రుణమాఫీతో మొదటికే మోసం! | give full debt waiver to farmers | Sakshi
Sakshi News home page

రుణమాఫీతో మొదటికే మోసం!

Published Sat, Jun 14 2014 2:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రుణమాఫీతో మొదటికే మోసం! - Sakshi

రుణమాఫీతో మొదటికే మోసం!

 ఆదోని: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందాన్ని తలపిస్తోంది రైతుల పరిస్థితి. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియమించిన వ్యవసాయ రుణ మాఫీ కమిటీ.. విధివిధానాలు ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు 45 రోజులు పడుతుంది. ఇందులో తాము రుణ మాఫీ అర్హత కోల్పోతే వడ్డీలేని రుణాల సదుపాయం కోల్పోయి అదనపు ఆర్థిక భారం మోయాల్సి వస్తుందేమోనని ఖరీఫ్ సీజన్‌లో బ్యాంకుల్లో అప్పు తీసుకున్న  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 గతంలో కిరణ్‌కుమార్‌రెడి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు రైతులు బ్యాంకుల్లో తీసుకున్న వ్యవసాయ రుణాలను ఏడాదిలోగా చెల్లిస్తే వడ్డీని పూర్తిగా రాయితే పొందే సదుపాయం ఉంది. దీంతో రైతులు తమ చేతిలో డబ్బు లేక పోయినా అప్పు చేసైనా బ్యాంకు రుణాలు చెల్లించి వడ్డీ రాయితీ పొందుతున్నారు. అయితే తమ పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడంతో కొందరు రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు చెల్లించలేదు. జిల్లాలోని ఆయా బ్యాంకులకు రైతులు ప్రస్తుతం రూ.4.344.13 కోట్లు బకాయిలతో కలుపుకుని వ్యవసాయ రుణాలు చెల్లించాల్సి ఉంది.
 
 ఇందులో గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో దాదాపు 4.4 లక్షల మంది రైతులు రూ.2796 కోట్లు తీసుకోగా ఇందులో దాదాపు రూ.1800 కోట్ల వరకు ఖరీఫ్‌లోనే ఉంది. ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ రుణాలు పొందిన రైతుల్లో సగానికి పైగా జూన్‌లో తీసుకున్న వారే. తీసుకున్న తేదీలోగా రుణాలు చెల్లిస్తే వడ్డీ ఉండదు. ఖరీఫ్‌లో తీసుకున్న రుణాలకు గడువు సమీపిస్తోంది. అయితే చంద్రబాబునాయుడు గెలిచిన తర్వాత నేరుగా రుణ మాఫీ ఉత్తర్వులపై సంతకాలు చేయకుండా రుణ మాఫీ విధివిధానాలు రూపకల్పన పేరుతో కమిటీని నియమించడం, ఇందుకు 45 రోజలు గడువు పెట్టడంతో ఇప్పుడు రైతుల్లో టెన్షన్ ప్రారంభమైంది.
 
 రుణాలను పూర్తిగా మాఫీ చేసే ఉద్దేశమే ఉండి ఉంటే చంద్రబాబు నేరుగా రుణ మాఫీ ఉత్తర్వులపై సంతకం చేసేవారని రైతులు పేర్కొంటున్నారు. తాము రుణ మాఫీ అర్హత కోల్పోతే తీసుకున్న అప్పును గడువు దాటి పోతే వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడువు ముగిసిన రుణాలపై బ్యాంకర్లు 11.5 శాతం వడ్డీని ముక్కు పిండి వసూలు చేస్తారు. ఈ లెక్కన రూ.లక్ష రుణం తీసుకున్న రైతులు అదనంగా రూ.11,500 చెల్లించాల్సి వస్తోంది.
 
 ఇదే జరిగితే తాము చంద్రబాబు ప్రకటనతో మోసపోయినట్లు అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమిటీ ఇచ్చే నివేదికతో సంబందం లేకుండా రుణాలు మాఫీ అయినా, కాకపోయినా అప్పు ఎప్పుడు చెల్లించినా వడ్డీ రాయితీ సదుపాయం వర్తించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు.
 
 వడ్డీ రాయితీ సదుపాయం కోల్పోతామేమో : ప్రహ్లాద,రైతు నేను గతేడాది జూన్‌లో అప్పు తీసుకున్నాను.  తీసుకున్న తేదీలోగా అప్పు చెల్లిస్తేనే వడ్డీ ఉండదు. లేదంటే 11.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రుణ మాఫీ అవుతోందన్న ఆశలో ఇంకా అప్పు చెల్లించలేదు. దురదృష్టవశాత్తు నేను రుణ మాఫీకి అర్హుడిని కాకపోతే వడ్డీతో సహా అప్పు చెల్లించాల్సి వస్తుంది. ఇది నాకే కాదు తోటి రైతులకు భారమే. ఇదే జరిగితే చంద్రబాబు రైతులను మరో సారి మోసం చేసినట్లే
 
కమిటీ వేసి చేతులు దులుపుకుంటే ఎలా : చిన్న ఈరన్న, రైతు
వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు కమిటీ వేసి చేతులు దులుపుకోవడం మంచిది కాదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. గత ఖరీఫ్‌లో తీసుకున్న అప్పు చెల్లింపు గడువు కూడా ముగుస్తూ ఉంది. కమిటీ నివేదిక కోసం ఎదురు చూడకుండా వడ్డీ రాయితీ సదుపాయం గడువుతో సంబంధం లేకుండా అందరికి వర్తించే విధంగా ఆదేశాలు జారీ చేయాలి.
 
 మోసం చేస్తే రైతులు క్షమించరు :వెంకటేశ్వర్లు, రైతు సంఘం డివిజన్ అధ్యక్షుడు
 కమిటీ నివేదిక వరకు వడ్డీ రాయితీ సదుపాయంపై నోరు విప్పక పోవడం సరైంది కాదు. రుణ మాఫీ అందరికి వర్తింపజేసే ఆలోచన చంద్రబాబుకు లేదనే విషయం కమిటీ నియామకంతోనే తేలిపోయింది. రుణమాఫీ అర్హత కోల్పోయిన రైతులు వడ్డీతో సహా అప్పు చెల్లించే పరిస్థితి తెస్తే చంద్రబాబను క్షమించరు. ఈ విషయమై ఆయన వెంటనే స్పందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement