చిత్తూరు (జిల్లాపరిషత్), న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రభుత్వ ప్రధానశాఖలైన రవాణా, వాణిజ్య విభాగాలకు సంబంధించిన ప్రజాసేవలు రెండు రోజుల పాటు బంద్ అవుతున్నారుు. నూతన రాష్ట్రం ఏర్పడనున్న సందర్భంగా ఈ రెండు శాఖలు కొత్త సర్వర్ల ద్వారా సోమవారం నుంచి సేవలను నిర్వహించనున్నాయి. ట్రెజరీ అకౌంట్స్‌కు సంబంధించి పాతపద్ధతుల్లోనే సేవలు అందిస్తారని సమాచారం.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడివిడిగా సర్వర్లు రూపొందించి ఉన్నందున మే 31న (శనివారం) ఆన్‌లైన్ సేవలన్నింటినీ నిలిపివేయాలని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శనివారం నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, ఎఫ్‌సీలు చేయబోరని జిల్లా రవాణాశాఖ ఉపకమిషనర్ ఎం.బసిరెడ్డి తెలిపారు. జూన్ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఆ రోజు కూడా సర్వర్లు పనిచేయవని, ఆదివారం అర్ధ రాత్రి నుంచి నూతన సర్వర్ ఓపెన్ అవుతుందని, సోమవారం యథావిథిగా రవాణా శాఖ సేవలు అందుతాయని చెప్పారు.
జూన్ 2వ తేదీ సోమవారమే వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన నూతన సర్వర్ ప్రారంభమవుతుందని, ఇందుకు అనుగుణంగానే జిల్లాలోని వస్త్ర దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల యజమానులు, వారికి కేటాయించిన టిన్ నెంబర్ల ద్వారా లావాదేవీలను జరపాలని చిత్తూరు వాణిజ్య పన్నుల శాఖాధికారులు సూచించారు. ఖజానా శాఖ సేవలను యథావిథిగా అందిస్తుందని ఆ శాఖ ఉపసంచాలకులు పాలేశ్వరరావు పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటివరకు తమకు ఎలాంటి సూచనలు అందలేదని, ఉత్తర్వులు అందేంతవరకు సేవలు యథావిథిగా కొనసాగిస్తామని తెలిపారు. ఉద్యోగులకు జూన్ 1వ తేదీ చెల్లించాల్సిన మే నెల జీతాన్ని ఈ నెల 24వతేదీ నాటికే వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. పెన్షన్‌దారులకు పెన్షన్ కూడా అదే రోజుకే వారి ఖాతాల్లో జమచేశామని తెలిపారు. ఇతర లావాదేవీలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు.
రవాణా, వాణిజ్య శాఖల సేవలు నేడు, రేపు బంద్
Published Sat, May 31 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
Advertisement
Advertisement