రైతుల కష్టాలు.. కన్నీళ్లు చూశా.. | I Saw The Farmers Difficulties And Tears | Sakshi
Sakshi News home page

రైతుల కష్టాలు.. కన్నీళ్లు చూశా..

Published Mon, Jun 11 2018 8:14 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

I Saw The Farmers Difficulties And Tears - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సినీ కథానాయకుడు విశాల్, దర్శకుడు మిత్రన్, తదితరులు 

సాక్షి, పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ) :  రైతులు పడుతున్న కష్టాలను దగ్గర్నించి చూశా..అందుకే వారికి చేయూతగా నిలవాలని నిర్ణయించుకున్నా. తమిళనాడులో  రైతులు వ్యవసాయం చేసేందుకు అవసరమైన నీటిని ఎలా నిల్వ ఉంచుకోవాలో అవగాహన కల్పిస్తున్నాను.. అని సినీ నటుడు విశాల్‌ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన అభిమన్యుడు చిత్ర విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి మెలోడీ థియేటర్‌కు దర్శకుడు మిత్రన్‌తో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో తను అనుభూతులు పంచుకున్నారు.
రైతు కుటుంబం నుంచి వచ్చా. మా తాత వ్యవసాయదారుడు. చిన్నతనం నుంచి పొలం గట్లు..రైతుల కష్టాలూ చూశా. సకాలంలో రుణాలు మంజూరు కాక..పంటలు సరిగా పండక..తీసుకున్న రుణాన్ని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే అన్నంపెట్టే రైతన్నను ఆదుకోవాలని ప్రయత్నిస్తున్నాను.


రాజకీయం అంటగట్టవద్దు
రైతుల పట్ల చూపిస్తున్న ఆదరణకు, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. రైతు అనేవాడు ప్రతి ఏటా కష్టాలు పడుతూనే ఉన్నాడు. వారి కష్టాలను తీర్చడం సమాజంలో వ్యక్తిగా బాధ్యతగా ప్రవర్తిస్తున్నానంతే. తమిళనాడులోని బోరు వేయించుకొనే స్తోమత ఏ రైతుకూ లేదు. సకాలంలో వర్షాలు పడక పంటలు నాశనం అవుతున్నాయి.
ప్రతి టిక్కెట్‌ నుంచి ఓ రూపాయి రైతుకు..
అభిమన్యుడు చిత్రానికి సంబంధించి ప్రేక్షకులు కొనుగోలు చేసే ప్రతి టిక్కెట్‌ నుంచి ఒక రూపాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నా. దీనికి డిస్ట్రిబ్యూటర్లూ అంగీకరించారు.

పేదలకు ఏం చేస్తే బాగుంటుంది..
ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను మరింత అభివృద్ధి చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్యం అందక చాలా మంది పేదవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. నిపుణులైన వైద్యులను ప్రభుత్వ ఆస్పత్రులలో నియమించి పేదలకు మంచి వైద్యాన్ని అందించాలి. అప్పుడే మనం కోరుకున్న మంచి సమాజాన్ని చూడగలం.


మీ తరువాత చిత్రం..
నా 25వ చిత్రంగా ‘పందెంకోడి–2’ ఈ ఏడాది దసరా రోజు (అక్టోబర్‌ 18)న విడుదల అవుతుంది. నేను కూడా టిక్కెట్‌ కొనుక్కుని ప్రేక్షకుల మధ్య కూర్చుని చూడాలని ఉంది. ‘అభిమన్యుడు’ పార్ట్‌ 2ను వచ్చే ఏడాది చేసేందుకు ప్లాన్‌ చేశాం.
నేనూ మోసపోయా 
స్మార్ట్‌ ఫోన్, ఫేస్‌బుక్, ఆధార్‌ సీడింగ్, క్రెడిట్‌ కార్డ్, ఏటీఎం కార్డ్‌ వంటి ఆధునిక సదుపాయాలు వచ్చిన తరువాత అనేక మంది మోసపోయి, ఆర్థికంగా నష్టపోయారు. అందులో నేనూ ఒకడ్ని. నాకు తెలియకుండా నా క్రెడిట్‌ కార్డు వినియోగించి రూ.30వేల దొంగలించారు. ఇది నా ఒక్కడి అనుభవమే కాదు, సినిమాకు వచ్చే ప్రేక్షకుల్లో అనేక మంది అనుభవం. దీని నుంచి ఎలా బయటపడాలన్నదే సందేశం.


వైట్‌ డెవిల్‌గా అర్జున్‌ సూపర్‌
నా చిన్నతనంలో వంద రూపాయలు పెట్టి బ్యాట్‌ కొనిచ్చిన అర్జున్‌తో ఫైటింగ్‌ సీన్‌లో నటించాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అభిమన్యుడు చిత్రం క్రైమాక్స్‌లో ఆయనతో చేసిన ఫైట్‌ మంచి అనుభవం. చిత్రంలో వైట్‌ డెవిల్‌గా ఆయన నటన చిత్రానికి పేరు తెచ్చింది.
సత్తా ఉన్న దర్శకుడు మిత్రన్‌
అభిమన్యుడు చిత్ర దర్శకుడు మిత్రన్‌కు ఇది తొలి చిత్రం. అయినా ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మంచి మెసేజ్‌తో చిత్రాన్ని రూపొందించారు. ఇటువంటి మంచి చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల ఆభిమానం సంపాదించుకుంటారని ఆశిస్తున్నాను.


మీ ఇష్ట దైవం..
థియేటర్లు నా దేవాలయాలు అయితే..ప్రేక్షకులే నా దేవుళ్లు..ఎందుకంటే వారు నామీద చూపిస్తున్న అభిమానం ప్రేమ ఎన్నటికి మరువలేనిది. నా చిత్రాలను ఆదరించి నన్నింతటివాడిని చేసింది ప్రేక్షకులే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement