీరం మీద నీకు హక్కు ఉందని బిడ్డకెందుకు తను చెప్పలేకపోయింది? ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోయింది? కుటుంబం, సమాజం, పరువు, మర్యాద అని తన తల్లి భయపడ్డట్టే తనూ భయపడిందా? తన బిడ్డకు తాను సర్ది చెప్పినట్టే.. ఆడపిల్ల మనసు, సున్నితమైన ఆమె శరీరం గురించి అల్లుడికీ ఎవరైనా చెప్పగలిగితే ఎంత బాగుండు.. ఈరోజు నా కూతురికి ఈ సమస్య వచ్చేది కాదు కదా..! ఇవి వారిజ తల్లి ఆలోచనలు మాత్రమే కాదు.. ఇప్పుడు ఒక చర్చ కూడా. తన శరీరం మీద తనకు హక్కులేదా? భర్త అయినంత మాత్రాన బలవంత పెడితే భరించాలా? అన్న ప్రశ్న మ్యారిటల్ రేప్‌ను చట్టం కిందికి తేవాలి అన్నంత పదును తేలింది. ఇంకోవైపు భార్యాభర్తలకు చెందిన ఈ సమస్యను పరస్పర అవగాహన, సహనంతో నాలుగు గోడలమధ్యే పరిష్కరించుకోవాలి.. కుటుంబం కూలిపోకుండా కాపాడుకోవాలి అన్న అభిప్రాయమూ వినపడుతోంది.
నేపథ్యం: నిర్భయ సంఘటన జరిగిన తర్వాత నిర్భయ యాక్ట్ సందర్భంలో జస్ట్టిస్ వర్మ కొన్ని మార్గదర్శకాలను సూచించారు. వాటిలో భార్యభర్తల మధ్య జరిగే బలవంతపు శృంగారాన్ని... అంటే భార్య అంగీకారం లేకుండా భర్త జరిపే శృంగారాన్నీ రేప్‌గానే పరిగణించాలని చెప్పారు. కానీ నాటి ప్రభుత్వం దీన్ని అంగీకరించలేదు. పార్లమెంటేరియన్లంతా దీనివల్ల వివాహ వ్యవస్థకున్న పవిత్రత పోతుందని, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని వాటిని వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్లీ ఈ అంశం వార్తల్లోకి వచ్చి జస్టిస్ వర్మ సూచన ప్రకారం దీన్ని వైవాహిక అత్యాచారంగా పరిగణించాలనే చర్చ మొదలైంది. భార్య, భర్త జ్యుడీషియల్ సపరేషన్‌లో ఉన్నా, విడాకులకు సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్నా, ఒప్పందం ప్రకారం ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నా భర్త, భార్యతో బలవంతంగా శృంగారం జరిపితే దాన్ని రేప్‌గా పరిగణించాలనే క్లాజ్ 376బిలో ఇదివరకే ఉంది. భార్య ఫిర్యాదు చేస్తే ఆ క్లాజు ప్రకారం 2 నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధిస్తారు.
బ్రూటాలిటీ... బీస్టాలిటీ...
పెరిగిన ఒత్తిళ్లు, ఆర్థిక అవసరాలు, కుటుంబ బాధ్యతల దృష్ట్యా భార్యాభర్తల మధ్య సెక్స్ పరంగా సత్సంబంధాలు ఉండడం లేదు. భర్త సెన్సిటైజ్ కావాలి.. అవసరం కూడా. స్త్రీకి భద్రత, భరోసా అవసరం. కాబట్టి బ్రూటాలిటీ, బీస్టాలిటీ కింద పరిగణించి మ్యారిటల్ రేప్‌ను 376బిలో చేర్చాలి.
- పార్వతి, ఫ్యామిలీ కోర్టు న్యాయవాది.
ఎవరు చేసినా నేరమే!
సెక్సువల్ అబ్యూజ్.. సెక్సువల్ అసాల్ట్.. సెక్సువల్ అటాక్.. ఎవరు చేసినా నేరమే. మహిళ సమ్మతి లేకుండా ఆమెను బలవంతం చేస్తే అది రేప్. భర్త చేస్తే మ్యారిటల్ రేప్. ఇందులో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు.
- సంధ్య, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు
బలహీనుల పక్షానే...
స్త్రీ్త్ర మానసికంగా బలవంతురాలైనప్పటికీ శారీరకంగా బలహీనురాలు. రాజ్యమెప్పుడూ బలహీనుల పక్షానే నిలబడాలి. వాళ్ల హక్కులకు రక్షణ కల్పించాలి. అందులో భాగంగానే మ్యారిటల్‌రేప్‌ను చట్టం కిందికి తీసుకురావాలి.
- సామాన్య, రచయిత్రి
ఇద్దరూ సమానమే...
మన రాజ్యాంగం ప్రకారం మన న్యాయవ్యవస్థలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే. దీనిప్రకారం ఆమె శరీరం మీద ఆమెకు హక్కు ఉన్నట్టే! ఒక మనిషి హక్కును ఇంకో మనిషి బలవంతంగా లాక్కోవడం నేరం. దాన్నే ప్రశ్నిస్తోంది వివాహిత. తన శరీరం మీద తనకున్న హక్కును పరిరక్షించే చట్టం కావాలి. అలాగే పురుషుడినీ సెన్సిటైజ్ చేయాలి.
- ప్రజ్ఞారశ్మి సైకాలజిస్ట్
అందుకే విముఖత!
సహజంగా భార్య ఇంటిపనితో (ఉద్యోగి అయితే బయటపని కూడా) శారీరకంగా, మానసికంగా అలసిపోయినప్పుడు. హార్మోనల్ ఇమ్‌బ్యాలెన్స్ ఉన్నప్పుడు. ఎండోమెట్రియాసిస్ ప్రాబ్లమ్, పెల్విక్ ఇన్‌ఫామెట్రీడిసీస్ ఉన్నప్పుడు. భర్త మొరటు ప్రవర్తన వల్ల కలిగే భయం వల్ల సెక్స్ పట్ల విముఖతతో ఉంటుంది స్త్రీ. ఇలాంటప్పుడు భార్యాభర్తలిద్దరూ కౌన్సెలింగ్‌కు వచ్చి సమస్యను చక్కదిద్దుకోవచ్చు.
- డాక్టర్ వి.శోభ, లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్