అప్పు తీర్తదో..లేదో? | farmers are in concern | Sakshi
Sakshi News home page

అప్పు తీర్తదో..లేదో?

Published Sat, Oct 11 2014 12:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

అప్పు తీర్తదో..లేదో? - Sakshi

అప్పు తీర్తదో..లేదో?

ఆందోళనలో రైతన్నలు

‘పోతిని... బేంకిల దస్కతి పెడితిని.. ఇయ్యాలగాకున్నా రేపైనా బేంకోడు నా ఇంటికే ఒచ్చి తట్టాసెంబులు గుంజుకపోడా?.. గింతకు గంతయి మొయ్యలేని బరువైనంక నా భూమిని బేంకోడు ఏలం బెట్టడా?’ నరసన్నపేట గ్రామానికి చెందిన రైతు రామచంద్రారెడ్డి, ఇటిక్యాల రైతు మల్లయ్య, రాంనగర్‌కు చెందిన చెందిన ఎర్రబోయిన నారాయణ అనే రైతులు అనుమానం ఇది.

ప్రభుత్వం రుణమాఫీ అమలు చేస్తున్నా, రైతులు వాస్తవానికి బ్యాంకుకు వెళ్లి రుణాలు రీషెడ్యూల్ లేదా రెన్యూవల్ చేయించుకోవాలి. అందుకు బ్యాంకులో సంతకాలు చేయాలి. కానీ సంతకాలు చేస్తే బ్యాంకర్లు తమ వద్దే అప్పు వసూలు చేస్తారని భయపడుతున్నారు రైతులు. వాస్తవ పరిస్థితిని రైతులకు వివరించాల్సిన యంత్రాగం ఆ పని చేయకపోవడంతో జిల్లాలో చాలామంది రైతులు బ్యాంకు వైపు కన్నెత్తి చూడడం లేదు.

 
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.500 కోట్లు బ్యాంకుల్లో జమ చేసింది. అయినా రైతుల్లో ఇంకా ఏదో ఆందోళన. స్పష్టమైన విధివిధానాలు రూపొందించి కచ్చితమైన హామీ ఇచ్చినా, రుణమాఫీ అవుతోందో? కాదో అన్న భయం వెంటాడుతోంది. ఖరీఫ్ ఎలాగు ముగిసిపోయింది, కనీసం రబీకైనా కొత్త రుణాలు దక్కుతాయే లేదో అని అన్నదాతలు దిగులు పడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఇంకా ఐదురోజులు మాత్రమే ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు కేవలం 3,404 మంది రైతులు మాత్రమే రీషెడ్యూల్ చేయించుకున్నారు.

దీనిపై వాస్తవ పరిస్థితులు అంచనా వేసేందుకు ‘సాక్షి’ పల్లెల్లో తిరిగింది. రైతులు ఏముకుంటున్నారో..వారి ఆందోళన ఏమిటో తెలుసుకునేప్రయత్నం చేసింది. రుణమాఫీ, రీషెడ్యూల్‌పై అన్నదాతలకు అవగాహన కల్పించడంపై అధికారులు పూర్తిగా విఫలమాయ్యారని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. దీనికి తోడు ప్రతిపక్ష నేతలు ఎవరికి తోచిన విధంగా వారు రుణమాఫీపై స్టేట్‌మెంట్లు ఇస్తూ రైతులను భయపెట్టారు. దీంతో  రైతన్నలు రుణమాఫీపై ఆందోళన చెందుతున్నారు.

బ్యాంకు గడపతొక్కని రైతు
జిల్లాలో 4,04,095 మంది రైతులు లక్షలోపు రుణాల మాఫీకి అర్హత ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 1,12,104 మంది రైతు లు రుణాల రీషెడ్యూల్‌కు, 2,91,991 మంది రైతులు రుణాల రెన్యూవల్‌కు అర్హులుగా నిర్ధారించింది. ఇప్పటి వరకు కేవలం 3,404 మంది రైతుల రుణాలే రీషెడ్యూల్ కాగా 44,807 మంది రైతుల రుణాలను మాత్రమే బ్యాంకర్లు రెన్యూవల్ చేయగలిగారు. ఇంకా 2.47 లక్షల మంది రైతుల రుణాలు రెన్యూవల్ చేయాల్సి ఉంది. లక్ష మందికిపైగా రైతుల రుణాలు రీషెడ్యూల్ చేయాల్సి ఉంది.

రీషెడ్యూల్ అంటే...
బ్యాంకులో రుణం అలాగే ఉంటుంది. నిర్ధారించిన రూ. లక్ష వరకు అసలు, దానికైన వడ్డీని కలిపి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ చెల్లింపులు వచ్చే ఏడాది చెల్లించవచ్చు... లేదంటే మరో రెండు మూడేళ్ల తర్వాతైనా చెల్లించవచ్చు. ఎప్పుడు చెల్లిం చినా అసలు వడ్డీని కలిపి రైతుతో సంబంధం లేకుం డా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల రుణాలను తీర్చేస్తుంది. భారతీయ రిజర్వుబ్యాంక్‌తోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విధంగా ఒప్పందం చేసుకుని వచ్చారు. దీన్నే రీషెడ్యూల్ అంటారు. అయితే ఇక్కడ రైతు పే రు మీద కొత్త ఖాతా తెరిచి ఈ ఖాతాలోనే పాత అప్పును జమ చేస్తారు. ఈ పద్ధతిలో రైతులు బ్యాం కులకు వెళ్లి బ్యాంకు రికార్డుల మీద సంతకం చే యాల్సి ఉంటుంది. ఇక్కడే రైతులు జంకుతున్నారు. సంతకం పెడితే అసలుకు వడ్డీలు కలిపి తమ వద్దే వసూలు చేస్తారోమోనని భయపడుతున్నారు.
 
రెన్యూవల్ అంటే...
ఇక రుణాలు రెన్యూవల్  అంటే ప్రభుత్వం రైతు రుణాలను దశల వారీగా బ్యాంకుకు చెల్లిస్తుంది. 2013 ఖరీఫ్ సీజన్ కంటే  ముందు తీసుకున్న  పంట రుణాలు, బంగారం రుణాలను కూడా ప్రభుత్వమే  విడతల వారీగా చెల్లిస్తుంది. సర్కార్ మొదటి విడత కింద 25 శాతం డబ్బును చెల్లిస్తుంది. మిగిలిన డబ్బును కూడా వాయిదాల్లో జమ చేస్తుంది.   దీనికి కూడా రైతు బ్యాంకు రికార్డుల్లో సంతకం చేయాల్సి ఉంటుంది. తొలి విడత నిధులు బ్యాంకులో జమ కాగానే రైతులు కొత్త రుణాలకు అర్హులు అవుతారు. పెరిగిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, చెల్లించిన 25 శాతం సొమ్మును కలుపుకుని రూ.55 వేల వరకు రైతులకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకర్లకు సూచించింది.

పై రెండు పద్ధతుల్లో కూడా రైతులు  రుణాలు కట్టాల్సిన పని లేదు. ప్రభుత్వమే రుణాలు చెల్లిస్తుంది. కానీ రెవిన్యూ, వ్యవసాయ, సమాచార, ప్రజా సంబంధాల శాఖల అధికారులు రైతులకు బ్యాంకు లావాదేవీల గురించి విడమరిచి చెప్పడంలో విఫలమయ్యారు. దీంతో అన్నదాతలు పాత రుణాలు మాఫీ చేయించుకోలేక, కొత్త రుణాలు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్ రుణాల మంజూరు, రుణాల మాఫీ మీద లీడ్‌బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement