రుణమాఫీ మాయ! | Maya waiver! | Sakshi
Sakshi News home page

రుణమాఫీ మాయ!

Published Tue, Jun 10 2014 4:06 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

రుణమాఫీ మాయ! - Sakshi

రుణమాఫీ మాయ!

  •       కమిటీ ఏర్పాటు  నిర్ణయంపై రైతుల్లో గుబులు
  •      పంట రుణాలు ఇవ్వడంపై   బ్యాంకులకు అందని హామీ
  •      కొత్త రుణాలు    ఇప్పట్లో లేనట్టేనా?
  •      వడ్డీ వ్యాపారస్తుల వైపు రైతుల చూపు
  • పంట రుణాల మాఫీ ప్రశ్నార్థకంగా మారడంతో రైతుల్లో దిగులు పట్టుకుంది. అధికారంలోకి రాగానే పంట రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నీటి మీద రాతలా మిగిలిపోనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పంట రుణాల మాఫీపై ఇదే వైఖరి అనుసరిస్తున్నారని తేటతెల్లమవుతోంది. రుణమాఫీ ఫైల్‌పై కాకుండా ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేసేందుకు తీసుకున్న నిర్ణయూనికి సంబంధించిన ఫైల్‌పై చంద్రబాబు తొలి సంతకం చేయడంతో రైతుల ఆశలు ఆవిరైపోయాయి.
             
    చిత్తూరు(కలెక్టరేట్): రుణమాఫీ కాగానే బ్యాంకుల నుంచి కొత్త రుణాలు తీసుకుని పంటలు సాగు చేస్తామని భావించిన రైతులు చివరకు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు పెట్టుబడి ఎక్కడ నుంచి తీసుకురావాలంటూ ఆందోళన చెందుతున్నారు.

    ఇప్పటికే బంగారు తాకట్టుపై బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులు, ఈ ఏడాది పంట రుణాలు ఎలా చేయాలంటూ మల్లగుల్లాలు పడుతున్నారు. పంట రుణాల మాఫీపై విధి విధానాలు తెలియజేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కమిటీ వేసేందుకు నిశ్చయించింది. 15 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 45 రోజుల్లో తుది నివేదికను కమిటీ ప్రభుత్వానికి అందించనుంది. ఈ తతంగమంతా ఏమిటంటూ రైతులు రగిలిపోతున్నారు.
     
    అయోమయంలో కరువు మండలాల రైతులు
     
    జిల్లాలో మూడేళ్లుగా ఖరీఫ్ సీజన్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశెనగ రైతులు నష్టాల ఊబిలో చిక్కుకుపోయారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో జిల్లాలోని 33 మండలాలను అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ మండలాల్లోని దాదాపు 80 వేల మంది రైతులు పంట రుణాలు మాఫీ అయితే కొత్త రుణాలు తీసుకోవాలని భావించారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదనే ఆందోళనలో ఉన్నారు.
     
    ప్రశ్నార్థకంగా పంట రుణాలు
     
    రుణమాఫీతో పాటు పంట రుణాల రీషెడ్యూల్‌పై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు బ్యాంకర్లకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. దీంతో ఈ ఏడాది రైతులకు బ్యాంకుల నుంచి పంట రుణాలు అందేది గగనంగా మారనుంది. పంట నష్టపోయిన రైతులు రీషెడ్యూల్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఈ ఏడాది పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రారు. ఒకవేళ పంట రుణాలు రీషెడ్యూల్ చేస్తే కొత్త రుణాలుగా బ్యాంకర్లు వాటిని పరిగణిస్తారు. ఈ రుణాలు మాఫీకి వర్తించవు.
     
    వడ్డీ వ్యాపారుల వైపు రైతుల చూపు
     
    బ్యాంకర్లు పంట రుణాలను రీషెడ్యూల్ చేయక పోవ డం, కొత్త రుణాలు ఇవ్వక పోవడంతో పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారుల వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఏటా 2.2 లక్షల మంది రైతులకు దాదాపు 2 వేల కోట్ల రూపాయలు పంట రుణాలుగా ఇవ్వాలని బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయిస్తారు. అయి తే ఖరీఫ్ సీజన్ మొదలైనా రైతులకు పంట రుణాలు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత బ్యాంకు అధికారులకు రాలేదు. దీంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు.
     
    కమిటీ ఏర్పాటుతో రైతుల్లో ఆందోళన

     
    పంట రుణాల మాఫీపై చంద్రబాబు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కమిటీ ఇచ్చే నివేదికల ఆధారంగా ఎంత మంది రైతులకు ఎంత మొత్తం పంట రుణాలు మాఫీ చేస్తారు.. ఆ జాబితాలో తమ పేర్లు ఉంటాయా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని బ్యాంకు అధికారుల గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే 2014 మార్చి నెలాఖరు వరకు వ్యవసాయ, వ్యవసాయేతర, దీర్ఘకాలిక, స్వల్ప కాలిక రుణాలు రూ.7693.75 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా చిన్న, సన్నకారు, మధ్య, పెద్ద రైతులు 8 లక్షల 70 వేల 321 మంది ఉన్నట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

    జిల్లా వ్యాప్తంగా 40 ప్రధాన బ్యాంకుల కింద 478 బ్రాంచీలు ఉన్నాయి. ఈ బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాల కింద 7 లక్షల 55 వేల 270 మంది రైతులు రూ. 5810.84 కోట్లు తీసుకున్నారు. ప్రధానంగా 4 లక్షల 53 వేల 162 మంది రైతులకు నగలు తాకట్టుపై పంట రుణాల కింద రూ. 3486.50 కోట్లు ఇవ్వగా, దీర్ఘకాలిక, స్వల్ప కాలిక (టర్ము) రుణాల కింద 68,671 మంది రైతులకు రూ.1129.75 కోట్లు ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా 45 వేల 780 మంది రైతులకు రూ.753.16 కోట్ల రుణాలు ఇచ్చినట్టు బ్యాంకు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement